రెండు దేశాలలోని (ఇరాక్, సిరియా) ప్రాంతాలను ఆక్రమించుకుని ఏలుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఇసిస్ లేదా ఇసిల్ లేదా దాయిష్) కు ఆర్ధిక వనరులు ఎక్కడివి? ఇతర దేశాలతో ఎలాంటి వ్యాపారం లేకుండా ఆయుధాలకు, కిరాయి సైనికుల వేతనాలకు డబ్బు ఎలా సమకూర్చుతోంది?
ఒక ప్రాంతాన్ని ఏలుతున్న పాలక వ్యవస్ధ నిలబడాలంటే ఆర్ధిక వనరులు తప్పనిసరి. తమ తరపున పని చేసేవారికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. మరి ప్రపంచం అంతా టెర్రరిస్టు సంస్ధగా ముద్ర వేసిన ఇస్లామిక్ స్టేట్ కు ఆర్ధిక వనరులు ఎలా సమకూరుతున్నాయి?
ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టమే (obvious). ఏదో ఒక దేశం గానీ లేదా దేశాలు గానీ రహస్యంగా ఇస్లామిక్ స్టేట్ కు సహకారం అందిస్తూ ఉండాలి. ఇస్లామిక్ స్టేట్ ఆక్రమిత ప్రాంతాలు చమురు వనరులు కలిగినవి కనుక ఇసిస్ వెలికి తీస్తున్న చమురును ఏదో ఒక దేశం కొంటూ ఉండాలి. ఇసిస్ చమురును అక్రమంగా కొనుగోలు చేస్తూ దానిని నిధులు సమకూర్చుతూ ఉండి ఉండాలి.
ఆ దేశం/దేశాలు ఏమిటో రష్యా సాక్షాలతో సహా రుజువు చేసింది. తగిన ఫోటోలు, వీడియోలు అంతర్జాతీయ సమాజం ముందు ఉంచింది. సిరియా, ఇరాక్ ల పొరుగునే ఉన్న టర్కీ ఇసిస్ నుండి చమురు కొనుగోలు చేస్తున్నదని వివరించింది. ఈ ఫోటోలు నిజమైనవే అని అమెరికా ప్రభుత్వ పరిశోధకులు ధృవీకరించారు కూడా. అయినప్పటికీ ఇసిస్ వ్యతిరేక పోరాటంలో టర్కీ ‘గొప్ప పార్టనర్’ అని అమెరికా కొనియాడింది. ఇసిస్ చమురుని టర్కీ కొనుగోలు చేస్తున్నదన్న వాస్తవాన్ని నిరాకరించింది.
ఇసిస్ ఆక్రమిత ప్రాంతాల నుండి ట్రక్కుల కొద్దీ చమురు టర్కీకి రవాణా అవుతున్న ఫోటోలు, వీడియోలను రష్యా మిలట్రీ విడుదల చేసింది. చమురు రవాణా అవుతున్న మ్యాప్ లను విడుదల చేసింది. అయితే ఈ రూట్ లపై వైమానిక దాడులు నిర్వహించడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాలు ఆసక్తి చూపడం అటుంచి నిరాకరిస్తున్నాయి.
రష్యా విడుదల చేసిన ఫోటోలను కింద చూడవచ్చు.
ప్రధానంగా మూడు మార్గాల్లో ఇసిస్ నుండి టర్కీకి చమురు స్మగ్లింగ్ జరుగుతోందని రష్యా గుర్తించింది. ఈ రూట్లన్నీ నేరుగా టర్కీకి దారి తీస్తున్నట్లు గుర్తించింది. చమురు ఎక్కడెక్కడ వెలికి తీస్తున్నది, వెలికి తీస్తున్న చమురు ఎక్కడ శుభ్రం (రిఫైన్) చేస్తున్నది, శుభ్రం చేసిన చమురును ఏయే మార్గాల్లో టర్కీకి రవాణా అవుతున్నది రష్యా వెల్లడి చేసింది.
