డి‌డి‌సి‌ఏ-జైట్లీ అవినీతి ఇదే!


Raghav Chadha of AAP

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డి‌డి‌సి‌ఏ అధ్యక్షులుగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి వివరాలను ఏఏపి ప్రభుత్వం వెల్లడి చేసింది. ఏఏపి కి చెందిన వివిధ నేతలు, మంత్రులు ఈ రోజు (డిసెంబర్ 17, 2015) విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ అవినీతి వివరాలను వెల్లడి చేశారు. ఢిల్లీ హైకోర్టు నియమించిన విచారణ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన తీవ్ర అవినీతి నేరాల పరిశోధనా సంస్థ (సీరియ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ – ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ) లతో పాటు డిడిసిఏ అంతర్గత విచారణ కమిటీ కూడా జైట్లీ నేతృత్వంలోని డి‌డి‌సి‌ఏ అవినీతికి పాల్పడిన సంగతిని నిగ్గుదేల్చడం విశేషం. ఈ మూడు విచారణ సంస్థలు మరియు కమిటీలు సమర్పించిన అవకతవకల నివేదికపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బట్టి జైట్లీపై ఆరోపణలను తొక్కిపెట్టారని స్పష్టం అవుతోంది.

ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ నిగ్గు దేల్చిన అవకతవకలు ఈ విధంగా ఉన్నాయి:

  • ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పునర్నిర్మాణానికి దాదాపు (2002 నుండి 2007 వరకు) 5 యేళ్ళు పట్టింది. ప్రారంభ బడ్జెట్ అంచనా కేవలం 24 కోట్లు కాగా 114 కోట్లు చెల్లించారు.
  • స్టేడియం నిర్మాణానికి గాను జారీ చేసిన కాంట్రాక్టులకు సంబంధించి ఎలాంటి రికార్డులు అందుబాటులో లేవు.
  • ఎం‌సి‌డి మరియు ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ ల అనుమతులు ఏమీ లేకుండానే అనధికారికంగా నిర్మాణాలు చేపట్టారు.
  • సరైన అనుమతులు లేకుండానే స్టేడియంలో కార్పొరేట్ బాక్సులు నిర్మించారు.
  • డి‌డి‌సి‌ఏ అంటర్గత నియంత్రణ వ్యవస్థ బలహీనంగా ఉన్నది. దాని స్థిర ఆస్తుల రిజిష్టర్ ను అసలు నిర్వహించడం లేదు

ఢిల్లీ హైకోర్టు నియమించిన కమిటీ నిర్ధారించిన అంశాలు:

  • డి‌డి‌సి‌ఏ పని పద్ధతిలో తీవ్రస్థాయి పారదర్శకతా లేమి నెలకొని ఉన్నది.
  • డి‌డి‌సి‌ఏ గొడుగు కిందనే అసోసియేషన్ సభ్యులు అక్రమంగా ప్రైవేటు క్రికెట్ అకాడమీలు నడుపుతున్నారు. తద్వారా (డి‌డి‌సి‌ఏ ని అడ్డం పెట్టుకుని) డబ్బు సంపాదనలో మునిగిపోయారు.

డి‌డి‌సి‌ఏ అంతర్గత కమిటీ నివేదిక నిర్ధారించిన అంశాలు:

  • భారీ స్ధాయిలో ఆర్ధిక అవకతవకలు జరిగాయనేందుకు రుజువులు ఉన్నాయి.
  • 2013-14లో కొన్ని కంపెనీలకు అక్రమంగా చట్ట విరుద్ధంగా చెల్లింపులు చేశారు.
  • అసోసియేషన్ లో అవసరానికి మించి సిబ్బందిని నియమించారు. అయినప్పటికీ నిరర్ధకమైన ఉద్యోగుల నియామకానికి భారీ మొత్తాన్ని వెచ్చిస్తూనే ఉన్నారు.
  • ఓవర్ టైమ్ కింద పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయి.
  • 9 కంపెనీలకు అక్రమ చెల్లింపులు జరగ్గా వాటన్నింటికీ ఒకటే రిజిస్టర్డ్ కార్యాలయము, ఒకటే ఈ మెయిల్ ఐ.డి నమోదై ఉన్నాయి. 9 కంపెనీలకు అదే డైరెక్టర్లు నియమితులై ఉన్నారు.
  • డూప్లికేట్ బిల్లులు జారీ చేశారు. సదరు బిల్లుల కోసం చేసిన చెల్లింపులకు తప్పుడు కారణాలు చూపారు.
  • విద్యార్ధులు, నిజమైన ఆటగాళ్లు డి‌డి‌సి‌ఏ మ్యాచ్ లలో ఆడేందుకు అసలు అవకాశమే లేదు.

ఏఏపి నేతలు, మంత్రులు విలేఖరుల సమావేశం జరిపిన దరిమిలా ది హిందు, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఐ.బి.ఎన్ లైవ్ తదితర పత్రికల వెబ్ సైట్లు పై అంశాలను ప్రచురించాయి. ది హిందు పత్రిక 5 కంపెనీలకు ఒకే అడ్రస్, ఒకే ఈ మెయిల్ ఐ.డి, అదే డైరెక్టర్లు ఉన్నారని చెప్పగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక 9 కంపెనీలుగా పేర్కొంది. స్టేడియం నిర్మాణానికి 24 కోట్లు బడ్జెట్ అంచనా వేసుకుని 114 కోట్లు చెల్లించారని అదనంగా చెల్లించిన 90 కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ఏఏపి నేత రాఖవ్ చద్దా విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా నిర్మాణాలు ఎలా చేశారని నిలదీశారు (ఎన్‌డి‌టి‌వి చానెల్).

ఏఏపి ప్రభుత్వం చేస్తున్న అదనపు ఆరోపణలు:

  • ఒక కంపెనీకి ఎలాంటి కారణం చూపకుండానే గ్రాంటుగా 1.55 కోట్లు చెల్లించారు.
  • ఒక్క పని కూడా చెయ్యకుండానే అనేక కంపెనీలకు డబ్బు చెల్లిస్తూ పోయారు.
  • టెండర్ ప్రక్రియను అరుణ్ జైట్లీ ఎన్నడూ పాటించలేదు.
  • డి‌డి‌సి‌ఏ కుంభకోణం క్రికెట్ ఆటకు చెందిన (కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన) కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం.

ఈ ఆరోపణల నేపధ్యంలో మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఏఏపి నేతలు డిమాండ్ చేశారు. మంత్రి రాజీనామా చేస్తేనే నిస్పాక్షిక విచారణ చేయడం సాధ్యపడుతుందని లేదా ఆయనకు కల్పించబడే రాజ్యాంగ రక్షణ రీత్యా విచారణ చేయడం సాధ్యం కాదని వారు ఎత్తి చూపారు.

జైట్లీ హయాంలో డి‌డి‌సి‌ఏ పై వచ్చిన ఆరోపణలను చూస్తే అవి రాజేంద్ర కుమార్ పై సి.బి.ఐ చేసిన ఆరోపణలనే పోలి ఉండడం గమనార్హం. లేదా జైట్లీ హయాంలోని డి‌డి‌సి‌ఏ పై ఏయే ఆరోపణలైతే వచ్చాయో సరిగ్గా అవే ఆరోపణలను (ఒకటి రెండు మినహా) ఢిల్లీ సి.ఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ పై బి.జె.పి ప్రభుత్వం ఎక్కుపెట్టింది. తద్వారా డి‌డి‌సి‌ఏ అవినీతిపై ఏఏపి నియమించిన విచారణ కమిషన్ యొక్క కొండి లోని ముల్లును ముందే మొద్దుబార్చే ఎత్తుగడ (taking out the sting) ను బి.జె.పి అవలంబించినట్లు కనిపిస్తోంది. కానీ ఆ ఎత్తుగడ ఘోరంగా విఫలం అయింది. డి‌డి‌సి‌ఏ/జైట్లీపై ఏఏపి వేయనున్న విచారణ కమిషన్ ఏర్పాటును మరింత ముందుకు జరపడానికే సి.బి.ఐ దాడులు తోడ్పడ్డాయి. ఆ విధంగా బి.జె.పి నేతల వ్యూహాన్ని అరవింద్ అప్రమత్తత వల్ల సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు.

