ప్యారిస్ దాడులు ఎవరి పని? -ఫోటోలు


ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో నవంబర్ 13 సాయంత్రం మొదలుకొని నవంబర్ 14 తెల్లవారు ఝాము వరకు వరసపెట్టి ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇరాక్, సిరియాలలో కొన్ని భాగాలను ఆక్రమించుకుని ఇస్లామిక్ కాలిఫెట్ ను ఏర్పాటు చేసిందని పశ్చిమ పత్రికలు ఘనంగా ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్ ఈ దాడికి కారకులుగా, విచారణ కనీసం మొదలు కాకుండానే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే ప్రకటించాడు. ఆ పిమ్మట ‘దాడి మా పనే’ అని ఐ.ఎస్/ఇసిల్/ఇసిస్ ప్రకటించిందని పత్రికలు చెప్పాయి. ఆ విధంగా ఆరోపణ రుజువు చేసే బాధ్యత ఫ్రాన్స్ పాలకులకు తప్పిపోయింది.

దాడులకు ఎవరు పాల్పడినా ఖండనార్హం. ఒట్టి ఖండనార్హం మాత్రమే కాదు. దోషులను పట్టుకుని, న్యాయ స్ధానాల్లో వారి ఉద్దేశాలను బట్టబయలు చేసి, తద్వారా ప్రజలకు సమాచారం అందజేసి, చట్టాల ప్రకారం తగిన శిక్ష వేసేవరకూ విశ్రమించకూడని దారుణమైన దాడులివి.

ప్యారిస్ లో వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఉగ్రవాదులు 130 మందిని చంపేశారు. జనసమ్మర్దమైన ప్రాంతాల్ని ఎన్నుకుని ఒక పధకం ప్రకారం దాడులకు పాల్పడడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మరణించినవారు కాక 400 మంది వరకు గాయపడ్డారు. వారిలో 80 నుండి 100 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

దాడుల అనంతర రోజుల్లో పత్రికలు ఇచ్చిన సమాచారం ప్రకారం దుండగులు మూడు బృందాలుగా ఏర్పడి 6 విడతలుగా హంతక దాడులకు వారి ఏకైక లక్ష్యం: తాము చనిపోయేలోపు సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపేయడం. ఒక దాడిలో ముగ్గురు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మరో దాడిలో మరొక వ్యక్తి ఆత్మాహుతి దాడికి దిగాడు. జర్మనీ, ఫ్రాన్స్ జాతీయ ఫుట్ బాల్ టీం లు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్న ‘స్టేట్ డి ఫ్రాన్స్’ స్టేడియం వద్ద పేలుళ్లు జరపడం ద్వారా ఒక దాడి చేశారు. ఈ మధ్యలో రూ ఆలిబర్ట్ రెండు బృందాలు వీధుల వెంట వాహనంలో తిరుగుతూ పలు చోట్ల కాల్పులకు దిగారు. హోటళ్లు, పిజ్జా సెంటర్లు, రెస్టారెంట్లు, బస్టాండ్ లు ఇలా జనం ఎక్కడ గుంపుగా కనపడితే అక్కడ కాల్పులు జరిపారు. బటాక్లాన్ ధియేటర్ లో అమెరికాకు చెందిన మ్యూజిక్ బృందం ఒకటి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తుండగా ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు అందులోకి చొరబడి విచాక్షాణారహితంగా ప్రేక్షకులపై కాల్పులు జరిపారు. పోలీసులు వచ్చి చుట్టుముట్టి దాడి చేయడంతో తమను తాము పేల్చేసుకున్నారు. ఎక్కువమంది (89) బటాక్లాన్ ధియేటర్ లోనే చనిపోయారు.

ఈ దాడులు సరిగ్గా ముంబై దాడులతో సరిపోలడం భారతీయుల దృష్టిని దాటిపోలేదు. ముంబై దాడులకు పాకిస్ధాన్ లో ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఐ.ఎస్.ఐ హ్యాండ్లర్లు దగ్గరే ఉండి శాటిలైట్ ఫోన్ ల ద్వారా ఆదేశాలు ఇస్తుండగా వారి ఆదేశాలను అనుసరించి కసబ్ తదితర ముష్కరులు దాడులకు పాల్పడ్డారు.

