వీళ్ళు మూసాహార్ అనబడే ఎలుకాహారులు. భోజ్ పురిలో ముసాహార్ అంటే ఎలుకల్ని తినేవారు అని. అదే వారి సమూహానికి పెట్టిన కులం పేరు. బీహార్ రాష్ట్రంలో నాగరికత నుండి దూరంగా వెలివేయబడ్డ ఈ కులం ప్రజలను భారత దేశ హిందూ సమాజం పంచములుగా గుర్తించి శతాబ్దాలు దాటిపోయింది.
ఆధునిక భారతావని, సర్వ స్వతంత్ర గణతంత్ర సామ్యవాద లౌకికవాద రాజ్యంగా అవతరించాక వారు షెడ్యూల్డ్ కులంగా గుర్తించ బడ్డారు. కానీ ఎన్ని పేర్లు పెట్టినా, ఓటు చట్టాలు చేసి ఎన్ని దశాబ్దాలు దాటినా వారిని చూసే చూపు మాత్రం మారలేదు. అది కిందకు చూసే చూపు. ఆ చూపు తిరస్కార విషం పూసిన తూణీరం. అది ఛీత్కారాల గోడలు దాటనివ్వని కరకు చూపు. ఆ చూపు ఛండాల దాస్యాన్ని నుదుటిపై లిఖించే ముఖ జన్మిత శాస్త్రవేత్తల దురహంకార హుంకారం!
68 యేళ్ళ స్వతంత్ర భారతావని సాధించిన సామ్యవాదానికి, సమానత్వానికి వీరు అచ్చమైన ప్రతీకలు. ముఖ్యంగా వేద కాలాన్ని గుర్తుకు తెస్తూ ఘనతరమైన ‘ప్రాచీన భారత సంస్కృతి’ అంటూ భాజా భజంత్రీలతో, ఆవేశకావేషాలతో, మిరుమిట్లు గొలిపే భాషాలంకారాలతో మోస్తున్న హిందూత్వ గణాల ఆనంద తాండవంపై ఫెటీల్మని కొట్టే చెంపపెట్టు ఈ జని నిష్టుర మూసాహారులు!
తూర్పు భారతాన బీహార్ లోని దర్భంగా జిల్లాలో కుబౌల్ గ్రామానికి చెందిన మూసాహారుల కాలనీ ఇది. పంటలు చేతికొచ్చే కాలంలో ఆ పంటలకు ఎలుకల బెడద బాగా ఉంటుంది. పంట చెలల్లోనే తావులు తవ్వుకుని ఎలుకలు పంటను కొల్లగొడుతుంటాయి. ఆ కాలంలో ఎలుకలు పట్టేవారికి బాగా పని దొరుకుతుంది. మిగతా తెలుగు జిల్లాల సంగతేమో గానీ కోస్తా జిల్లాల్లో ఆ పనిని ఎరుకుల కులం ప్రజలు చేస్తారు. బీహార్ లో మూసాహారులు చేస్తారు.
ముసాహారుల ప్రధాన ఆహార వనరు ఎలుకల తొర్రలే. కోతలు, నూర్పిడిలు అయ్యి ధాన్యం గాదెలు ఇళ్లకు చేరాక ఎలుకలు తమ తొర్రల్లో చేరవేసిన ధాన్యమే మూసాహారులకు పరమాహారం. వారికి లభించే కూలి వారి జీవనానికి ఏమూలకూ సరిపోదు. మాంసాహారం వారికి కలల్లో మాత్రమే లభ్యం. ఫలితంగా వరి చేలల్లో పట్టే ఎలుకలు, తడి నేలల్లో దొరికే నత్తలు, బురద గుంటల్లో దొరికే చిన్న చిన్న చేపలు… ఇవే వారికి పోషకాహారంగా మారాయి.
