ఫాసిస్టు పోకడ: కేజ్రీవాల్ ఆఫీస్ పై సి.బి.ఐ దాడి!


Media wait outside Kejriwal's Office

Media wait outside Kejriwal’s Office

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఫాసిస్టు ఆరోపణలు నిజమేనా అన్నట్లుగా సరికొత్త రాజకీయ పరిణామం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈ రోజు చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ అధికారులు ఈ రోజు పొద్దున్నే దాడి చేశారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనువెంటనే ట్విట్టర్ పోస్టుల ద్వారా లోకానికి వెల్లడి చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడి అయిన సి.బి.ఐ దాడి సమాచారం పార్లమెంటులో ఇరు సభల్ని కుదిపివేసింది. దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో సి.బి.ఐ చర్యను ఖండించాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంపై ఆయనకు సమాచారం ఇవ్వకుండా దాడి చేయడం ఏమిటని ప్రశ్నించాయి. బి.జె.పి ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని నిందించాయి. దేశంలోని ఫెడరల్ తరహా ప్రభుత్వ నిర్మాణాన్ని అపహాస్యం చేస్తున్నదని ఆరోపించాయి.

ప్రతిపక్షాలన్నీ ఏక తాటిపై సి.బి.ఐ చర్యను ప్రశ్నించడంతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వారికి సమాధానం ఇచ్చారు. సి.బి.ఐ దాడి చేసింది ముఖ్యమంత్రి కార్యదర్శి కార్యాలయం పైనే కానీ ముఖ్యమంత్రి కార్యాలయం పైన కాదని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యదర్శి రాజేంద్ర కుమార్ అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని ఆ ఫిర్యాదు మేరకే ఆయన కార్యాలయంపై దాడి జరిగిందని సభకు తెలిపారు. సి.బి.ఐ దాడికి సంబంధించిన అంశం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య మంత్రిగా పదవి చేపట్టిన నాటికంటే ముందుదని, దానికి అరవింద్ పాలనకు సంబంధం లేదని ఆయన సభకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శి రాజేంద్ర కుమార్ గతంలో నిర్వహించిన పదవుల్లో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిందని సదరు ఫిర్యాదుపై విచారణ చేసేందుకే సి.బి.ఐ దాడి జరిగిందని జైట్లీ చెప్పుకొచ్చారు.

తన కార్యదర్శి రాజేంద్ర కుమార్ అవినీతిపై ఫిర్యాదు మేరకే సి.బి.ఐ దాడి చేసిందన్న వివరణను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొట్టిపారేశారు.  ఏరి కోరి నియమించుకున్న కార్యదర్శి తనను సాధించే లక్ష్యంతోనే దాడి జరిగిందని, దాడిని సమర్ధించుకోవడానికి తన కార్యదర్శిని అడ్డం పెట్టుకుంటున్నారని కేజ్రీవాల్ ఘాటుగా బదులిచ్చారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనతో పని చేస్తున్న అధికారులను బెదిరించడానికి మోడి ప్రభుత్వం దిగజారిందని అరవింద్ వెల్లడించారు. ఒక దశలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని మోడీని ‘పిరికి పంద’, అనీ ‘సైకో పాత్’ అనీ నిందించారు.

రాజేంద్ర కుమార్ అవినీతి విచారణకే దాడి చేశామని చెబుతూ సి.బి.ఐ అబద్ధం ఆడుతోందని అరవింద్ స్పష్టం చేశారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అసలు కారణాన్ని కప్పి పుచ్చి పార్లమెంటులోనే అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. సి.బి.ఐ, జైట్లీలు చెబుతున్నట్లుగా దాడి జరిగింది రాజేంద్ర కుమార్ కార్యాలయంపైన కాదని, ఆ పేరుతో తన కార్యాలయంలో రాకపోకలను బంద్ చేసి తన కార్యాలయంలోని ఫైళ్లనే సి.బి.ఐ పరిశీలిస్తోందని అరవింద్ ట్విట్టర్ ద్వారా వెల్లడి చేశారు. “అసలు తనకు ఏ ఫైలు కావాలో ప్రధాన మంత్రినే చెప్పమనండి!” అని ఢిల్లీ ముఖ్యమంత్రి సవాలు విసిరారు.

“అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే ఒక మంత్రిని ఒక సీనియర్ అధికారిని స్వయంగా డిస్మిస్ చేసిన ఏకైక ముఖ్యమంత్రిని నేనే. వారి కేసులను సి.బి.ఐకి అప్పగించింది నేనే. రాజేందర్ కి వ్యతిరేకంగా తమవద్ద సాక్ష్యాలు ఉన్నట్లయితే వాటిని సి.బి.ఐ నాకు ఎందుకు చూపదు? నేనే ఆయనకు వ్యతిరేకంగా చర్య తీసుకుని ఉందును కదా?” అని అరవింద్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

“ఆర్ధికమంత్రి పార్లమెంటులో అబద్ధం చెప్పారు. నాకు వ్యతిరేకంగా సాక్షాలు వెతకడానికి నా సొంత కార్యాలయం ఫైళ్లనే పరిశీలిస్తున్నారు. రాజేందర్ కేవలం ఒక సాకు మాత్రమే” అని అరవింద్ స్పష్టం చేశారు. సి.బి.ఐ దాడి వార్త విని తాను దిగ్భ్రాంతి చెందానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరవింద్ ట్విట్టర్ పేజీలోనే స్పందించారు. ఆమె వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ అరవింద్ “మమతా దీ. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ” అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

“నా ప్రశ్న -నా కార్యదర్శిగా రాజేందర్ నియమితుడై ఉండకపోతే ఆయనపై దాడి జరిగి ఉండేదా? జరగదు. అప్పుడు దాడి లక్ష్యం రాజేందరా లేక నేనా?” అని అరవింద్ ప్రశ్నించారు. 2007-2014 కాలంలో రాజేందర్ వివిధ చోట్ల వివిధ పదవులు నిర్వహించారని, ఆ కాలంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతోనే సి.బి.ఐ దాడి జరిగిందని బి.జె.పి నేతలు, కేంద్ర మంత్రులు అదే పనిగా చెబుతున్నారు. ఆ ఆరోపణలపై అప్పుడే అందని ఫిర్యాదు ఇప్పటికిప్పుడు ఎలా అందిందని, రాజ్యాంగ పదవి నిర్వహిస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పకుండా ఆయన కార్యదర్శి కార్యాలయం పైనే ఉన్న ఫళాన దాడి చేయాల్సిన అవసరం ఏమిటని అది కూడా సి.ఎం కార్యాలయానికి రాకపోకలు రాకుండా చేసి తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు.

ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ద్వంద్వంగా సమర్ధించారు. ఆయన మచ్చలేని నీతిమంతమైన అధికారి అని అరవింద్ స్పష్టం చేశారు. తనను సాధించడానికి తన అధికారులను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం రాజేంద్ర కుమార్ కు మద్దతు పలికారు. ఒక నిజాయితీ అధికారి భుజంపై తుపాకి మోపి తమ ప్రభుత్వాన్ని బెదిరించాలనుకుంటే ఆ ప్రయత్నంలో విఫలం కాక తప్పదని స్పష్టం చేశారు.

“ఈ దాడుల ద్వారా నిజాయితీ రాజకీయాలను భయాందోళనలకు గురించేసేందుకు మోడి ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కోసం మోడి ఎంత విషం దాచుకున్నారో చూపారు” అని ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.

లోక్ సభలో కాంగ్రెస్, టి.ఎం.సి, ఆర్.జె.డి, ఏఏపి, లెఫ్ట్ పార్టీల సభ్యులు సి.బి.ఐ దాడిపై ఆందోళన ప్రకటించారు. దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. బి.జె.పి తాను అధికారంలోకి వచ్చాక సి.బి.ఐని సొంత ప్రయోజనాలకు వినియోగించడం ప్రారంభించిందని కాంగ్రెసేతర పార్టీలు ఆరోపించాయి. అమిత్ షాను షోరాబుద్దీన్-కౌసర్ బీ-తులసీరాం ప్రజాపతి కేసు నుండి భద్రంగా తప్పించుకునేందుకు సి.బి.ఐని వినియోగించదని గతంలోనే ఏఏపి పార్టీ తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆ ఏఏపి యే సి.బి.ఐ దుర్వినియోగానికి లక్ష్యం కావడం కాకతాళీయం మాత్రం కాదు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు గారు ఒక జోక్ పేల్చారు. సి.బి.ఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా వెంకయ్య నాయుడుతో సహా పలు బి.జె.పి నేతలు గతంలో తిట్టిపోశారు. “కాంగ్రెస్ పాలనలో ఉన్నట్లుగా సి.బి.ఐ కేంద్ర ప్రభుత్వం కింద లేదు. ఇప్పుడు సి.బి.ఐ స్వతంత్ర సంస్ధ. సి.బి.ఐ చర్యలన్నీ స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలే. సి.బి.ఐ ని వాడుకోవడానికి మాది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు” అని ఆయన సి.బి.ఐ దాడులను వెనకేసుకొచ్చారు.

అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పని చేసిన సి.బి.ఐ బి.జె.పి అధికారంలోకి రాగానే ఉన్నపళంగా నిజాయితీ కలిగిన నిఖార్సయిన స్వతంత్ర సంస్ధగా మారిపోయిందన్న మాట! ఇది ఎలా సాధ్యం? అప్పటి అధికారులే కదా ఇప్పుడూ ఉన్నది! కాంగ్రెస్ హయాంలోని అధికారులందరినీ బదిలీ చేసి కొత్త అధికారులనేమీ బి.జె.పి నియమించలేదు కదా! కాంగ్రెస్ పాలన నాటి సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా గారే బి.జె.పి ప్రభుత్వం కూడా ఆయన పదవీ విరమణ వరకూ కొనసాగించింది కదా! అంతలోనే సి.బి.ఐ స్వతంత్ర సంస్ధగా ఎలా అవతరించినట్లు?

ససాక్షంగా అడగాలంటే బి.జె.పి అధ్యక్షులు అమిత్ షా, తనపై జరుగుతున్న బూటకపు ఎన్ కౌంటర్ (షోరాబుద్దీన్, కౌసర్ బీ, తులసీరాం ప్రజాపతి) కేసును కొట్టివేయాలని బొంబే హై కోర్టులో పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ విచారణలో అమిత్ షా లాయర్లు ఏకబిగిన 3 రోజుల పాటు వాదనలు వినిపిస్తే సి.బి.ఐ ప్రాసిక్యూటర్ కేవలం 15 నిమిషాల వాదనతో సరిపెట్టడం ఎలా అర్ధం చేసుకోవాలి?

పోనీ అమిత్ షా పైన ఉన్నది బలహీనమైన కేసా అంటే అదీ కాదు. గుజరాత్ పోలీసు అధికారులతో పాటు అనేకమంది సహ బలవంతపు వసూలుదార్లను (extortionists) గతంలో సి.బి.ఐ సాక్షులుగా ప్రవేశపెట్టింది నిజం కాదా? ఆ ముగ్గురి బూటకపు ఎన్ కౌంటర్ లో అమిత్ షాదే ప్రధాన హస్తం అని సి.బి.ఐ వాదించి అందుకు తగిన సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదా? బూటకు ఎన్ కౌంటర్ లకు మొదలు చివరా అమిత్ షా యే అని సి.బి.ఐ బల్లలు బాది వాదించలేదా? అలాంటి సి.బి.ఐ బి.జె.పి అధికారంలోకి రావడంతోనే 3 రోజుల డిఫెన్స్ వాదనకు సమాధానంగా 15 ని.ల వాదనతో సరిపెట్టడం బి.జె.పికి సేవలు చేయడం కాదా?

అత్యంత బలమైన సాక్ష్యాలతో కూడిన బూటకపు ఎన్ కౌంటర్ లేదా కోల్డ్ బ్లడెడ్ మర్దర్స్ కేసును 15 నిమిషాల ప్రాసిక్యూషన్ కేసుగా నీరుగార్చిన సి.బి.ఐ ఎవరి ప్రయోజనాల కోసం దిగజారినట్లు? బలమైన సాక్షాలు ఉండి కూడా అమిత్ షా ఎలా బైటపడగలిగినట్లు? విచిత్రంగా అమిత్ షా పై ఆరోపణలు రద్దు చేయడమే సి.బి.ఐ స్వతంత్రతకి కొలబద్దగా బి.జె.పి నేతలు చెప్పుకోవడం!

వాస్తవం ఏమిటన్నది బహిరంగ రహస్యం. సి.బి.ఐ అధికారంలో ఎవరు ఉంటే వారి మాటను అక్షరాలు అమలు చేస్తుంది. పదవీ విరమణ అయ్యాక సి.బి.ఐ డైరెక్టర్లకు ఆ మేరకు పునరావాసం కల్పించబడాలన్నా, వారి సేవలను మరో చోట కొనసాగడం జరగాలన్నా, తమ సొంత అవినీతి కప్పిపెట్టాలన్నా అది తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఆజ్ఞలు జవదాటలేదని ఆరోపణలు ఎదుర్కొన్న రంజిత్ సిన్హా (సి.బి.ఐ మాజీ డైరెక్టర్) బి.జె.పి పాలనలో తన పదవీ విరమణకు సరిగ్గా ముందుగా అమిత్ షా డిఫెన్స్ కు వ్యతిరేకంగా బలహీనమైన ప్రాసిక్యూషన్ వినిపించే ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు డైరెక్టర్ గా పని చేసిన రంజిత్ సిన్హా కాంగ్రెస్ పాలన అయ్యాక ఏ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు డైరెక్టర్ గా పని చేసినట్లు?

*******************

తదుపరి ఆర్టికల్: అవినీతి జైట్లీని కాపాడుకునేందుకే సి.బి.ఐని పురిగొల్పారు -అరవింద్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s