మరి ప్యారిస్ దాడులకు ఎక్కడ వ్యూహాలు రచించబడ్డాయి? ఉగ్రవాదులు సిరియా లేదా ఇరాక్ లో పధకం రచించి ప్యారిస్ వచ్చి దాడులకు పాల్పడ్డారా? ఇస్లామిక్ కాలిఫెట్ లోనే పధకం వేసి వచ్చారని పశ్చిమ ప్రభుత్వాలు, పత్రికలు గట్టిగా చెప్పడం లేదు. అలా చెబితే తాము అత్యంత కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్ధలను ఉగ్రవాదులు చేదించారన్న అపప్రధ వస్తుంది. నిజానికి ఉగ్రవాదులు ఫలానా చోట పధకం వేసుకుని ఫలానా దారుల్లో ప్యారిస్ వచ్చి దాడి చేశారని చెప్పడానికి ప్రభుత్వ విభాగాలు ముందుకు రావడం లేదు. దానికి బదులు అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి సమాచారాన్ని లీక్ చేస్తూ తమకు సంబంధం లేకుండానే జనానికి ఒక అవగాహన వచ్చేవిధంగా చేస్తున్నారు.

ఉదాహరణకి తాము ఎంత తేలికగా ప్యారిస్ లో దాడి చేశామో ఉగ్రవాదులు తమలో తాము చెప్పుకుంటున్నట్లు ఒక వార్త వెలువడుతుంది. తాను సిరియా శరణార్ధిగా ఐరోపా దేశాల సరిహద్దు బలగాలను, చెక్ పోస్ట్ లను, భద్రతలను ఎంత తేలికగా బురిడీ కొట్టించానో అని ఒక ఉగ్రవాది ఎవరితోనో అన్నట్లుగా ఇంకో వార్త వెలువడుతుంది. బెల్జియంకు చెందిన ఉగ్రవాది అబ్దెల్ హమీద్ అబౌద్ దాడులకు వ్యూహరచన చేసిన మాస్టర్ మైండ్ అని చెబుతూ ఆయన ఉంటున్న హోటల్ గదిపై ఫ్రెంచి ఫెడరల్ పోలీసులు దాడి చేసి చాకచక్యంగా చంపేశారని కొద్ది రోజుల తర్వాత మరో వార్త వెలువడుతుంది. పోలీసుల గుళ్ళ వర్షం వల్ల  ఈ మాస్టర్ మైండ్ శరీరం గుర్తు పట్టలేని విధంగా మారిందని అతని నోటిలోని లాలాజలం ఆధారంగా ఒక రోజు తర్వాత మాత్రమే ఆయన ఫలానా అని గుర్తించారని పత్రికలు మనకు చెబుతాయి.

ఈ మాస్టర్ మైండ్ గురించి తాము ముందే హెచ్చరించామని టర్కీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్యారిస్ పోలీసులకు ఆయన కొత్త కాదని వెల్లడి అయింది. ఫలానా వ్యక్తి పొటెన్షియల్ టెర్రరిస్ట్ అని తాము 2014 డిసెంబర్ లోనే సమాచారం ఇచ్చామని టర్కీ తెలిపింది. అలాంటి సమాచారం ఏదీ తమ వద్ద లేదు అంటూనే ప్యారిస్ అధికారులు అతను గతంలో పాల్పడ్డ 4 దాడులను తమ బలగాలు తిప్పికొట్టాయని ప్రకటించారు. ఆ వ్యక్తి తమ దేశంలో ఉన్న సంగతే తమకు తెలియదని చెబుతూ ఆయన పాల్పడిన ఉగ్రవాద దాడులను 4 సార్లు తిప్పికొట్టామని ఎలా చెప్పగలరు? ఆ వ్యక్తి ప్యారిస్ లోనే ఉన్న సంగతి వారికి తెలిస్తే తప్ప!

