కేంద్ర ఆర్ధిక మంత్రి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్యాట్రన్ కూడా అయిన అరుణ్ జైట్లీని క్రికెట్ అవినీతి కేసు నుండి రక్షించడానికే తన కార్యాలయంపై సి.బి.ఐ దాడి జరిగిందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోడిని ‘పిరికిపంద’ అనీ, ‘సైకోపాత్’ అనీ నిందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న అరవింద్ తన నిందలను ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు.
ట్విట్టర్ పోస్టుల ద్వారా సాగించిన నిందలకు క్షమాపణ చెప్పాలన్న బి.జె.పి డిమాండ్ కు బదులుగా “మోడి తన దుష్కార్యాలకు క్షమాపణ చెబితే నేను చెప్పడానికి కూడా అభ్యంతరం లేదు” అని తెగేసి చెప్పారు. తద్వారా గుజరాత్ ముస్లింలపై నెలల తరబడి సాగిన మారణకాండకు గాను క్షమాపణ చెప్పడానికి ప్రధాని మోడి పదే పదే నిరాకరించిన సంగతిని అరవింద్ గుర్తు చేశారు.
ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ) వ్యవహారాలకు సంబంధించి విచారణ కమిషన్ వేయడానికి తాను ఉద్యుక్తం అవుతున్న తరుణంలో సి.బి.ఐని తన కార్యాలయం పైకి కేంద్రం ఉసిగొల్పిందని అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం వెల్లడి చేశారు. సి.బి.ఐ దాడి విషయమై జైట్లీ రాజ్య సభలో వివరణ ఇస్తుండగానే అరవింద్ వేగంగా స్పందిస్తూ ట్విట్టర్ పై వ్యాఖ్యానాల ద్వారా ఆయన వివరణను కొట్టిపారేశారు. డిడిసిఏ అవినీతికి సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకునేందుకే తనను తన కార్యాలయంలోకి వెళ్లకుండా ముట్టడి విధించారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. రాజేందర్ అవినీతి అని చెబుతున్న ఫైళ్ళ జోలికి పోకుండా తన కార్యాలయం ఫైళ్లను పరిశీలించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
వాస్తవానికి తన కార్యాలయంలోని ఫైళ్ళ పరిశీలనలోనే సి.బి.ఐ నిమగ్నం అయిందని తాను అప్రమత్తమై అసలు విషయం వెల్లడి చేయడంతో డిడిసిఏ ఫైళ్లను స్వాధీనం చేసుకోకుండా సి.బి.ఐ ఆగిపోయిందని ఢిల్లీ సి.ఎం తెలిపారు. మంగళవారం రోజంతా ఢిల్లీ సి.ఎం కార్యాలయాన్ని సి.బి.ఐ తన స్వాధీనంలో ఉంచుకోవడంతో అరవింద్ తన కార్యాలయానికి వెళ్లలేకపోయారు. బుధవారం తన ఆఫీసుకి వెళ్ళిన అనంతరం అక్కడి పరిస్ధితులను బట్టి మంగళవారం తాను చేసిన ఆరోపణలు నిర్ధారణ అయ్యాయని అరవింద్ తెలిపారు. తన కార్యాలయాన్ని జల్లెడ పట్టారని, జైట్లీపై విచారణ కోసం తయారు చేసిన ఫైళ్లన్నింటిని సి.బి.ఐ అధికారులు కలియబెట్టారని కేజ్రీవాల్ తెలిపారు. డిడిసిఏ కేసు సంగతి తాను మీడియాకు చెప్పడంతో సదరు ఫైళ్లను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదని చెప్పారు.
“నా ఆఫీసులో ఏ ఫైలు కోసం సి.బి.ఐ వెతుకుతోంది? అరుణ్ జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిడిసిఏ ఫైళ్లేనా. ఆ అంశం పైనే నేను విచారణ కమిషన్ వేయబోతున్నాను” అని అరవింద్ వెల్లడి చేశారు. ప్రధాన మంత్రిపై దాడి కొనసాగిస్తూ “నా మాటలే సముచితం కాకపోవచ్చు గానీ నీ చేతలే ఎంతమాత్రం సముచితం కావు” అని ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్షమాపణ చెప్పే వ్యాఖ్యానాలు ముఖ్యమంత్రి ఏమీ చేయలేదని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. ప్రధాని మోడి తాను సాగించిన దుష్కార్యాలకు క్షమాపణ చెబితే తమ ముఖ్యమంత్రి క్షమాపణ చెబుతారని సిసోడియా అరవింద్ పై విమర్శలను తిప్పి కొట్టారు.