ప్రధాన మంత్రిని ‘సైకోపాత్’ అనీ, ‘పిరికిపంద’ అనీ తూలనాడం ముఖ్యమంత్రీ స్థాయి వ్యక్తికి తగదని సుద్దులు చెప్పడానికి కొన్ని పత్రికలు, ఛానెళ్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. కానీ అదేమంత తీవ్రమైన అంశం కాదు. పత్రికలు, ఛానెళ్లు ప్రజాధనం దుర్వినియోగం పైనే ప్రధాన దృష్టి పెట్టాలి తప్పితే రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడడం పైన కాదు. ఏమంటే ఒక వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రే అయినప్పటికీ, తూలనాడం వల్లనే ఒక ప్రధాన మంత్రి గౌరవానికి భంగం జరగబోదు. ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఇవ్వవలసిన గౌరవం సంపాదించుకోవడం ద్వారా రావాలి గానీ ఇవ్వడం వల్ల కాదు. ‘పదవీకే వన్నె తెచ్చారు’ అని చెప్పడం ఈ అర్ధం తోనే. ప్రధాన మంత్రి అనుసరించే ప్రజానుకూల సిద్ధాంతాలు, విధానాలు, ఆచరణ, జీవన విధానం… ఇవి మాత్రమే ఆ పదవికి మరియు ఆ పదవిలో ఉన్న వ్యక్తికి గౌరవం లభించాలి. బలప్రయోగంతో ఒత్తిడి చేసి సంపాదించే గౌరవం క్షణ భంగుర సమానమే కాగలదు.

మరో కోణంలో చూస్తే పదవికి గౌరవం ఇవ్వడం సరైన అంశంగా కనపడవచ్చు. కానీ మన ప్రధాన మంత్రులుగా పని చేసినవారిలో అత్యధికులు ఆ పదవికి తగిన వన్నె తెచ్చే విధంగా వ్యవహరించిన ఉదాహరణలు చాలా తక్కువ. గత ప్రధాని మన్మోహన్ సింగ్, లక్షల కోట్ల అవినీతి వల్ల ప్రజాధనం కొల్లగొట్టబడుతున్నా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఊరుకున్నారే తప్ప కనీసం మాటపూర్వక అభ్యంతరాలైనా చెప్పలేదు. అమెరికా మెప్పు కోసం ‘పదవికి రాజీనామా చేస్తా’ అని బెదిరించి మరీ అణు ఒప్పందాన్ని భారత ప్రజలపై రుద్దిన వ్యక్తులు ప్రధాని కుర్చీలో ఉంటే మాత్రమేం, ప్రజల గౌరవానికి అర్హులు కాగలరా?

అలాగే ఒక మతం ప్రజలపై సామూహిక దహనకాండ సాగుతుంటే ‘చర్యకు ప్రతిచర్య’ అని దానిని వెనకేసుకు వచ్చిన ముఖ్యమంత్రి ప్రజల నుండి తగిన గౌరవం పొందడానికి అర్హుడా అన్నది సమాధానం తెలిసిన ప్రశ్నే. “మొదట ఆయన దుష్కార్యాలకు ప్రజలను క్షమాపణలు కోరమనండి. అప్పుడు క్షమాపణ చెప్పేందుకు మాకు అభ్యంతరం లేదు” అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు స్పష్టం చేయడం ప్రజల దృష్టి కోణంలో ముఖ్యంగా ఈ దేశంలో అణచివేతకు, హింసాకాండలకు, దోపిడీకి గురవుతున్న శ్రామికులు, మహిళలు, జాతులు, మైనారిటీల దృష్టి కోణంలో సరైన సమాధానమే కాగలదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s