బి.జె.పి నేతల శాపనార్ధాలను వమ్ము చేస్తూ ఢిల్లీలో బేసి-సరి పధకం విజయవంతం అయింది. ఢిల్లీ ప్రజలు అద్భుతమైన రీతిలో తమ పధకానికి స్పందించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలో మిగిలిన ప్రాంతాలకు ఢిల్లీ దారి చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది ప్రభుత్వం అమలు చేస్తున్నది కాదని ప్రజలే దానిని సొంతం చేసుకున్నారని ప్రభుత్వం వారికి కేవలం సహాయం మాత్రమే చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పడం విశేషం.
ప్రపంచంలో అత్యధిక కలుషిత గాలి కలిగిన నగరంగా ఢిల్లీ అవతరించిన నేపధ్యంలో కాలుష్య నివారణకు బేసి-సరి పధకాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.
బేసి సంఖ్యలు రిజిస్ట్రేషన్ నెంబర్ గా కలిగిన నాలుగు చక్రాల వాహనాలు బేసి సంఖ్యల తేదీల్లోనూ, సరి సంఖ్యల వాహనాలు సరి సంఖ్యల తేదీల్లోనూ రోడ్లపైకి అనుమతించే విధంగా ఈ పధకాన్ని రూపొందించారు.
ఈ పధకం విఫలం అయి తీరుతుందని కొందరు బి.జె.పి నేతలు శపించినప్పటికీ ప్రజల మద్దతుతో సఫలం అయిందని పత్రికల వార్తలను బట్టి తెలుస్తోంది.
పధకం విజయవంతం కావడం పట్ల ఢిల్లీ పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఈ స్ధాయిలో స్వచ్ఛందంగా రూల్ ని పాటిస్తారని తాము అనుకోలేదని కొందరు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. పధకం అమలు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది.
“మొదటి అరగంటలోనే కనీసం డజను మంది ఉల్లంఘనదారులను పట్టుకుంటానని నేను భావించాను. కానీ ఆశ్చర్యకరంగా చాలా మంది ఈ కొత్త రూల్ ని పాటిస్తున్నారు” అని ట్రాఫిక్ పోలీస్ మేన్ అంకిత్ కుమార్ చెప్పారని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక తెలిపింది.
బేసి-సరి పధకం వల్ల జనవరి 1 తేదీన కనీసం 10 లక్షల వాహనాలు రోడ్ల మీదికి రాలేదని అంచనా వేస్తున్నారు.
గడియారం 8 గంటలు కొట్టడం తోనే ముందే సిద్ధంగా ఉన్న వేలమంది వాలంటీర్లు పధకం ఉల్లంఘనదారులను గుర్తించడానికి వీధుల్లోకి వచ్చారు. వారు ఉల్లంఘనదారులను కట్టడి చేయడానికి బదులు గులాబీ పూలు ఇచ్చి రూల్ ను గుర్తు చేశారు.
దాదాపు 10,000 మంది విద్యార్ధి, యువజన వాలంటీర్లను ఢిల్లీ ప్రభుత్వం ఎన్.ఎస్.ఎస్, ఎన్.సి.సి లాంటి సంస్ధల సహాయంతో సమీకరించి వాలంటీర్లుగా నియమించింది. వారంతా చేతుల్లో గులాబీ పూలతో కూడళ్ళ వద్ద నిలబడి ఉల్లంఘనదారులకు ట్రాఫిక్ నియమాలు వివరించారు.
ఎవరైనా కొత్త రూల్ పాటించకపోతే వారితో ఎవరూ అమర్యాదగా ప్రవర్తించవద్దని, పరుషంగా మాట్లాడవద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముందే సూచనలు ఇచ్చారు. అయితే పోలీసులు మాత్రం రు. 2,000 జరిమానా వేయకుండా వదిలి పెట్టలేదు. మోటారు వాహనాల చట్టం ప్రకారమే రు. 2,000 ల జరిమానా నిర్ణయించారు.
పధకం అమలు కోసం ఢిల్లీ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించారు. ఢిల్లీ పోలీసులు 200 బృందాలను నియమించారు. రవాణా శాఖ 66 అమలు బృందాలను నియోగించింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లు 40 బృందాలతో పహారా కాశారు.
ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చడానికి అదనంగా 3,000 బస్సులను రంగంలోకి దించారు. అదనంగా 70 ట్రిప్పులను వేస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కారు నెంబర్ బేసి సంఖ్య కావడంతో ఆయన తన కారులో రవాణా మంత్రి గోపాల్ రాయ్, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ లను సెక్రటేరియట్ వద్దకు తీసుకెళ్లారు.
టూరిజం మంత్రి కపిల్ మిశ్రా ద్విచక్ర వాహనంపై సెక్రటేరియట్ కు వెళ్లారు. పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ లు తాము ఆటో లేదా బస్ లో కార్యాలయానికి వస్తామని ముందే ప్రకటించారు.
ప్రజా రవాణా వ్యవస్ధకు సంబంధించిన సమాచారం ట్విట్టర్ ద్వారా అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు చేశారు. ఎక్కడికి ఏ బస్సు వెళ్తుందో తెలియని వారు ట్విట్టర్ లో నిర్దిష్ట హ్యాండిల్ (#pollutionfreeDelhi) కు పోస్ట్ చేస్తే వెంటనే సమాచారం అందించేలా చర్యలు తీసుకున్నారు.
మొట్ట మొదటి ఉల్లంఘన పధకం అమలులోకి వచ్చిన 33 నిమిషాలకు జరిగింది. ఐటిఓ జంక్షన్ దగ్గర 2 తో అంతమైన నంబర్ గల కారును పోలీసులు పట్టుకున్నారు. తనకు కొత్త రూల్ గురించి తెలిసినప్పటికీ తమ ప్రాంతం నుండి బస్సులు లేనందున కారులో రాక తప్ప లేదని సదరు వ్యక్తి చెప్పాడని పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తి నుండి రు. 2,000 వసూలు చేశామని పోలీసులు చెప్పారు.
Photos: Hindustan Times, Indian Express