‘నేషనల్ హెరాల్డ్’ పేరుతో పార్లమెంటులో ఓ వింత నాటకం ప్రదర్శితం అవుతోంది. నిజానికి పార్లమెంటులో ఇలాంటి వింత నాటకాల ప్రదర్శన కొత్తేమీ కాదు. ఈ నాటకాలు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడేట్లు చూడడంలో పాలకులు, ప్రతిపక్షాలు చూపించే ప్రతిభా సంపత్తులే ఆసక్తికరంగా ఉంటుంటాయి.
నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని నేరుగా అవినీతి చర్చలోకి లాగిన రెండో ఉదంతం నేషనల్ హెరాల్డ్! మొదటి ఉదంతం బోఫోర్స్ అవినీతి ఆరోపణలని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. విశేషం ఏమిటంటే బోఫోర్స్ అవినీతి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వెల్లడి కాగా, నేషనల్ హెరాల్డ్ అవినీతి ఉదంతం ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వెల్లడి కావడం.
ఇప్పుడంటే అవినీతి ఆరోపణలు వేలు లక్షల కోట్ల రూపాయల్లో ఉంటేనే పత్రికల దృష్టిని ఆకర్షిస్తున్నాయి గానీ అప్పట్లో బోఫోర్స్ అవినీతి మొత్తం కేవలం 60 కోట్ల చిల్లర మాత్రమే. అది కూడా వేరే కాంగ్రెస్ నాయకులైతే ఎలా ఉండేదో గానీ భారత దేశ మొదటి కుటుంబంపై అవినీతి ఆరోపణలు కావడం మూలాన బోఫోర్స్ కుంభకోణం అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.
నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కూడా చాలా తక్కువ మొత్తానికి (రు 90 కోట్లు) సంబంధించినది. నేషనల్ హెరాల్డ్ పత్రికను భారత ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించారు. మొదటి నుండి ఆర్ధిక కష్టాల్లో నడిచిన ఈ పత్రిక అడపా దడపా మూసివేతకు గురవుతూ మళ్ళీ ముద్రణ పొందుతూ వచ్చింది. చివరికి 2008లో పూర్తిగా మూసివేతకు గురయింది.
అయితే ఈ పత్రిక ముద్రణ కోసం కేంద్ర ప్రభుత్వాలు దేశవ్యాపితంగా వివిధ నగరాల్లో ఉచితంగానో నామ మాత్రమైన ధరలకో భూములు ఇచ్చింది. కాలక్రమంలో ఈ భూముల్లో ఆస్తులు పోగుపడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఈ పత్రిక కింద విలువైన భూమి ఆస్తులు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం దేశం వ్యాపితంగా పత్రిక కింద ఉన్న ఆస్తుల విలువ రు 5,000 కోట్లకు పైనే. ఢిల్లీలోని భూముల విలువ రు 2000 కోట్లకు పైనే. ఈ ఆస్తులే నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ప్రస్తుతం ప్రధాన ఆకర్షణ.
పత్రికల్లో వచ్చిన వివిధ వివరాలను బట్టి చూస్తే నేషనల్ హెరాల్డ్ తో పాటు వివిధ పేపర్ సంస్ధలు కేంద్రంగా గాంధీ కుటుంబం నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకోవడానికి వినియోగించిందని అర్ధం అవుతుంది. అయితే అందుకు తగిన సాక్షాలు ఏమీ లేవు. కానీ అవినీతి జరిగిందని ఊహించడానికి తగిన తతంగం అయితే నడిచింది. అనగా నైతిక దృష్టి కోణంలో తప్పు జరిగిందని చెప్పొచ్చు గానీ చట్టం దృష్టిలో జరిగిన తప్పులేమీ లేవు.
క్లుప్తంగా చూస్తే నేషనల్ హెరాల్డ్ పత్రిక అసోసియేటెడ్ జర్నల్స్ (ఏ.జె.ఎల్) ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ కింద నడిచింది. పత్రిక మూతపడే నాటికి నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి 90 కోట్ల రూపాయల అప్పు పడి ఉంది. ఈ అప్పు వడ్డీ లేకుండా విడతలు విడతలుగా కాంగ్రెస్ పార్టీ సమకూర్చింది.
