జల విలయం అన్నది చిన్నమాట కావచ్చు. ఏకంగా ఫ్లై ఓవర్ రోడ్లే నిండా మునిగిపోయే వర్షం! ది హిందు ప్రకారం మునిగిపోయిన రోడ్ల సంఖ్య 6,857. 84 గంటల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకి తడవని వాడు వెధవ కిందే లెక్క! వంద యేళ్ళ తర్వాత ఈ స్ధాయిలో కురిసిన వర్షాన్ని కనీసం స్పర్శతోనన్నా అనుభవించనివాడు వెధవ కాక మరెవ్వరూ?
నీటి కొరతతో సంవత్సరం పొడవునా అల్లాడుతూ గడిపే చెన్నై నగరాన్ని రాక రాక వచ్చి పలకరించిన వర్షం తన యేళ్ళ తరబడిన తన ఎడబాటును ఒక్కసారిగా తీర్చుకుంటున్నదా అన్నట్లు కురిసింది వర్షం!
ఇంత విలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదిలింపుతో సమానమైన సహాయక చర్యలతో సరిపెట్టుకుంటున్న దారుణ పరిస్ధితుల్లో ప్రజలే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బతికి బట్ట కడుతున్నారు. తోటి మనిషికే కాకుండా జంతువులకు కూడా అంతో ఇంతో సహాయం చేస్తూ మనిషి బతికే ఉన్నాడని నిరూపిస్తున్నారు. నిజానికి సామాన్యుడిని వాడి మానాన వాడ్ని బతకనిస్తే వాడెప్పుడూ బతికే ఉంటాడు.
కొందరు యువకులు పనిగట్టుకుని మరీ సహాయమే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిస్తే మనసంతా హాయితో నిండిపోతుంది. చేతికి అందిన వాహనం ఎక్కి వీధుల్ని సర్వే చేస్తూ కొందరు యువకులు మునిగిపోయిన వీధులు ఎక్కడ, మునగకుండా నిలబడిన వీధులు ఎక్కడో చూసి, తెలిసినవారికి తెలియని వారికి సమాచారం ఇస్తున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి తెరిచి ఉన్న షాపుల నుండి సరుకులు కొని తెస్తున్నవారు కొందరు.
చెన్నైవాసులతో స్నేహం చెయ్యడం చాలా కష్టం అని ఒక వాడుక ప్రచారంలో ఉందిట. అది ఎంతవరకు నిజమో గానీ ఇప్పటి వరదల్లో వారు ఒకరికి ఒకరు ఆపన్న హస్తమై తోడు నిలుస్తున్న తీరు అభినందనీయం.
సోషల్ మీడియాను సరైన ప్రయోజనాలకు ఉపయోగిస్తే అది ఎంత శక్తివంతం కాగలదో చెన్నై వరదలు నిరూపిస్తున్నాయి. అనేకమంది ఔత్సాహికులు తమ తమ ప్రాంతాల్లో పరిస్ధితిని ఫోటోల ద్వారా, వ్యాఖ్యల ద్వారా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్ట్ చేస్తుండగా వాటిని చూసి సాయం అందించడానికి స్పందిస్తున్న వారు అనేకులు! నిండా మునిగిన ఓ కాలనీకి సరఫరాలు అందివ్వడానికి వాలంటీర్లు కావాలని వాట్సప్ లో పోస్ట్ చేసిన వెంటనే యువకులు వరదలా వచ్చిపడ్డారట!
కార్ల యజమానుల్లో కొందరు తమ కార్లలో జనాన్ని ఉచితంగా అటూ ఇటూ మోస్తూ సహాయపడుతున్నారు. కొందరైతే కోరినవారిని చెన్నై నుండి బెంగుళూరులో దింపి రావడానికి సైతం ముందుకు వస్తున్నారట. మ్యారేజి హాల్స్ యజమానులు కొందరు వరద బాధితులకు ఉచిత పునరావాసం కల్పించడానికి తమ హాళ్లను తెరిచి ఉంచారు. సామూహిక వంటశాలలు కూడా పని చేస్తున్నట్లు వార్తలు చెబుతున్నాయి.
స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఓ జంట నీటి వరవడికి కొట్టుకు పోతుండగా అది చూసిన ఇతర ప్రయాణీకులు కార్ల నుండి, లారీల నుండి, ఇతర వాహనాల నుండి వేగంగా దుమికి వచ్చి మానవహారంగా ఏర్పడి వారిద్దరిని రోడ్డు మీదికి లాక్కువచ్చిన వీడియో ఫేస్ బుక్ లో నడుస్తోంది.
ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మచ్చుకు కొన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. ఈ ఫోటోలు వివిధ వార్తల వెబ్ సైట్ల నుండి సేకరించబడినవి.
మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం!!!
చెన్నై వరదలు మనకు చాలా పాఠాలు నేర్పుతున్నాయి.
నగర నిర్మాణం, మురుగు నీటి పారుదల విషయాల్లో ఇప్పటికైనా మేల్కోకకపోతే
మరిన్ని విలయాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బాధితులకు సహాయ చర్యలకోసం జనం ముందుకు రావడం అభినందనీయం.
ా
పింగ్‌బ్యాక్: 2015లో తెలుగు వార్తలు బ్లాగ్ -సమీక్ష | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