దేశం దృష్టికి రాని ఆరేళ్ళ నిర్భయ


Public Toilet where girl was raped

నిర్భయపై అత్యాచారం చేసిన ఆరుగురిలో ఒకరైన బాల నేరస్ధుడిని విడుదల చేసినందుకు ప్రస్తుతం దేశ్యవ్యాపితంగా అనేకమంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురిలో నిర్భయ పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది బాల నేరస్ధుడే అన్న అభిప్రాయం మొదటి నుండీ వ్యాపించి ఉండడంతో అతన్ని వదిలిపెట్టడం పట్ల ఆగ్రహం తీవ్రంగా వ్యక్తం అవుతోంది.

ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు బాల నేరస్ధుడు విడుదల కానున్నాడన్న నిజాన్ని తట్టుకోలేక నిద్ర లేని రాత్రులు గడుపుతూ తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఆక్రోసిస్తున్నారు. వారి ఆగ్రహం న్యాయమైనది. అర్ధం చేసుకోదగ్గది. కానీ నిర్భయ దారుణంపై మాత్రమే కేంద్రీకరిస్తూ అంతే తీవ్రత కలిగిన అత్యాచార కేసులను పలు సంఘాలతో పాటు పోలీసులు, కోర్టులు కూడా పట్టించుకోక పోవడం గర్హనీయం.    

నిర్భయ దుర్ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత అదే ఢిల్లీలో అత్యాచారానికి గురై అనేక నెలలపాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి బైటపడిన 6 యేళ్ళ బాలికపై జరిగిన ఘోరంపై కార్యకర్తలు గానీ, సంఘాలు గానీ, జువెనైల్ జస్టిస్ బోర్డ్ గానీ, కోర్టులు గానీ తగిన విధంగా స్పందించడం లేదు. బాలికపై అత్యాచారం చేశానని పోలీసుల వద్ద నిందితుడు ఒప్పుకున్నప్పటికీ అతన్ని నిర్దోషిగా 17 రోజులలోనే జువెనైల్ జస్టిస్ బోర్డ్ వదిలి పెట్టింది. నిందితుడు తన ముందే స్వేచ్ఛగా తిరుగుతుండడంతో ఆ బాలిక తండ్రి మానసిక వేదనకు గురవుతూ ఆత్మహత్య ఆలోచనలతో, నిందితుడిని తానైనా హత్య చేయాలన్న కసితో రగిలిపోతున్న సంగతిని ది హిందు పత్రిక వెలుగులోకి తెచ్చింది.

18 సం.ల వయసుకు 2 నెలల దూరంలో ఉన్న ముఖేష్ (అసలు పేరు కాదు) ఏప్రిల్ 26, 2013 తేదీన, అనగా నిర్భయ దారుణం జరిగి దాదాపు నాలుగు నెలలు- 6 నెలల పాపపై ఘోరమైన రీతిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆనక తాను చేసిన దారుణం బైటపెడుతుందన్న భయంతో బ్లేడుతో పాప గొంతు కోసి అక్కడ పడేసి వెళ్లిపోయాడు. ఢిల్లీ శివారు ప్రాంతాల్లోని బదర్ పూర్ మురికివాడలో ఈ ఘోరం జరిగింది. పొరుగునే ఉన్న పబ్లిక్ టాయిలేట్ వద్దకు వెళ్ళిన పాపను లాక్కెళ్లి వెనుక నుండి అత్యాచారం చేశాడా దుర్మార్గుడు. వాడి దుర్మార్గం వల్ల నాలుగు నెలల పాటు మల విసర్జన చేయలేక నరకయాతన అనుభవించింది ఆ పాప. అనేక సార్లు సర్జరీ చేస్తే గానీ పాపకు యాతన తప్పలేదు.

