పఠాన్ కోట్ దాడి: పాక్ తో చర్చలు నిలిపేస్తారా?


బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా ఎల్లప్పుడూ వ్యతిరేకించిన అంశం: పాక్ తో చర్చలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ తో చర్చలు ఎలా చేస్తారని బి.జె.పి ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఆగ్రహావేశాలు ప్రకటిస్తూ ఉండేది. పాక్ వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టేది. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం అని తిట్టిపోసేది.

ఇప్పుడు అదే పాకిస్తాన్ తో మిత్రత్వానికి ప్రధాని నరేంద్ర మోడి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది కూడా ‘అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసే’ ఆకస్మిక పాకిస్ధాన్ సందర్శన ద్వారా ‘పాక్ వ్యతిరేకత’ ను ప్రధాని మోడి నెత్తి మీది నుండి, భుజాల మీది నుండి ఒక్కసారిగా దించేశారు.

ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు -పాకిస్తాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని బి.జె.పి ఎప్పుడూ ఆరోపించే సీమాంతర ఉగ్రవాదులు- మళ్ళీ దాడికి తెగబడ్డారు. ప్రధాని మోడి ఆకస్మికంగా పాకిస్తాన్ సందర్శించి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో నవ్వులు చిందిస్తూ చర్చలు జరిపిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగింది. దాడిని ఎదుర్కొనే క్రమంలో ముగ్గురు జవాన్ లు చనిపోయారు కూడా.

అయినా గానీ పాక్ తో చర్చలను ఆపేది లేదని కేంద్ర మంత్రులు తడుముకోకుండా ప్రకటిస్తున్నారు. భారత్-పాక్ చర్చలు జరపడం ఇష్టం లేని (పాక్ లోని) కొన్ని రోగ్ శక్తులు ఈ దాడికి తెగబడ్డాయని కూడా ప్రకటిస్తున్నారు. ఒక దాడి జరిగితే మాత్రం వెంటనే చర్చల్ని ఆపేస్తారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.

“ఈ చర్చల ప్రక్రియను ఒక దాడి జరిగిందని చెప్పి ఆపలేము… పాకిస్తాన్ మన పొరుగు దేశం. మీరు మీ మిత్రులను మార్చుకోవచ్చు గానీ పొరుగువారిని మార్చుకోలేరు. కాబట్టి మనం చర్చలను కొనసాగించవలసిందే. చర్చలు ప్రధానంగా ఉగ్రవాదం పైనే జరగాలి. ఇండియా చేస్తున్నది సరిగ్గా అదే” అని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేసేశారు.

“ఉగ్రవాదంపై మాట్లాడకపోతే (చర్చలు చేయకపోతే) ఉగ్రవాదాన్ని తగ్గించలేము” అని ప్రకాష్ జవదేకర్ నిర్ధారించారు కూడాను. “చర్చలు నిలిపేయాలని కోరడం ద్వారా ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది” అంటూ ఆయన తన ఫైనల్ పంచ్ విసిరారు.

ఎట్టా?!

కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఒక మాట, తాను అధికారంలో ఉంటే మరొక మాటా?

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది అన్న దాన్ని బట్టి ఉగ్రవాదంపై చర్చలు చేసే అంశాన్ని నిర్ధారించవచ్చా? ఈ ప్రశ్నకు బి.జె.పి నేతలు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడి దేశ ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంది.

ఒక్క ఉగ్రవాదం పైనే కాదు, సరిహద్దు సమస్యల మీదా, వాణిజ్య సంబంధాల మీదా… అన్నీ సమస్యల మీదా పొరుగు దేశంతో చర్చించవలసిందే.

పాకిస్తాన్ మనలాగే బడుగు దేశం. నిన్నటిదాకా మన శరీరంలో భాగంగా ఉండి విడిపోయిన దేశం. కాబట్టి ఆ దేశ ప్రజలతో అనేక కుటుంబ, సాంస్కృతిక, భౌగోళిక, వాణిజ్య సంబంధాలను భారత దేశ ప్రజలు కలిగి ఉంటారు. ఈ సంబంధాలు చెడిపోతే నష్టపోయేది ప్రజలే.

