
From Financial Times
[మొన్న అనగా డిసెంబర్ 16, 2015 తేదీన అమెరికా సెంట్రల్ బ్యాంకు -ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్- వడ్డీ రేటు 0.25 శాతం పెంచింది. ఇప్పుడు అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు 0.5 శాతం. డిసెంబర్ 2008లో ద్రవ్య సంక్షోభం చుట్టుముట్టడంతో కంపెనీలు తమ డబ్బు సంపదను ఎక్కడికక్కడ బిగదీసుకున్న నేపధ్యంలో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించిపోయిన దరిమిలా కదలిక తేవడానికి ప్రభుత్వమే మార్కెట్ లో డబ్బు కుమ్మరించడం మొదలు పెట్టింది. అలా కుమ్మరించడానికి వీలుగా వడ్డీ రేటును ‘దాదాపు సున్న’ అని పేర్కొనదగినట్లుగా 0.25 శాతానికి తగ్గించింది. అప్పటి నుండి యెడేళ్లుగా అది అక్కడే ఉండిపోయింది. దానిని మళ్ళీ మొన్ననే పెంచడం.
వడ్డీ రేటు తక్కువగా ఉంటే రిజర్వ్ బ్యాంక్ నుండి కంపెనీలకు, బ్యాంకులకు ఇతర ద్రవ్య కంపెనీలకు రుణాలు తేలికగా లభిస్తాయి. అమెరికాలో ఇలా వదిలే డబ్బు అక్కడే పరిమితం కాదు. అమెరికా సామ్రాజ్యవాద దేశం కనుక అక్కడి బహుళజాతి కంపెనీలు ప్రపంచం నిండా విస్తరించి అందిన కాడికి నొల్లుకుంటున్నందున ఆ డబ్బు అన్ని దేశాలకూ ప్రవహిస్తుంది. ఈ డబ్బు వల్లనే కాంగ్రెస్ (పాపం మన్మోహన్!) హయాంలో ఇక్కడ ద్రవ్యోల్బణం అవధులు దాటి విహరించింది. వడ్డీ రేట్లు పెంచుతామని కాంగ్రెస్ పాలన చివరి రోజుల్లో ఫెడ్ ప్రకటించింది. ప్రపంచం నిండా హాహాకారాలు చెలరేగడంతో (మన పాలకులూ హాహాకారాలు చేశారు) వెనక్కి తగ్గి ‘ఇదిగో పెంచుతాం, అదిగో పెంచుతాం’ అంటూ గత రెండేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇక పెంపు తప్పదని అలవాటు పడ్డాక మొన్న పెంచారు.
ఫెడ్ వడ్డీ పెంపుదల పై నిన్న అనగా డిసెంబర్ 18 తేదీన “Fed’s liftoff ends uncertainty” శీర్షికన ది హిందూ సంపాదకీయం ప్రచురించింది. దానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్]
*******
ఫెడ్ ఫండ్ రేటును ఒకింట పాతిక భాగం పెంచడం ద్వారా వడ్డీ రేట్లను సాధారణ స్ధాయికి తేవడం ప్రారంభించాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ఎట్టకేలకు తీసుకున్న నిర్ణయం, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఏ దేశలో వెళ్తున్నదోనన్న అనిశ్చితికి ముగింపు పలికింది. 2008 ద్రవ్య సంక్షోభం దరిమిలా (అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు) ఉద్దీపన చేకూర్చడానికై బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమం, ప్రామాణిక వడ్డీ రేటును దాదాపు సున్నకు దగ్గరగా ఉంచడం లాంటి చర్యల ద్వారా రికార్డు స్ధాయి ద్రవ్య విస్తరణ కార్యక్రమాన్ని ఆరంభించిన ఏడేళ్ళ తర్వాత అమెరికా సెంట్రల్ బ్యాంకు అమెరికన్ ఆర్ధిక వ్యవస్ధ మూల మలుపు తిరిగిందని గట్టి సంకేతాలు ఇచ్చింది.