రష్యా వెల్లడి చేసిన నిజం, నిజానికి ఎప్పటి నుండో ప్రపంచానికి తెలిసిన విషయమే. పక్కా రుజువులు వెల్లడి కావడం ఇదే మొదటిసారి. డిసెంబర్ మొదటి వారంలో ఇసిస్ చమురు రవాణా మార్గాలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్న రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేయడంతో రుజువులు బైటికి వచ్చాయి.
రష్యా యుద్ధ విమానం తమ గగనతలంలోకి చొరబడినందునే దానిని కూల్చవలసి వచ్చిందని టర్కీ ప్రకటించింది. కానీ టర్కీ ప్రకటన ప్రకారం చూసినా కేవలం 17 సేకన్లు మాత్రమే టర్కీ గగనతలంలో రష్యన్ విమానం ఉన్నది. సరిహద్దు ప్రాంతాల్లో ఈ మాత్రం పొరపాట్లు సహనంగా జరిగేవే. అందునా ఇసిస్ పై అమెరికా, ఐరోపాలు కూడా యుద్ధం ప్రకటించి వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి కనుక, వారి దాడులకు టర్కీ సహకరిస్తోంది అని చెబుతున్నారు గనుక రష్యా విమానం కూడా ఇసిస్ పై యుద్ధానికే అక్కడ ఉన్నది కనుక ఆ మాత్రం చొరబాటు సహజంగానే స్వీకరించాలి.
కానీ టర్కీ అందుకు విరుద్ధంగా స్పందించింది. ఎకాఎకిన రష్యా యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. రష్యా విమానం సిరియా భూభాగంలోనే కూలినందున టర్కీ గగనంలోకి చొరబడిందన్న ఆరోపణ నిజం కాదని తేలిపోయింది. పైగా విమానం నుండి ‘ఎజెక్ట్’ అయిన రష్యా సైనికుడు ఒకరిని ఇసిస్ టెర్రరిస్టులు పట్టుకుని చంపేయడం బట్టి విమానం సిరియా గగనతలం పైనే ఉందని స్పష్టం అయింది.
ఈ నేపధ్యంలో టర్కీ-ఇసిస్ సంబంధాలపై రష్యా కేంద్రీకరించి వివరాలు సేకరించింది. ఇసిస్ ఆర్ధిక వనరులు ప్రధానంగా చమురు అమ్మకం ద్వారానే సమకూరుతున్నాయన్నది అమెరికా, ఐరోపా దేశాలు ఇదివరకే అంగీకరించాయి. కానీ ఇసిస్ చమురు ఎవరు కొనుగోలు చేస్తున్నది వివరాలు మాత్రం అవి ఇవ్వవు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా అది తమకు ముందే తెలుసు అని ప్రకటించే అమెరికా రోజుకు కొన్ని మిలియన్ డాలర్ల మేర ఇసిస్ సాగిస్తున్న చమురు వ్యాపారం ఎవరితో అన్నది మాత్రం తమకు తెలియనట్లు నటిస్తాయి. ఇసిస్ ఆర్ధిక మూలాలను పెళ్లగిస్తాం అంటూనే దాని చమురు వ్యాపారాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తాయి.
“మొత్తం మీద రోజుకి 200,000 బ్యారెళ్ళ చమురును 8,500 ట్రక్కులలో ఇసిస్ తరలిస్తోంది. ఈ ట్రక్కులు నేరుగా టర్కీ సరిహద్దులు దాటి వెళ్తున్నాయి. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఈ ట్రక్కులను కనీసం తనిఖీ చెయ్యడం లేదు” అని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ సెర్జీ రుడ్ స్కాయ్ ప్రకటించాడు.
“ప్రధానంగా మూడు చమురు రవాణా మార్గాలను మేము గుర్తించాం. పశ్చిమ మార్గం మధ్యధరా సముద్ర పోర్టులకు దారి తీస్తుంది. ఉత్తర మార్గం టర్కీలోని బాత్మెన్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీకి వెళ్తుంది. తూర్పు మార్గం టర్కీలోని భారీ చమురు స్ధావరం అయిన సిజ్రేకు దారి తీస్తుంది” అని రుడ్ స్కాయ్ మూడు రోజుల క్రితం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపాడు.
