ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ లను వేధిస్తున్న సి.బి.ఐ


kejriwal

బి.జె.పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సి.బి.ఐ తమ ప్రభుత్వంలోని ఐ‌ఏ‌ఎస్ అధికారులను ప్రతి రోజూ వేధిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. దానితో వారంతా భయకంపితులై లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినట్టల్లా వింటున్నారని వెల్లడించారు.

నూతన సంవత్సరం రోజున ది హిందు పత్రికకు కేజ్రీవాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడి చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వంపై ఏ విధంగా కక్ష సాధిస్తున్నదీ వివరించారు. DANICS అధికారులు, ఇతర ఐ‌ఏ‌ఎస్ అధికారులను వినియోగిస్తూ తమ ప్రభుత్వం సక్రమంగా పని చేయకుండా ఆటంకాలు కల్పిస్తోందని చెప్పారు.

*********

ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ చెప్పిన సంగతులు ఇలా ఉన్నాయి:

“కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నన్ను రాజకీయంగా ఎదుర్కోవడానికి ప్రత్యక్షంగా తలపడడం లేదు. కొన్ని సార్లు వాళ్ళు అవినీతి వ్యతిరేక విభాగం ద్వారా కాల్పులు జరుపుతారు. మరికొన్ని సార్లు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఆడ్డం పెట్టుకుని కాల్పులు చేస్తారు. ఇప్పుడేమో ఐ‌ఏ‌ఎస్ అధికారులను వినియోగిస్తున్నారు.

“గత బుధవారం రాత్రంతా ఐ‌ఏ‌ఎస్ అధికారులు ఇక్కడ (ఢిల్లీ సెక్రటేరియట్) 7వ అంతస్ధులో కనీసం 5 గంటల సేపు సమావేశం అయ్యారు. సమావేశానికి వెళ్ళిన కొందరు అధికారులు నాతో చెప్పారు.

“సమావేశ పర్యంతం లెఫ్టినెంట్ గవర్నర్ గోవా నుండి స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఆయన మళ్ళీ కేంద్ర హోమ్ కార్యదర్శి రాజీవ్ మహర్షితోనూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతోనూ లైన్ లో ఉన్నారు.

“ఆయన తనకు వచ్చిన ఆదేశాలను ఇక్కడి అధికారులకు చెబుతూ ఉన్నారు. ఈ పరిస్ధితిలో మా ప్రభుత్వాన్ని అస్ధిరపరచేందుకు పి‌ఎం‌ఓ నుండే ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో మీరు అర్ధం చేసుకోవచ్చు.

“పి‌ఎం‌ఓ నుండి వస్తున్న చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లన్నింటికీ ఒప్పుకోవడం తప్ప మరో అవకాశం బ్యూరోక్రట్లకు లేకపోయింది.

“రాజేంద్రజీ (ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ) పైన దాడులు జరిపాక సి.బి.ఐ ప్రతి రోజూ ఎవరైనా ఇద్దరు అధికారులను ఎంచుకుని పిలిపిస్తోంది. ఢిల్లీ సెక్రటేరియట్ తాము జరిపిన సోదాల విషయం అని చెప్పి పిలిపిస్తోంది. కానీ వాస్తవ కారణం అది కాదు.

“సి.బి.ఐ వారిని రోజంతా కూర్చోబెడుతోంది, ఎలాంటి విచారణ చేయడం లేదు. దానితో వారిలో భయాందోళనలు వ్యాపించాయి. కేజ్రీవాల్ తో పని చేసినా, ఆయనకు సానుభూతిగా ఉన్నట్లు కనిపించినా లేక ఎలాంటి విధేయత చూపినా ఇక మీ పని ముగిసినట్లే అన్న భయ సందేశాన్ని ఇస్తోంది.

“మీకు నిజాయితీగా చెప్పాలంటే, ఆయా రంగాల్లో నిపుణులైన వ్యక్తులను ప్రభుత్వంలో నియమించే సమయం ఆసన్నం అయిందని భావిస్తున్నాను. ఆరోగ్య నిర్వహణ నిపుణులే లేదా ఒక వైద్యుడే ఆరోగ్య కార్యదర్శిగా ఉండకపోవడానికి కారణం ఏమీ లేదు. ఒక ఐ‌ఏ‌ఎస్ అధికారి ఆరోగ్య కార్యదర్శిగా ఎందుకుండాలి? ఈ బ్యూరోక్రట్ల స్ధానంలో వివిధ రంగాల నిపుణులను నియమించేందుకు దాగి ఉన్న అవకాశం ఇదే అని నా అభిప్రాయం. పోస్టుల వివరాలను నేను ఇప్పటికే అడిగాను. అక్కడి నుండి ఇక నేను ముందుకు వెళ్తాను.

“(సి.బి.ఐ) దాడి ఉదయం జరిగింది. సాయంత్రం నలుగురైదుగురు సిబ్బంది చెప్పేవరకూ నాకా ఆలోచనే తట్టలేదు. ‘సార్, వాళ్ళు డి‌డి‌సి‌ఏ ఫైళ్ళ కోసం వెతుకుతున్నారు’ అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత నేను పత్రికలకు ప్రకటన విడుదల చేశాను. నిజం నిజమే కదా.