తమ నిర్ణయం “అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై మాకు ఉన్న నమ్మకానికి ప్రతిబింబిస్తోంది” అని ఫెడ్ అధిపతి జానెట్ యెల్లెన్ స్పష్టంగా నొక్కి చెప్పిన విధమూ, ఆర్ధిక వ్యవస్ధ స్ధిరమైన మెరుగుదల వైపు దృఢంగా పయనిస్తోందని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసి) వేస్తున్న అంచనా… ఈ రెండూ ప్రపంచ వ్యాపిత మదుపుదారులకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ యొక్క కీలక ఇంజన్ ఇప్పుడు పని చేయడం ప్రారంభించిందన్న విషయమై నమ్మకాన్ని కలిగించి ఉండాలి.
అదే సమయంలో, (ఆర్ధిక వ్యవస్ధ) రికవరీకి సహాయపడే విధానాలకు వసతి కల్పించడం కొనసాగడంతో పాటు ద్రవ్యోల్బణం లక్ష్యిత 2 శాతం స్ధాయికి పెరుగుతుందన్నపునర్నిర్ధారణను ఫెడరల్ రిజర్వ్ ప్రముఖంగా ముందుకు తెచ్చింది. ముఖ్యంగా మందగమనంలో ఉన్న చైనా ఆర్ధిక వ్యవస్ధ నుండి డిమాండ్ కొరవడిన నేపధ్యంలో ప్రపంచ వాణిజ్యం స్తంభన కొనసాగుతూ వాణిజ్య సరుకుల ధరలు కుంగిపోయిన పరిస్ధితి కొనసాగుతున్న నేటి తరుణంలో, అందరూ ముందే అనుకున్నదే అయినా, ఫెడ్ తీసుకున్న నిర్ణయం అటు అభివృద్ధి చెందిన దేశాలలోనూ, ఇటు వర్ధమాన దేశాలలోనూ ఎంతగానో అవసరమైన ఆశావాదాన్ని చొప్పించి ఉండాలి.
చరిత్ర మార్గదర్శనం చేస్తుందని నమ్మితే గతంలో 1999, 2004 లలో రెండు సందర్భాల్లోనూ వడ్డీ రేట్లను బిగించడం (పెంచడం), దరిమిలా వర్ధమాన దేశాలలోకి పెట్టుబడుల ప్రవాహం పెరగడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. అమెరికాలో జరిగిన ఆర్ధిక వృద్ధి అభివృద్ధి చెందుతున్న మరియు ఎగుమతి ఆధారిత దేశాలలో సరుకులు మరియు సేవలకు డిమాండ్ పెరగడానికి దోహదం చేయడమే దానికి కారణం. అయితే, కొందరు ఆర్ధికవేత్తలు ఎత్తి చూపినట్లుగా పరిస్ధితులు ఈసారి భిన్నంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణంను కూడా లెక్కలోకి తీసుకుంటూ వాణిజ్య మొత్తం ప్రాతిపదికన చూస్తే 11 యేళ్ళ క్రితం నాటి కంటే మెజారిటీ వర్ధమాన మార్కెట్లలో కరెన్సీ విలువలు మరింత ప్రియంగా ఉన్నాయి.
