పాత టర్కీ ఒట్టోమాన్ సామ్రాజ్యం తరహాలో మధ్య ప్రాచ్యంలో సరికొత్త టర్కీ సామ్రాజ్యాన్ని స్ధాపించాలని కలలు గంటున్న టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, అంతకంతకూ ఫాసిస్టు రూపం ధరిస్తున్నాడు. సిరియా విచ్ఛిన్నానికి కుట్రలు పన్నిన పశ్చిమ సామ్రాజ్యవాదుల వ్యూహాల్లో తురుపు ముక్కగా మారి అత్యంత విద్రోహకర, ప్రగతి నిరోధక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఎర్డోగన్ టర్కీ ప్రజల ప్రాధమిక హక్కులను ఒక్కొక్కటిగా హరించి వేస్తున్నాడు.
వేలాది ప్రతిపక్ష నేతలతో పాటు వారి మద్దతుదారులను కూడా జైళ్ళలో నిర్బంధిస్తున్న టర్కీ ప్రధాని అక్కడి ప్రజల నిరసనలను కర్కశంగా అణచివేస్తున్నాడు. నిరసన ఏ మాత్రం ధ్వనింపజేసినా మీడియాను సైతం వదలకుండా వివిధ నల్ల చట్టాలతో అణచివేస్తున్నాడు. అందులో భాగంగా టర్కీ ప్రజల నిరసనలకు కార్టూన్ రూపం ఇస్తూ ఎర్డోగాన్ విధానాలను ఎండగడుతున్న బ్రెజిలియన్ కార్టూనిస్టు కార్లోస్ లాతుఫ్ పై తాజాగా నిషేధాజ్ఞలను జారీ చేశాడు.
2013లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ప్రజలు వినియోగించే చరిత్రాత్మక తకసిమ్ ప్రాంతంలోని గెజి పార్క్ ను ధ్వంసం చేసి దాని స్ధానంలో ఒట్టోమాన్ సామ్రాజ్యాన్ని తలపించే మిలట్రీ బ్యారక్ లను నిర్మించాలని ఎర్డోగన్ తలపెట్టాడు. అనుకున్నదే తడవుగా బుల్ డోజర్లు, ఇతర సామాగ్రితో పోలీసులను దింపాడు. దీనికి వ్యతిరేకంగా టర్కీ ప్రజలు భారీ ఎత్తున తిరగబడ్డారు. వివిధ సంస్ధల కింద సమీకృతమైన ప్రజలు పార్క్ లో వారాల తరబడి నివసించి పార్క్ ను ధ్వంసం చేయడానికి వీలు లేదని పట్టు బట్టారు. పార్కు ధ్వంసానికి వ్యతిరేకంగా మొదలైన నిరసన చివరికి ఎర్దోగాన్ ఫాసిస్టు పాలన వ్యతిరేక ఉద్యమంగా రూపుదాల్చి దేశం అంతా విస్తరించింది.
ఈ ఉద్యమం సందర్భంగా కార్లోస్ లాతుఫ్ టర్కీ ప్రధాని ఫాసిస్టు పాలనపై విస్తృత సంఖ్యలో కార్టూన్లు వెలువరించాడు. టర్కీ ప్రజలకు మద్దతుగా ఎర్దోగాన్ నియంతృత్వ పద్ధతులకు వ్యతిరేకంగా గీసిన లాతుఫ్ కార్టూన్ లు ప్రపంచం నిండా విస్తరించాయి. ఎర్దోగాన్ పాలన గురించి టర్కీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి లాతుఫ్ కార్టూన్లు బాగా తోడ్పడ్డాయి. అప్పటి నుండే లాతుఫ్ కార్టూన్ లపై ఎర్దోగాన్ ప్రభుత్వం కత్తి కట్టింది.
మే 2014లో టర్కీ లోని సోమా బొగ్గు గని కూలిపోయి 301 మంది చనిపోయారు. గనిలో హఠాత్తుగా మంటలు రగిలి వ్యాపించడంతో గని పేలిపోయి మొత్తంగా కూలిపోయింది. షిఫ్ట్ మార్పిడి సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో కార్మికులు భారీగా చనిపోయారు. ప్రమాదానికి కొద్ది వారాల ముందే సోమా గనిలో భద్రతా పరిస్ధితులను మెరుగుపరచాలని, గని భద్రతపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గని కార్మికులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ కోసం ఆందోళనలు నిర్వహించారు. వారి డిమాండ్ ను ప్రతిపక్ష పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టగా ఎర్దోగాన్ ప్రభుత్వం అందుకు నిరాకరించి బిల్లును ఓడించింది. అనంతరం రెండు వారాల లోపే కార్మికులు భయపడినట్లుగానే గని కూలిపోయింది.
సోమా గని దుర్ఘటన దరిమిలా మృతుల బంధువులు నష్టపరిహారం కోసం కూడా ఉద్యమించాల్సి వచ్చింది. తగిన నష్టపరిహారం చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు చేపట్టిన ఒక ఆందోళనపైకి ఎర్దోగన్ పోలీసులను ఉసిగొల్పాడు. ఆ సందర్భంగా ఎర్దోగాన్ సహాయకుడు యూసఫ్ యెర్కెల్ పోలీసులతో కలిసి బూటు కాళ్లతో బాధితులను తన్నుతూ పత్రికల కెమెరాలకు చిక్కాడు. ఈ సంఘటనను ఉద్దేశిస్తూ లాతుఫ్ గీసిన కార్టూన్ ప్రపంచం యావత్తూ ఆదరణ పొందింది. ఇప్పుడు అదే కార్టూన్ ను కారణంగా చూపిస్తూ ఎర్దోగాన్ లాతుఫ్ కార్టూన్ లు టర్కీలో ప్రదర్శించకుండా నిషేధం విధించాడు.
ఎర్దోగాన్ సహాయకుడు పోలీసులతో కలిసి బాధితులను కాలితో తన్నుతున్న ఫోటోను స్ఫురింప జేస్తూ బొగ్గు గని కార్మికులు ఎర్దోగాన్ ను తన్నుతున్నట్లుగా లాతుఫ్ తన కార్టూన్ లో చిత్రీకరించాడు. సదరు ఫోటో, కార్టూన్ లను కింద చూడవచ్చు. ఆ పక్క ఫోటో కార్లోస్ లాతుఫ్ దే.
లాతూఫ్ కార్టూన్ల పై విధించిన నిషేధం మేరకు టర్కీ పత్రికలు ఏవీ ఆయన కార్టూన్ లను ప్రచురించకూడదు. టర్కీ ఆన్ లైన్ పత్రికలు బ్లాగర్లు ఆయన కార్టూన్ లను పోస్ట్ చేయకూడదు. లాతుఫ్ కార్టూన్ లను ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ వెబ్ సైట్లలో షేర్ చేయడం, లైక్ చేయడం చేయకూడదు.
కానీ నిషేధంలో ఉన్నప్పుడే ఒక పుస్తకంపైన ఆసక్తి కలుగుతుంది. నిషేధిస్తేనే ఒక సినిమాను ఎగబడి చూస్తారు. నిషేధంలో ఉన్న సరుకే మార్కెట్ లో అధిక రేటుకు అమ్ముడు అవుతుంది. లాతుఫ్ కార్టూన్ పై విధించిన నిషేధం ఎంతవరకు పని చేస్తుందో వేచి చూడవలసిందే.
అరచేతితో సూర్యోదయాన్ని ఆపగలం అనుకుంటారు నియంతలు. ఉషోదయం కాక మానదు. వెలుగు రేకలు విచ్చుకోక తప్పదు.