
Advani arives at MM Joshi house
కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్లుగా కీర్తి ఆజాద్ కు బిజెపి పెద్దల నుండి మద్దతు వస్తోంది. బి.జె.పి సైద్ధాంతిక మార్గదర్శక సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్ సైతం కీర్తి ఆజాద్ విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ ఎం.పిని మొదట వివరణ కోరుతూ షో-కాజ్ నోటీసు ఇవ్వకుండా ఎకాఎకిన సస్పెండ్ చెయ్యడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. చూడబోతే ఏఏపి ఒత్తిడికి తలొగ్గి ఆదరాబాదరాగా కీర్తి ఆజాద్ ను సస్పెండ్ చేసినట్లు కనిపిస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఒకరు అన్నట్లు ఎన్‌డిటివి తెలిపింది.
బీహార్ రాష్ట్రం, దర్భంగా పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బిజెపి ఎంపిగా ఎన్నికయిన కీర్తి ఆజాద్ ను పార్లమెంటు చలికాలం సమావేశాలు ముగిసిన వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు బి.జె.పి ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం తప్ప సస్పెన్షన్ కు ఇతమిద్ధమైన కారణాలు ఏవీ బి.జె.పి చెప్పలేదు.
ఈ నేపధ్యంలో “మార్గదర్శక్ మండల్” పేరుతో బి.జె.పి ఏర్పాటు చేసిన పెద్దల కమిటీ సభ్యులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. మానవ వనరుల శాఖ మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి ఇంట్లో సమావేశం అయిన మార్గదర్శక్ మండల్ సభ్యులు కీర్తి ఆజాద్ విషయమై పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని భావించినట్లు పత్రికల ద్వారా తెలుస్తున్నది.
సస్పెన్షన్ నిర్ణయం వెలువడిన వెంటనే కీర్తి ఆజాద్ ఓ ప్రకటన జారీ చేస్తూ తాను బి.జె.పి పెద్దలను ఆశ్రయిస్తానని ప్రకటించారు. తాను ఏమి నేరం చేశానని సస్పెండ్ చేస్తారో చెప్పాలని, అవినీతిని ప్రశ్నించడమే తన తప్పయితే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయడానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. తనకు సహాయం చేయాలని పెద్దలను కోరతాను అని చెప్పారు.
తన సస్పెన్షన్ నోటీసుకు తగిన రీతిలో బదులు ఇచ్చేందుకు సుబ్రమణ్య స్వామి మద్దతు కోరానని, తగిన సాయం చేస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారని కీర్తి ఆజాద్ చెప్పారు. ఈ మేరకు తాను కీర్తి ఆజాద్ కు హామీ ఇచ్చింది నిజమేనని సుబ్రమణ్య స్వామి నిర్ధారించారు కూడా.
ఈ విధంగా కీర్తి ఆజాద్ ఒక పధకం ప్రకారం అన్నివైపుల నుండీ అరుణ్ జైట్లీని ముట్టడిస్తున్నారు. పనిలో పనిగా తాను అవినీతి వ్యతిరేక రారాజు నరేంద్ర మోడికి వీరాభిమానిని అంటూ మోడిని సైతం ఒక చట్రంలో ఇరికించేశారు. అవినీతిపై తిరగబడి పార్టీ నుండి సస్పెన్షన్ కు గురి కావడం అంటే భావోద్వేగాల పరంగా వీర మరణంతో సమానమే. సదరు భావోద్వేగాలను కీర్తి ఆజాద్ తనకు అనుకూలంగా విజయవంతంగా వినియోగించుకున్నట్లు కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ పదవుల నుండి దూరంగా పెట్టబడిన బి.జె.పి పెద్దలతో నామమాత్ర అధికారాలతో ఏర్పరిచిన మార్గదర్శక్ మండల్ సభ్యులుగా ఎల్.కె.అద్వానీ, ఎం.ఎం.జోషి, శాంతా కుమార్, యశ్వంత్ సిన్హాలను బి.జె.పి నియమించింది. వారు తన వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిర్ణయించారని కీర్తి ఆజాద్ చెప్పారు.
“పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోవాలని సీనియర్ నేతలు నిర్ణయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా జోక్యం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఆయనకు నేను త్వరలో లేఖ రాస్తాను” అని కీర్తి ఆజాద్ చెప్పారని ది హిందు తెలిపింది.
గురువారం ఉదయం ఎంఎం జోషి ఇంట్లో ఈ నలుగురు పెద్దలు సమావేశం అయ్యారు. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించిన తీరు పట్లా, పార్టీని బలహీనం కావించడం పట్లా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన పెద్దలు ఈసారి ఇంకా ప్రకటన ఏదీ చేయలేదు.
ఎల్.కె.అద్వానీ చొరవతో జరిగిన తమ సమావేశాన్ని ‘కర్టెసీ కాల్’ గా కొట్టిపారేశారు. అయితే పార్టీలో తలెత్తిన విభేదాలను వారు చర్చించారని షో-కాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెన్షన్ నోటీసు ఇవ్వడం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి.
అది కూడా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు స్పసెండ్ చేయడం ఏమిటన్నది పెద్దల అభిప్రాయంగా ఉన్నట్లు అభిజ్ఞ వర్గాలు చెబుతున్నాయి. డిడిసిఏ అవినీతిపై విచారణ చేసేందుకు ఏదో ఒక మార్గాన్ని పార్టీ వెతికి ఉండాల్సిందని తద్వారా అవినీతిపై తాము కఠినంగా ఉన్నామన్న సందేశం ఇవ్వాల్సి ఉందని, దానికి బదులు గొంతెత్తిన వారి నోరు మూసే చర్యలు తీసుకోవడం సరికాదన్నది వారి అభిప్రాయం అని వారు చెప్పారు.
అదీ సంగతి! అవినీతిపై కఠినంగా ఉన్నామన్న సందేశం ఇవ్వడానికే ఏదో విధంగా విచారణ జరిగే ఏర్పాటు చేయాలి తప్ప నిజంగా అవినీతిని పెళ్లగించేందుకు కాదు. అవినీతిని ప్రశ్నించిన ఎం.పి ని సస్పెండ్ చేయడం అంటే పార్టీ అవినీతికి మద్దతుగా నిలబడినట్లే. ఇలాంటి స్పష్టమైన చెడ్డ పేరు పార్టీకి వచ్చేలా చేయడం ఏమిటన్నదే పెద్దల ప్రశ్న.
కీర్తి ఆజాద్ ధైర్యమూ అదే. అవినీతిపై మాత్రమే మాట్లాడడం ద్వారా తాను అవినీతి వ్యతిరేక పోరాట యోధుడుగా పేరు సంపాదించారు. అదే సమయంలో తనపై పార్టీ చర్య తీసుకోలేని పరిస్ధితిని కల్పించారు. ఈ సస్పెన్షన్ పార్లమెంటు సమావేశాల రోజుల్లో జరిగి ఉంటే ప్రతిపక్షాలు చట్ట సభల్లో ఉతికి ఆరేసి ఉండేవి. ఆ పరిస్ధితి రాకుండా సమావేశాలు ముగిసే వరకూ ఆగి ఆ తర్వాత హడావుడిగా సస్పెండ్ చేసేశారు.
కానీ ఆ క్రమంలో మొదట షో-కాజ్ అడగాలన్న సంగతి మరిచినట్లున్నారు. ఈ అంశం మీదనే పెద్దలు కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. తద్వారా ఏదో విధంగా మోడి-షా ద్వయం చెల్లుబాటును బలహీనపరచడం పెద్దల లక్ష్యం.
ఇదంతా బి.జె.పి పార్టీలోని ముఠా కుమ్ములాటల్లో భాగం మాత్రమే. ఒకవేళ డిడిసిఏ స్కామ్ పై విచారణ కమిటీ వేసినా అదేమీ ఒరగబెట్టదు. కీర్తి ఆజాద్ డిమాండ్ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సి.బి.ఐ విచారణ జరిగితే ఎంతో కొంత నిజం వెల్లడి కావచ్చు.