వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు


Arvind responds

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్]

***********

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు. కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ ను లక్ష్యంగా చేసుకుంటూ ఢిల్లీ సచివాలయంలో సోదాలు నిర్వహించే సమయంలో కేంద్ర ఏజన్సీ (సి.బి.ఐ) మెరుగైన వివేకాన్ని ప్రదర్శించి ఉండవలసింది. ఎందుకంటే తద్వారా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా సోదా చేశారన్న అభిప్రాయాన్ని అది కలిగించింది.

సోదా జరిపే ప్రదేశం నుండి మీడియాను దూరం పెట్టడం సాధారణమే. కానీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఆయన కార్యాలయానికి వెళ్లకుండా దూరంగా ఉంచడం ద్వారా ఆయన కార్యాలయాన్ని కూడా తనిఖీ చేశారన్న ఊహాగానాలకు సి‌బి‌ఐ తావిచ్చింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా తనిఖీలు నిర్వహించినందుకు సి.బి.ఐని తప్పు పట్టడం కష్టమే కావచ్చు. కానీ సమాఖ్య సంబంధిత వ్యవస్ధలో అధికారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ ఆవరణలలో తనిఖీలు నిర్వహిస్తే అది తప్పనిసరిగా అనుమానంతోనే చూడబడుతుంది, ముఖ్యంగా అధికార ముఖ్యమంత్రి ఆ తనిఖీకి లక్ష్యం కానప్పుడు! సెప్టెంబర్ లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పై సి.బి.ఐ సోదాలు నిర్వహించింది. కానీ (అప్పటికే) ఆయన విచారణలో ఉన్నారు. కనుక దాచిపెట్టుకున్న దురుద్దేశాలను (ఆ తనిఖీలకు) ఆపాదించడానికి తావు లేదు, ఒక్క రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించడం తప్ప.

నవంబర్ 15 – డిసెంబర్ 15 కాలానికి చెందిన ఫైల్ మూవ్ మెంట్ రిజిష్టర్ ను కూడా సి.బి.ఐ స్వాధీనం చేసుకుందన్న కేజ్రీవాల్ ఆరోపణ నిజమే అయితే సి.బి.ఐ సోదాలు రాజేంద్ర కుమార్ 2007-2014 కాలంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినంతవరకే పరిమితం కాలేదన్న ఆరోపణలకు సాక్ష్యం లభించినట్లే. కానీ తన ప్రిన్సిపల్ సెక్రటరీ సాకుతో తననే లక్ష్యం చేసుకున్నారన్న ఆరోపణలకు మరిన్ని రుజువులు కావాలి. ఈ లోపు ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సి.బి.ఐని వాడుకుంటున్నారన్న అవగాహన పట్టు కోల్పోక కొనసాగుతూనే ఉంటుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి “పిరికిపంద” అనీ, “సైకోపాత్” అనీ నిందిస్తూ కేజ్రీవాల్ విరుచుకుపడడం, అధికారం నెరుపుతున్న ఒక ముఖ్యమంత్రి స్ధాయికి తగనిది. జన లోక్ పాల్ కు అపరిమిత అధికారాలు ఇవ్వాలని కోరిన వ్యక్తే ఒక పరిశోధనా సంస్ధను ప్రశ్నించవలసిన వైపరీత్యాన్ని చూస్తున్నారా అన్న నిబిడాశ్చర్యాలకు అటువంటి గర్జనలు దారితీస్తాయి. మోడి వ్యతిరేక కూటమికి జాతీయ ముఖంగా తనను తాను నామినేట్ చేసుకోగల అవకాశాన్ని చూడడంలో కేజ్రీవాల్ వేగంగా వ్యవహరించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సుపరిపాలనా సూత్రాల కోసం తనకంటే ఎన్నోరెట్లు పెద్దవైన శక్తులతో తలపడుతున్నానని చాటుకోవడం ద్వారా తన రాజకీయాల వెంట సమీకరణా అవకాశాన్ని పెంచుకోవడం కేజ్రీవాల్ వ్యూహంలో ఒక భాగంగా ఉంటోంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి ఏఏపి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో, అనేక అంశాలపై తన వెనుక వరుస కట్టేందుకు ఇతర పార్టీల నాయకులు  సిద్ధంగా ఉండడం తప్పనిసరిగా లాభిస్తుంది. సోదాల గురించి తమకు ముందుగా తెలియకున్నప్పటికీ బి.జె.పి ప్రతినిధులు, మంత్రులు తమవంతుగా (ప్రజల) ముందు ఉంచిన ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయంటే స్వయం ఓటమికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. రాజకీయంగా తన పోరాటాన్ని తన షరతుల ప్రకారమే వారివద్దకు కొనిపోయేందుకు, తాము ఆత్మ రక్షణలో పడిపోయేందుకు కేజ్రీవాల్ కు వారు అవకాశం ఇచ్చారు – రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట్ల ఆ ప్రభుత్వాలతో సమాఖ్య చైతన్యానికి సంబంధించి తమ సమీకరణం ఏమిటో వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వారిపైనే ఉన్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s