ఇటీవల కాలంలో మూసాహారుల యువకులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు దొరకబుచ్చుకోవడంతో ఈ ఫొటోల్లో కనబడుతున్న గడ్డి గుడిసెలు కట్టుకోవడం సాధ్యపడుతోంది. ఆహార సేకరణ కోసం పిల్లా జెల్లా, ముసలీ ముతకా అందరూ బురద నేలల్లో కెలుకుతూ చేపలు నత్తల కోసం వెతుకులాడుతున్న దృశ్యాలను చూస్తే భారత దేశ ప్రాచీన హైందవ సంస్కృతీ వారసత్వం ఎటువంటి వారసుల్ని సృష్టించి మనకు అందించిందో అర్ధం అవుతోంది. ఈ హైందవ నాగరీకులే అనేకానేక పశువుల్లో ఒకటైన గోవును తల్లిగా పూజిస్తూ సాటి మానవుడ్ని బురద నేలల్లోకి తన్ని తగలెయ్యడమే కాక వారి ఆహారాన్ని సైతం లాగేసుకుంటున్న దౌర్భాగ్యం నేటి వర్తమానం.
తమ పరిస్ధితుల మెరుగు కోసం మూసాహార్ లు ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా, ఎన్ని మహజరులు పెట్టుకున్నా వారి అభివృద్ధికి కనీస దృష్టి పెట్టిన నాయకుడు గానీ, పార్టీ గానీ లేదు. వారికీ ఓటర్ కార్డులు ఉన్నందున ఎన్నికలప్పుడు మాత్రం ఛోటా మోటా నాయకులు వారిని క్రమం తప్పకుండా సందర్శిస్తారు. ఎన్నికలయ్యాక వారిని మరి చూడరు. ఇలా కాదని 2014 సాధారణ ఎన్నికలను వారు బహిష్కరించారు. దానితో వాగ్దానాల వర్షం కురిసింది. ఎన్నికలయ్యాక షరా మామూలే.
“పక్క గ్రామంలో పాఠశాలకు వెళ్లాలంటే ఒక నది దాటుకుని వెళ్ళాలి. సీజన్ అంతా నది నిండుగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే మా ఊరుకు మిగతా ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఏవీ మా దగ్గరకు రావు. మా ఊరికి కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. ‘రోడ్డు లేదు, వోటు లేదు’ నినాదంతో ఎన్నికలు బహిష్కరించాం” అని ఊరికి చెందిన ఒక వ్యక్తి చెప్పాడని ఆల్ జజీరా ఛానెల్ గత సాధారణ ఎన్నికల సందర్భంగా చెప్పింది.
వారి చుట్టూ పక్కల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంటుంది గానీ వారికి ఉండదు. చుట్టూ గ్రామాలలో పాఠశాలలు ఉంటాయి గాని వారికి లేదు. వారి పిల్లలు ఆ పాఠశాలల్లో చేరనివ్వరు. ఒకవేళ చేరినా వారు ఎదుర్కొనే వివక్షలకు అంతే ఉండదు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా వారిని చీత్కరిస్తారు. దానితో పిల్లలు చదువు పేరు ఎత్తరు. బడితో పోలిస్తే వారికి ఇల్లు స్వర్గమే.
మూసాహార్ లు ప్రధానంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో విస్తరించి ఉన్నారు. వీరి ఆవాసాల చుట్టూ పంట చేలు కళకళలాడుతూ ఉంటే వారు మాత్రం ఆకలితో నకనకలాడుతూ ఉంటారు. వారికి భూములు ఉండనే ఉండవు. కనీసం పశువులు అసలే లేవు. కొందరు ఎలాగోలా అప్పుడప్పుడూ అన్నం తినగలుగుతారు. అత్యధికులు ప్రతి రోజూ తిండి కోసం వెతుకులాడుతూనే ఉంటారు. ఆ వెతుకులాట దృశ్యాలే ఈ ఫోటోలు.
ఈ ఫోటోలు చూస్తుంటే శ్రీశ్రీ కవిత ‘నీడలు’ గుర్తుకు వస్తుంది. ఆ కవిత చదువుతూ ఫోటోలు చూస్తే శ్రీశ్రీ కవిత ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా స్ధల, కాలాలను కోల్పోకుండా బతికి ఉన్న సత్యం తెలిసి వచ్చి మనసంతా వికలం అవుతుంది.