కానీ బి.జె.పి ఇన్నాళ్లూ చేసింది ఏమిటి? తాను అధికారంలో ఉంటేనేమో పాక్ తో నిర్మొహమాటంగా చర్చలు జరుపుతుంది. ప్రతిపక్షంలో ఉంటేనేమో పాక్ చర్చల సమస్యను, ఉగ్రవాద దాడుల సమస్యను పూర్తి స్ధాయిలో రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటుంది. తద్వారా ప్రజల్ని మోసం చేస్తున్నామన్న ఇంగితం లేకుండా రాజకీయం చేస్తుంది.

ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చర్చల అవసరం తెలిసి వచ్చాక, బిగ్ బ్రదర్ అమెరికా పాలకుడు మెడ మీద కూర్చొని ‘చర్చలు చెయ్యి, చెయ్యి’ అంటూ తెస్తున్న ఒత్తిడి తట్టుకోలేక… పాక్ పొరుగు దేశం అని హఠాత్తుగా గుర్తుకు వస్తుందా?

‘మనం మిత్రులను మార్చుకోవచ్చు గానీ, పొరుగువారిని మార్చుకోలేము’ అన్న నిత్య సత్యం అధికార పీఠంపై కూర్చొని ఉంటే గాని తెలిసి రాదా?

ప్రతిపక్షంలో ఉండగా బి.జె.పి నేతలు ఎన్ని పరిహాసాలు చేశారు? ఎన్ని ఆటంకాలు కల్పించారు? చర్చల రద్దుకు ఎన్ని ఒత్తిడులు తెచ్చారు? అవన్నీ మరిచిపోయి సరిగ్గా అప్పుడు కాంగ్రెస్ చేసిన వాదనలనే పొల్లు పోకుండా వినిపిస్తున్న బి.జె.పి నేతలను ఎలా అర్ధం చేసుకోవాలి?

పఠాన్ కోట్ లో జరిగింది మామాలు దాడి కాదు. ముంబై దాడుల తరహాలోనే పెద్ద ఎత్తున పధకాన్ని రచించుకుని చేసిన దాడి. పత్రికలు, ఆర్మీ మరియు ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం భారీ మందుగుండు సామాగ్రితో ఉగ్రవాదులు దాడి చేశారు.

దాడి చేసిన చోటు ఆషామాషీ చోటు కూడా కాదు. ఏకంగా భారత రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే వైమానిక స్ధావరం పైనే ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ స్ధావరం నుంచి భారత సైన్యం ఫార్వర్డ్ ఆపరేషన్స్ ను నిర్వహిస్తుంది. అనగా అత్యంత కీలకమైన స్ధావరం ఇది. పాక్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లోని ఈ స్ధావరం సీమాంతర ఉగ్రవాదం దృష్ట్యా కూడా కీలకమైనదే.

అలాంటి దాడిని ‘కేవలం ఒకే ఒక్క దాడి’ అని బి.జె.పి మంత్రి కొట్టిపారేస్తున్నారు. భారత నేర చట్టాల ప్రకారం విచారించి, ఆ చట్టాల ప్రకారమే దోషిత్వాన్ని నిరూపించేందుకు ముంబై దాడుల దోషి అజ్మల్ కసబ్ ను భారత జైళ్ళలో నిర్బంధించారు.

ఎలాగూ ఉరి శిక్ష వేశారు కదా అని ఏ ఖైదీని ఆకలితో మాడ్చరు. భారత విదేశీ విధానంలోని ఒక ప్రధాన అంశంతో ముడిపడి ఉన్న వ్యక్తి కనుక ఆ ఖైదీకి తగిన రక్షణ కల్పిస్తారు. ఆ విధంగా మన చట్టాల ప్రకారమే ఉరి తీసేవరకు కసబ్ ను జైళ్ళలో ఉంచి అన్నం పెడితే, ‘ఒక కరడు గట్టిన ఉగ్రవాదిని ఏళ్ల తరబడి మేపే బలహీన ప్రభుత్వం/దేశం’ అంటూ పరిహసించారు బి.జె.పి నేతలు. ఆ నేతల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు.

