
Ambulance between in Huge Traffic jam at NH 24 due kawarian in New Delhi on Monday. Express Photo by Prem Nath Pandey. 10.08.2015.
ఢిల్లీ ఐఏఎస్ అధికారులు ఏఏపి ప్రభుత్వంపై సమ్మె ప్రకటించారు. వందల మంది అధికారులు మూకుమ్మడిగా సెలవుపై వెళ్లారు. కొందరు రోజంతా సెలవు తీసుకోగా మరికొందరు ఒక పూట సెలవులో వెళ్లారు. ఇదంతా తమలో ఇద్దరు అధికారులను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు! అధికారుల సెలవు వల్ల ఢిల్లీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తలపెట్టిన బేసి-సరి సంఖ్యల (నంబర్ ప్లేట్లు) వాహన పధకం అమలుకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం తలెత్తింది.
ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదించే కౌన్సెళ్ళకూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకూ వేతనాలు పెంచుతూ ఢిల్లీ రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసేందుకు సంబంధిత అధికారులు నిరాకరించారు. రాష్ట్ర హోమ్ శాఖకు చెందిన ప్రత్యేక కార్యదర్శి (ప్రాసిక్యూషన్) యశ్ పాల్ గార్గ్, ప్రత్యేక కార్యదర్శి (జైళ్ళు) సుభాష్ చంద్ర లు దస్త్రాలపై సంతకాలు చేయవలసి ఉండగా వారు నిరాకరించారు. దానితో వారిని సస్పెండ్ చేశామని ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారుల సంఘం (DANICS – Delhi, Andaman and Nicobar Isalands Civil Services) అర్జెంటుగా సమావేశం అయింది. అధికారుల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా సామూహిక సెలవులో వెళ్తామని బెదిరిస్తూ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. నిర్ణయం తీసుకున్నదే తడవుగా 200 మందికి పైగా అధికారులు ఒక రోజు సెలవుపై వెళ్ళిపోయారు. మరో 50 మంది వరకు ఒక పూట సెలవులో వెళ్లారు.
తమ అసోసియేషన్ సభ్యులను చట్ట విరుద్ధంగా సస్పెండ్ చేశారని DANICS అధికారుల సంఘం ఆరోపించింది. తగిన అధికారం కలిగిన వారు ఆమోదం తెలపకుండా తీసుకున్న నిర్ణయంపై తాము సంతకం చేయలేమని వారి వాదన. ప్రాసిక్యూషన్ మరియు జైళ్ల విభాగం సిబ్బంది వేతనాలు పెంచడానికి తగిన అధికారం కలిగి ఉన్న వారు ఎవరో వాళ్ళు చెప్పలేదు. బహుశా లెఫ్టినెంట్ గవర్నర్/కేంద్ర హోమ్ శాఖ అయి ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం అండ లేకుండా ఒక రాష్ట్ర ఐఏఎస్ అధికారులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ధిక్కరించే సాహసం చేయలేరు. ఢిల్లీ ప్రభుత్వం సకల విధాలుగా కేంద్ర ప్రభుత్వానికి కట్టివేయబడి ఉన్నదని, ఢిల్లీ రాష్ట్రం నామమాత్రంగా రాష్ట్రమే తప్ప పాలనాధికారాలు కలిగిన రాష్ట్రం కాదని మరోసారి వెల్లడి అయింది. గతంలో బి.జె.పి, కాంగ్రెస్ ల ఏలుబడిలోని ఢిల్లీ ప్రభుత్వాలు అనేకసార్లు తమకు తగిన అధికారాలు ఇవ్వాలని మొత్తుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలన్నీ అధికారుల సంతకాలతోనే అమలులోకి రావాలి. కాబట్టి అధికారులు సహకరించకపోతే ప్రభుత్వ నిర్ణయాలు జనంలోకి వెళ్లలేవు. కనుక సదరు అధికారులను తప్పించడం తప్ప మరో మార్గం ప్రభుత్వానికి లేదు. తాము తీసుకునే నిర్ణయాలు అధికారులు ఎలాగూ తిరస్కరిస్తారని తెలిసాక ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎలా పని చేయగలదో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పండితులు చెప్పాల్సి ఉంది. భారత దేశంలో ఫెడరల్ తరహా వ్యవస్ధ ఉన్నదని గొప్పలు పోయే రాజ్యాంగ పండితులైనా ఢిల్లీ ప్రభుత్వం పడుతున్న తిప్పలపై స్పందిస్తున్న దాఖలాలు లేవు.
బేసి-సరి పధకాన్ని విఫలం చేసేందుకే?
