ఆవును చంపి తిన్నారని ఆరోపిస్తూ మతోన్మాద మూకలు దాద్రి (ఉత్తర ప్రదేశ్) లో ముస్లిం కుటుంబంపై దాడి చేసి యజమానిని చంపిన ఘటనపై పార్లమెంటులో, దేశం అంతటా చర్చ జరుగుతుండగానే బి.జె.పి పాలిత హర్యానా రాష్ట్రంలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. బాధితులకు ప్రాణాలు దక్కడం ఒక్కటే తేడా.
హర్యానా రాష్ట్రం, పాల్వాల్ లో గురువారం జరిగిన ఘటనలో ఆవు మాంసం తరలిస్తున్నారన్న ఆరోపణతో ఒక వ్యాన్ డ్రైవర్, సహాయకుడిపై దాడి చేసి విపరీతంగా కొట్టారు. వారిని రక్షించబోయిన పోలీసులపైనా దాడి చేశారు. రాళ్ళు విసిరి పలువురు పోలీసులను గాయపరిచారు. దాదాపు 5 గంటల పాటు హిందూ మతం పేరు చెప్పుకున్న మూకలు యధేచ్చగా స్వైర విహారం చేశాయి.
జిల్లా యానిమల్ హస్బెండ్రీ శాఖ వ్యాన్ లో తరలిస్తున్న మాంసాన్ని స్వాధీనం చేసుకుంది. అది ఆవు మాంసం కాదని ఒంటె మాంసం అని శాఖ అధికారులు చెప్పడం కొసమెరుపు. తమ ప్రాధమిక పరిశీలనలో వ్యాన్ లో ఉన్నది ఒంటె మాంసం అయి ఉండొచ్చని తేలినట్లు శాఖ అధికారులు చెప్పారు. మాంసంతో పాటు ఒంటె చర్మం వ్యాన్ లో ఉన్నట్లు అధికారులు చెప్పారు.
పోలీసుల సమాచారం ప్రకారం హిందూత్వ సంస్ధలే దాడికి కారణం. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మేవాత్ నుండి ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ కు ఒక ట్రక్కులో మాంసాన్ని తీసుకెళ్తుండగా పాల్వాల్ వద్ద దాడి జరిగిందని జిల్లా మేజిస్ట్రేటు అశోక్ కుమార్ చెప్పారని పత్రికలు తెలిపాయి.
పాల్వాల్ వద్ద ఓ పెద్ద గుంపు ట్రక్కును అటకాయించి లోపల ఉన్న వారిని బైటికి ఈడ్వడం ప్రారంభించారు. వారి చేతుల నుండి ట్రక్కు డ్రైవర్ ఎలాగో తప్పించుకోగలిగాడు. అతనికి సహాయంగా వచ్చిన వ్యక్తిని మూకలు దొరకబుచ్చుకున్నాయి. ఇష్టం వచ్చినట్లు అతన్ని కొట్టడం ప్రారంభించారు.
ట్రక్కులో ఆవు మాంసాన్ని తీసుకెళ్తున్నారని దానివల్ల తమ మతపరమైన భావోద్వేగాలు గాయపడ్డాయని మూకలు ఆరోపించాయి. మూకలో కొందరు, మాంసం రవాణాదారులతో పోలీసులు కుమ్మక్కయ్యారని సైతం ఆరోపించారు. ఇకనేం! పోలీసులపై దాడికి కూడా కారణం దొరికింది.
ఆవు మాంసాన్ని రవాణా చేయడానికి పోలీసులు లంచం పుచ్చుకుని ఆవు హంతకులతో కుమ్మక్కయ్యారని ఆవు భక్తులు ఆరోపించారు. పోలీసులు వచ్చేసరికి ట్రక్కు ధ్వంసంలో భక్తులు మునిగిపోయారు. పోలీసులూ కుమ్మక్కయ్యారని నిర్ణయించుకున్న ఆవు భక్తులు వారి పైనా విరుచుకు పడ్డారు. చేతికి దొరికిన రాయినల్లా పోలీసులపై విసిరారు. చేతికందిన వస్తువులతో పోలీసులతో తలపడ్డారు. తీవ్ర హింసాత్మకంగా మారిన మూకలను అదుపు చేయడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు.
దానితో పోలీసులు అదనపు బలగాలను రప్పించుకున్నారు. అదనపు బలగాలు వచ్చి చేరేలోపు మూక మరింత హింసాత్మకంగా మారిపోయింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొన్ని రౌండ్లు గాలిలో కాల్పులూ జరిపారు. సాయంత్రానికి గాని పరిస్ధితి అదుపులోకి రాలేదు.