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 14 సంవత్సరాల పాటు ఏకబిగిన డిడిసిఏ అధ్యక్ష పదవి నిర్వహించారు. అనంతరం డిసెంబర్ 2014 వరకు ఆయన డిడిసిఏ కు ప్యాట్రన్-ఇన్-చీఫ్ పదవిలో కొనసాగారు. అనగా ఆర్ధిక మంత్రిగా నియమితులైన తర్వాత కూడా ఆయన ఒక జిల్లా క్రికెట్ సంఘం ఉన్నత పదవులు నిర్వహించారు. రాజకీయ నాయకులు ప్రతిపక్ష నేతలుగానో లేదా మంత్రులు గానో ప్రజలకు సేవ చేయడం పక్కనబెట్టి క్రికెట్ సంఘాల పదవుల కోసం వెంపర్లాడడం ఏమిటో భారత ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కోట్ల కొలది తేలిక డబ్బు (ఈజీ మనీ) అందుబాటులో ఉండడమే క్రికెట్ సంఘాల ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం అనవసరం. దేశ రాజధాని అయిన ఢిల్లీ క్రికెట్ సంఘం అంటే అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని కొల్లగొట్టే అవకాశం లభిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ విచారణ కమిషన్ వేయబోతున్నది కూడా డిడిసిఏ నుండి అక్రమంగా లీజుకు తీసుకున్న భవనాల విషయంలోనే కావడం గమనార్హం.
“సి.బి.ఐ దాడుల లక్ష్యం రాజేంద్ర కుమారే అయితే, సి.బి.ఐ చెబుతున్నట్లు 2007-2014 కాలంలోని రాజేంద్ర అవినీతి విషయంలోనే తమ దాడి జరిగినట్లు చెప్పడం నిజమే అయితే సి.బి.ఐ ఆయన ఆ కాలంలో పని చేసిన కార్యాలయాలపై దాడి చేయాలి. విద్యా కార్యదర్శిగా, వ్యాట్ కమిషనర్ గా, ఐ.టి విభాగం అధిపతిగా ఆయన పనిచేసినందున ఆ విభాగాల కార్యాలయాలపై దాడి చేసి వెతుకులాట నిర్వహించాలి. అలా కాకుండా నా కార్యాలయాన్ని ఎందుకు దిగ్బంధనం చేశారు? సి.ఎం కార్యదర్శి కార్యాలయంలో ఆ ఫైళ్ళు ఎందుకుంటాయి?” అని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
తన కార్యాలయంలో వెతుకులాట జరిగినప్పటికీ డిడిసిఏ విచారణ ఫైళ్లను సి.బి.ఐ చేజిక్కించుకోగలిగేది కాదని కేజ్రీవాల్ తెలిపారు. తన కార్యాలయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు భద్రమైన చోటికి తరలించడమే అందుకు కారణమని ఆయన తెలిపారు. గత 10 నుండి 15 రోజుల నాటి ఫైళ్ళు మాత్రమే కార్యాలయంలో ఉంటాయని కనుక డిడిసిఏ వ్యవహారంలో జైట్లీ అవినీతి విచారణకు సంబంధించిన ముఖ్యమైన దస్త్రాలు సి.బి.ఐకి లభించలేదని చెప్పారు. అయితే విచారణతో సంబంధం ఉన్న కొన్ని ఉపరితల ఫైళ్లను సి.బి.ఐ కాపీలు తీసుకుని ఉండవచ్చని తెలిపారు.
