నవంబర్ 8 తేదీ నుండి కురుస్తున్న వర్షాలు చెన్నై నగరాన్ని ముంచివేసి నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరుస పెట్టి దాడి చేసిన రెండు అల్ప పీడనాలు ఈ వర్షాలకు కారణం. అల్ప పీడనాలు కొత్తేమీ కాదు. అల్ప పీడనాలు ఏర్పడితేనే వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తరహాలో ఊహించని రీతిలో వర్షపాతం ఇచ్చే అల్ప పీడనాలే కొత్త.
ఎల్-నినో పుణ్యమా అని ఈ యేడు నైరుతి ఋతుపవనాలు పెద్దగా వర్షాలను ఇవ్వలేదు. దేశం మొత్తం మీద సగటు కంటే తక్కువ వర్షపాతం మాత్రమే నైరుతి ఋతుపవానల వల్ల సమకూరింది. ఇక ఈ సంవత్సరానికి ఇంతే అని రైతులు భావిస్తున్న తరుణంలో ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభం అయ్యాయి. ఆరంభంలో బలహీనంగా ఉన్న ఈశాన్య ఋతుపవనాలు హఠాత్తుగా బలం పుంజుకున్నాయి.
‘ఆహా వర్షాలు!’ అని జనం సంతోషిస్తుండగానే ఆ వర్షాలకు అంతే కనపడకపోవడంతో వారి సంతోషం కాస్తా ఆవిరైపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో నెల్లూరు, చిత్తూరులలో ప్రధానంగా కేంద్రీకృతమైన ఈశాన్య ఋతుపవన వర్షాలు తమిళనాడులో ప్రధానంగా ఉత్తర జిల్లాల్లో కింద్రీకృతం అయ్యాయి.
ఉత్తరాన ఉన్న చెన్నై నగరం ఇప్పుడు ధారాపాతంగా పారుతోంది. చెరువు అలుగు పారుతూంది అంటుంటాం. చెన్నై నగరం నగరమే అలుగు పారుతూంది అన్నట్లుగా పరిస్ధితి తయారయింది. చెన్నై లోతట్టు ప్రాంతం అయిన దక్షిణ భాగం మొత్తం ఓ భారీ చెరువును తలపిస్తోందని తెలుస్తున్నది. మునిగిన దక్షిణ చెన్నై నుండి జనం ఉత్తర చెన్నైకు వలసలు కట్టారు. కొందరు తమ ఇళ్లలోనే ఉండి వరద నీరు వెనక్కి వెళ్ళేందుకోసం ఎదురు చూస్తున్నారు.
నవంబర్ 8 తేదీన ఒక అల్పపీడనం ఏర్పడగా నవంబర్ 28 తేదీన మరో అల్ప పీడనం ఏర్పడింది. మొదటి అల్ప పీడనం ఏకంగా మూడు వారాల పాటు ఎడతెరిపి లేని వర్షాలు కురిపించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక మీదుగా చుట్టూ తిరిగొచ్చి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ లలో లంగరు వేసినట్లుగా స్ధిరపడిపోయింది.
సాధారణంగా అల్ప పీడనం సముద్రంలో కొంతకాలం పచార్లు చేసి తీరాన్ని దాటి సమసి పోతుంది. అది తుఫానుగా మారితే తీరాన్ని దాటాక కాసిని చెట్లు కూల్చి, పేదల ఇళ్ళను ఇష్టంగా ఆరగించి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ కింద ఆధారం లేక సమసి పోతుంది. ఈ ప్రయాణం వలన వర్షాలు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా తుఫాను ప్రయాణించిన మేరకు విస్తరిస్తాయి.
ఈశాన్య ఋతుపవనాల వల్ల నవంబర్ లో ఏర్పడిన రెండు అల్ప పీడనాలు అటూ ఇటూ వెళ్లకుండా బద్ధకించినట్లుగా ఒకే చోట స్ధిరపడిపోవడంతో కురవదలుచుకున్న వర్షం అంతా ఆ ప్రాంతంలోనే కురుస్తోంది. ఉత్తర తమిళనాడు జిల్లాలు, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ఈ విధంగా అల్ప పీడనం బద్ధకానికి బలవుతున్నాయి.
రెండు అల్ప పీడనాల వల్ల చెన్నైలో ఒక్క నవంబర్ లోనే 105 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. నవంబర్ 28 తేదీన మొదలయిన రెండో అల్ప పీడనం డిసెంబర్ లోకి కూడా ప్రయాణించింది. డిసెంబర్ లో చెన్నైలో మొదటి రెండు రోజుల్లో 12 సెం. మీ వర్షపాతం కురియగా చెన్నై శివారు ప్రాంతాల్లో 18 సెం. మీ వర్షపాతం కురిసింది. మొదటి అల్పపీడనం కురిపించిన వర్షాల నీరు చెన్నై ముంపు ప్రాంతాలను ఇంకా వదలకుండానే రెండో విడత కుండపోత మొదలు కావడంతో చెన్నై ప్రజలకు దెబ్బ మీద దెబ్బ పడినట్లయింది.
