“నిజాయితీ మౌత్ పీస్ లు ఇంకా ఎవరన్నా ఉన్నారా?”
—
కాంగ్రెస్ పార్టీ ముంబై విభాగం ‘కాంగ్రెస్ దర్శన్’ పేరుతో ఒక పత్రిక నడుపుతుంది. ఈ పత్రిక ఇటీవల కాశ్మీర్ పట్ల నెహ్రూ విధానాన్ని విమర్శిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్ ఎవరు రాశారో పేరు వేయలేదు.
అప్పటి హోమ్ మంత్రి వల్లబ్ భాయ్ పటేల్ సలహాలను పెడ చెవిన పెట్టి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీర్ సమస్యపై ఐక్య రాజ్య సమితిని ఆశ్రయించారని ఆర్టికల్ తప్పు పట్టింది.
నెహ్రూతోనే ఆర్టికల్ సరిపెట్టలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వంశాన్ని సైతం తప్పు పట్టింది. సోనియా గాంధీ కుటుంబం పూర్వీకులు ‘ఫాసిస్టులు’ అని ఆర్టికల్ ఎత్తి చూపింది.
పత్రిక వెలువడిన గంటల లోపే కాంగ్రెస్ పార్టీ ముంబై నాయకులు క్షమాపణలు ప్రకటించారు. “అటువంటి రిఫరెన్స్ లు తప్పు మాత్రమే కాదు, పార్టీని ఏ కారణం లేకుండా చెడ్డ వెలుగులో చూపిస్తాయి. పార్టీ ‘మౌత్ పీస్’ లో ప్రచురించే ముందే దీనిని సరిగ్గా స్క్రూటినీ చేయాల్సి ఉండగా అలా జరగలేదు” అని ముంబై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి సచిన్ సావంత్ పత్రికలకు వివరించారు.
ప్రధాని పదవి కోసం నెహ్రూ, పటేల్ వర్గాల మధ్య తీవ్ర పోటీ నడిచిన సంగతి రహస్యం కాదు. గాంధీ నెహ్రూ వైపు మొగ్గు చూపడంతో పదవి ఆయన్ని వరించింది. కాంగ్రెస్ పార్టీ లోని హిందూ సాంప్రదాయ వర్గాలు పటేల్ ను ప్రధానిని చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. అంతర్జాతీయంగా నెహ్రూకి ఉన్న స్టేచర్ పటేల్ కు కొరవడిందని గాంధీ అభిప్రాయంగా చెబుతారు. తన వృద్ధాప్యం రీత్యా పటేల్ కూడా నెహ్రూ అభ్యర్ధిత్వాన్ని ఆమోదించారని నెహ్రూ మద్దతుదారులు చెప్పే సంగతి.
ఆర్టికల్ ప్రచురణతో బిజేపి నేతలు పండగ చేసుకున్నారు. ‘నిజాలు ఎన్నాళ్లు దాస్తారు?’ అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ అతివాద శిబిరం నేత మీర్వాయిజ్ ఫరూక్ మాత్రం నెహ్రూ చేసింది సరైందే అని తీర్మానించారు. పాకిస్తాన్ అప్పుడు ఆక్రమణదారు అనీ కనుక ఐరాస తలుపు తట్టడం ద్వారా నెహ్రూ సరైన చర్య తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
సోనియా గాంధీ తండ్రి ఫాసిస్టులతో సన్నిహితంగా వ్యవహరించారని సదరు ఆర్టికల్ లో రాయడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం చెలరేగింది. సాయంత్రానికల్లా పత్రిక ఎడిటర్ ను బాధ్యతల నుండి తొలగించారు.
కాంగ్రెస్ ‘మౌత్ పీస్’ లో ఆ పార్టీ అధినేత్రి పైనే విమర్శ చేయడం ఆశ్చర్యమే.
అలాంటి నిజాయితీ ‘మౌస్ పీస్’ లు కాంగ్రెస్ పార్టీలో ఇమడ లేవని కార్టూనిస్టు సరదాగా (lighter vein) చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఆ మాటకొస్తే పార్టీ అధికారిక పత్రికలో పార్టీ నేతకు వ్యతిరేకంగా రాయడం ఏ పార్టీ మాత్రం సహిస్తుంది?