బేసి-సరి పధకం అమలు కాకుండా ఇబ్బందులు సృష్టించేందుకే అధికారులు సరిగ్గా సమయం చూసుకుని సెలవుపై వెళ్ళే నిర్ణయం తీసుకున్నారని ఏఏపి ప్రభుత్వం ఆరోపించడం విశేషం. ఢిల్లీ నగరంలో గాలి అత్యంత కాలుష్యంతో కూడినదని అంతర్జాతీయ సంస్ధలు తిట్టి పోస్తున్న నేపధ్యంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం బేసి-సరి పధకాన్ని ప్రకటించింది.
ఈ పధకం ప్రకారం జనవరి 1 నుండి 15 వరకు ఢిల్లీలో నాలుగు చక్రాల వాహనాలు బేసి, సరి సంఖ్యల ప్రాతిపదికన రోడ్ల మీదికి రావాలి. వాహన రిజిష్ట్రేషన్ నంబర్లు బేసి సంఖ్య అయితే అవి బేసి సంఖ్యల తేదీల్లో (1, 3, 5…) మాత్రమే రోడ్లపైకి వచ్చేందుకు అనుమతి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నంబర్లు సరి సంఖ్యలు అయితే అవి సరి సంఖ్యల తేదీల్లో (2, 4, 6…) రోడ్ల మీదికి వచ్చే అనుమతి ఇస్తారు.
ఈ పధకాన్ని డిసెంబర్ 24 తేదీన ప్రకటించారు. పధకం నుండి ద్విచక్ర వాహనాలు, గ్యాస్ వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు ఉంటుంది. మహిళా డ్రైవర్లు ఉన్న వాహనాలకు మినహాయింపు ఉంటుంది. అయితే ఆ వాహనాల్లో మగవాళ్ళు ఉండకూడదు. 12 సం.ల లోపు పిల్లలు ఉండవచ్చు. వికలాంగుల వాహనాలకు వివిధ వి.ఐ.పిల వాహనాలకు కూడా మినహాయింపు ఉంటుంది.
మినహాయింపు ఉన్న అధికారులు వీళ్ళు: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్లు, చీఫ్ జస్టిస్, లోక్ సభ స్పీకర్, రాజ్య సభ ఉపాధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, పార్లమెంటులో ఇద్దరు ప్రతిపక్ష నేతలు, ముఖ్య మంత్రులు, సుప్రీం కోర్టు జడ్జిలు. అరవింద్ కేజ్రీవాల్ తన మినహాయింపును వ్యక్తిగత స్ధాయిలో రద్దు చేసుకున్నారు. కార్ పూలింగ్ ద్వారా ఇతర మంత్రుల వాహనాల్లో తాను వెళ్లగలనని ఆయన ప్రకటించారు. మినహాయింపు పొందిన ఇతర వి.ఐ.పి లు కూడా ఇదే పద్ధతి పాటించాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కోరారు.
మినహాయింపులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లాయర్ ఒకరు హై కోర్టుకు వెళ్లారు. ఇలాంటి మినహాయింపులకు చట్టంలో ప్రాతిపదిక లేదని వారు వాదించారు. దానికి సమాధానంగా ఢిల్లీ ప్రభుత్వం బద్రతా కారణాలను ఒక కారణంగా చూపింది. అలాగే ఈ పధకం కేవలం ప్రయోగాత్మకంగా తలపెట్టిందే తప్ప ఇంకా శాశ్వతం చేయలేదని జనవరి 15 తర్వాత పధకం అమలును సమీక్షించి మరింత మెరుగైన పద్ధతి కోసం ప్రయత్నిస్తామని కోర్టుకు చెప్పింది. దానితో స్టే ఇవ్వడానికి హై కోర్టు నిరాకరిస్తూ తదుపరి విచారణ జనవరి 6 కి వాయిదా వేసింది. బహుశా పధకం లోటుపాట్లు అప్పటికి తెలుస్తాయని కోర్టు భావించి ఉండవచ్చు.
ఢిల్లీ ప్రభుత్వం తలపెట్టిన ఈ పధకం వినూత్నమైనది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఐక్యరాజ్య సమితి ఢిల్లీని ప్రకటించిన నేపధ్యంలో ఏదో ఒకటి వెంటనే చేపట్ట వలసిన పరిస్ధితి వచ్చి పడింది. సాధారణంగా అయితే మన తోలు మందం ప్రభుత్వాలు ఎంత అప్రతిష్ట వచ్చినా మౌనంతోనో కంటితుడుపు చర్యలతోనో నెట్టుకొచ్చేస్తాయి.
