“నిజమే సుమా. ఇప్పుడు మరీ ఇరుకై పోయింది -ముఖ్యంగా వెల్ ఆఫ్ ద హౌస్ లో…”
____________________________
పార్లమెంటు కోసం కొత్త భవనం కావాలని స్పీకర్ కోరారు.
************
పార్లమెంటు కార్యకలాపాల కోసం కొత్త భవనం కావాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు ఆమె రెండు ఆప్షన్ లను ప్రభుత్వం ముందు పెడుతూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారికి లేఖ కూడా రాశారు. ఇపుడున్న పార్లమెంటు కాంప్లెక్స్ లోనే మరో భవనం కట్టడం లేదా రోడ్డు అవతల రాజ్ పధ్ వద్ద ఉన్న పెద్ద ఖాళీ స్ధలంలో అత్యాధునిక సౌకర్యాలతో పూర్తిగా కొత్త భవనం నిర్మించడం.. ఆ రెండు ఆప్షన్లు.
పత్రికల వార్తల్ని బట్టి చూస్తే త్వరలోనే మన పార్లమెంటు సచివులకు అత్యాధునిక హంగులతో కొత్త భవనం నిర్మాణం ప్రారంభం కావచ్చు. లోక్ సభ, రాజ్య సభల్లో ఇప్పుడున్న స్ధలం చాలక ఇరుకుగా మారిపోయిందని స్పీకర్ భావిస్తున్నారట. అదీగాక ఆర్టికల్ 81, క్లాస్ (3) ప్రకారం 2026 సం. నాటికి సభ్యుల సంఖ్య పెరుగుతుందట. సభ్యుల సంఖ్య పెరిగితే వారు కూర్చోవడానికి సీట్లు ఏవీ లేవట. అలాగే ఇపుడున్న భవనం వయసు మీరి అధికి ఒత్తిడికి లోనవుతోందని అందువల్ల కొత్త భవనం కావాలని స్పీకర్ కోరుతున్నారు.
ఇప్పుడు కట్టిన భవనం 1927 లో నిర్మించినది. అప్పటి భవిష్యత్ ను ఊహించుకుని 550 సీట్లు ఉండేలా లోక్ సభలో ఏర్పాట్లు చేశారు. సభ్యుల సంఖ్య పెరిగితే వారికి కోర్చోవడానికి కుర్చీలు లేవు. “పార్లమెంటు భవనం వయసు మీరి పోతున్న దృష్ట్యానూ కార్యకలాపాలు విస్తరిస్తున్న దృష్ట్యానూ అలాగే సిబ్బంది సంఖ్య పెరిగిపోతున్నందునా ఇపుడున్న భవనం ఒత్తిడికి గురవుతోంది. అతిగా వినియోగించబడుతోంది… ఈ పరిస్ధితుల నేపధ్యంలో అత్యంత ఆధునికమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది” అని స్పీకర్, కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది.
‘అత్యంత ఆధునికమైన’ అంటే స్పీకర్ గారి అర్ధం ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సాధనాలను సభ్యులకు అందుబాటులోకి వచ్చేలా చేయాలని. ఆధునిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా సభల నిర్వహణ కాగితం రహితంగా (పేపర్ లెస్) చేయాలన్నది స్పీకర్ అభిలాష. ఆధునిక ఎలక్ట్రానిక్ గాడ్గెట్ లను ప్రతి సభ్యుడికి అందుబాటులోకి తెస్తే కార్యకలాపాలు సులువుగా జరపవచ్చని ఆమె అభిప్రాయం.
అయితే ఇలాంటి ఆధునిక పరిజ్ఞానం ఏర్పాటు చేయాలంటే భవనంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని కూల్చాలి. కొన్నింటికి తిరిగి కట్టాలి. లోక్ సభ ఛాంబర్ కు రీ డిజైనింగ్ చేయాలి. సరికొత్త హంగులు అమర్చాలి. ఇవన్నీ చేయడానికి తగిన అవకాశం ఇప్పటి భవనంలో లేదు. అందుకు అనేక పరిమితులు ఉన్నాయి. ప్రస్తుత భవనం ‘హెరిటేజ్ గ్రేట్ – I’ భవనంగా ప్రకటించినందువల్ల మార్పులు చేయడం నిషిద్ధం. అదే కొత్త భవనం అయితే కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆధునిక సాధనాలను అమార్చుకోవచ్చు. ఇదీ స్పీకర్ అభిప్రాయంగా బైటికి వచ్చిన బి.జె.పి ప్రభుత్వ అభిప్రాయం.
ఒకవేళ రాజ్ పధ్ అవతల కొత్త భవనం నిర్మిస్తే రాజ్ పధ్ కిందుగా -అండర్ గ్రౌండ్ ద్వారా- ఇప్పటి భవనానికి దారి నిర్మించవచ్చని తద్వారా పాత, కొత్త భవనాలకు లంకె ఏర్పాటు చేయాలని కూడా ఆమె ప్రతిపాదించారు. భూమి కింద మార్గం లేకపోతేనేమి? భూమి పైన సభ్యులు, మంత్రులు, అధికారుల కదలికలకు ఎవరు అడ్డం వస్తారు?