ఇప్పుడేమో కేవలం ఒక్క దాడితోనే చర్చలు రద్దు చేసేస్తామా అని బి.జె.పి నేతలు ప్రశ్నిస్తున్నారు. ముంబై దాడుల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలను రద్దు చేసుకుంది. ఆ దాడులు ఇంకా మన వెనకే ఉన్నాయి. బి.జె.పి అప్పటి వాదన ప్రకారం ఇప్పటికీ పాక్ తో చర్చలు చేయకూడదు. అయినా చర్చలు ప్రారంభించారు.

దేశ రక్షణకు అత్యంత కీలకమైన స్ధావరంపై పాక్ నుండి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేసినా అది ‘కేవలం ఒక్క దాడి మాత్రమే’ అని కేంద్ర మంత్రి కొట్టివేయడం ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని తక్కువ చేసి చూపడం కాదా?

దాడికి కారణం ‘జైష్-ఏ-మహమ్మద్’ సంస్ధ అయి ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పత్రికలు చెబుతున్నాయి. ఈ సంస్ధ నేత అజర్ మసూద్ 1999లో విమానం హైజాక్ చేసిన దరిమిలా వాజ్ పేయి-అద్వానీ-జశ్వంత్ సింగ్ నిర్ణయం మేరకు భారత ప్రభుత్వం విడుదల చేసిన కరడుగట్టిన ఉగ్రవాది ఆయనే. బి.జె.పి విడుదల చేసిన ఉగ్రవాదియే ఈ రోజు మళ్ళీ దేశంలోని కీలకమైన వైమానిక స్ధావరంపై దాడి చేయించాడు.

అజర్ మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాది కూడా. సోమాలియా, యెమెన్ లాంటి దేశాలలో ఆల్-ఖైదా ఉగ్రవాదులను ప్రవేశపెట్టిన ఘనత అతని సొంతం. ఆ సంగతి ఆయనే స్వయంగా అంగీకరించాడు. యెమెన్ నుండి ఉగ్రవాదులను సోమాలియాకు తరలించిన ఘనత ఆయన సొంతం. అమెరికా, ఇండియాలపై జీహాద్ జరపడమే ముస్లింల జీవితాలకు పరమార్ధం అని ఘనంగా ప్రకటించిన వ్యక్తి అజర్ మసూద్.

అలాంటి వ్యక్తి నేతృత్వంలోని జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్ధ జరిపిన దాడి ‘ఒక దాడి’ కొట్టి పారేయడం ఏ ప్రయోజనాల కోసం? ‘ఉగ్రవాదం పై చర్చలు జరపకుండా దానిని తగ్గించలేము’ అన్న జ్ఞానం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి.జె.పి కి ఉండదెందుకని?

పఠాన్ కోట వైమానిక స్ధావరంలో సిబ్బంది నివాసాల మధ్య దాక్కుని ఐదుగురు ఉగ్రవాదులు ఈ రోజు భారత భద్రతా బలగాలపైన కాల్పులు, పేలుళ్లు జరిపారు. ఆర్.డి.ఎక్స్ లాంటి ప్రమాదకర పేలుడు పదార్ధాలతో వారు దాడి చేశారు. గ్రెనేడ్లు, ఇతర ఆధునిక ఆయుధాలు ధరించి వచ్చారు. కనుక ఈ దాడి చిన్నది కాదు. ‘ఒక దాడి’ అని కొట్టిపారేయదగ్గది కాదు.

అయినా సరే, చర్చలు జరగాలి.

ఎందుకంటే పాకిస్తాన్ లో, ఆ మాటకొస్తే ఏ దేశంలో నైనా, అధికార వ్యవస్ధ ఏక శిలా సదృశంగా ఉండదు. అందులో వివిధ శక్తులు ఆధిపత్యం కోసం నిత్యం ఘర్షణ పడుతూ ఉంటాయి. అధిక లబ్ది పొందేందుకు తగువులాడుతూ ఉంటాయి. ఒకరిని మరొకరు బలహీనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.