ఏఏపి ప్రభుత్వం దానికి భిన్నంగా తక్షణం కార్యరంగంలోకి దూకింది. ప్రపంచంలో ఇతర దేశాలు, నగరాలు ఏ పద్ధతి పాటిస్తున్నాయో పరిశీలించింది. ఉన్న వాటిలో మెరుగైనదిగా బేసి-సరి పధకాన్ని పరిగణించింది. వెంటనే పధకాన్ని ప్రకటించింది. వివిధ వేదికల ద్వారా అభిప్రాయాలను సేకరించింది. తాత్కాలిక ప్రాతిపదికన ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాలు చూడాలని పలువురు చెప్పడంతో దానిని స్వీకరించింది.
ఈ పధకం అమలు కావాలంటే ప్రజల మద్దతు తప్పనిసరి. వాహన చోదకులు స్వతంత్రంగా ముందుకు రాకపోతే పధకం విఫలం కాక తప్పదు. ప్రారంభం చాలా ముఖ్యమైనది. ప్రారంభం రోజు ఫలితాన్ని బట్టి పధకం మొత్తాన్ని అంచనా వేసేందుకు పత్రికలు, ఛానెళ్లు కాచుకుని ఉంటాయి. ఈ నేపధ్యంలో ప్రారంభం రోజైన జనవరి 1 తేదీకి సరిగ్గా ఒకరోజు ముందు ఢిల్లీ ఐఏఎస్ అధికారులు సామూహికంగా సెలవుపై వెళ్ళడం నిస్సందేహంగా అనుమానాలకు తావిస్తోంది.
భారత ప్రభుత్వంలో ప్రజా సేవకుల (పబ్లిక్ సర్వెంట్స్) పేరుతో అధికారాలు నిర్వహించే ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర సేవల అధికారులు స్వభావం రీత్యా నిరంకుశులు. వారిపై ప్రజల ప్రభావం ఏమీ ఉండదు. ప్రజల జీవనం, వారి భావోద్వేగాలు, సామాజిక-సాంస్కృతిక పట్టింపులు వారి గమనంలో ఉండవు. వారి ఏకైక అవగాహన చట్టాలను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయడం.
వారు రాజకీయ కార్యనిర్వాహకులకు జవాబుదారీ వహిస్తారు కానీ ప్రజలకు కాదు. అవడానికి అక్షరాస్యులే గాని వాస్తవంలో ప్రజల ఆదాయ వనరులే తమను పోషిస్తున్నాయన్న గమనింపు వారికి ఉండదు. ఉన్నా బహు తక్కువగా ఉంటుంది. అది కూడా తమ చుట్టూ పరిసరాలు, బంధు గణాల అవసరాల పరిధిలోనే ప్రజా దృష్టిని కలిగి ఉంటారు. అయితే వారు చట్టబద్ధ పాలనను ప్రజలకు మాత్రమే పరిమితం చేస్తారు. పై వర్గాల వారికి వర్తింపజేయడానికి వెనకా ముందు చూస్తారు. ఎందుకంటే వారి (పై) సంపాదన వారితో ముడి పడి ఉంటుంది కనుక.
రాజకీయ నాయకులు 5 యేళ్ళకు ఒకసారి జనం వద్దకు రావాలి. అందువలన ప్రజలకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించాల్సిన అవసరం వారికి ఉంటుంది. నిరంకుశ అధికారులకు ఆ అవసరం కూడా ఉండదు.
ఈ అవగాహనతో ఢిల్లీ ఐఏఎస్ అధికారుల సమ్మెను పరిశీలిస్తే మర్మం ఇట్టే బోధపడుతుంది. ఏఏపి నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి వ్యతిరేక నినాదంతో అధికారం చేపట్టింది. ఆ పార్టీ అయితే అవినీతిని అరికడుతుందని ప్రజలు నమ్మారు. కానీ అవినీతికి వ్యతిరేకంగా గట్టి నిబద్ధతను ప్రభుత్వాలు పాటిస్తే అది మొదట అధికారుల దగ్గరికే వస్తుంది.
ప్రభుత్వాల చట్టబద్ధ పాలనలో అధికారులు కీలక స్ధానంలో ఉంటారు. వారు శాశ్వతంగా, పదవి విరమణ చేసేవరకు, ఉన్నత పదవుల్లో ఉంటారు. వ్యవస్ధలోని లొసుగులు, లోటు పాట్లు వారికి కరతలామకం. అందుకే రాజకీయ నాయకులు వారిపై ప్రధానంగా ఆధారపడతారు. చట్టాలకు ఎక్కడ ఏయే కన్నాలు ఉన్నాయో ఎక్కడెక్కడ అవినీతి ఆదాయ మార్గాలు ఉన్నాయో వారికి తెలుసు గనక వారి ద్వారానే పనులు చక్కబెడతారు. దీని అర్ధం అధికారులది పై చేయి అని కాదు.
