గత సంవత్సరం సెప్టెంబర్ లో హాంగ్ కాంగ్ లో విద్యార్ధులు, యువకులు ఒక ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమానికి ‘ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన ఉద్యమం’గా పశ్చిమ పత్రికలు చెప్పుకుని సంతోషిస్తుంటాయి.
పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన అరబ్ వసంతం లిబియాను కుక్కలు చింపిన విస్తరి చేసినట్లే, ఈజిప్టును తిరిగి మిలట్రీ చీకటి కొట్టంలోకి విసిరి కొట్టినట్టే, సిరియాను అల్లకల్లోలం కావించి ముక్కలు ముక్కలుగా విడదీయడానికి ఉద్దేశించినట్లే… హాంగ్ కాంగ్ లో జరిగిన సొ కాల్డ్ ‘ప్రజాస్వామిక ఉద్యమం’ కూడా తమ ప్రయోజనాలకు అక్కరకు వస్తుందని గోతి కాడ గుంట నక్కల్లా ఎదురు చూశాయి.
కానీ చైనా ప్రభుత్వం పాటించిన ఓరిమి ఎత్తుగడ ఫలించి చివరికి ఉద్యమకారులే ఉద్యమాన్ని విరమించి ఇళ్లకు చేరారు. ఈ ఉద్యమం నిజానికి పశ్చిమ పత్రికలు ప్రచారం చేసినట్లు ‘ప్రజాస్వామ్యం కోసం’ జరిగిన ఉద్యమం కాదు. చైనా నుండి వలస వచ్చిన వారి వల్ల ఉద్యోగాలు నానాటికీ కుచించుకుని పోయి, వేతనాలు తగ్గిపోయిన దరిమిలా వెల్లడి అయిన నిరసన!
కాకపోతే 2017 లో హాంగ్ కాంగ్ లో జరగబోయే ఎన్నికల్లో ఏయే అభ్యర్ధులు పోటీ చేయాలో తాము మొదట నిర్ణయించాల్సి ఉంటుందని చైనా ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా ఈ నిరసన తన్నుకు వచ్చింది కావడంతో ‘ప్రజాస్వామ్య ఉద్యమం’గా ప్రచారం చేసుకోవడానికి వీలు దొరికింది. 1997లో హాంగ్ కాంగ్ బ్రిటన్ నుండి చైనాకు బదిలీ అయిన సందర్భంలో కుదుర్చుకున్న ‘బేసిక్ లా’ కు వ్యతిరేకంగా చైనా ప్రకటన ఉన్నదని ఆందోళన చెందుతూ కొందరు వీధుల్లోకి రాగా ఇంకా అనేకమంది తమ తమ కారణాలతో వారితో వచ్చి చేరారు.
అప్పటి ఉద్యమానికి పశ్చిమ పత్రికలు ఏదో ఒక రంగు ఉద్యమంగా పేరు పెడతాయేమో అని ఉద్యమకారులు భయపడ్డారు. ఈజిప్టు, ట్యునీషియా, లిబియా, ఉక్రెయిన్, జార్జియా తదితర దేశాల్లో ప్రజలు తాము అనుభవిస్తున్న దుర్భర పరిస్ధులకు వ్యతిరేకంగా కాగి కాగి ఉన్నపుడు ఆ కాకను భద్రంగా తీసుకెళ్లి సముద్రాల్లో కలిపేసేందుకు పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ప్రాపకం లోని ఎన్.జి.ఓ సంస్ధలు జొరబడి ఉద్యమాలకు నాయకత్వం వహించాయి. తమ చలవ వల్ల వేడెక్కిన ఉద్యమాలకు రంగుల పేర్లు పెట్టుకున్నాయి. అలాగే తమ ఉద్యమానికీ పశ్చిమ మీడియా తమకు తోచిన రంగు పూసేస్తే చైనా నుండి తీవ్ర అణచివేత ఎదురవుతుందని వారి భయం.
ఈ భయం దరిమిలా అప్పటి ఉద్యమకారులైన విద్యార్ధులు, యువకులు తమది ‘గొడుగు ఉద్యమం’ అని పేరు పెట్టేసుకున్నారు. హాంగ్ కాంగ్ పోలీసులు ప్రయోగించిన భాష్పవాయువు నుండి రక్షణ కోసం వారు గొడుగులను విస్తృతంగా వినియోగించారు. ఆ విధంగా అది గొడుగు ఉద్యమం అని ఎవరో ఒకరు ప్రస్తావిస్తే, దానినే ఉద్యమకారులు స్వీకరించారు.
ఇక్కడ ఉన్నవి జతల ఫోటోలు. ఒకే ప్రదేశంలో 2014 నాటి నిరసనల సందర్భంగానూ సంవత్సరం తర్వాత ఏ నిరసనా లేని సందర్భంగానూ తీసిన ఫొటోలివి. హాంగ్ కాంగ్ ఉద్యమం, దానికి పశ్చిమ పత్రికల భాష్యం సంగతి ఎలా ఉన్నా ఇలా ఒకే ప్రదేశాన్ని ఒక సంవత్సరం తేడాతో దాదాపు ఒకే కోణంలో తీసిన ఫోటోలు ఒకింత ఆసక్తిని కలిగిస్తాయి. ఈ ఫోటోల ప్రచురణకు (ఈ బ్లాగ్ లో) కారణం ఆ ఆసక్తే.
కావాలంటే మీరూ చూడండి. తమాషాగా ఉంటుంది.