ఎందుకో కారణం చెప్పలేదు గాని కూడలి అగ్రి గేటర్ ను నిర్వాహకులు ఆపేశారు.
కినిగె నిర్వాహకులే కూడలిని కూడా నిర్వహిస్తున్నారని ‘బహుశా కినిగె పనిలో మునిగి ఉన్నందున సమయం చాలక పోయి ఉండవచ్చు’ అని కొందరు మిత్రులు చెప్పారు.
తెలుగు బ్లాగులకు సేవ చేయడంలో కూడలి ఎంతో పేరు తెచ్చుకుంది. అత్యధిక బ్లాగు పాఠకులు, సందర్శకులు కూడలి ద్వారానే బ్లాగ్ లకు రావడానికి అలవాటు పడిపోయారు.
దానితో ‘కూడలి ఇక లేదు’ అన్న ప్రకటన కూడలి వెబ్ సైట్ లో ఏకైక ప్రకటనగా దర్శనం ఇవ్వడం ఆశానిపాతానికి గురి చేసింది.
“ఏదో విధంగా కూడలి ని నడపవచ్చు గానీ ప్రస్తుతానికి ఇది చాల్లెమ్మని ముగించుకుంటున్నాం” అని ప్రకటిస్తూ అగ్రిగేటర్ ను మూసివేశారు.
తెలుగు బ్లాగర్లు, బ్లాగు పాఠకులు తగ్గిపోవడం వల్లనే కూడలి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని ఇతర మిత్రులు చెబుతున్నారు. అదే నిజం అయితే కూడలి అవసరం మరింత పెరిగిందే గాని తగ్గలేదు. నిర్వాహకులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని కూడలిని పునరుద్ధరిస్తే అది బేషైన నిర్ణయం కాగలదు.
తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ లు ఇంకా మరికొన్ని ఉన్నాయి. వాటిలో ‘బ్లాగ్ వేదిక’ ను ఎంచుకుని వారికి సమాచారం ఇచ్చాను. వారు వెంటనే స్పందించి ‘తెలుగు జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ ను తమ జాబితాలో చేర్చుకున్నారు.
తెలుగు బ్లాగ్ లకు అగ్రిగేటర్ ల సహకారం అవసరం అయినట్లే, అగ్రిగేటర్ లకు బ్లాగ్ లు కూడా తగిన విధంగా సహకారం ఇవ్వాలి. ముఖ్యంగా వీలైనంత రెగ్యులర్ టపాలు రాస్తుంటే తాము మంచి కృషి చేస్తున్నామన్న సంతృప్తి వారికి లభిస్తుంది.
అలాగే అగ్రి గేటర్ ల గురించి ప్రచారం చేయడంలో బ్లాగ్ లు ఇతోధికంగా సహకరించవచ్చు. అందులో భాగంగా ఈ టపాను రాస్తున్నాను. ఇతర బ్లాగర్లు ఇదే పని చేస్తే అగ్రిగేటర్ లకు ప్రోత్సాహం అవుతుంది.
బ్లాగ్ వేదిక త్వరలో పెయిడ్ అగ్రిగేటర్ అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ నిర్ణయం కాసింత నిరుత్సాహకరంగా ఉన్న మాట వాస్తవం. ఈ నిర్ణయం అమలు కోసం మరి కొంత కాలం వేచిఉండగలరేమో చూడాలని బ్లాగ్ వేదిక నిర్వాహకులను ఆలోచించాలని కోరుతున్నాను.
ఆరోగ్యకరమైన అగ్రిగేటర్ గా వ్యవహరించగలిగితే అదే పదివేలన్న వాతావరణం ఉన్న నేపధ్యంలో అగ్రిగేటర్ నిర్వహణ కష్టంగా మారి ఉండవచ్చు.
‘బ్లాగ్ వేదిక’ పేరును ‘వేదిక’ గా మార్చితే మరింత క్లుప్తంగా ఉండవచ్చు. ఈ సలహాను నిర్వహాకూలు పరిశీలించగలరు.
పూదండ అగ్రిగేటర్ లో ఈ బ్లాగ్ చేర్చాలని ఈ మెయిల్ ద్వారా కోరాను. వారి నుండి ఇంకా స్పందన లేదు.
బ్లాగ్ వేదిక నిర్వాహకులు తమ అగ్రిగేటర్ ను నిరంతరాయంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
కూడలి నిర్ణయం నన్ను కూడా నిరాశ పరిచింది సర్ .
పోనీలేండి. బ్లాగ్ వేదికన్నా నాలుగు కాలాలు నిలబడాలని కోరుకుందాం.