జైట్లీకి కీర్తి ఆజాద్ 52 ప్రశ్నలు


Kirti Azad, BJP MP

Kirti Azad, BJP MP

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైట్లీ అవినీతిపై 5 ప్రశ్నలతో సరిపెడితే బి.జె.పి ఎం.పి కీర్తి ఆజాద్ ఏకంగా 52 ప్రశ్నలను సంధించారు. సోమవారం మాజీ టెస్ట్ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కీర్తి ఆజాద్, ఒక వ్యక్తిపై ఎక్కుపెట్టిన దాడి కాదని చెబుతూనే జైట్లీకి 52 ప్రశ్నాస్త్రాలను సంధించాడు.

ప్రశ్నలను సంధించడంతోనే కీర్తి ఆజాద్ సరిపెట్టుకోలేదు. Wikileaks4India అనే వెబ్ సైట్, సన్ స్టార్ అనే పత్రికా విడుదల చేసిన అవినీతి సాక్షాలను కూడా విడుదల చేశాడు. ఫిరోజ్ షా కోట్ల స్టేడియం ఆధునీకరణ కోసం డి‌డి‌సి‌ఏ ఒకే చిరునామా కలిగిన 14 కంపెనీలకు కాంట్రాక్టులు, చెల్లింపులు చేసిన సంగతిని వెల్లడి చేశాడు.

విలేఖరుల సమావేశంలో అరుణ్ జైట్లీ పేరు ఎత్తని కీర్తి ఆజాద్, విలేఖరులకు పంపిణీ చేసిన 52 ప్రశ్నల పత్రంలో మాత్రం జైట్లీకే ప్రశ్నలను ఉద్దేశించడం గమనార్హం. కీర్తి, బేడీలు విడుదల చేసిన ప్రశ్నల ప్రకటనకు “Questions for Shri Arun Jaitley” అని శీర్షిక పెట్టారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది. డి‌డి‌సి‌ఏ లో జరిగిన అక్రమాలను కార్పెట్ కిందికి ఊడ్చెయ్యడానికి జైట్లీ శ్రమించారని ఆజాద్ 52 ప్రశ్నల పత్రం పేర్కొందని ఎక్స్ ప్రెస్ తెలిపింది. ఢిల్లీ క్రికెట్ అవినీతితో పాటు హాకీ ఇండియా అనే ప్రవేటు సంస్ధలో జైట్లీ భార్య కుమారులు అక్రమాలకు పాల్పడ్డారని కీర్తి ఆజాద్ ఆరోపించారు.

కీర్తి ఆజాద్ విడుదల చేసిన ప్రకటనలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

“తన 14 యేళ్ళ డి‌డి‌సి‌ఏ అధ్యక్ష పదవీ కాలంలో జరిగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం గురించి అనేక ప్రశ్నలు వచ్చినప్పటికీ అరుణ్ జైట్లీ వాటిని సానుకూలంగా పక్కన పెట్టారు. అక్రమాలపై 200 లేఖలు, 500 మెసేజ్ లు పంపినప్పటికీ వేటికీ సమాధానం ఇవ్వలేదు. కానీ పరిశోధనల వల్ల వెలుగు చూడని అంశాలే మాకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి…. ఆర్‌ఓ‌సి, ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ, అంతర్గత ఆడిటర్లు, కమిటీ సభ్యులు, సెషన్స్ కోర్టు నియమించిన ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ అన్నీ డి‌డి‌సి‌ఏలో భారీ ఎత్తున నిధుల్ని దొంగిలించారన్న నిజాన్ని ధృవీకరించాయి. నిధుల్ని రౌండ్ ట్రిప్పింగ్ (వినియోగంలో లేని ఆస్తుల్ని వేరొక కంపెనీకి అమ్మేస్తూ, అమ్మకం సమయంలోనే కొద్ది కాలం తర్వాత ఆ ఆస్తిని అదే ధరకు కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకోవడం. తద్వారా పెరిగిన ధరల్ని సంస్ధకు కాకుండా సొంతానికి మిగుల్చుకోవడం) కి వినియోగించారని, అక్రమ నిర్వహణకు పాల్పడ్డారని పరిశోధనలు ధ్రువపరిచాయి” కీర్తి ప్రకటన పేర్కొంది.

కీర్తి, బేడిలు విడుదల చేసిన ప్రశ్నలలో కొన్ని ఇలా ఉన్నాయి.