పాప ఏఐఐఎంఎస్ లో కోలుకుంటుండగా నిందితుదిని కోర్టు కరెక్షన్ ఫెసిలిటీకి పంపింది. కానీ 18 యేళ్ళు నిండడంతో 17 రోజులకే అతడిని విడుదల చేసేశారు. బాల నేరస్ధుల చట్టం ప్రకారం బాల నేరస్ధులకు గరిష్టంగా 3 యేళ్ళు కరెక్షన్ హోమ్ లో గడపాలి. ఈ లోపు 18 యేళ్ళు నిండితే వదిలిపెట్టాలి. అనగా నిర్భయ కేసులోని నిందితులలో బాల నేరస్ధుడు చట్టం విధించిన శిక్ష కంటే అదనంగా 2 సం.లు హోమ్ లో గడిపాడు. దేశంలో వ్యాపించి ఉన్న భావోద్వేగాల నేపధ్యంలోనూ నిర్భయ కోమాలోకి వెళ్ళి ఆ తర్వాత మరణించిన నేపధ్యంలోనూ జువెనైల్ జస్టిస్ బోర్డు తన విశేషాధికారాలను వినియోగించి అతని శిక్షను పొడిగించింది. కానీ ఆ పొడిగింపు మొత్తం మీద 3 సం.లు మించకూడదు గనుక హై కోర్టు, సుప్రీం కోర్టులు కూడా మరింత పొడిగింపుకు నిరాకరించాయి.

ముఖేష్ విషయానికి వస్తే రెండేళ్ల తర్వాత ఫిబ్రవరి 19, 2015 తేదీన జువెనైల్ జస్టిస్ బోర్డు అతన్ని నిర్దోషిగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును పత్రికలు, ఛానెళ్లు, సంఘాలు, ఎన్.జి.ఓ లు ఎవరూ వ్యతిరేకించలేదు, ప్రశ్నించలేదు. కనీసం అదొకటి జరిగిందన్న సంగతే గుర్తించలేదు. ఆ విధంగా పేద కుటుంబంలో పుట్టిన 6 యేళ్ళ పాప తగిన న్యాయం పొందలేక కూడా మీడియా దృష్టికి దూరంగా ఉండిపోయింది. తనపై అత్యాచారం జరిగిన పబ్లిక్ లెట్రిన్ తన ఇంటికి సమీపంలోనే ఉన్నా అక్కడికి వెళ్లడానికి ధైర్యం లేక అక్కడికి దూరంగా పక్క కాలనీకి వెళ్తూ అవసరం తీర్చుకుంటోంది. ఆ పాపకి తనపై జరిగిన ఘోరం ఏమిటన్నది కూడా తెలియదు. కానీ 4 నెలల పాటు వరుస సర్జరీలతో ఆసుపత్రిలో యాతన పడింది.

పాపపై దాడి చేసింది తానేనని నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు. అయినప్పటికీ అతనిపై సాక్షాలు లేవని జువెనైల్ జస్టిస్ బోర్డు భావించింది. పాపకు మద్దతుగా ఎవరూ ఢిల్లీ వీధుల్లో నిరసనలు చేయలేదు. ఇండియా గేట్ ను చుట్టుముట్టలేదు. పోలీసులతో తలపడలేదు. కాబట్టి పాప కేసును యధాలాపంగా తీసుకుని పక్కకు నెట్టెయ్యడానికి జువెనైల్ జస్టిస్ బోర్డ్ కు అభ్యంతరం ఏమీ కనపడలేదు.

నిందితుడి కుటుంబం పాప తండ్రిని అనేకసార్లు తీవ్రంగా బెదిరించింది. కేసు విషయమై పట్టు వద్దని హెచ్చరించింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు నమోదు చేయలేదు, పట్టించుకోలేదు. ఆ తండ్రి ఢిల్లీ వీధుల వెంట, ట్రాఫిక్ సిగ్నళ్ళ వద్దా బూరలు (బెలూన్లు) అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. బాలిక, నిందితుడి కుటుంబాలు రెండూ ఒకే కాలనీలో -రెండు వీధుల తేడాతో- ఉండడం వల్ల ఇరు కుటుంబాల మధ్య ఆరంభంలో ఉద్రిక్తతలు ఉండేవి. కాల క్రమంలో ఉద్రిక్తతల తీవ్రత నెమ్మదించినా, అవి మరో రూపంలో బాలిక ఇంటిలో తిష్ట వేశాయి.

