ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ -డిడిసిఏ- అధ్యక్షులుగా 13 సంవత్సరాలు, ప్యాట్రన్-ఇన్-చీఫ్ గా ఒక సంవత్సరం పదవులు నిర్వహించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, అవినీతి ఆరోపణల నేపధ్యంలో, రాజీనామా చేయవలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడి సంకేతం ఇచ్చారా?
బి.జె.పి పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడి చేశారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పత్రికలకు చెప్పిన వ్యాఖ్యలు ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి.
“ప్రధాన మంత్రి ఎల్.కె.అద్వానీ ఉదాహరణను ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం హవాలా కేసులో ఆయనను (అద్వానీని) ఇరికించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత అద్వానీ విజయవంతంగా బైటికి వచ్చారు. కాంగ్రెస్ వ్యూహం ఆ పార్టీకే వెనక్కి తన్నింది. జైట్లీపై వచ్చిన ఆరోపణల విషయంలోనూ అదే పునరావృతం కాబోతున్నది. ప్రభుత్వంపై బురద జల్లడానికి కాంగ్రెస్ సరికొత్త అంశాలను కనిపెడుతోంది” అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సమావేశం అనంతరం విలేఖరులతో చెప్పారు.
అద్వానీ ఉదాహరణను ప్రత్యేకంగా ప్రస్తావించడంలో ప్రధాని నరేంద్ర మోడి ఉద్దేశం ఏమిటన్న విషయమై ఊహాగానాలు సాగుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతలతో పాటు కాంగ్రెస్ ఎం.పిలు, ఇతర పార్టీల నేతలు కొందరు అరుణ్ జైట్లీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతుండగా ఆయనపై విచారణ చేయడం జరగదు కనుక ఆయన రాజీనామా చేయాల్సిందేనని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
1996లో హవాలా కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే ఎల్.కె.అద్వానీ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. పి.వి.నరసింహారావు నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం హవాలా కేసుపై సి.బి.ఐ విచారణకు ఆదేశించింది. అయితే ఆ తర్వాత సాక్షాలు లభించలేదని చెబుతూ అద్వానీపై కేసు కొట్టేశారు.
ఎల్.కె.అద్వానీ తరహా లోనే అరుణ్ జైట్లీ కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సంకేతం ఇచ్చినట్లే అని వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎల్.కె.అద్వానీ ఉదాహరణను ప్రస్తావించిన ఉద్దేశం అదేనని వారు అర్ధం తీస్తున్నారు. సి.పి.ఎం పార్టీ నేతలు కూడా ఇదే అర్ధం తీయడం గమనార్హం.

Kirti Azad and Bishan Singh Bedi at a press conference in New Delhi
“అద్వానీ ఉదాహరణ తేవడం ద్వారా అరుణ్ జైట్లీ తన పదవికి రానీజామా చేయాలని ప్రధాన మంత్రి సూచిస్తున్నారు. తనపై ఆరోపణలను ఎదుర్కొని అవి తప్పని రుజువు చేసుకోవాని, ఆ తర్వాత పదవి చేపట్టవచ్చని ఆయన చెబుతున్నారు. అద్వానీ లాగే మీరూ చేయండని ప్రధాని జైట్లీకి సంకేతం ఇస్తున్నట్లే నేను భావిస్తున్నాను” అని సి.పి.ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.
ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఏదో ఊసుపోకకు ఇలాంటి పోలికలు తీసుకురారని తన ఉద్దేశం ఏమిటో చెప్పడానికే వారు పోలికలు తెస్తారని విశ్లేషకులు భాష్యం చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అర్ధాలు ఏమీ లేకుండానే అటువంటి పోలికలు ప్రస్తావించడం జరిగితే వారి మాటలను స్వీకరించడంలో పత్రికలు, పరిశీలకులు మునుముందు అయోమయానికి గురవుతారన్న సంగతి వారి దృష్టిలో ఉంటుంది. వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ‘ప్రధాన మంత్రి ఇలా అన్నారు’ అని చెప్పడం అంటే జైట్లీ రగడపై ప్రధాని ఉద్దేశం ఏమిటో వెల్లడి చేయడమే అని విశ్లేషకుల అభిప్రాయం.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా కోరడంలో అప్పటి బి.జె.పి పార్లమెంటు సభ్యులు అత్యంత కఠినంగా వ్యవహరించడం ఈ సందర్భంగా స్మరణీయం. మన్మోహన్ సింగ్ తానుగా తప్పు చేయలేదని, ఎలాంటి అవినీతికి పాల్పడ లేదని తమకు తెలుసని కానీ అవినీతి మంత్రులను చూస్తూ ఊరుకోవడం ద్వారా ఆయన కూడా అవినీతికి అవకాశం ఇచ్చారని బి.జె.పి నేతలు గట్టిగా వాదించారు. 2జి, బొగ్గు కుంభకోణాల పర్యవసానంగా మన్మోహన్ రాజీమా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇప్పుడు అరుణ్ జైట్లీ కూడా అప్పటి మన్మోహన్ తరహాలోనే తనను తాను వెనకేసుకొస్తున్నారు. 13 సంవత్సరాల అధ్యక్ష పదవి లో ఉండి కూడా తాను నాన్-ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించానని, రోజువారీ విధులు, కాంట్రాక్టులు తనకు తెలియవని నమ్మబలుకుతున్నారు. కనుక తాను డిడిసిఏ అవినీతికి అతీతం అని సమార్చించుకుంటున్నారు.
అయితే ఢిల్లీ క్రికెట్ తో యేళ్ళ తరబడి అనుబంధం ఉన్న మాజీ జాతీయ ఆటగాడు బిషన్ సింగ్ బేడి, మాజీ ఆటగాడు మరియు బి.జె.పి ఎం.పి కూడా అయిన కీర్తి ఆజాద్ వాదనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జైట్లీ మాట లేకుండా డిడిసిఏలో ఒక్క పని కూడా జరగదని బిషన్ సింగ్ బేడి రెండు రోజుల క్రితం ఐ.బి.ఎన్-సి.ఎన్.ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బల్ల గుద్ది చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన పదవిలో లేకపోయినా ఆయన చెప్పిందే డిడిసిఏలో శాసనం అని బేడి స్పష్టం చేశారు.
కీర్తి ఆజాద్ అయితే జైట్లీ పేరు చెప్పలేదన్న మాటే గానీ మిగిలినదంతా చెప్పారు. ఆయన వెల్లడి చేసిన స్టింగ్ వీడియోలో తాను జైట్లీని అవినీతిపైనా, అక్రమ ఆదేశాల పైనా నిలదీస్తున్న దృశ్యాలే ఉన్నాయని పత్రికల ద్వారా తెలుస్తోంది. బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా కీర్తి ఆజాద్ తో ప్రత్యేకంగా సమావేశమై తగిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయన డిడిసిఏలో తీవ్ర అవినీతి జరిగిందన్నది ముమ్మాటికీ నిజం అని స్పష్టం చేస్తున్నారు. డిడిసిఏ వ్యవహారాలపై విచారణ సైతం డిమాండ్ చేశారు. తనను నోరు తెరవకుండా అమిత్ షా కట్టడి చేశారన్న పుకార్లను నమ్మవద్దని కూడా ఆయన పత్రికలను కోరారు. పైగా ఒకే చిరునామా కలిగిన 14 కంపెనీలకు అక్రమంగా కోట్లాది డబ్బు చెల్లించారని చెబుతూ సాక్ష్యాలు కూడా ప్రవేశపెట్టారు.
ఈ పరిస్ధితుల్లో బహుశా జైట్లీ రాజీనామా చేయక తప్పదని ప్రధాని మోడి ఒక అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చని బలమైన అభిప్రాయం వినపడుతోంది. ప్రధాని అసలు ఉద్దేశం ఏమిటన్నది ఆయన బహిరంగంగా నోరు తెరిస్తే గాని తెలియదు. కానీ ఆయన నోరు తెరవడమే గగనం అయిపోయింది. మన్మోహన్ ను మౌన మునిగా హాస్యమాడిన నరేంద్ర మోడి, ఆ మౌనానికి అర్ధం ఏమిటో తానూ ప్రధాని అయ్యాక అర్ధమైందని భావించాలా?