కొత్త గాడ్గెట్ లు ఏర్పాటు చేస్తే మన సభ్యుల వీరావేశాల ధాటికి అవి నిలుస్తాయా అన్నది మరొక ప్రశ్న. ఇప్పుడంటే ఒక్క మైకు మాత్రమే సభ్యుల ఆవేశాలకు సాధనంగా పని చేస్తోంది. ఎలక్ట్రానిక్ గాడ్గెట్ లు తెచ్చి వారి ముందు పెడితే వాటిని ఆవేశంతో పగలగొట్టబోరన్న గ్యారంటీ ఏమీ లేదు. పగలగొట్టేలా చేతికి ఎందుకు ఇస్తారని ప్రశ్న రావచ్చు. చేతికి ఇవ్వకపోయినా బల్లలకు, కుర్చీలకు బిగించినా వాటిని పగల గొట్టడం అంత కష్టమైన పనేమీ కాదు కదా.
మైకులు విరగ్గొడితే విరగ్గొట్టిన వాటిని తీసేసి కొత్త వాటిని బిగిస్తున్నారు. ఆ ఖర్చును సభ్యుల నుండి వసూలు చేసిన దాఖలాలు లేవు. మైకుల ఖర్చు తక్కువ గనక సరిపోతోంది గాని ఎలక్ట్రానిక్ గాడ్గెట్ ల ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ప్రజాధనం మరింత దుర్వినియోగం కాక మానదు. ఈ సమస్యను పార్లమెంటు సభ్యులు చర్చించే అవకాశమే లేదు; అలా చర్చించడం అంటే వారి వెధవ్వేషాలు వారే ప్రచారం చేసుకోవడం అవుతుంది కనక.
గత 15 – 20 యేళ్లుగా పార్లమెంటు సమావేశాలు అంటే ప్రతిపక్ష, పాలక పక్ష సభ్యులు ఒకరిని మించి మరొకరు ఆందోళనలు చేయడానికి ఆవేశకావేశాలు ప్రదర్శించేందుకు, మూకుమ్మడిగా వెల్ లోకి దూకి వీరంగం వేసేందుకు మాత్రమే ఖ్యాతి గాంచాయి. వీధుల్లో జరగవలసిన ఆందోళనలు పార్లమెంటు సభల్లోనే జరుగుతుండడంతో తరచుగా ప్ల కార్డులు ప్రదర్శిస్తూ గుంపులుగా స్పీకర్ చుట్టూ వెల్ లో మూగిపోతున్నారు. అక్కడ స్ధలం చాలక సభ్యులు అనేకమార్లు స్పీకర్ ముందరి అధికారుల మేజా బల్లలపై ఎక్కి కూర్చుంటున్నారు కూడాను. ఇటీవల తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి మన తెలుగు వీరులు ఏ స్ధాయికి వెళ్లారో చూసి ఉన్నాము.
కనుక మారిన పరిస్ధితుల దృష్ట్యా వెల్ ను విశాలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కార్టూనిస్టు వ్యంగ్యంగా సూచిస్తున్నారు. కొత్త భవనం నిర్మాణాన్ని కోరడంలో స్పీకర్ దృష్టిలో ఉన్నది కూడా మారిన, మారుతున్న పరిస్ధితులే. కార్టూన్ దృష్టిలో ఉన్నదీ మారిన పరిస్ధితులే. కాకపోతే అవి రెండూ ఒకటేనా అన్నది ప్రశ్న.
నిజానికి స్పీకర్ దృష్టిలో కార్టూనిస్టు ఊహిస్తున్న పరిస్ధితులు లేకపోతే ఆశ్చర్యపడవలసిందే. ఇటీవల చలికాలం పార్లమెంటు సమావేశాలు పూర్తిగా వృధా అయ్యాయని కేంద్ర సచివులు, పత్రికలు ఒకటే పనిగా దుఖిస్తున్నాయి. దేశాన్ని శరవేగంగా ముందుకు దౌడు తీయించే బిల్లులు స్పీకర్ బల్ల మీదికి రాలేదని వారు వాపోయారు. ఈ పరిస్ధితులు స్పీకర్ దృష్టిలో ఉండవచ్చు. కనుక కొత్త భవనంలో స్పీకర్ ఆసనం చుట్టూ రక్షణ గోడ కట్టినా ఆశ్చర్యం లేదు.
ఈ దేశ విధివిధానాలు మార్చే అధికారభవనమైన పార్లమెంట్ హౌస్ ను నేటి అవసరాలకనుగునంగా మార్చుకోవచ్చును,అందులోని సభ్యుల అవసరాలకు తగినట్లుగా వారిజీతభత్యాలు పెంచుకోవచ్చును. దీనికి ఎటువంటి అభ్యంతరమూ లేదు.దీనికి ప్రజాసేవా అనిపేరుపెట్టుకోకండి.
ఈ దేశ విధివిధానాలు నిజమైన అర్ధంలో మార్చే సామాన్యులు,నిరుపేదలూ అయినటువంటి శ్రామికులు తలదాచుకొనే వారి భవనాలను నేటి అవసరాలకనుగునంగా మార్చడానికి,అందులోని సభ్యుల అవసరాలకు తగినట్లుగా వారిజీతభత్యాలు పెంచడానికి ఎటువంటి విధివిధానాలు అమలుపరిచారో ముందు చెప్పమనడి?