పాక్ లో రాజకీయ వ్యవస్ధ ఒక పక్షంలో ఉంటే ఆర్మీ + కోర్టులు మరో పక్షంలో ఉంటాయి. ఇవి రెండూ అనాదిగా ఆధిపత్యం కోసం నిత్యం ఘర్షణ పడుతూ వచ్చాయి. ఆర్మీ పై చేయివహిస్తే ఒక్కోసారి (నిజానికి అత్యధిక కాలం) అది సైనిక పాలన రూపం కూడా తీసుకుంది.

పాక్ ఉగ్రవాద గ్రూపులు కూడా ఏక శిలా సదృశం కాదు. అందులో కొన్నింటిని ఆర్మీ, మరి కొన్నింటిని రాజకీయ పార్టీలు పోషిస్తున్నాయి. తమకు అవసరం వచ్చినప్పుడల్లా వాటితో దాడులు చేయిస్తాయి.

పాక్ ఆర్మీకి ఎప్పుడూ ఘర్షణలు రగలడం కావాలి. అలా జరిగితేనే వారికి నిధులు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి సరిహద్దుల వద్ద శాంతి నెలకొనడం పాక్ ఆర్మీకి ఇష్టం ఉండదు. రాజకీయ నాయకులు, వాణిజ్య ప్రయోజనాల కోసం, శాంతికి ప్రయత్నించినప్పుడల్లా అది వారికి కంటగింపు అవుతుంది.

అందుకే ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఉగ్రవాద సంస్ధలను ప్రేరేపించి సరిహద్దు దాటిస్తాయి. దరిమిలా జరిగే దాడులు చర్చలను అసాధ్యం చేస్తాయి. దాడులు చేయిస్తుంటే పాక్ తో చర్చలు ఎలా చేస్తారు? అంటూ ప్రతిపక్షాలు భావోద్వేగాలు రెచ్చగొడితే పాలక పక్షం అనివార్యంగా వాణిజ్య ప్రయోజనాలు పక్కన బెట్టి చర్చలనుండి వెనక్కి తగ్గుతారు.

అనగా ప్రతిపక్షంలో ఉండగా పాక్ వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎప్పటికప్పుడు చర్చలకు అడ్డు తగలడం ద్వారా బి.జె.పి ఎవరి ప్రయోజనాలు నెరవేర్చినట్లు? పరోక్షంగా పాక్ లోని ఉగ్రవాద మూకలకూ, వారి యజమానులైన ‘రోగ్ శక్తులకు’ సహకరించినట్లు!

అధికారానికి వచ్చాక తమ పాలనలో ఆర్ధిక వృద్ధి జరిపినట్లు చూపాలి. అనగా జి.డి.పి వృద్ధి చెందినట్లు చూపాలి. కానీ ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. జి.డి.పి వృద్ధి రేటుకు సంబంధించిన పునాది -బేస్- ను ముందుకు జరపడం ద్వారా 4-5 శాతం వద్ద ఊగులాడుతున్న జి.డి.పి వృద్ధి రేటును 7-7.5 శాతానికి కృత్రిమంగా పెరిగేలా మోడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అనగా జి.డి.పి వృద్ధి రేటు వాస్తవంగా పెరగకుండానే కృత్రిమంగా పెంచి ‘చైనా కంటే వేగంగా పెరుగుతోంది’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.

అలాంటి కృత్రిమ వృద్ధి కూడా పడిపోయే పరిస్ధితి ఏర్పడింది. ధరలు పెరిగి కొనుగోళ్ళు, వినిమయం పడిపోయింది; కనుక ఉత్పత్తీ పడిపోయింది. విదేశీ మార్కెట్ లు లేక అందువల్లా ఉత్పత్తి పడిపోయింది. ఈ పరిస్ధితుల్లో విదేశీ వాణిజ్యం పెంచుకోవడం అత్యవసరం. దానికి ఏ కాస్త అవకాశం ఉన్నా వదులుకునే పరిస్ధితిలో మోడి ప్రభుత్వం లేదు.