రాజ్యాంగం అధికారాన్ని పార్లమెంటు, బ్యూరోక్రటిక్ ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీల మధ్య సమానంగా, సమతూకంగా విభజించింది అని చెబుతారు గాని ఆచరణలో అది పార్లమెంటులోనే ప్రధానంగా కేంద్రీకృతం అయి ఉంది. బ్యూరోక్రాట్లు రాజకీయులకు సేవకులుగా ఉంటూ సంపదలను పోగేయడంలో తల పండిపోయారు. వారి అవినీతి వెల్లడి కాకూడదంటే పరస్పరం సహకరించుకోవాలి. ఆ విధంగా అధికార వ్యవస్ధ రాజకీయ వ్యవస్ధకు నమ్మకమైన మిత్రుడుగా ఉంటూ అవినీతిలో భాగం పంచుకుంటోంది.
అలాంటి అధికార వ్యవస్ధ అవినీతికి దూరంగా ఉండడం కల్ల. తమ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి అది ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఢిల్లీ అధికారులు చేస్తున్నది అదే కావచ్చు. అప్పుడే ఒక నిర్ధారణకు రావడం సరికాదు గానీ కేజ్రీవాల్ వ్యాఖ్యానాలను బట్టి చూస్తే వారు కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వంతో నిండా కుమ్మక్కు అయ్యారని అర్ధం అవుతోంది.
“ఢిల్లీ లోని DANICS, ఐఏఎస్ అసోసియేషన్ లు బి.జె.పి కి పూర్తి స్ధాయి B టీం లు గా వ్యవహరిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి లెఫ్టినెంట్ గవర్నర్, అధికారుల ద్వారా ఏఏపి ప్రభుత్వం మీదికి కాల్పులు జరుపుతున్నారు” అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
“సెలవులో వెళ్ళిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాము. ఈ అధికారులు పూర్తికాలం సెలవులో వెళ్లిపోతే ప్రజలు చాలా సంతోషిస్తారు. వారికి చెల్లింపు సెలవు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం. అప్పుడు ప్రభుత్వం నిజాయితీగా, ఆటంక రహితంగా, సమర్ధవంతంగా పని చేసుకోవచ్చు” అని కూడా అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ “బేసి-సరి పధకం అమలు చేసే రోజుకు సరిగ్గా ముందు రోజే వారు ఎందుకు సామూహిక సెలవులో వెళ్లాలని నిర్ణయించారు? ఇది కుట్రలో భాగం. పధకం అమలు చేయడంలో మేము విఫలం కావాలని వారి ఉద్దేశం… DANICS అధికారులు నిన్న (ఎమర్జెన్సీ) సమావేశంలో ఉండగా ప్రధాన మంత్రి కార్యాలయం, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాలు రెండూ వారితో నేరుగా సంబాషిస్తూ ఉన్నారు” అని ఉప ముఖ్యమంత్రి వెల్లడి చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇటువంటి ఆరోపణలు చేయబోరు. కాంగ్రెస్, బి.జె.పి ప్రభుత్వాలైతే క్షణాల్లో మాట మార్చేయగల సమర్ధవంతులే కావచ్చు గానీ ఢిల్లీ ప్రభుత్వ పెద్దల నుండి అటువంటి ప్రవర్తన ఇంకా అనుభవంలోకి రాలేదు. కనుక ఢిల్లీ ప్రభుత్వంపై DANICS అధికారులు పరోక్ష యుద్ధం ప్రకటించారని భావించాల్సి వస్తోంది. వారికి వెనక ఉండి నడిపిస్తున్నది కేంద్ర ప్రభుత్వమూ అధికారులేనని ఏఏపి ప్రభుత్వం చెప్పేది నిజమే అయితే ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు పూర్తి స్ధాయి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే వారు ఎంతో ఇష్టపడి గద్దెమీద కూర్చోబెట్టిన ఏఏపి ప్రభుత్వాన్ని కాపాడుకోగలరు. లేనట్లయితే ఈనగాచి నక్కల పాల్జేసినట్లు తమ ఆశలను, ఆకాంక్షలను నిరంకుశ ఐఏఎస్ అధికారుల పాల్జెసినట్లే కాగలదు.