గురువారం (అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచిన తరువాత) ఇండియా మార్కెట్ల తక్షణ స్పందన సానుకూలంగా ఉన్నది. స్టాక్ షేర్లు, రూపాయి విలువా రెండూ శక్తి పుంజుకుని ముగిశాయి. అనుకోని విధంగా ఉన్నపళాన పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోయినా తట్టుకోవడానికి సరిపోయినన్ని విదేశీ మారకద్రవ్య నిల్వలు రక్షణ బురుజుగా నిలిచినందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు గవర్నర్ రఘురాం రాజన్ లు ఎలాంటి విపత్కర పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగానే కనిపించారు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకూ, వర్ధమాన మార్కెట్లకూ మునుముందు ప్రయాణం అంత సాఫీగా, మలుపులు లేకుండా ఏమీ ఉండదన్న సందేశం (వడ్డీ పెంపు ప్రకటిస్తూ) ఫెడ్ వెలువరించిన సమాచారంలో తగినంత స్పష్టంగానే ఒదగబడి ఉంది. “ఆర్ధిక పరిస్ధితులు పరిణామం చెందే పద్ధతికి అనుగుణంగానే ప్రామాణిక వడ్డీ రేటులో దశలవారీగా మాత్రమే మార్పులు (పెంపులు) జరుగుతాయి” అని ఎఫ్‌ఓఎంసి జారీ చేసిన ప్రకటన స్పష్టంగా చెప్పింది. స్పష్టంగా ముందుగానే నిర్దేశించిన టైమ్-టేబుల్ ప్రకారమే, చక్కగా అమర్చిన మెట్ల తరహాలో వడ్డీ రేటు పెంపుదలలు (వెంట వెంటనే) ఉండబోవని, దీర్ఘకాలిక విడతల ద్వారా మాత్రమే మార్పులు జరుగుతాయని స్పష్టంగా చెప్పడం కాకుండా చెప్పీ చెప్పకుండా చెప్పడమే ఇది.
గత ఆగస్తులు చైనా తన కరెన్సీ యువాన్ విలువను హఠాత్తుగా తగ్గించిన దరిమిలా ఏర్పడిన కల్లోలం జ్ఞాపాకాల్లో ఇంకా పదిలంగానే ఉన్నది. జపాన్, యునైటెడ్ కింగ్ డమ్, యూరోపియన్ యూనియన్ లలోని ద్రవ్య పాలక వ్యవస్ధలతో పాటు చైనా విధాన నిర్ణేతలను కూడా (మార్కెట్లు) ఇక జాగ్రత్తగా గమనించడం జరుగుతుంది. మరిన్ని విదేశీ రుణాలు ఇక ఖరీదుగా మారడం మొదలయ్యే అవకాశం ఉన్నందున మరియు డాలర్ విలువ పెరుగుదల కార్పొరేట్ బ్యాలన్స్ షీట్లను కుదిపివేయనున్నందునా భారత కంపెనీలకు ఋణ చెల్లింపుల భారం మరింతగా పెరగనుంది.
********
[వడ్డీ రేట్లు పెంచడం అంటే ఏమిటో, ముఖ్యంగా అమెరికా ఆ పని చేస్తే పరిణామాలు ఏమిటో గతంలో అనేక ఆర్టికల్స్ లో వివరించడం జరిగింది. కనుక మరింత వివరణ అవసరం లేదని భావిస్తున్నాను. అయితే కొంత చెప్పాల్సి ఉంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు ‘వెంటవెంటనే కాకుండా దీర్ఘకాలాల పాటు ఆగి ఆగి కొద్ది కొద్దిగా పెంచుతాను’ అని చెప్పడం అంటే ఏమిటి అర్ధం?
దానికి చాలా అర్ధాలు ఉన్నాయి. అవన్నీ కావలసిన అర్ధాలే. ముఖ్యంగా మనకు కావలసిన అర్ధం ఏమిటంటే అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకోనే లేదు. బారక్ ఒబామా త్వరలో గద్దె దిగిపోతాడు. ఆయన ఏదో సాధించాడని చెప్పుకోవాలి కదా. అందుకే ఇరాన్ తో దౌత్య సంబంధాలు పెట్టుకోవడం, క్యూబాతో వాణిజ్య సంబంధాలు ఆరంభించడం లాంటి విదేశీ విధాన ఫలాల (achievements) తో పాటు దేశంలో ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరిచాడని కూడా జనులు చూడాలి. ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడింది అని చెప్పుకోగానే సరిపోదు. అది ఎలాగోలా కనబడాలి. లేదా జనం అనుభవంలోకన్నా రావాలి. జనం అనుభవంలోకి రావడం ఎలాగూ సాధ్యం కాదు. ఫెడ్ రేటు కొద్దిగా పెంచడం తన చేతుల్లో పని!