ఈ నేపధ్యంలోనే ప్రధాని మోడి ఎలాంటి ముందస్తు సూచన లేకుండానే హఠాత్తుగా పాకిస్తాన్ లో దిగిపోయి ప్రధాని నవాజ్ షరీఫ్ తో నవ్వుల చిందులతో ఫోటోలకు ఫోజులిచ్చి ఇరు పక్షాల మధ్య వివాదం సమసిపోయినట్లు లేదా సమసిపోతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. తద్వారా వాణిజ్య చర్చలకు పునాది వేశారు.

ఇది ఎప్పటిలాగే పాక్ ఆర్మీకి రుచించలేదు. ఫలితమే ఉగ్రవాద దాడి.

ఉగ్రవాద దాడికి పాక్ ప్రభుత్వానికి సంబంధం లేదని బి.జె.పి నేతలు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బి.జె.పి మిత్ర పార్టీ అకాలీ దళ్ ప్రభుత్వం అయితే నేరుగానే అసలు సంగతి చెప్పింది. పాక్ లోని కొన్ని రోగ్ శక్తులు ఈ దాడి చేయించాయని అకాలీ మంత్రి ప్రకటించారు. ‘చర్చలు ఇష్టం లేని వర్గాలు’ ఈ దాడి జరిపించారని బి.జె.పి నేతలు ప్రకటించారు.

అసలు పాకిస్తాన్ తో చర్చలు జరపడం ఏమిటని గతంలో (కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో) ప్రశ్నించిన మిత్రులకు ఇప్పటికైనా తత్వం బోధపడి ఉండాలి.

One thought on “పఠాన్ కోట్ దాడి: పాక్ తో చర్చలు నిలిపేస్తారా?

  1. చర్చల ప్రక్రియను ఒక దాడి జరిగిందని చెప్పి ఆపలేము.చర్చలను కొనసాగించవలసిందే.
    ఈ చర్చల ప్రధానుద్దేశం వాణిజ్యసంభందాలను పెంపొందించుకోవడానికైనా,తద్వారా ప్రజలమధ్యసత్సంభందాలు మొదలవ్వడానికి ఉపయోగపడితే ఇరుదేశాల ప్రజలకూ ఉపయోగకరంగా ఉంటుంది.
    అమెరికా(సామ్రాజ్యవాదుల) ఒత్తిడిమేరకు చర్చలు మొదలైనా దానిని సానుకూలంగా మలచుకోగల చాతుర్యం ఇరుదేశాల పాలకులకు(ఆధిపత్య వర్గాలకు) లేకపోవడం విచారకరం.దేశంలో అసహనం పెరిగిపోతుందని గళంవిప్పుతున్న వాళ్ళను శాంతపరచడానికి(అదుపుచేయడానికి) ఈ చర్చల ప్రక్రియని ముందుకు తీసుకెల్లడం ద్వారా మోదీకి ఒక అవకాశం కలిగినట్టే.మర్చినెలలో జరగబోయే 20-20 ప్రపంచకప్పులో పాకిస్తాన్ పాల్గొనడం నిర్వాహకులకు(పెట్టుబడిదారులకు) అత్యవసరం.చర్చల ప్రక్రియలో ఈ అంశంకూడా ఇమిడి ఉంటుందనడంలో సందేహం ఉండనక్కరలేదు.
    తద్వారా పక్-భారత్ ల మధ్య క్రికెట్ సంభందాలు,ఇతర క్రిడలు మొదలవ్వవచ్చును.

    ప్రస్తుతం చర్చల ప్రక్రియ మొదలుకావడానికి మూలకారణం సామ్రాజ్యవాదుల ఒత్తిడి. సామ్రాజ్యవాదులు(యుద్ధవ్యాపారులుమినహాయించి మిగిలినవారు) పాక్ సైన్యంపై ఒత్తిడి పెంచి వారివ్యాపారాలకు ఆటంకం ఎదురుకాకుండా ఎందుకు చేసుకోలేక పోతున్నారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s