  • డి‌డి‌సి‌ఏ కు మీరు పదే పదే ఎన్నిక కావడం ‘ప్రాక్సీ వ్యవస్ధ’ (తన సొంత వారి చేతనే ఎన్నికలు నిర్వహించుకుని గెలిచే ఏర్పాట్లు చేసుకోవడం) ద్వారా జరగలేదా?
  • డి‌డి‌సి‌ఏ నుండి చెల్లింపులు స్వీకరించిన కంపెనీ ’21st Century’ లో మీ బంధువులు ప్రయోజనాలు పొందలేదా?
  • అర్బన్ డెవలప్ మెంట్, కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖలలో జోక్యం చేసుకుని డి‌డి‌సి‌ఏ కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేయలేదా?
  • డి‌డి‌సి‌ఏ లోకి మీరు తెచ్చిన అడ్వకేట్ ఒకరు డి‌డి‌సి‌ఏ కు కౌన్సెల్ గా వ్యవహరిస్తున్నప్పుడే ఆయనను కంపెనీ లా బోర్డ్ (సి‌ఎల్‌బి) కి చెందిన లోక్ అదాలత్ సభ్యుడుగా నియమించలేదా? తద్వారా డి‌డి‌సి‌ఏ చేసిన వివిధ దరఖాస్తులను సి‌ఎల్‌బి లోక్ అదాలత్ ఒకే రోజులో పరిష్కరించేలా ప్రభావితం చేయలేదా?
  • హాకీ ఇండియా లో మీ కూతురు, అల్లుడు చురుకైన సభ్యులన్నది నిజమా, కాదా? హాకీ ఇండియాలో వారు ఉన్న ఐదేళ్ల కాలంలో రిటైనర్ షిప్ కోసం, కన్సల్టెన్సీ కోసం, హాకీ ఇండియా లోని పలు కమిటీలలో ఉన్నందుకు వారికి ఎంత మొత్తాన్ని చెల్లించారు?
  • ఆర్ధిక మంత్రిగా ఉన్న మీరు హాకీ ఇండియా కు నాన్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ పాత్రలో చురుకుగా వ్యవహరించడం నేరుగా ‘ప్రయోజనాల వైరుధ్యం’ అవుతుందని మీకు తెలుసా? హాకీ పేరుతో (చలామణి అవుతున్న) ఒక ప్రైవేటు గుంపు మీ పేరును వినియోగిస్తూ వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి భారీ మొత్తాలను ప్రాయోజిత మొత్తం కింద వసూలు చేసిన సంగతి మీకు తెలుసా?
Click to enlarge

Click to enlarge

ఇది ఇలా ఉండగా సి.బి.ఐ నిర్బంధంలో ఉన్న ఐ.ఏ.ఎస్ అధికారి ఢిల్లీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ ను సి.బి.ఐ అడుగుతున్న ప్రశ్నలు, తెస్తున్న ఒత్తిడి కేజ్రీవాల్ ఆరోపణలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడి చేశారు. డి‌డి‌సి‌ఏ అక్రమాల గురించి సమాచారం ఇస్తూ అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన డి‌డి‌సి‌ఏ అధికారుల పేర్లు ఏమిటో చెప్పాలని సి.బి.ఐ బృందం రాజేంద్ర కుమార్ పై ఒత్తిడి తెస్తున్నదని మనీష్ ఆరోపించారని చెబుతూ హిందూస్తాన్ టైమ్స్ పత్రిక వార్త ప్రచురించింది. (వార్త కటింగ్ ను పక్కన చూడవచ్చు. దీనిని wikileaks4india వెబ్ సైట్ ప్రచురించింది.)

పత్రికలకు ఎక్కక ముందే కీర్తి ఆజాద్ ను బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా కలిశారని వార్తల ద్వారా తెలుస్తోంది. మోడీకి నష్టం తెచ్చే, కష్టం కలిగించే పార్టీ నేతలపై కఠినంగా వ్యహరించే అమిత్ షా కలిశాక కూడా కీర్తి ఆజాద్ జైట్లీపై విరుచుకు పడడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. పార్టీలో ఎవరి మద్దతు లేకుండా కీర్తి ఆజాద్ ఇలా చెలరేగడం సాధ్యం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. బి.జె.పి పార్టీలోని గ్రూపుల కుమ్ములాటల్లో కీర్తి ఆజాద్ కు అవసరమైన మద్దతు లభిస్తోందని అవి త్వరలోనే వెల్లడి కాక తప్పదని బి.జె.పి అనుకూల పత్రికలు సైతం విశ్లేషిస్తున్నాయి. కీర్తి ఆజాద్ సైతం “అవినీతికి వ్యతిరేకంగా నేను చేసే పోరాటంలో నరేంద్ర మోడీయే నాకు హీరో” అని వక్కాణించడం దేనిని సూచిస్తోంది?

ప్రతిపక్షంలో ఉండగా అద్వానీ-సుష్మా శిబిరంలో ఉన్న ఆజాద్ కు ఇప్పుడు కూడా అద్వానీ నుండే మద్దతు పొందుతున్నాడా అని కొందరు అనుమానిస్తున్నారు. అద్వానీ మద్దతు వల్లనే కీర్తి ఆజాద్ పై చర్యలకు వెనుకాడుతున్నారని వారు సూచిస్తున్నారు. “Party with a difference” అంటూ గొప్పలు చెప్పుకున్న పార్టీ కాస్తా “Party with differences” గా మారిపోయిందని కాంగ్రెస్ కంటే తాము ఏమాత్రం భిన్నం కాదని రుజువు చేసుకుంటున్నారని చెబుతున్నవారూ లేకపోలేదు.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s