తమిళనాట వ్యక్తి పూజ జాస్తి. అభిమాన నటుడికి గుడి కట్టి పూజించేవరకూ ‘వ్యక్తి పూజ’ వెళ్తుందని తమిళులు ఇప్పటికే అనేక తడవలు చాటుకున్నారు. ‘అమ్మ పూజ’ ఇప్పుడు అన్ని పాత రికార్డులను దాటుకుని విపరీత స్దాయికి చేరుకుందని ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి.
‘అమ్మ పూజ’ ఎంత వికృత స్ధాయికి చేరిందో చెన్నై వరదలు వెల్లడి చేశాయి. ‘అమ్మ’కి జైలు శిక్ష పడినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ సహా మంత్రివర్గం మొత్తం టి.వి కెమెరాల ముందు కుమిలి కుమిలి ఏడ్చి ‘అమ్మ భక్తి’ ని చాటుకున్నది. వారి విపరీత పోకడ చూసి ‘ఔరా’ అని దేశం అంతా ముక్కు మీద వేలు వేసుకున్నది.
శతాబ్దం తర్వాత కురిసిన విపరీత వర్షానికి వరద పోటెత్తి చెన్నైతో సహా అనేక తమిళనాడు జిల్లాలను ముంచివేసింది. నిజానికి ‘వరద పొటెత్తడం’ అన్నది చిన్న మాట! ఆకాశ హర్మ్యాలలో తప్ప నేలమీద వ్యాపారం చేయని బడా బడా బహుళజాతి కంపెనీలు సైతం తమ కార్యకలాపాలను మూసేసుకుని ఉద్యోగులకు సెలవు ప్రకటించి వరద నీరు ఎప్పుడు వెనక్కి వెళ్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్ధితి!
రోడ్లు కాలవలుగా మారిపోయి పడవల్లో ప్రయాణించవలసిన దుర్గతి! సముద్రమూ, చెన్నై నగరము రెండూ ఒకటిగా కలిసిపోయాయా అన్నంతగా భవనాలు మునిగిపోయిన స్ధితి! చెన్నై నగరం ద్వీపకల్పంగా మారిపోయిందని హోమ్ మంత్రి పార్లమెంటులో ప్రకటించవలసి వచ్చింది.
ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తమ నిధులను ఖర్చు చేయడంతో పాటు కేంద్రాన్ని సహాయం కోరుతుంది. ఇంకా దాతలు విరాళాలు ఇవ్వాలని కోరుతుంది. వివిధ ప్రభుత్వ అంగాలను పురమాయించడంతో పాటు జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ కార్యకలాపాల్లో పాల్గొవాలని పిలుపు ఇస్తుంది. ముందుకు వచ్చినవారికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్వహించే రాజకీయ పార్టీ కార్యకర్తలను కోరుతుంది.
కానీ తమిళనాడులో చెన్నైలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. జయలలిత పార్టీ ఏ.ఐ.ఏ.డి.ఎం.కె పార్టీ కార్యకర్తల దృష్టిలో వరద సహాయం అంతా ‘అమ్మ’ ఆజ్ఞానుసారమే జరగాలి. సాయం చేసిన క్రెడిట్ అంతా ‘అమ్మ’కు మాత్రమే దక్కాలి. ఎవరూ సొంతగా సహాయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఒకవేళ పాల్గొన్నా ‘అమ్మ’కు ఆ క్రెడిట్ అప్పగించి మాత్రమే పాల్గొనాలి.
తమకే, తమ పార్టీకే, తమ ‘అమ్మ’కె క్రెడిట్ అంతా దక్కాలన్న విపరీత ధోరణితో ఏ.ఐ.ఏ.డి.ఎం.కె కార్యకర్తలు స్వచ్ఛంద సహాయ కార్యకర్తలకు తీవ్ర అంతరాయంగా మారారు. వాహనాల్లో ఆహారం తెస్తుంటే ఆ వాహనాలకి అమ్మ బొమ్మ అతికిస్తే తప్ప కదలనీయడం లేదు. ఆహార పోట్లాల పైన కూడా అమ్మ బొమ్మ అంటించాలని పట్టు బడుతున్నారు. అందుకు ఎవరైనా నిరాకరిస్తే వారిని వెళ్లగొడుతున్నారు. వారిపై దాడి చేస్తున్నారు.
కొన్ని చోట్ల సహాయం తెచ్చినవారిని నిలబెట్టి తమ స్ధానిక నాయకుడు వచ్చేవరకూ ఆపేస్తున్నారు. తమ నాయకుడు వచ్చి ఇతరులు తెచ్చిన సాయాన్ని ఆయన చేతుల మీదుగా పంచిపెట్టించి అది కూడా తమ సాయమే అని ముద్ర వేయించుకోడానికి చీదర పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
చివరికి ఇదంతా ఎంతవరకు వెళ్ళిందంటే ఏ.ఐ.ఏ.డి.ఎం.కె కార్యకర్తల ధాటికి వివిధ స్వచ్ఛంద సంస్ధలు అసలు సాయం మాటే మానుకున్నాయి. ఎంతో కష్టపడి ఊరూరా తిరిగి ఆహారం, దుస్తులు, డబ్బు, షెల్టర్ పరికరాలు సేకరించి బాధితులకు ఇద్దామని వస్తే దానిని లాక్కుని తమ దాతృత్వ ఖాతాలో జమ చేసుకోవడం వారికి ఎంత మాత్రం నచ్చడం లేదు. అలాగని స్ధానిక ఏ.ఐ.ఏ.డి.ఎం.కె నేతలను ఎదుర్కొని సహాయం చేయగల స్ధితిలో వారు లేరు. ఫలితంగా అసలు సహాయం మాటే వదిలిపెట్టేస్తున్నారు.
వరదల వల్ల రాష్ట్రం సతమతం అవుతుంటే ముఖ్యమంత్రి పోయెస్ గార్డెన్ వదిలి బైటికి రాకపోగా, వస్తున్నవారిని ఇలా వేధింపులకు గురి చేయడం ఏమిటని పలు సంస్ధలు విమర్శించాయి. స్వచ్ఛంద కార్యకర్తలు ఫేస్ బుక్, ట్విట్టర్ లను ఆశ్రయించి ఏ.ఐ.ఏ.డి.ఎం.కె కార్యకర్తల ధోరణిని ఎండగడుతున్నారు. దానితో అలాంటి వ్యవహారాలు తమ దృష్టికి తేవాలని పార్టీ నేతలు ప్రకటించారు. కొన్ని ఫిర్యాదులు అందాయి కూడా. కానీ చర్యలు ఏమీ లేవు. కార్యకర్తల ధోరణి మాత్రం అలాగే కొనసాగుతోంది.
ఈ విపరీత ధూర్త ధోరణిని కార్టూనిస్టు ఇలా తప్పు పట్టారు. వరదల్లో మునుగుతున్నవారికి ఆపన్న హస్తం కావాలే గానీ పార్టీ జెండానో, అమ్మ బొమ్మో ఇవ్వడం వల్ల ఏమిటి ప్రయోజనం అని ప్రశ్నించారు. అమ్మ బొమ్మ తీసుకున్నవారు మునిగిప్కుండా ఆగడం లేదు. అమ్మ బొమ్మ బాధితులను రక్షిస్తున్నదేమీ లేదు. ఇల్లు కాలి జనం ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని ఏ.ఐ.ఏ.డి.ఎం.కె కార్యకర్తలు సంతోషపడడం పార్లమెంటరీ రాజకీయాల వికృత రూపాల్లో ఒకటి!