ట్రిబ్యూన్ పత్రిక ప్రకారం విధ్వంసానికి గురయిన ట్రక్కు మేవాట్ జిల్లాలో మహమ్మద్ పూర్ గ్రామానికి చెందిన ఒక మాసం వ్యాపారిది. మాంసాన్ని రవాణా చేసేందుకు ఆయనకు లైసెన్స్ ఉంది. దాడి జరిగిన సమయంలో ఒంటె, దున్నల మాంసాన్ని మీరట్ లోని ఒక మీట్ ప్రాసెసింగ్ యూనిట్ కు ట్రక్కు తీసుకెళ్తోంది.
విచిత్రంగా పోలీసులు ట్రక్ డ్రైవర్ ని అరెస్టు చేశారు. మాంసాన్ని స్వాధీనం చేసుకుని భూమిలో పాతిపెట్టారు. మాంసం శాంపిల్స్ ని పరీక్షలకు పంపారు. డజను మంది పోలీసులు గాయపడడానికి కారణం అయిన ‘గావ్ రక్షా దళ్’ (ఆవు రక్షణ దళం) సభ్యులను మాత్రం ఎవరినీ అదుపులో తీసుకోలేదు.
అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోయినా దేశం యొక్క ఉమ్మడి ఆత్మ చేతనను సంతృప్తి పరచడానికి ఆయనకి సుప్రీం కోర్టు ఉరిశిక్షను ఖాయం చేసినట్లుగానే పాల్వాల్ లో భావోద్వేగాలు గాయపడ్డాయన్న ఆందోళనతో రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడిన మూక ఉమ్మడి ఆత్మను సంతృప్తిపరిచేందుకు పోలీసులు బాధితుడినే అరెస్టు చేసేశారు. ఆ విధంగా గో రక్షణ జరిగిపోయింది.
మరి మానవ రక్షణ? పౌరుల రక్షణ? డ్రైవర్, ఆయన సహాయకుడి భావోద్వేగాలు? వారి పౌర హక్కులు?
గతంలో జరిగిన ఘటనలు:
దాద్రి: సెప్టెంబర్ 28 తేదీన ఆవు మాంసాన్ని తిన్నారని ఆరోపిస్తూ 55 సం.ల మహమ్మద్ అఖ్లక్ హిందూత్వ మూకలు కొట్టి చంపేశారు. అతని కొడుకు, తల్లి, భార్యలను కూడా విపరీతంగా కొట్టారు. 22 యేళ్ళ కొడుకు దనీష్ ఇంకా ఆసుపత్రి మంచం పైనే కోమాలో ఉన్నాడు. ఆయన పరిస్ధితి కష్టంగానే ఉన్నట్లు సమాచారం.

Body of Zahid Rasool Bhat
ఉధంపూర్: జమ్ము ప్రాంతంలోని ఉధంపూర్ జిల్లాలో అక్టోబర్ 9 తేదీన హిందూత్వ మూకలు ఒక ట్రక్కుపై దాడి చేశాయి. ట్రక్కులో ఉన్న 10వ తరగతి విద్యార్ధి జాహిద్ రసూల్ భట్ కు నిప్పు అంటించి తగలబెట్టారు. ఆ తర్వాత ఆయన కాలిన గాయాలతో చనిపోయాడు. ట్రక్కులో ఆవు మాంసం తరలిస్తున్నారని అనుమానించడమే దాడికి కారణం. ట్రక్కు డ్రైవర్ దాడి నుండి తప్పించుకోగా కండక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు.
సిమ్లా: అక్టోబర్ 14 తేదీన పశువులను రవాణా చేస్తున్నాడని ఆరోపిస్తూ హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో నోమన్ అనే ట్రక్కు డ్రైవర్ ను మూకలు కొట్టి చంపేశారు. పోలీసులు ట్రక్కును కనిపెట్టి డ్రైవర్ ను చూసేసరికి ఆయన తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కనిపించాడు.
ఇవి సాధారణ పేదలపై జరిగిన దాడులు.
ఎం ఎం ఖల్బుర్గి అనామకుడు కాదు. ఓ యూనివర్సిటీ మాజీ ఈవైస్ ఛాన్సలర్. వందకు పైగా పుస్తకాలు, వ్యాసాల రచయిత. పోలీసుల రక్షణ ఆయనకు ఇచ్చారు. విద్యార్ధులను కలవడానికి ఇబ్బందిగా ఉందని పోలీసుల రక్షణ వద్దని చెప్పారు. వారం లోపే తన ఇంటివద్ద ఉగ్రమూకల చేతుల్లో హత్యకు గురయ్యారు.