పత్రిక మూసివేసేటప్పుడు ఏ.జె.ఎల్ కి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయని కాంగ్రెస్ ప్రకటించింది. అంటే సంస్ధ నెగిటివ్ విలువ కలిగి ఉన్నదని అర్ధం. ఏ.జె.ఎల్ కంపెనీలో నెహ్రూ-గాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని వివిధ పెద్దల (ఆంటోనీ, ఫెర్నాండెజ్, వోరా మొ.వారు) పేర్ల కింద మొత్తం షేర్లు ఉన్నాయి. ఏ.జె.ఎల్ లో నెహ్రూ-గాంధీ కుటుంబం కాకుండా ఇతర వాటాదారులు 761 మంది.
ఈ నేపధ్యంలో ఏ.జె.ఎల్ అప్పులను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఛారిటబుల్ ట్రస్టుకు బదలాయిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. యంగ్ ఇండియన్ సంస్ధ మొత్తం షేర్ కేపిటల్ రు 5 లక్షలు మాత్రమే. ఈ ఛారిటీలో సోనియా, రాహుల్ లకు ఇద్దరికీ చెరో 38 శాతం షేర్లు ఉన్నాయి.
90 కోట్ల అప్పును తాను స్వీకరిస్తూ యంగ్ ఇండియన్ సంస్ధ అందుకు ప్రతిగా రు 50 లక్షలను కాంగ్రెస్ పార్టీకి చెల్లించింది. అప్పులు బదలాయించడం అంటే ఆస్తులు కూడా బదలాయించడంగా అర్ధం చేసుకోవాలి.
ఈ బదలాయింపును అర్ధం చేసుకోవడానికి ఓ చిన్న ఉదాహరణ! కాలం తీరిన ఓడల్ని వేలంలోనో, కాంట్రాక్టు కిందనో కొనే కంపెనీలు ఉంటాయి. తాము కొన్న ఓడల్ని భాగాలు భాగాలుగా విడదీసి తిరిగి అమ్మకానికి పెట్టడం ద్వారా లాభాలు సంపాదిస్తాయి.
నేషనల్ హెరాల్డ్ అప్పుల బదలాయింపు కూడా అలాంటిదే. ఏ.జె.ఎల్ కంపెనీ దివాళా తీసే కంపెనీగా మొదట ప్రకటించడం, ఆ తర్వాత కంపెనీ అప్పులని ఆస్తులతో సహా మరో ఛారిటీ కంపెనీకి ఇచ్చేయడం ఎందుకు జరిగింది? ఎందుకంటే ఆ విధంగా అప్పులలో తీసుకుంటూ, నికరంగా నెగిటివ్ విలువ కలిగి ఉన్న ప్రచురణ సంస్ధ ఆస్తులను దయతో ఒక ఛారిటీ కంపెనీ కొనుగోలు చేసిందన్న అవగాహనను సృష్టించడానికి.
2010 డిసెంబర్ లో ఏ.జె.ఎల్ కంపెనీ తన అప్పును స్వీకరించిన యంగ్ ఇండియన్ ఛారిటీకి పెద్ద మొత్తంలో షేర్లను బదిలీ చేసింది. ఎంత మొత్తంలో అంటే ఈ షేర్ల బదలాయింపు తర్వాత ఇతర వాటాదారుల వాటా కేవలం 1 శాతానికి కుదించుకుపోయింది. అనగా సోనియా, రాహుల్ ల ఆధ్వర్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ఏ.జె.ఎల్ కి దాదాపు పూర్తి సొంతదారుగా అవతరించింది. ఇప్పుడిక ఏ.జె.ఎల్ ఆస్తులన్నీ యంగ్ ఇండియన్ ఛారిటీవే.
