[‘Secularism and the Constitution’ శీర్షికన నవంబర్ 30 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.]
************
దేశంలో సహనం లేదా సహన రాహిత్యంపై ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయమై ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాలు (తమదంటూ) ఓ స్పష్టతను చేర్చాలని భావించబడుతోంది. కానీ ఈ అంశాన్ని చేపట్టక మునుపే బిజెపి నేతృత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం, రాజ్యాంగం ప్రబోధించిన విలువలను ఈ రోజు ఏ మేరకు అర్ధం చేసుకున్నారన్న అంశంపై చర్చ జరపాలన్న ఆలోచనతో ముందుకు వచ్చింది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి సంవత్సరం సందర్భంగానూ, రాజ్యాంగ సభ నవంబర్ 29, 1949 తేదీన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన సందర్భంగానూ ఈ చర్చ జరపాలని ప్రతిపాదించారు.
సమకాలీన వ్యవహారాల్లో లౌకికవాదాన్ని వినియోగిస్తున్న పద్ధతిని హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రశ్నించిన దరిమిలా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి జరుగుతోందని వాదించారు. ఆ లౌకికవాదం రాజ్యాంగ వ్యవస్ధలో మూల విలువ అన్న విషయంలో చర్చకు తావు లేదు. అది ఒక పాలనా సూత్రంగా భంగం కావించడానికి వీలులేదన్న సంగతి యధాతధంగా సమ్మతించబడింది. స్వతంత్ర భారతంలో ఆ విషయం ఎప్పుడన్నా చర్చకు రావడం అంటూ జరిగితే, అది చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రానికి, మైనారిటీల హక్కులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన మినహాయింపుకూ మధ్య సమతూకం గురించిన ప్రశ్నలు లేవనెట్టడానికి మాత్రమే.
భారత రాజకీయాల్లో అత్యధికంగా దుర్వినియోగం అయిన పదం ‘లౌకికవాదం’ అనీ, ఆ దుర్వినియోగాన్ని అంతం చేయవలసిన సమయం వచ్చిందనీ రాజ్ నాధ్ సింగ్ చేసిన వాదన ‘లౌకిక వాద’ సిద్ధాంతం తన ప్రాసంగికతను కొనసాగిస్తూ ఉండడాన్ని ప్రశ్నించడానికి దగ్గరగా వచ్చింది. రాజ్యాంగంలో ‘లౌకికవాదం’ గురించిన ప్రస్తావన ఆదిలో లేని మాట, దానిని 1976 లో ప్రవేశపెట్టిన మాట నిజమే. ఐనప్పటికీ మత స్వేచ్ఛ, అంతరాత్మ చేతన కలిగి ఉండే స్వేచ్ఛ, సమానత్వం మరియు వివక్ష రాహిత్యం సూత్రాలను నొక్కి చెప్పడంలోనే లౌకికవాద స్ఫూర్తిని రాజ్యాంగం కలిగి ఉన్నది. 42వ రాజ్యాంగ సవరణ దానిని స్పష్టంగా కనపడేలా చేసిందంతే.
గత ఎన్.డి.ఏ ప్రభుత్వం (1998-2004) రాజ్యాంగాన్ని బలవంతంగానైనా సమీక్షించడానికి ప్రయత్నించిన నేపధ్యంలో రాజ్ నాధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సిద్ధాంతాన్ని నీరుగార్చడానికి చేసిన ప్రయత్నంగా లౌకికవాదానికి కట్టుబడినవారు భావించడం సహజం. అటువంటి సమీక్ష చేసే ఉద్దేశం ఏమీ లేదనీ, రాజ్యాంగం మూల సూత్రాలకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చర్చలో జోక్యం చేసుకుని చెప్పడం ఆహ్వానించదగినది. తన పార్టీ సహచరులు మరియు తన ప్రభుత్వం లోని ఇతరులు సాగించిన మతపరమైన ప్రకటనలను ఖండిస్తూ ఇటీవలి కాలంలో ఒక్క మాట కూడా ఉచ్చరించకుండా ముక్తసరి మాటలతో సరిపుచ్చిన మోడి ఈసారి అందుకు విరుద్ధంగా తన ప్రభుత్వానికి ఏకైక మతం ‘ఇండియా ఫస్ట్’ మాత్రమే అనీ, తమ ఏకైక పవిత్ర గ్రంధం ‘రాజ్యాంగం’ మాత్రమే అనీ చెబుతూ చర్చను ముగించారు.
రాజ్యాంగాన్ని సమీక్షించే పధకం ఏమీ లేదని చెబుతూ అదే పాటున తన ప్రభుత్వ చట్ట సభ ఎజెండాను ముందుకు కొనిపోవడానికి ప్రతిపక్షాలకు స్నేహహస్తం చాచడం ద్వారా ప్రధాన మంత్రి సరైన స్వరాన్ని పలికారు. బీహార్ ఎన్నికల్లో తన పార్టీ ఓటమి తమపై మోపిన నిర్బంధం నుండే ఈ పరిణామం సంభవించిందని ఎవరైనా భావించవచ్చు గాక! రాజ్ నాధ్ సింగ్ నిజానికి ‘ట్రయల్ బెలూన్’ వదిలారనీ, బి.జె.పి ఎజెండాలో లౌకికవాదాన్ని కిందమీదులు చేయడమే ప్రధాన అంశంగా ఉందన్న ఆందోళనలను దూరం చేయాలంటే ఆయన చెప్పడమే కాకుండా ఆచరణలో చూపవలసింది అంతకంటే ఎక్కువే ఉన్నది.
***************
[జి.ఎస్.టి బిల్లు, ప్రభుత్వ కంపెనీల డిజిన్వెస్ట్ మెంట్, మిగిలినవనరులను వేగంగా విదేశీ కంపెనీలకు అప్పజెప్పే విధానాలను తెచ్చే బిల్లులు… ఇవే బి.జె.పి ఎజెండా. ఈ ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి ప్రధాని సరైన స్వరమే పలికారని ‘ది హిందు’ ఆనందిస్తోంది. చెప్పింది చేసి చూపాలని కూడా కాంక్షిస్తోంది. -విశేఖర్]