సల్మాన్ కొక న్యాయం, అఫ్జల్ కొక న్యాయం?! -1


Salman

భారత దేశ పార్లమెంటరీ రాజకీయార్ధిక వ్యవస్ధను కంటికి రెప్పలా కాపాడుతున్న భారతీయ కోర్టులు తాము, రాజ్యాంగ చట్టాలు చెబుతున్నట్లుగా, అందరికీ ఒకటే న్యాయం అమలు చేయడం లేదని మరోసారి రుజువు చేసుకున్నాయి. సల్మాన్ ఖాన్ హిట్ & రన్ కేసు విషయంలో అంతిమ తీర్పు ప్రకటిస్తూ ముంబై హై కోర్టు చేసిన వ్యాఖ్యలు, పొందుపరిచిన సూత్రాలకూ అఫ్జల్ గురు కేసు విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సూత్రాలకూ మధ్య తేడాను గమనిస్తే ఈ సంగతి తేలికగా అర్ధం అవుతుంది.

మొదట సల్మాన్ ఖాన్ కేసు పూర్వాపరాలను చూద్దాం. ఈ కేసు 2002 నాటిది. సెప్టెంబర్ 28, 2002 తేదీన సల్మాన్ ఖాన్ ప్రయాణిస్తున్న టొయోటా (ల్యాండ్ క్రూయిజర్) ముంబై నగరంలో బాంద్రా వెస్ట్ ఏరియాలో రోడ్డు పక్కనే ఉన్న ఒక బేకరీలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బేకరీ ముందు ప్లాట్ ఫారంపై నిద్రిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎంతమంది ఉన్నారు అన్నది ఓ పెద్ద ప్రశ్న. పత్రికల వార్తలు, కోర్టులో వివిధ వాదనల సారాంశం ప్రకారం చూస్తే సల్మాన్ కాకుండా మరో ముగ్గురు కారులో ఉన్నారు. వారు: డ్రైవర్ అశోక్ సింగ్, సల్మాన్ స్నేహితుడు (బాలీవుడ్ సింగర్) కమాల్ ఖాన్, సల్మాన్ రక్షణ కోసం బాడీ గార్డ్ గా నియోగించబడిన పోలీసు కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్.

సెప్టెంబర్ 27 రాత్రి లేదా సెప్టెంబర్ 28 తెల్లవారు ఝాము గం.  2:45 ని.లు ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆ వెంటనే కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్, డ్రైవర్ అశోక్ సింగ్ లు ఇద్దరూ బాంద్రా పోలీసు స్టేషన్ కి వెళ్ళి ప్రమాదం గురించిన సమాచారం ఇచ్చారు. అశోక్ సింగ్ తానే డ్రైవ్ చేస్తున్నానని పోలీసులకు చెప్పాడు. కానీ ఆయన తన యజమానిని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చన్న కారణంతో ఆయన సాక్ష్యాన్ని మేజిస్ట్రేట్ కోర్టు, సెషన్స్ కోర్టు పరిగణించలేదు.

పాటిల్ మొదట పోలీసులకు ఏం చెప్పాడో తెలియదు. కానీ ప్రమాదం జరిగిన మొదటి 3 గంటల వరకు అనగా తెల్లవారు 5:45 ని.ల వరకు సల్మానే డ్రైవింగ్ చేస్తున్నాడని మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత పాటిల్ చెప్పాడని చెబుతూ బాంద్రా పోలీసులు ప్రమాద సమయంలో సల్మాన్ ఖాన్ డ్రైవింగ్ చేస్తున్నట్లూ, ప్రమాదం జరిగాక కారు వదిలి పారిపోయినట్లూ తెలిపే సమాచారాన్ని బహిరంగం చేశారు. సల్మాన్ ని అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.

ఆ తర్వాత పాటిల్ రెండు సార్లు తన స్టేట్ మెంట్ ను, కోర్టు విచారణ నిమిత్తం, న్యాయ వ్యవస్ధకు (పోలీసులతో సహా) అందించాడు. మొదటిసారి ప్రమాదం జరిగిన వెంటనే స్టేట్ మెంట్ ఇస్తూ కారు వేగంగా వెళ్తుందని చెప్పాడు తప్ప సల్మాన్ ఖాన్ గురించి చెప్పలేదు. ఆ తర్వాత మరోసారి అనుబంధ స్టేట్ మెంట్ ఇస్తూ సల్మాన్ తాగి డ్రైవ్ చేస్తున్నాడని, తాను పదే పదే హెచ్చరించినా వినలేదని కొత్త సమాచారాన్ని జత చేశాడు. ఆయన 2007లో చనిపోయాడు. దానితో ఆయన రెండు సాక్ష్యాలు ఎందుకు ఇచ్చిందీ విచారించే అవకాశం డిఫెన్స్ కి లభించలేదు.