రోజుకు 200,000 బ్యారెళ్ళ చమురు ఎగుమతి అంటే అది గాబన్ దేశ రోజువారీ ఎగుమతికి సమానం. లేదా ఆస్ట్రేలియా 2013 సంవత్సరంలో చేసిన రోజువారీ ఎగుమతికి సమానం. ఒపెక్ (ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) విడుదల చేసే గణాంకాలను చూస్తే ఈ వివరాలు తెలుస్తాయి. 2005 తర్వాత సిరియా దేశం ఎగుమతి చేసిన చమురు రోజుకు 247,000 నుండి 250,000 బ్యారెళ్ళ వరకు ఉండేది. ఇప్పుడు ఇసిస్ చేస్తున్న అక్రమ వ్యాపారం పరిణామం ఎంత భారీ స్ధాయిలో ఉన్నదో దీని ద్వారా అర్ధం చేసుకోవచ్చు.
ఇసిస్ ఉనికి నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆర్ధిక వనరులు ఎక్కడి నుండి వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం ఇదే. ఈ సమాధానంలో టర్కీ పాత్ర ఉన్నది. టర్కీ పాత్రను వెనకేసుకొస్తున్న అమెరికా పాత్ర ఉన్నది. సాక్ష్యాలు నిజమైనవి అంటూనే అందులో టర్కీ పాత్ర లేదని బుకాయిస్తున్న అమెరికా నాలిక మడతకు కారణం: ఇసిస్ చమురు వ్యాపారానికి అమెరికా మద్దతు ఉండడమే. నాటో సభ్య దేశమైన టర్కీ అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయదని గ్రహిస్తే టర్కీ-ఇసిస్ ల బంధం అమెరికా అనుమతితోనే కొనసాగుతున్నదని గ్రహించవచ్చు.
తమ వైమానిక దాడుల్లో ఇసిస్ కి చెందిన 32 చమురు కాంప్లెక్స్ లు, 11 చమురు రిఫైనరీలు, 23 చమురు పంపింగ్ స్టేషన్లు నాశనం చేశామని రష్యా ప్రకటించింది. చమురు ఎగుమతి ద్వారా రోజుకు 3 మిలియన్ డాలర్ల సంపాదనను రోజుకు 1.5 మిలియన్ డాలర్లకు తగ్గించామని రష్యా తెలిపింది. అదే క్రమంలో టర్కీ నుండి 2,000 మంది ఫైటర్లు, 120 టన్నుల మందుగుండు సామాగ్రి, 250 యుద్ధ వాహనాలు ఇటీవలి కాలంలో ఇసిస్ కు చేరాయని రష్యా ప్రకటించింది.
ఇసిస్ పై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇత్యాది నాటో దేశాలు ప్రకటించిన యుద్ధం ఎంత బూటకమో తెలియడం లేదా? ఇసిస్ పై చేస్తున్నామని అమెరికా, ఐరోపా దేశాలు చెబుతున్న బాంబు దాడులు ఒట్టి బూటకం అని తెలియడం లేదా?
******
ఇసిస్ చమురు స్ధావరాలపై రష్యా చేసిన వైమానిక దాడులను కింద వీడియోల్లో చూడవచ్చు.
–
ఈ సాక్షాలు నిజమైనవే అని అమెరికా కూడా ధృవీకరించింది. ఇలాంటి సాక్షాలను అమెరికా ఎన్నడూ చూపలేదు. ఇసిస్ కు నష్టం కలిగించే దాడులు అమెరికా చేయలేదు కనుక సాక్ష్యాలు చూపడం సాధ్యం కాదు. సాక్షాలు లేనప్పుడు మిగిలేదు ఊకదంపుడు కబుర్లు మాత్రమే.