చెన్నైలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితి మానవ తప్పిదమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై వ్యాపితంగా అక్రమ ఆక్రమణలతో, చట్టాలను అతిక్రమిస్తూ వెలిసిన కట్టడాలు నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. కాలవలు, చెరువులు సైతం ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో ఎక్కడ నీరు అక్కడ నిలవ ఉండడమే కాకుండా పక్క ప్రాంతాలను ముంచెత్తడానికి కారణమైంది. కనీసం డ్రైనేజీ కాలవలను ఆక్రమణల నుండి మినహాయించినా ఇంత తీవ్ర పరిస్ధితులు ఏర్పడకపోవును! ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఎవరి శక్తికి మించి వారు సాగించిన ఆక్రమణలు రోడ్లను కాలవలు గానూ, కాలనీలను చెరువులు గానూ మార్చివేశాయి.
ప్రజలకు భలే సహాయం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు చూస్తే అనిపిస్తుంది. ఇన్ని పడవలు తిరుగుతున్నాయని, హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, ఆహార పోట్లాలు పంచామని, కష్టపడి జనాన్ని ఖాళీ చేస్తున్నామని, డజన్ల కొద్దీ ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు దిగాయని టి.వి ఛానెళ్లలో ఒకటే ప్రకటనలు! కానీ వాస్తవంలో పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది.
చెన్నైలో ప్రభుత్వం పోయెస్ గార్డెన్ (జయలలిత నివాసం) లో మొదలై పోయెస్ గార్డెన్ లో ముగుస్తుందని అక్కడి ప్రజలు ఆరోపిస్తుండడం బట్టి ప్రకటిత సహాయక చర్యల బండారం వెల్లడి అవుతోంది. పడవలు పంపిస్తున్నామని చెప్పడమే గానీ అవి ఎన్నటికీ ఇళ్ల వద్దకు రావు. ఒక కాలనీలో ప్రజలను సురక్షిత ప్రాంతానికి చేర్చలంటే కొన్ని వందల మందిని చేరవేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ బృందాల నుండి ఒకటి రెండు పడవలు వస్తే ఆ వార్తనే పదే పదే ప్రసారం చేస్తూ పడవలు తెగ తిరుగుతున్న భావాన్ని కలిగిస్తున్నారు. సహాయం చేయమని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అడగడమే గానీ కేంద్రం నుండి ఎంత సాయం అందిందో చెప్పినవారు లేరు.
అక్రమ కట్టడాలు అవినీతి వల్లనే సాధ్యం. నేటి రోజుల్లో కట్టడాలు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రారాజుల ఏలుబడిలోనే సాగుతున్నాయి. కావున ఉన్నత స్ధాయిల్లో అవినీతి నేటి చెన్నై పరిస్ధితికి కారణం. అట్టహాసంగా చెన్నై నుండి ఆంధ్ర నగరాలను కలుపుతూ నిర్మించిన నాలుగు లేదా ఆరు లైన్ల రహదారి వల్ల అనేక ఊళ్ళు మునిగిపోయి ప్రయాణాలు ఆగిపోయిన పరిస్ధితిని వెల్లడించిన ఛానెళ్లు దాదాపు లేవు.
ఎక్కడి కక్కడ నీటి ప్రవాహ మార్గాలను మూసివేస్తూ కట్టిన ఎన్.హెచ్-5 రహదారి లోపలి ప్రాంతాల నుండి వచ్చే నీటికి ఆనకట్టగా మారిపోయింది. దానితో ఊళ్లలో, లోపలి రహదారులపైనా నీరు నిలిచిపోయింది. రోడ్లు మునిగిపోయాయి. చెరువులు తెగడం వల్ల వచ్చిపడ్డా నీరు అదనం. చివరికి నెల్లూరు జిల్లాలోని మనుబోలు వంతెన వద్ద ఎన్.హెచ్-5 రోడ్డును తెగ్గొట్టితే తప్ప నీటి ముంపు నుండి నెల్లూరు, చిత్తూరు లోతట్టు గ్రామాలు బైటపడలేదు. మనుబోలు రహదారికి కొట్టిన గండి రెండు రాష్ట్రాల మధ్య రావాణాను రెండు, మూడు వారాల పాటు ఆపేసింది. జాతీయ రహదారి, రైల్వే లైన్ ల మధ్య విచ్చల విడిగా నిర్మించిన రొయ్యల చెరువులు కూడా సహజ నీటి ప్రవాహాన్ని ఆటంకం అయ్యాయి. దానితో రైల్వే లైన్ కూడా మునిగిపోయి వారం రోజుల పాటు రైలు ప్రయాణం కూడా బంద్ అయిపోయింది.
ఉన్నత స్ధాయిల్లోని అవినీతి, ధనికవర్గాల దురాశ ప్రజల జీవనాన్ని ఎంతగా అతలాకుతలం చేయగలదో చెన్నై-నెల్లూరులలో నెలకొన్న ముంపు పరిస్ధితి తెలియజేస్తుంది.