నిజానికి సల్మాన్ డ్రైవర్ సీట్ లో లేడని, అశోక్ సింగే డ్రైవర్ సీట్ లో ఉన్నాడని డిఫెన్స్ లాయర్లు ప్రధానంగా వాదించారు. కావాలంటే కమాల్ ఖాన్ సాక్ష్యం తీసుకోండి అని కోరారు. అయితే వైద్య పరీక్షల్లో సల్మాన్ తాగి ఉన్నట్లు తేలింది. కానీ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు వైద్య పరీక్షలు చెప్పవు కదా! సెషన్స్ కోర్టు, చీఫ్ మెట్రో పాలిటన్ కోర్టు బాడీ గార్డ్ రవీంద్ర పాటిల్ సాక్ష్యాన్ని ప్రధానంగా తీసుకున్నాయి. మే 6, 2015 తేదీన సల్మాన్ దోషిగా తేల్చి 5 సం.లు జైలు శిక్ష వేసింది సెషన్స్ కోర్టు.

కానీ అదే సెషన్స్ కోర్టు, సల్మాన్ ను వెంటనే జైలుకు పంపే అవసరం లేకుండా 2 రోజులు బెయిల్ మంజూరు చేసింది. ఈ రెండు రోజుల్లోనే సల్మాన్ ఖాన్ హై కోర్టుకు వెళ్ళడం, హై కోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిపోయింది. ఆ విధంగా కింది కోర్టు విధించిన శిక్షను రెండు రోజుల్లో హై కోర్టు వెనక్కి తిప్పేసింది. మరిన్ని రోజులు సెషన్స్ విచారణను పరిశీలించిన హై కోర్టు గత రెండు రోజుల నుండి తన అంతిమ తీర్పు ఇవ్వడం ప్రారంభించింది. ఈ రోజు తీర్పును ముగిస్తూ సల్మాన్ పై సాక్షాలు లేవని నిర్ధారించింది. ఆయనకు విధించిన శిక్షను రద్దు చేసింది.

సల్మాన్ బాడీ గార్డ్ రవీంద్ర పాటిల్ ‘పూర్తిగా నమ్మదగిన సాక్షి కాడు’ అని హై కోర్టు నిన్న చెప్పడం తోటే తీర్పు ఏ విధంగా రానున్నదో స్పష్టం అయింది. ప్రాసిక్యూషన్ వాదన అంతా పాటిల్ సాక్ష్యం పైనే ఆధారపడి కొనసాగింది. డిఫెన్స్ వాదన అంతా పాటిల్ సాక్ష్యంలో లొసుగులు ఎత్తి చూపడం పైనే కేంద్రీకరించింది. చివరికి డిఫెన్స్ వైపే హై కోర్టు మొగ్గు చూపింది.

ఇక్కడ సెషన్స్ కోర్టు తీర్పు సరైనదా లేక హై కోర్టు సరైనదా అని చర్చించబోవడం లేదు. తన తీర్పు సందర్భంగా హై కోర్టు చేసిన వ్యాఖ్యలే ఇక్కడ చర్చనీయాంశం. ఆ వ్యాఖ్యలు న్యాయవ్యవస్ధ నడవడిని వివరించేవి. న్యాయ వ్యవస్ధకు ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు అన్న అంశాన్ని చర్చకు తెచ్చేవి. హై కోర్టు వ్యాఖ్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి:

“సల్మాన్ ఖాన్ తాగి ఉన్నాడని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. కనీసం నలుగురు గాయపడ్డానికి, ఒకరు చనిపోవడానికి దారి తీసిన ప్రమాద సమయంలో ఆయనే డ్రైవింగ్ చేస్తున్నాడని అయినా రుజువు చేయలేకపోయింది. అప్పీలుదారు (సల్మాన్ ఖాన్) కు వ్యతిరేకంగా కేసు ఉన్నట్లు -ఆయన డ్రైవింగ్ చేస్తున్నట్లూ అది కూడా తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లూ- నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయింది.

“ఆయనకు వ్యతిరేకంగా కేసు ఉన్నట్లు రుజువు చేసే భౌతిక (మెటీరీయల్) సాక్ష్యం దేనినీ ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. ఈ కేసులో ఖచ్చితమైన తీర్పు ఇచ్చి తీరాలన్న ప్రజల దృష్టికోణాన్ని (perception) కోర్టు విస్మరించడం లేదు. కానీ చట్టబద్ధ ప్రక్రియల ప్రకారం సాక్ష్యంగా ప్రవేశపెట్టదగిన మెటీరీయల్ ఆధారంగా మాత్రమే కేసులో నిర్ణయాలు చేయాలన్నది (ఇప్పటికే) స్ధిరపడిపోయిన సూత్రం. సాధారణ ప్రజల అభిప్రాయానికి సాక్ష్యాల చట్టం (Law of Evidence) లో స్ధానం లేదు.

……….…ఇంకా ఉంది.

[పాఠకులు క్షమించాలి. వేరే అత్యవసర పని తగలడం వల్ల ఉన్న పళాన బైటికి వెళ్లవలసి వస్తోంది. మరో అరగంటలో తిరిగి వచ్చి ఈ ఆర్టికల్ ను ముగిస్తాను. -విశేఖర్)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s