ఉద్రిక్తతలు కొనసాగిన రోజుల్లో బాలిక తండ్రి ఆగ్రహం బైటికి వెళ్లగక్కేవాడు. అవి తగ్గే కొద్దీ అతని ఆగ్రహం గుండెల్లో పేరుకుని పోవడం మొదలైంది. ఇప్పుడు అతనికి నిద్ర లేని రాత్రులు మామూలైనాయి. తన పాపపై అంత ఘొరం చేసిన వాడు తన కళ్లెదుటే స్వేచ్చగా తిరగుతుండడంతో అతను కోపంతో, బాధతో రగిలిపోవడమే మిగిలింది. నిస్సహాయతతో కుంగిపోవడం తప్ప ఏమీ చేయలేకున్నాడు. “కొన్ని రోజులు అతన్ని చంపేయాలని అనుకుంటాను. కొన్ని రోజులు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది” అని బాలిక తండ్రి తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడని ది హిందు తెలిపింది. “అసలు అతను నిర్దోషిగా ఎలా బైటపడ్డాడో తనకు అర్ధం కావడం లేదు” అని ఆశ్చర్యంతో కూడిన నిస్పృహ వ్యక్తం చేశాడు.

పాప తరపు లాయర్ ప్రకారం పోలీసులు పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని (Protection of Children from Sexual Offences Act – POCSO) మోపలేదు. జువెనైల్ జస్టిస్ బోర్డ్ కూడా ఈ సంగతిని పట్టించుకోలేదు. “జువెనైల్ జస్టిస్ బోర్డ్ గత ఫిబ్రవరిలో తీర్పు ప్రకటించాక ఆ తీర్పు కాపీని ఇంతవరకు బాధిత కుటుంబానికి ఇవ్వలేదు. అత్యాచారం నుండి బైటపడిన బాలిక హక్కును ఉల్లంఘించడమే ఇది. బాధిత బాలిక పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపడమే” అని పాప అడ్వకేట్ చారు వాలిఖన్నా వ్యాఖ్యానించాడు. తీర్పు కాపీ ఇవ్వకపోతే ఈ లాయర్ ఏం చేస్తున్నట్లు? బోర్డ్ ను డిమాండ్ చేసి తీర్పు కాపీ తీసుకోవాలి కదా!

కేసు హియరింగ్ జనవరి 15, 2016 తేదీన ఉన్నట్లు పత్రిక తెలిపింది. తీర్పు వచ్చాక మళ్ళీ హియరింగ్ ఏమిటన్నదీ పత్రిక నుండి స్పష్టత లేదు.

One thought on “దేశం దృష్టికి రాని ఆరేళ్ళ నిర్భయ

 1. డిల్లీలోనే 4 నెలల వ్యవధిలో జరిగిన 2 అత్యాచారఘోరాలు,వాటి క్రమం,పర్యవసానాలులో ఇంతపెద్ద తేడా ఏమిటి?
  కోర్టులు,పొలీస్లు,ప్రజాసంఘాలు వీటి చర్యలు అన్నీ పాక్షిక పక్షపాతాలతో కూడినవే!
  భాదిత కుటుంబాల నేపధ్యాలు,అత్యాచారాలు జరిగిన క్రమాలు,మీడియాలో వాటి ప్రచారాలు బాల(ఘోర)నేరస్థుల శిక్షల కాలవ్యవధిలో తేడాలను ఇంతగా ప్రభావితం చేస్తాయా? అందుకే నాకనిపిస్తూ ఉంటుంది–
  “భారతదేశ శిక్షాసృతిలో
  శిక్షనుండి తప్పించుకోవడంలో సాధారణ ప్రజల అభిప్రాయానికి విలువలేదు.
  అదే శిక్షవిదింపబడడంలో భారత సమాజం యొక్క ఉమ్మడి ఆత్మకు ఎనలేని విలువకలిగియుంటుంది” అని.
  2010 ఇంగ్లాండ్-పాకిస్తాన్ లమద్య జరిగిన టెస్ట్ సిరీస్ లో స్పాట్ ఫిక్షింగ్ కు పాల్పడినందుకు(తన కెప్టైన్ ప్రభావంతో) మైనర్ అయిన ఆమిర్ కు తన దేశం కాని ఇంగ్లాండ్ లోనే 6 మాసాల కారాగార శిక్ష విధించడమైనది.5 సంవత్సరాలుపాటూ ఎటువంటి గుర్తింపు కలిగిన క్రికెట్ నూ ఆడనివ్వలేదు.
  మైనర్ అయిన ఈ బాల నేరస్తులకు కనీసం ఈ పాటిశిక్ష కూడా ఈ న్యాయస్థానాలు విధించలేవా?లేదా వాళ్ళుచేసిన నేరం ఈ పాటి తీవ్రతనైనా కలిగిలేదా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s