ప్యారిస్ దాడుల దరిమిలా సిరియాపై అర్జెంటుగా వాయు దాడులు నిర్వహించే అవకాశం ఫ్రాన్స్ కు వచ్చింది. అనగా సిరియాపై దాడి చేయాలా వద్దా అని ఫ్రెంచి ప్రజలను అడగాల్సిన అవసరం లేకుండానే సిరియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఫ్రెంచి పాలకవర్గాలకు చిక్కింది.

ఈ ఫ్రాన్స్ దాడులను చూపించే బ్రిటన్ ప్రధాని కామెరాన్ సిరియాపై దాడికి అనుమతి ఇవ్వాలంటూ కాన్స్ సభలో మరో బిల్లు ప్రవేశపెట్టాడు. ఇదే బిల్లును ఒకటిన్నర సం.ల క్రితం ప్రవేశపెట్టినప్పుడు పాలక, ప్రతిపక్ష సభ్యులు ఇరువురూ కలిసి దానిని ఓడించారు. ప్యారిస్ దాడుల దరిమిలా ‘ఇక ఆలస్యం చేయడానికి వీలు లేదు’ అన్న సందేశంతో సిరియాలో జోక్యం చేసుకునే బిల్లును కామెరాన్ మళ్ళీ ప్రవేశపెట్టాడు. ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల వల్ల తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొన్న బ్రిటన్ ప్రజలు మరో దేశంపై దాడికి వెళ్ళేందుకు (వివిధ ఒపీనియన్ పోల్స్ లో) ససేమిరా అనడంతో అప్పట్లో ఎం.పిలు సిరియాపై దాడికి సిద్ధపడలేదు. కానీ ప్యారిస్ దాడి చూపిస్తూ అదే ఎం.పి లు పలువురు బిల్లు ఆమోదానికి సై అంటున్నారు. బ్రిటన్ ప్రజలు అదే మెజారిటీతో ‘నో’ అంటున్నా వారు వినిపించుకోదలచలేదు. ప్యారిస్ దాడులు వారికి ఆ బలాన్ని, ఒక కారణాన్ని ఇచ్చాయి.

ప్యారిస్ దాడుల్లో అమాయక ఫ్రెంచి పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఫ్రాన్స్ పాలకవర్గాలు బహుధా లాభపడనున్నారు. కనీసం లాభపడాలన్న ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ ఇత్యాది ఐరోపా పాలకవర్గాలకు (బహుళజాతి కంపెనీలకు) తాము సంక్షోభం నుండి బైటపడడం కావాలి. అందుకు కొత్త మార్కెట్లు కావాలి. ఇంతవరకు తమ చేతికింద లేని మార్కెట్లు కావాలి. తమ ఏలుబడిలో లేని వనరులు కావాలి. ఆ వనరులు రష్యా వద్ద కుప్పబడి ఉన్నాయి. ఇరాన్ లో ఉన్నాయి. చైనా ఆర్ధిక శక్తిలో ఉన్నాయి. చైనా మార్కెట్ లో ఉన్నాయి. ఆ మార్కెట్ ల వశానికి జరిగే దండయాత్రలో తక్షణ మజిలీ సిరియా. లిబియా వలెనే సిరియా కూడా కుక్కలు చింపిన విస్తరి కావాలి. దేశం నిలువునా చీలిపోవాలి. ముక్కలు ముక్కలు కావాలి. సిరియా ఒడ్డున రష్యా ఏర్పరచుకున్న నౌకా బలగాల కేంద్రాన్ని ఎత్తి వేయించాలి. ఆ విధంగా ఇరాన్ కుడి భుజాన్ని విరిచిపారేయ్యాలి. అలా చేస్తే ఇరాన్ పాలకులు దారికి వస్తారు. తమకు కాంట్రాక్టులు అప్పజెపుతారు. తద్వారా రష్యా రక్షణ బలహీనపరచవచ్చు. రష్యాను బ్లాక్ మెయిల్ చేసి మార్కెట్లు వశం చేసుకునే వెసులుబాటు లబిస్తుంది.