***********
చూడు చూడు నీడలు !
నీడలు పొగ మేడలు !
యుగ యుగాల దోపిడిలో
నరనరాల రాపిడిలో
వగమారిన
పొగచూరిన
శాసనాల జాడలు !
జాలిజార్చు గోడలు !
చూడు చూడు నీడలు !
నీడలు పొగ మేడలు !
*
చూడు చూడు నీడలు !
పేదవాళ్ళ వాడలు
నర నరాల వేదనలో
తర తరాల రోదనలో
బక్కచిక్కి
బిక్కచచ్చి
పడిన బతుకు గోడలు !
పాడుపడ్డ వాడలు !
చూడు చూడు నీడలు !
పేదవాళ్ళ వాడలు !
*
చూడు చూడు నీడలు !
పూలు లేని కాడలు !
తరతరాల చెరసాలల
రకరకాల తెరచాటుల
పొదిగిటిలో
ఒదిగిలిపడు
నిర్భాగ్యపు నీడలు !
ఎడారిలో ఓడలు !
చూడు , చూడు , నీడలు !
పూలులేని కాడలు !
*
చూడు చూడు వ్రీడలు !
పీడలతో క్రీడలు !
చూడు చూడు నీడలు !
సూర్యునితో క్రీడలు !
సూర్యునితో సూదులతో
క్రీడలాడు నీడలు !
************
కతార్ షేక్ కు చెందిన ఆల్-జజీరా టీ.వి ఛానెల్ తన వెబ్ సైట్ లో ఈ ఫోటోలను ప్రచురించింది.
భారతీయ సమాజపు అశ్పృస్యతల సజీవమరకలు వీళ్ళు.ఆధిపత్యవర్గాల పాదాలకింద నిలిగిపోతున్న మానవత్వపు గుర్తులు వీళ్ళు.ఒకళ్ళుతినే తిండినిబట్టి వారి(కి) కులానికి నామకరణంగావించడం నాకు తెలిసి ఇదే ప్రథమం.
బిహార్లో జీతన్ రాం మంఝీ సి.ఎం అయినప్పటినుండి మూసాహార్ ల గురించి వింటున్నాను.వీరిని మహాదళితులంటారని(దళితులలో బాగా వెనుకబడేటట్టు చేయబడ్డారు) గుర్తు!దళితులలో దళితుడువోయ్ ఓ దళిత(శ్రీశ్రీ గారు,ఈ వ్యాఖ్యలవలన ఎవరినైనా నొప్పించుంటే క్షమించాలి).
వారి చుట్టూ పక్కల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంటుంది గానీ వారికి ఉండదు. చుట్టూ గ్రామాలలో పాఠశాలలు ఉంటాయి గాని వారికి లేదు. వారి పిల్లలు ఆ పాఠశాలల్లో చేరనివ్వరు. ఒకవేళ చేరినా వారు ఎదుర్కొనే వివక్షలకు అంతే ఉండదు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా వారిని చీత్కరిస్తారు. దానితో పిల్లలు చదువు పేరు ఎత్తరు. బడితో పోలిస్తే వారికి ఇల్లు స్వర్గమే.
ఆ చూపు ఛండాల దాస్యాన్ని నుదుటిపై లిఖించే ముఖ జన్మిత శాస్త్రవేత్తల దురహంకార హుంకారం!
భూస్వామ్య సమాజపు ఆనవాళ్ళు బలంగా ఉన్నంత వరకూ భారతీయులలో శాస్త్రీయ దృక్పథం కలుగదేమో!
నిన్ననే “మాలపిల్ల” సినిమా చూశాను. ఈ ఆర్టికల్,ఫొటోస్ చూస్తుంటే ఆ సినిమాయే గుర్తుకు వచ్చింది(వారి వస్త్రధారణ,గుడిసెలు,పరిసరాలు-ఆదిపత్య వర్గాల అణచివేతల నిదర్శనాలేకదా ఇవన్నీ).పోలిక చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు.1940ల నాటి పరిస్థితులే నా మదిలో కనిపించాయి.