“వాళ్ళు రాజేంద్రకు వ్యతిరేకంగా ఏమన్నా కనుగొన్నారా? సి.బి.ఐకి రు. 2 లు దొరికితే రు 100 లు దొరికినట్లు చెబుతుంది. అలాంటి సంస్ధ అది. వాళ్ళకి ఏదైనా దొరికినట్లయితే వాళ్ళు తమవరకే దాచి పెట్టుకుని ఉండరు.

“ప్రధాన మంత్రి మమ్మల్ని పని చేసుకోనివ్వాలి, అంతే. అలా చేస్తే (మా మధ్య వివాదం తాలూకు) చేదు రెండు నిమిషాల్లో ముగిసిపోతుంది. ఆయన చేయాల్సిందల్లా లెఫ్టినెంట్ గవర్నర్ కి కాల్ చేసి మా పనిలో ఆటంకాలు కల్పించొద్దూ, ఏ‌సి‌బి ని మాకు అప్పగించండి, అని మాత్రమే. ఈ రెండే మాకు కావాలి.

“నా దేముంది! సగం (స్ధాయి) రాష్ట్రానికి పావు సైజు ముఖ్యమంత్రిని నేను. ఆయన దేశం మొత్తానికి పాలకుడు. ఆయన నా వెంట ఎందుకు పడుతున్నట్లు?

*********

సగం స్ధాయి రాష్ట్రానికి పావు సైజు ముఖ్యమంత్రి ఐనాగానీ ప్రజల ప్రయోజనాలకు నిజాయితీగా కృషి చేస్తే వారి వల్ల దోపిడీ పాలకులకు ఎప్పటికీ ప్రమాదమే. ఢిల్లీని ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పరిపాలించిన ఖ్యాతి ఏ మాత్రం ఏ‌ఏ‌పికి దక్కినా అది ఇతర పార్టీలను తీవ్ర ప్రమాదంలో పడవేస్తుంది. అవడానికి చిన్న ఢిల్లీయే అయినా ప్రజలు అనివార్యంగా ఢిల్లీ పాలనతో దేశ పాలనను పోలికలు పెట్టి కొలుస్తారు. ఒక చిన్న రాష్ట్రానికి ఇన్ని చేయగా లేనిది దేశానికి ఆయన ఎందుకు చేయలేడు అన్న పోలిక అనివార్యంగా వస్తుంది. అప్పుడు బి.జె.పితో పాటు కాంగ్రెస్, ఎస్.పి, బి.ఎస్.పి… ఇత్యాది దోపిడీ వర్గాల పార్టీల పాలనకు తీవ్ర ప్రమాదం ముంచుకు వస్తుంది.

అందుకే దేశంలో ఎక్కడా నిజాయితీతో కూడిన పాలన నడవకూడదు. ఎన్ని వైఫల్యాలతో కూడినదయినా ‘నిజాయితీగా పాలించారు’ అన్న నమ్మకం ఏర్పడితే ఆ పార్టీనే ప్రజలు మళ్ళీ మళ్ళీ నమ్మి గద్దె పైన కూర్చోబెడతారు. ఆ పార్టీలాగానే మిగతా పార్టీలూ పాలించాలని ఆశిస్తారు. అందుకే ఏ‌ఏ‌పి ప్రభుత్వాన్ని మొగ్గలోనే తుంచివెయ్యడం బి.జె.పి, కాంగ్రెస్ లాంటి పార్టీలకు అత్యవసరం.

 

 

2 thoughts on “ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ లను వేధిస్తున్న సి.బి.ఐ

  1. సి.బి.ఐకి రు. 2 లు దొరికితే రు 100 లు దొరికినట్లు చెబుతుంది-సగం స్ధాయి రాష్ట్రానికి పావు సైజు ముఖ్యమంత్రి వెల్లడించిన ఈ విషయంలో నిజం ఎక్కువగా ఉన్నట్లు అర్ధం చేసుకోవాలి.ఎందుకంటే స్వయానా కేజ్రివాల్ కూడా సివిల్ సెర్వంట్ అధికారిగనుక.
    ఈ లెక్కన సి.బి.ఐ విచారణ చేసి,వెల్లడించిన గాలి జనార్ధనరెడ్డి,జగన్ ల అక్రమాస్థుల కేసులో ఆస్థులవివరాలులో విశ్వసనీయత ఎంత?

    ఆయా రంగాల్లో నిపుణులైన వ్యక్తులను ప్రభుత్వంలో నియమించే సమయం ఆసన్నం అయిందని భావిస్తున్నాను-ఇది మాత్రం సరియైన ఆలోచన.పరిపాలనాధికారుల స్థానంలో ఆయారంగాలలోని విషయనిపుణులను నియమించడమనే విషయం కార్యరూపందాల్చితే పాలనాపరమైన అంశాలులో ఎటువంటిమార్పులు ఎదురౌతాయనే అంశం చర్చనీయాంశం కాగలదు.

  2. సీ.బీ.ఐ. దృష్టిలో కేజ్రీవాలా ఐ.ఏ.ఎస్. లందరు ఐ.ఎస్.ఐ . ఏజెంట్లుగా అగ్ మార్క్
    మోడి భావననుకుంటాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s