ఆయన వృత్తి రీత్యా రైల్వే టికెట్ కలెక్టర్. ఆయన ప్రవృత్తి మాత్రం పెయింటింగ్. ఆర్ట్ లేకుండా ఆయన లేరు. పెయింటింగ్ లేకపోతే తన బతుకే వృధా అనుకున్న బిజయ్ బిశ్వాల్ తల్లి దండ్రుల ఒత్తిడితో సంపాదన కోసం టికెట్ కలెక్టర్ ఉద్యోగం సంపాదించారు. అంతటితో గీతలు మానేస్తాడని తెలిసినవారు భావించగా దానికి బదులు తన వృత్తిని కూడా తన ప్రవృత్తికి అనుకూలంగా మార్చుకున్నారు. తన వృత్తిలోకి తన చిన్నతనం నుండి కాపాడుకుంటూ వచ్చిన ప్రవృత్తిని ఒంపుకుని అటు ఉద్యోగాన్నీ, ఇటు కళా పిపాసను విజయవంతంగా సంతృప్తిపరుచుకుంటున్నారు బిజయ్ బిశ్వాల్!
రైలు ప్రయాణీకులకు నిత్యం తారసపడే టి.సి వృత్తిలో పని చేస్తూ కూడా అద్భుతమైన కళా ఖండాలను సృష్టించడం వెనుక రహస్యం ఏమిటి అంటే: ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అద్భుతమైనదే అని గుర్తించిన ఫలితమే అని బిజయ్ చెబుతారు. అందులో భాగంగానే ఆయన రైళ్లు, రైలు ప్రయాణీకులు, రైల్వేస్టేషన్లు, పట్టణ వీధులు, పవర్ లైన్లు అన్నింటినీ ఆయన ప్రకృతిలో భాగంగా పరిగణిస్తూ స్ఫూర్తిని పొందుతారు. ఆయన పెయింటింగ్స్ లో ఎక్కువ భాగం రైలుతో ముడిపడి ఉండడం బట్టి ఆయన తన వృత్తిని ప్రవృత్తిని ఎంతగా మిళితం చేసి అనుభూతి పొందారో గ్రహించవచ్చు.
ఒరిస్సాకు చెందిన బిజయ్ బిశ్వాల్ చిన్నతనం నుండి గోడల మీద చాక్ పీస్ తో బొమ్మలు గీయడం అలవాటుట. గోడలంతా విశాలమైన కాన్వాస్ ఎక్కడ లభిస్తుందని ఆయన ప్రశ్న! చేతిలో చాక్ పీస్ ఒదిగిపోయేంతగా మరేదీ ఒదగదని కూడా ఆయన అభిప్రాయం. అన్నింటి కంటే మించి ఆయన అమితంగా ఇష్టపడేది ప్రకృతిని. ప్రకృతిని అటూ ఇటూ మార్చి నిర్మాణాలు చేస్తారే గానీ అవి కూడా ప్రకృతిలో భాగం కాకుండా ఎలా పోతాయి? అందుకే ఆయన తనకు కనిపించే ఏ దృశ్యాన్నీ పెయింటింగ్ కు పనికిరానిదిగా చూడరు.
వాటర్ కలర్స్ తో సహజత్వానికి దగ్గరగా బొమ్మ గీయడం చాలా కష్టం. ఎంతో నేర్పు, ఓర్పు ఉంటే గానీ అది సాధ్యం కాదు. ముఖ్యంగా రంగుల మిశ్రమం ఆపోసన పట్టి ఉండాలి. అటువంటి వాటర్ కలర్స్ తో సహజత్వానికి ఏ మాత్రం తీసిపోని పెయింటింగ్ లు సృజించిన బిశ్వాస్ బహుధా అభినందనీయులు. కింది పెయింటింగ్స్ లో మర్రి ఊడల కింద శివుడిని ఆరాధిస్తున్నట్లు కనిపిస్తున్న మహిషుడి పెయింటింగ్ జాతీయ అవార్డు సంపాదించింది. ఆయనకు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయని తెలుస్తోంది.
వృత్తిని నిర్వహిస్తూనే …తన అభిరుచిని కొనసాగిసితున్న బిశ్వాల్ ధన్యజీవి