Keshav strikes again!
డిడిసిఏ స్కాంలో తన అవినీతిని అరుణ్ జైట్లీ ఎలా సమర్ధించుకుంటున్నారో ఈ కార్టూన్ విశ్లేషిస్తున్నది.
ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో కొన్ని భాగాల్ని ఆధునికరించడానికి 24 కోట్ల అంచనాతో కాంట్రాక్టు అప్పగించగా పనులు ముగిసే నాటికి 114 కోట్లు చెల్లించడం ప్రధాన కుంభకోణం.
ఆధునీకరణ పనుల్లో భాగంగా ఢిల్లీ మునిసిపాలిటీ అనుమతి లేకుండానే కొన్ని బాక్స్ లను నిర్మించారు. స్టేడియం స్ధలంలో అక్రమ నిర్మాణాలు చేసి వాటిని అక్రమంగా లీజులకి ఇచ్చేశారు. అదనంగా ఖర్చు చేసిన 90 కోట్లను ఈ విధంగా భోంచేశారు.
ఈ ఖర్చులు తనకేమీ తెలియవని జైట్లీ బుకాయిస్తున్నారు. తాను నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ని అని నమ్మబలుకుతున్నారు. రోజువారీ ఖర్చులు తనకు చెప్పరని దాట వేశారు. మొత్తం మీద జైట్లీ జనం ముందు ఉంచిన డిఫెన్స్ ‘అడ్డంగా నిరాకరించడం’.
కార్టూన్ లో జైట్లీ ప్రధాన బ్యాట్స్ మేన్. ఎలాంటి బ్యాట్స్ మేన్ అంటే పిచ్ ని ఎలా క్యూరేట్ చెయ్యాలో నిర్దేశించగల బ్యాట్స్ మేన్. ఆయన తాను అవుట్ కాకుండా ఉండడానికి వికెట్ల ముందు ఒక అడ్డంకిని నిర్మించుకోగల బ్యాట్స్ మేన్.
ప్రేక్షకులు, ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు, బహుశా అంపైర్లు కూడా దానికి అభ్యంతరం చెబితే “ఆ సంగతేమీ నాకు తెలియదు. బహుశా స్టేడియం ఆధునీకరణ పనుల్లో పిచ్ లో కూడా కొన్ని మార్పులు చేశారేమో తెలియదు” అని ఆయన బుకాయిస్తున్నారు.
ఆ అడ్డంకిని తొలగించడానికి ఎవరూ రాకుండా చుట్టూ బరిగీసి ఆ గీత దాటితే (బహుశా బ్యాట్ తో) అటాక్ చేసేస్తానని హెచ్చరిస్తున్నారని కూడా కార్టూనిస్టు సూచిస్తున్నారు.
“Caesar’s wife must be above suspicioion” అన్న సామెత ను జైట్లీ ప్రతిపక్ష నేతగా ఉండగా ఎప్పుడూ వల్లే వేసేవారు. యు.పి.ఏ కుంభకోణాలపై ‘నాకేమీ తెలియదు’ అని బుకాయిస్తున్న అప్పటి ప్రధాని మన్మోహన్ ను ఉద్దేశిస్తూ ఆయన ఈ సామెత వల్లించేవారు.
ఈ సామెత డిడిసిఏ ఛైర్మన్ కు వర్తించదా?