తాము ఏయే ఫైళ్ళు స్వాధీనం చేసుకున్నదీ జాబితాను కోర్టుకు సమర్పిస్తామని సి.బి.ఐ ప్రకటించింది. అయితే ఏ యే ఫైళ్ళ కాపీలు తాము తీసుకున్నది సి.బి.ఐ చెప్పే అవకాశం లేదు. అక్రమంగా కాపీ తీసుకున్న ఫైళ్ళ సమాచారం కోర్టుకు ఇచ్చే పిచ్చి పని సి.బి.ఐ ఎందుకు చేస్తుంది?
డిడిసిఏ అవినీతి ఆరోపణలను ‘చెత్త’ అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. వెంకయ్య నాయుడు గారయితే ఢిల్లీ ముఖ్యమంత్రి జాతీయ దృష్టిని ఆకర్శించేందుకు విఫలయత్నం చేస్తున్నారని వాకృచ్చారు. 70 సీట్ల అసెంబ్లీలో 67 సీట్లు గెలుచుకున్ననాడే అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలు జాతీయ దృష్టిని ఆకర్షించలేదనా వెంకయ్య నాయుడుగారి ఉద్దేశ్యం. అచ్చంగా కేంద్రం ఆదేశాలను పొల్లు పోకుండా అమలు చేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియామకాలను రద్దు చేయడం ద్వారా నేరుగా కేంద్రంతో తలపడినప్పుడే అరవింద్ కేజ్రీవాల్ జాతీయ దృష్టిలోకి రాలేదా?
అత్యంత ప్రాచుర్యం పొందిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హాజరే కుడి భుజంగా మెలిగినప్పుడే అరవింద్ జాతీయ దృష్టిలోకి రాలేదా? “చేతనైతే రాజకీయాల్లోకి రండి! ప్రభుత్వాలు నడపడం అంటే ఏమిటో తెలుస్తుంది” అంటూ కాంగ్రెస్, బి.జె.పి, ఎస్.పి తదితర పార్టీలు విసిరిన సవాలును స్వీకరించి ఆమ్ ఆద్మీ పార్టీని స్ధాపించినప్పుడే అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్ధాయిలో ఆకర్షణగా నిలవలేదా?
రాజకీయ పార్టీ స్ధాపన నుండి అన్నా హజారే వెనక్కి మళ్లినప్పటికీ మొండిగా ముందుకే సాగి పార్టీ స్ధాపించడమే కాకుండా మొదటి ఎన్నికల్లోనే 28 స్ధానాలు గెలుచుకున్నప్పుడే అరవింద్, ఏఏపి లు జాతీయ దృష్టినే కాక అంతర్జాతీయ దృష్టినే ఆకర్షించలేదా?
అంతెందుకు? నిన్నటి రోజున సి.బి.ఐ సీజ్ ద్వారా అరవింద్ ను ఆయన కార్యాలయంలోకి ప్రవేశించకుండా చేసిన రోజున ట్విట్టర్ ద్వారానే కేంద్ర ప్రభుత్వం అఘాయిత్యాన్ని, ప్రధాని మోడి దుష్కార్యాలను ఎండగట్టిన తీరును అమెరికా పత్రికలు వాషింగ్టన్ పోస్ట్, హఫింగ్టన్ పోస్ట్, లండన్ పత్రిక ది గార్డియన్, బ్రిటన్ వాణిజ్య పత్రిక రాయిటర్స్… ఇవన్నీ అందిపుచ్చుకుని పతాక శీర్షికల్లోని వార్తగా చేసుకోవడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే కదా!
వెంకయ్య నాయుడుగారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే జాతీయ దృష్టిలో మాత్రమే కాదు, అంతర్జాతీయ దృష్టిలోనే ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా ప్రయత్నించి ఏ దృష్టినీ ఆకర్షించాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందడంలో పాలక పార్టీ బి.జె.పి యే కాకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తమకు ఇష్టం లేకుండానే సహకరిస్తున్నాయి. కాగా ‘జాతీయ దృష్టిని ఆకర్షించడానికి విఫలయత్నం చేస్తున్నార’ని ఇప్పుడు పరిహసించడం…. ఏమని అనాలో మాటలు రావడం లేదు.
