ప్రపంచంలో అత్యంత పెద్ద ఒడల్లో ‘ఎపిక్’ ఒకటి. 1.53 లక్షల టన్నులు తూగే ఎపిక్ ఓడ చిన్న దేశం నార్వే లోని వ్యాపారస్ధులకు చెందినది. ప్రస్తుతానికి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఓడగా పరిగణించబడుతున్న ఎపిక్ ని ప్రయాణీకులను చేరవేసే నిమిత్తం 2010లో నిర్మించారు.
ఎపిక్ కంటే పెద్ద ఓడలు 3 ఉన్నప్పటికీ ఇందులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు ఏ ఓడ లోనూ లేవని చెబుతున్నారు.
డెక్ పైన ఉన్న పెద్ద వాటర్ పార్క్ ప్రయాణీకులకు ఒక ఆకర్షణ. నిత్యం రద్దీగా ఉండే రెస్టారెంట్లు, బార్లు, నైట్ క్లబ్ లు ఓడ నిండా కళకళలాడుతూ ఉంటాయి. ఎంత డబ్బు పెడితే అంత ఉన్నత స్ధాయి సౌకర్యాలు ఓడలో అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యక్తి కోసం నిర్మించిన పోష్ గదులతో పాటు కుటుంబాలు, గ్రూపుల కోసం ఉపయోగపడే సూట్ లు కూడా ఓడలో ఉన్నాయి.
ఓడలో మొత్తం 20 రెస్టారెంట్లు, 20 బార్లు, ఒక కామెడీ క్లబ్, ఒక జాజ్ క్లబ్ లు ఉన్నాయని ఓడ నిర్వాహకులు, ప్రయాణీకులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఈ భారీ ఓడను ఫ్రాన్స్ కు చెందిన ‘ఎస్‌టిఎక్స్ ఫ్రాన్స్ క్రూయిజ్ ఎస్‌ఏ’ అనే పేరు గల కంపెనీ నిర్మించింది. సెప్టెంబర్ 2006 లో ఈ ఓడ నిర్మాణానికి ఆర్డర్ ఇవ్వగా 2009 లో పూర్తి చేసి ఇచ్చారు. జులై 2009లో ఈ ఓడ మొదటిసారి సముద్ర జలాల్లో ప్రవేశించింది.
ఇది సామాన్యులు ప్రయాణించే ఓడ కాదని కింది ఫోటోలు చూస్తే అర్ధం అవుతుంది. కేవలం ప్రయాణాల కోసమే ఈ ఓడ ఎక్కుతారంటే నమ్మలేము. డబ్బు, సమయం విరివిగా మిగిలిపోయి వాటిని ఖర్చు చేసేందుకు వేరే తావు లేని వారు మాత్రమే ఈ ఓడలో ప్రయాణిస్తారు కావచ్చు.