మరీ ఇంతగా, ఊహకు అందనంతగా ఉంటాయా? అని అడుగుతున్నారా? సామాన్యుల ఊహలకు అందితే అవి సామ్రాజ్యవాద ఎత్తుగడలు ఎందుకు అవుతాయి? ఇంకా అనుమానం ఉంటే ఇరాక్ ను గుర్తు తెచ్చుకుందాం. ఆ దేశంపై దాడి చేయడానికి అమెరికా, ఐరోపాలు చెప్పని అబద్ధం ఉన్నదా? సామూహిక మారణాయుధాలు ఉన్నాయన్నారు. ‘అబ్బే అది తప్పుడు సమాచారం’ అని ఇప్పుడు అంటున్నారు. (ఇరాక్ పౌరులపై తీవ్ర టార్చర్ ఎత్తుగడలకు పాల్పడినందుకు బాధ్యుడిని చేస్తూ అప్పటి బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ పై విచారణ ఒక కొలిక్కి వచ్చి నేరారోపణలు నమోదు చేసే దశకు వచ్చిందని ఇటీవల పత్రికలు చెబుతున్నాయి.) ఆల్-ఖైదాతో సద్దాం హుస్సేన్ కు సంబంధాలు ఉన్నాయి అన్నారు. అందుకు ఒక్క సాక్ష్యం కూడా దొరకకపోగా అసలు ఆల్-ఖైదాను నడిపించిందే అమెరికా పాలకులని తెలిపే సమాచారం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్ విషయం! ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘన్ కొండల గుహల్లో దాచారని చెప్పారు. వాడిని పట్టుకోవాలంటే దాడి తప్పదు అన్నారు. 9/11 దాడులకు లాడేనే కారణం అనేందుకు ఇంతవరకు ఒక్క సాక్షమూ అమెరికా చూపలేదు. పైగా 9/11 దాడులు అమెరికా లోపలి శక్తులే జరిపించాయని చెబుతూ అనేకమంది అమెరికా ప్రముఖులు ముందుకు వచ్చారు. కేవలం విమాన దాడుల వల్ల ఆ WTC టవర్లు నిలువునా కూలిపోవడం సాధ్యం కాదని లోహశాస్త్ర నిపుణులు, నిర్మాణ నిపుణులు అనేకమంది చెప్పారు.

కొన్నిసార్లు మన తెలుగు ఛానళ్లలోనే చూస్తుంటాం. తమను తామే కిడ్నాప్ చేసుకునేవారి వార్తలు, ఇంట్లో దోపిడీ జరిగిందని నాటకం ఆడేవారు పోలీసుల విచారణలో దొరికిపోయిన వార్తలు మనకు పరిచయమైనవే. ఈ చర్యల వెనుక ఆయా వ్యక్తులు సాధించదలుచుకున్న ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. తమ డబ్బు దోపిడీకి గురయిందని చెబితే అప్పులు తప్పించుకోవచ్చు. తాను కిడ్నాప్ అయ్యానని చెబితే తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారన్న అతి తెలివి. వ్యక్తిగత స్ధాయిలోనే ఈ ఈ విధంగా ‘ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు’ జరుగుతున్నప్పుడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ల విషయంలో ఉండడం అంత అనూహ్యమేమీ కాదు. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ నిర్వహణలో పశ్చిమ దేశాల పాలకులు పండిపోయారు. మలేషియా విమానాన్ని ఉక్రెయిన్ పాలకుల చేత కూల్పించి అది రష్యా చేసిన పనిగా ప్రచారం చేసిన ఉదాహరణ నిన్న మొన్నటిదే. రష్యాయే మలేషియా విమానాన్ని కూల్చేసిందని ప్రపంచ వ్యాపితంగా అనేకమంది ఇప్పటికీ నమ్ముతున్నారు. అందుకు విరుద్ధమైన సాక్షాలకు ప్రచారం లభించకుండా చేయడానికి పశ్చిమ మీడియా ఎలాగూ ఉన్నది.

2 thoughts on “ప్యారిస్ దాడులు ఎవరి పని? -ఫోటోలు

  1. “వ్యక్తిగత స్ధాయిలోనే ఈ ఈ విధంగా ‘ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు’ జరుగుతున్నప్పుడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ల విషయంలో ఉండడం అంత అనూహ్యమేమీ కాదు.”…ఔను, సందేహమే లేదు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s