అరవింద్ నిందలు, రవి శంకర్ ప్రసాద్-వెంకయ్య నాయుడు తదితరుల పరిహాసాలు పక్కనబెట్టి ఢిల్లీ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చే కేజ్రీవాల్ డిమాండ్లను కేంద్రం తీర్చాలి. ఢిల్లీకి పూర్తి స్ధాయి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలన్న డిమాండ్ ని కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ ఎందుకు కాదంటున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి సొ కాల్డ్ ప్రజాస్వామ్య దేశాలలో కూడా రాజధాని కార్యకలాపాలు నిర్వహించే కొద్ది ప్రాంతం తప్ప మిగిలిన ప్రాంతం అంతా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే పాలిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీలో అవినీతిని అరికట్టి ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలంటే ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. కానీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఏఏపి నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా కాపలా కాస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కనీసం తన అధికారులను సైతం నియమించుకోనివ్వకుండా ముఖ్యమంత్రిని అడ్డుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్రమైన ప్రజాకంటకుడిగా అవతరించడం కేంద్రం చలవే.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్… ఇరువురూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ప్రతికూల పరిస్ధితులను బట్టి, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్ధ ద్వారా ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం ఎందుకు దుస్సాధ్యమో స్పష్టంగా అర్ధం అవుతున్నది. ఈ సంగతి అరవింద్ కేజ్రీవాల్ కి ఈ పాటికే అర్ధం అయి ఉండాలి. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరబూనడం వెర్రితనమే కాగలదని ఆయన గ్రహించాలి. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఉండడం ఎంత బూటకమో తెలియజేయడంలో అరవింద్ కేజ్రీవాల్ పాలన తెలియజేస్తున్నదనడంలో సందేహం లేదు. బూటకపు ప్రజాస్వామ్యం ముసుగు ధరించిన దోపిడీ వర్గాల నియంతృత్వ పాలన అసలు రంగు వెల్లడి కావడంలో అరవింద్ కేజ్రీవాల్ పాలన శక్తివంతంగా ఉపయోగపడుతోంది. సి.పి.ఐ, సి.పి.ఐ(ఎం) పార్టీలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దశాబ్దాల తరబడి అంటిపెట్టుకుని కూడా ప్రజలకు సాధించిపెట్టలేని ప్రయోజనాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సాధించి పెడుతోంది.
ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 14 సంవత్సరాల పాటు ఏకబిగిన డిడిసిఏ అధ్యక్ష పదవి నిర్వహించారు. అనంతరం డిసెంబర్ 2014 వరకు ఆయన డిడిసిఏ కు ప్యాట్రన్-ఇన్-చీఫ్ పదవిలో కొనసాగారు. అనగా ఆర్ధిక మంత్రిగా నియమితులైన తర్వాత కూడా ఆయన ఒక జిల్లా క్రికెట్ సంఘం ఉన్నత పదవులు నిర్వహించారు.
పై వ్యాఖ్యలో డి.డి.సి.ఎ అంటే డిల్లీ & జిల్లా క్రికెట్ సంఘం.
కానీ ఒక జిల్లా క్రికెట్ సంఘం అని పేర్గొంటే అంశం యొక్క తీవ్రతను తగ్గించినవారమౌతాము.గమనించగలరు.
విదేశాలలో;అవినీతి,అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఉన్న లలిత్ మోడీ ఇప్పటికీ రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడంటే వారు ఈ రాష్ట్రాల,జాతీయ క్రికెట్ సంఘాలలో ఎంతగా చొచ్చుకుపోయారో తెలియజేస్తుంది.
//సి.పి.ఐ, సి.పి.ఐ(ఎం) పార్టీలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దశాబ్దాల తరబడి అంటిపెట్టుకుని కూడా ప్రజలకు సాధించిపెట్టలేని ప్రయోజనాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సాధించి పెడుతోంది.//
చాలా మంచి మాటన్నారు. ప్రజలకు సాదించి పెట్టటం అటుంచి ఈ ప్రభుత్వాలను ఎండ గట్టి ప్రజలను కార్యోన్ముఖులను చేయడములో విపల మైనాయి.