కనుక అప్పు బదలాయింపు ద్వారా ఏం జరిగింది? ఢిల్లీ, లక్నో, భోపాల్, ముంబై, ఇండోర్, పాట్నా, పంచకుల తదితర నగరాలలో నేషనల్ హెరాల్డ్ లేదా ఏ.జె.ఎల్ కింద ఉన్న స్ధిరాస్తులన్నీ యంగ్ ఇండియన్ సొంత ఆస్తులుగా లేదా నెహ్రూ-గాంధీ కుటుంబం సొంత ఆస్తులుగా పరిణామం చెందాయి.
నేరుగా చెప్పాలంటే నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన ఆస్తులు ఎలాగూ నెహ్రూ-గాంధీ కుటుంబానివే. అనగా సోనియా, రాహుల్ గాంధీలవే. కానీ చట్టం రీత్యా అవి ఏ.జె.ఎల్ కింద ఉన్నాయి. చట్టం దృష్టిలో ఏ.జె.ఎల్ లో వాటాలు కలిగి ఉన్న వివిధ కాంగ్రెస్ నాయకులు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల సొంతదారులు. ఈ పరిస్ధితిని మార్చి ఇతర నేతలకు నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు ఉన్న లంకెను అధికారికంగా తెంచివేసి చట్టం రీత్యా కూడా అవి పూర్తిగా తమ ఆస్తులుగా చేసుకోవడానికి సోనియా, రాహుల్ లు యంగ్ ఇండియన్ అనే పేపర్ కంపెనీ నాటకాన్ని ఆడారు.
కాంగ్రెస్ పార్టీ దఫ దఫాలుగా ఏ.జె.ఎల్ కు ఇచ్చిన 90 కోట్ల అప్పు కేవలం పేపర్ పైన కనిపించేది. కాంగ్రెస్ పార్టీకి నిధులు ఎలా వస్తాయి? వివిధ దాతలు ఇచ్చే విరాళాలే పార్టీ నిధులు. ఈ నిధులు వైట్ మనీ. కాంగ్రెస్ పార్టీ ఏ.జె.ఎల్ కు నిజంగా అప్పులు ఇచ్చి ఉంటుందా? ఇస్తే అసలు ఇంత రగడ జరగదు. వాస్తవం ఏమిటంటే కాంగ్రెస్ అప్పుల పేరుతో బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే సౌలభ్యాన్ని గాంధీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవ్వని అప్పులు ఇచ్చినట్లుగా చెప్పడం అంటే నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేసుకోవడం.
చూడడానికి 90 కోట్లే అయినా పత్రిక ఆస్తుల విలువ 5,000 కోట్లకు పైనే గనుక ఆ మేరకు తెల్ల డబ్బును చూపగల అవకాశాన్ని చేజిక్కించుకున్నట్లే (అంత తెల్ల డబ్బును చూపిస్తే పన్నులు ఎదుర్కోవాలి కనుక ఒకేసారి అంత మొత్తాన్ని చూపరు. కానీ అవసరం వచ్చినప్పుడల్లా అవసరమైన మొత్తాన్ని సొమ్ము చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.) ఇదంతా చట్టబద్ధంగా జరిగినట్లు చూపడానికే యంగ్ ఇండియన్ కంపెనీ స్ధాపన జరిగింది.
ఇప్పుడు మాజీ జనతా/ఇప్పటి బి.జె.పి నేత సుబ్రమణ్య స్వామి ఆరోపణ ఏమిటంటే నేషనల్ హెరాల్డ్ అప్పుల్ని/ఆస్తుల్ని యంగ్ ఇండియన్ కి బదలాయించడంలో అవినీతి జరిగింది అని. ఈ బదలాయింపు ద్వారా ఏ.జె.ఎల్ వాటాదారుల ప్రయోజనాలకు నష్టం వచ్చిందని, అలాగే కాంగ్రెస్ పార్టీకి దాతలు ఇచ్చిన విరాళాలు దుర్వినియోగం అయ్యాయని ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణలలో వాస్తవం లేకపోలేదు. కానీ చట్టబద్ధంగా చూస్తే అవి నిలిచే ఆరోపణలు కావు. ఎందుకంటే అప్పులు, వాటాల బదలాయింపు వల్ల తాము నష్టపోయామని ముందుకు వచ్చే బాధితులు ఎవరూ లేరు. వాటాదారులు అందరూ కాంగ్రెస్ నేతలే కనుక ఎవరూ ముందుకు రారు. ఆ అవసరం ఎవరికీ లేదు. కనుక కోర్టులో కేసు వీగిపోతుంది.