ఫెడ్ రేటు పెంచడం పాజిటివ్ వార్త. లేదా ఒక అచీవ్ మెంట్. ఎందుకు? ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం (ప్రజలకు) నెగిటివ్ వార్త. ఆ సంక్షోభం వల్ల వడ్డీ రేటు కిందికి తోక్కెయ్యడం కూడా నెగిటివ్ వార్తే. దానికి వ్యతిరేకమైన రేటు పెంపు పాజిటివ్ వార్త అవుతుంది. వడ్డీ రేటు పెంచడం అంటే ఆర్ధిక వ్యవస్ధ తిరిగి గాడిన పడిందని చెప్పడం. సంక్షోభం సమసిపోయిందని చెప్పడం. ఆ విధంగా ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపరిచానని చెప్పుకోవడానికి ఒబామాకు ఇప్పుడొక అవకాశం.
సంక్షోభం (రేటు తగ్గింపు) కంపెనీలకు నెగిటివ్ కాదు. కొన్నాళ్లు వ్యాపారాలు నడవకపోవడం తప్పించి వారికి ఎలాంటి నష్టమూ ఉండదు. పైగా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు తొలగించాయి. వేతనాలు తగ్గించాయి. బోలెడు డబ్బుని ధారాళంగా ప్రభుత్వం నుండి పొందాయి. ఇప్పుడు తగ్గించిన వేతనాల ద్వారా లాభాలు సంపాదిస్తున్నాయి. కనుక సంక్షోభం ఉంటే ఒక లాభం, సంక్షోభం లేకపోతే మరొక లాభం. ప్రజలకు మాత్రం ఎప్పుడూ తగిన లాభం ఉండదు. బూమ్ దశలో అతి తక్కువగా లాభపడతారు (నిజంగా చూస్తే ఇదీ నష్టమే). కానీ సంక్షోభాల నష్టాన్ని అత్యధికంగా భరిస్తారు.
రేటు పెంచుతూ కూడా ఆగి ఆగి పెంచుతామని సన్నాయి నొక్కులు నొక్కడం అంటే అర్ధం, ఆర్ధిక వ్యవస్ధ వాస్తవంగా మెరుగుపడలేదనే. మెరుగుపడని అమెరికా వైపు చూడడం ఇండియా లాంటి దళారీ పాలిత రాజ్యాలు మానేస్తాయి. అవి మరో మాస్టర్ ను వెతుక్కుంటాయి. చైనా ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు పోటీగా బ్రిక్స్ బ్యాంకు -నూతన అభివృద్ధి బ్యాంకు- ఏర్పాటు చేసింది. ఐఎంఎఫ్ కు ధీటుగా సిఆర్‌ఏ -కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్ మెంట్- ఏర్పాటు చేసింది. అది కాక సొంత చొరవతో ఏఐఐబి -ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్- ఏర్పాటు చేసింది. దాని వెంట ఇప్పుడు ఐరోపా దేశాలూ పరుగెడుతున్నాయి. కనుక వర్ధమాన దేశాలు చైనా చుట్టూ చేరతాయి. అందులో ఇండియా ఉన్నా ఆశ్చర్యం లేదు. అది వేరే చర్చ.
అందుకే అమెరికా ఇంకా తాను డాలర్లు కుమ్మరిస్తానని పరోక్షంగా చెబుతోంది. కానీ డాలర్లు ఎన్ని కుమ్మరించినా బహుశా అది ఆరిపోయే దీపపు వెలుగు మాత్రమే కావచ్చు.]