గోవింద్ పన్సారే, ప్రగతిశీల ఉద్యమాల నాయకుడు. శివాజీ ఎన్నడూ ముస్లింలను ద్వేషించలేదని, ఇతరులు కూల్చిన మసీదులు కూడా పునర్నిరించాడని, ఉర్దు భాషను సామాదరించాడని… ఇలా అనేక వాస్తవాలు వెల్లడి చేసిన ప్రగతిగామి. ఆయన సైతం ఓ ఉదయం పూట తన ఇంటివద్దనే దుండగుల కాల్పులకు గురై మరణించారు.
నరేంద్ర దభోల్కర్! తన జీవితం అంతా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ప్రజాస్వామ్య రాజ్యాంగం సమకూర్చిన హక్కుతో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేశారు. మహారాష్ట్రలో ఆయన గురించి తెలియనివారు లేరు. అలాంటి వ్యక్తిని మార్నింగ్ వాక్ లో ఉండగా ఉదయాన్నే తన ఇంటివద్దనే కాల్చి చంపేశారు.
సామాన్యులు, కృషీవలురు అన్న తేడా లేకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ జరిగిన, జరుగుతున్న ఈ హత్యలు కేవలం అడపా దడపా జరుగుతున్నవే అనడం దారుణం.
ఇవి అడపా దడపా జరుగుతున్నవి కావు. పాత్రధారులకు తెలియకపోవచ్చు గానీ వారిని నడిపిస్తున్నవారికి స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. ఈ దేశాన్ని భయోత్పాతంలో ముంచివేయడం వారి లక్ష్యం. ఆ భయాందోళనలకు కారణం అవసరం లేదు. లక్ష్యం ఉండాలి గానీ అది స్పష్టంగా ఉండకూడదు. భయాలతో జనం ఒకరినొకరు అనుమానించుకోవాలి. మతం తేడాలను పట్టించుకోనివారు ఇక పట్టించుకోవడం మొదలు పెట్టాలి. ప్రాచీన ఉత్కృష్టత పేరుతో పాత, బూజు పట్టిన, మకిలి వదలని ఫ్యూడల్ మత సంబంధాలు సమాజంలో పునర్వైభవం పొందాలి. ఇలాంటి మతాగ్ని మంటల్లో తాము చలి కాచుకోవాలి. తమ పెత్తనం సుదృఢం కావాలి. హిందూత్వ అంటేనే లౌకికవాదం. కనుక ఇంకో లౌకికవాదానికి తావు ఉండకూడదు.
ఇది పురోగమనమా? కాదు తిరోగమనం! ఇది అభివృద్ధి వైపుకు ప్రయాణమా? కాదు, చీకటిలోకి ప్రయాణం! ఇది 21వ శతాబ్దపు వాస్తవమా? కాదు మధ్య యుగాల మూఢత్వం! ఇది శాశ్వతమా? కాదు, జనం త్వరలోనే గోరీ కడతారు.
ఇది పురోగమనమా? కాదు తిరోగమనం! ఇది అభివృద్ధి వైపుకు ప్రయాణమా? కాదు, చీకటిలోకి ప్రయాణం! ఇది 21వ శతాబ్దపు వాస్తవమా? కాదు మధ్య యుగాల మూఢత్వం! ఇది శాశ్వతమా? కాదు, జనం త్వరలోనే గోరీ కడతారు.
మీ ముగింపు వాక్యాలలో -జనం త్వరలోనే గోరీ కడతారు-ఈ వాక్యానికి వివరణ ఇస్తారా?
జనాలను కులాలు,మతాలు పేర్లుచెప్పి సంఘటితం కావిస్తున్నంత కాలం హేతువాద ఆలోచనలవైపు దృష్టిసారించడం జనులకు వీలుపడుతుందా?
5 సం,,కొకసారి వచ్చి పోయే ఎన్నికలలో ఓటమి,గెలుపులు రుచిచూడడం ద్వారా వీరి దుర్మార్గాలకి పెద్ద అడ్డంకి ఎదురుకాదుకదా!
గోమాంస వ్యాపారులపై దాడులు చెయ్యడం వల్ల ఒరిస్సాలో కొన్ని పశువుల సంతలు మూతపడినాయి. మా రాయగడ జిల్లాలో అమలభేట సంత కూడా ఇలాగే మూతపడింది.