వీగిపోయే కేసును ఎదుర్కోవడానికి కూడా సోనియా, రాహుల్ లు సిద్ధంగా లేరు. భారత దేశానికి మొదటి కుటుంబంగా గుర్తింపు పొందిన తాము కోర్టు బోనులో నిలబడడం ఏమిటన్న అహంకారంలో వారు ఉండి ఉండవచ్చు.
వారికి అహంకారం సంగతి ఎలా ఉన్నా ఈ కేసు ద్వారా జి.ఎస్.టి బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కు ఒక సాకు దొరికిందా అన్న కోణంలో కూడా ఆలోచించివలసిన అవసరం ఉంది. నిజానికి జి.ఎస్.టి బిల్లును అడ్డుకునేందుకు ఇంతకంటే మెరుగైన అంశాలు కాంగ్రెస్ వద్ద ఉన్నాయి. ఉదా: అసహనం (దాద్రి హత్యలు, ఖల్బుర్గి తదితరుల హత్యలు), కేరళలో ప్రధాని హాజరు కానున్న ఒక ఫంక్షన్ కు ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి పంపిన ఆహ్వానాన్ని మతోన్మాదుల ఒత్తిడికి లొంగి ఉపసంహరించుకోవడం.. మొ.వి.
లేదా నేషనల్ హెరాల్డ్ కేసును బొంద పెట్టించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ, లోక్ సభలను నడవకుండా చేస్తున్నా ఆశ్చర్యం లేదు. జి.ఎస్.టి బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు నడవాలి. జి.ఎస్.టి బిల్లును అడ్డం పెట్టుకుని నేషనల్ హెరాల్డ్ కేసు నుండి బైటపడే ప్రయత్నం జరుగుతున్నదేమో మరిన్ని పరిణామాలు జరిగితే తప్ప తెలియదు.
మొత్తం మీద చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసు భారత దేశంలో కలిగిన కుటుంబాలు, పలుకుబడి ఉన్న కుటుంబాలు ఆస్తులను కూడగట్టుకునే మార్గాలలో ఒక మార్గాన్ని వెల్లడి చేసింది. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునే ఒక మార్గాన్ని కూడా వెల్లడి చేసింది. కాంగ్రెస్, బి.జె.పి లాంటి రాజకీయ పార్టీలు వాస్తవంలో ప్రజలకోసం పనిచేసే పార్టీలు కాదని, అవి బడా ధనికవర్గాల కోసం పనిచేసేవి మాత్రమేననీ, వారి ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటును సైతం చేపల మార్కెట్ కిందికి దిగజార్చడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదని అర్ధం అవుతున్నది.
Subramanya swami ki hats-off cheppochchu. అప్పటి జనతా, ఇప్పటి బిజెపి కి బదులు ఆయన పేరు ప్రస్తావించి ఉంటె బాగుండేది
కాశి గారు పేరు రాయకపోవడం నేను తర్వాత గమనించాను. రాయకూడదు అనేమీ లేదు. ఫ్లోలో అది మిస్ అయింది. సవరిద్దాం అనుకుని కూడా వేరే పనిలోకి వెళ్లిపోయాను. సవరిస్తాను.
ఇందులో క్రెడిట్ ఇవ్వాల్సింది ఏమీ లేదని నా అభిప్రాయం. బి.జె.పి నేతలను సంతృప్తిపరచడం ఆయన అవసరం. ఆయన చూడడానికి ఇష్టపడని అవినీతి దేశంలో చాలా జరుగుతోంది. కానీ ఆయన చూడరు. ఆయన చూడాలనుకున్నవే చూస్తారు. అందుకే క్రెడిట్ అనవసరం. ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా.