‘ఎక్కడ అసహనం, ఆయ్?’ అని దబాయించిన వారికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్య నాయుడు సమాధానం ఇచ్చారు. అసహనంపై రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన “మన సమాజంలో ‘కొంత మొత్తంలో’ అసహనం ఉన్నమాట నిజమే. దానిని గుర్తించి దానితో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది” అని వెంకయ్య అంగీకరించారు. తన ఒప్పుకోలు -పాక్షికంగానే అయినా- ద్వారా ఆయన దేశంలో అసహనమే లేదు పొమ్మని నిరాకరించిన హిందూత్వ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడిక ఆ ‘కొంత మొత్తం’ ఎంత అన్నదే నిర్ణయించాలి కాబోలు!
“సందర్భ రహితంగా, సమంజసం కాని ప్రకటనలు జారీ చేసేవారిని అందరూ ఖండించాలి, ఒంటరి చేయాలి, దూరం పెట్టాలి” అని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
“మన సమాజంలో, వివిధ ప్రాంతాల్లో, కాస్త మొత్తంలో అసహనం ఉన్నది. దానిని గుర్తించాలి. దానిని స్ధానికంగానే పరిమితం చేయాలి. దానితో కఠినంగా వ్యవహరించాలి. దానికి బదులుగా మనం దానిని సాధారణీకరిస్తున్నాము” అని కొన్ని రాష్ట్రాలలో దళితులు, రచయితలు హత్యలకు గురవుతున్న సంఘటనలను ఉద్దేశిస్తూ వెంకయ్య అన్నారు. “అయితే ఈ ఘటనలు రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇవి ఎప్పటినుండో జరుగుతూ ఉన్నాయి” అన్నారాయన.
వెంకయ్య నాయుడు ఉద్దేశం స్పష్టమే. దాద్రి హత్యలు, ఖల్బుర్గి-పన్సారే-దభోల్కర్ హత్యలు లాంటి సంఘటనలు ‘అసహనం’ తో చేసిన హత్యలే. కాని అవి చెదురు ముదురుగా జరుగుతున్నవి మాత్రమే. వాటిని సాధారణీకరించి దేశం మొత్తం జరుగుతున్నవిగా చెప్పడం సరికాదు’ అని వెంకయ్య మాటల ఉద్దేశం.
ఆవేవో అనుకోకుండా జరిగిన ఘటనలనీ, వాటిని అసహనం కింద జమ కట్టడమే అసహనం అనీ మంత్రులు, నేతలు, ఛోటా మోటా వందిమాగధులు, సోషల్ మీడియాలోని వారి అనుచర గణాలు వేస్తున్న కేకలు, రాస్తున్న రాతలతో పోల్చితే వెంకయ్య నాయుడుగారి ‘కాస్త’ ఒప్పుకోలు మెరుగైనదే. కళ్లెదుట జరుగుతున్నదాన్ని లేదు పొమ్మని గుడ్డిగా నిరాకరించడం కంటే ‘ఎంతో కొంత ఉన్నది నిజమే’ అని అంగీకరించడం ఒక ప్రారంభం.
కానీ ఈ ప్రారంభం అన్నివైపుల నుండి విమర్శలు జడివానలా కురవడం వల్లనే సాధ్యపడింది. మరీ ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఓటమి దరిమిలా ఎదురైన రాజకీయ తలవంపులు ‘కాస్త ఒప్పుకోలు’ను అనివార్యం చేశాయి. లేదంటే ఆ రాజ్యసభలో ‘జి.ఎస్.టి బిల్లు’ గట్టెక్కడం కష్టం అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గుర్తించారు. బహుశా ఇది ఫ్లోర్ మేనేజ్ మెంట్ లో భాగమైన ఎత్తుగడ కావచ్చు కూడా.
సల్మాన్ రష్దీ రాసిన ‘ద సాటానిక్ వర్సెస్’ పుస్తకాన్ని నిషేదించడం ఒక తప్పు అంటూ ఇటీవల మాజీ హోమ్ మంత్రి చిదంబరం ఒప్పుకోవడాన్ని వెంకయ్య ఆహ్వానించారు. “ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది, పుస్తకాలు రాసేవారు. వాళ్ళు ప్రజల భావోద్వేగాలను బాధించకూడదు. సామాజిక ఉద్రిక్తతలను వారు పెంచకూడదు. అదే సమయంలో (రెండవది) భావ ప్రకటనా స్వేచ్చ, మాట్లాడే స్వేచ్చ, ప్రజలకు హక్కులు ఉన్నాయి. కానీ ఈ రెండింటిని సమతూకపరిచే అంశంలో ఒక విశాలమైన ఏకాభిప్రాయం కావాలి. రష్దీ పుస్తకం నిషేదం ప్రశంసలు కురిస్తే శివాజీ పుస్తక నిషేధంపై నిరసనలు వచ్చాయి. భిన్న కోణాలు, హిందూ కోణం-ముస్లిం కోణం, రంగం మీదికి వస్తున్నాయి” అని వెంకయ్య అన్నారు.
వెంకయ్య గారి పాయింటు ‘కోడి ముందా, గుడ్డు ముందా’ అన్న అంశం చుట్టూ తిరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ‘మీరు చేయలేదా అంటే మీరు చేయలేదా’ అన్న వాదనలే జరుగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఈ బ్లాగ్ లో కొందరు మిత్రులు కూడా ఇదే తరహా వాదనలు చేస్తున్నారు. అసలు ఏది ముందు అన్న ప్రశ్నకు ఆది ఏది? అంతం ఏది?
దేశానికి ఒక పాలనా వ్యవస్ధ ఉన్నది. దాని పని ప్రజల బాగోగులు చూడడం. ప్రజల అవసరాలు తీర్చడం, దానితో పాటు నేరాలు జరగకుండా చూడడం. ముఖ్యంగా సంఘ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నప్పుడు వారిని ఖండించడం, నేర విచారణ చేయడం, తగిన శిక్షలు పడేలా చూడడం. ఇవి జరగనప్పుడు ప్రజలు, వ్యతిరేక భావాలు ఉన్నందుకు దాడులు ఎదుర్కొంటున్నవారు రక్షణ కోసం ఏం చేయాలి? ఆవు మాసం తిన్నాడన్న అనుమానంతో -అలా తినడానికి వారికి గల హక్కును నిరాకరిస్తూ- అత్యంత ఘోరంగా కొట్టి, పొడిచి చంపితే ఈ దేశ ప్రధాని ఆ విషయమై ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం ఎలా అర్ధం చేసుకోవాలి? ఖల్బుర్గి, పన్సారే ల హత్యలను కనీసం ఖండిస్తూనైనా ఓ ప్రకటన జారీ చేయలేని ప్రధాని చట్టబద్ధ పాలనకు హామీగా ఉంటారని ఎలా భావించడం?
ఇవి చాలా సాధారణమైన ప్రశ్నలు. జనాన్ని కాపాడుతారని అధికారం అప్పగిస్తే కాపాడడానికి బదులు ఎడతెగని మౌనం వహిస్తుంటే ఆ జనం ఎవరికి చెప్పుకోవాలి? తాము భద్రంగా ఉన్నామని ఎలా భావించాలి? డజన్ల కొద్దీ రచయితలు నిరసనగా తమ అవార్డులు వెనక్కి ఇస్తున్నా ‘మీకు ఆందోళన అనవసరం. ఇక ముందు జరగకుండా చూస్తాము’ అన్న మాట చెప్పడానికి ఏమిటి ఆలోచన? ఈ ప్రశ్నలకు సమాధానం ఎందుకు రాదు? రాకపోగా అప్పుడేందుకు రాజీనామాలు చేయలేదు అనడం ప్రజలు అప్పగించిన బాధ్యత నుండి అత్యంత ఘోరంగా తప్పించుకోవడమే.
‘బి.జె.పి అధికారంలో ఉన్నందునే ఈ నిరసనలు!’ అంటూ తీర్పులు.
అసలు అందులో అనుమానం ఎందుకు? రచయితలు కానీ కళాకారులు గానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చెబుతున్నది అదే కదా.
“మోడి నేతృత్వంలోని బి.జె.పి అధికారంలో ఉన్నది కనుకనే హిందూ మతం పేరుతో ఉన్మాదులు అసహన హత్యలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారు. చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామిక చర్చలకు బదులు ప్రతీకార హత్యలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టకుండా ప్రభుత్వ నేతలు ఎడతెగని మౌనం పాటిస్తున్నారు. తద్వారా ఉన్మాద మూకలకు పరోక్ష మద్దతు వహిస్తున్నారు” జనం మొట్టుకుంటున్నది ఇదే. ఇక్కడ అనుమానాలకు తావు లేదు.
నిన్న మొన్న కళ్ళు తెరిచినవారికి తెలియకపోవచ్చు. ఢిల్లీలో, చుట్టుపక్కలా శిక్కులపై జరిగిన హత్యాకాండను ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముక్తం కంఠంతో ఖండించాయి. పత్రికలు అనేకం కాంగ్రెస్ హత్యారాజకీయాలకు వ్యతిరేకంగా అనేక విశ్లేషణలు ప్రచురించాయి. అప్పుడు ఎవరూ ‘మేము కాంగ్రెస్ కాబట్టే ఈ ఖండనలు’ అని తప్పు పట్టే సాహసం చేయలేదు.
షాబానో కేసులో భర్తకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన దరిమిలా ముస్లిం ఫండమెంటలిస్టుల ఒత్తిడితో రాజీవ్ గాంధీ మధ్య యుగాలతో పోల్చదగ్గ చట్టాన్ని తెచ్చినప్పుడు విద్యార్ధి, మహిళా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, వామపక్ష సంస్ధలు అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దేశ్యవ్యాపిత ఆందోళనలు జరిగాయి.
దశాబ్దాల తర్వాత బాబ్రీ మసీదు తలుపులు తెరిపించింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమే. మసీదు తలపులు తెరవడం ద్వారా కొడిగడుతున్న పలుకుబడిని హిందూ-ముస్లిం వైషమ్యాల ద్వారా పోగు చేసుకునేందుకు రాజీవ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దేశంలోని చరిత్రకారులు, రచయితలు, కళాకారులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. చర్చాగోష్టులు, సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించారు. అప్పటి నిరసనలతో పోల్చితే ఇప్పటి నిరసనలు ఏ పాటివి?
అప్పటి యువత కుల, మత విభేదాలకు అతీతంగా ప్రజాస్వామిక భావాలకు, విప్లవకర భావాలకు నిలయంగా నిలవగా ఇప్పటి యువత కనీస ప్రజాస్వామిక చైతన్యం కూడా కొరవడి ఉన్మాదాల వెంట కొట్టుకుని పోతున్నారు. అందుకే అప్పటి నిరసనలు పదునుగా ఉంటే ఇప్పటి నిరసనలు పేలవంగా ఉంటున్నాయి. ఇప్పటి యువత ఉండవలసిన చోట లేకుండా ఉండకూడని చోట్ల ఉంటూ ఉన్మాదాల వెంటా, కెరీర్ ల వెంటా పరుగెడుతుంటే మళ్ళీ ఇప్పుడు వృద్ధతరంగా ఉన్న అప్పటి యువతరమే కనీస నిరసనగా అవార్డులను వెనక్కి ఇవ్వవలసిన పరిస్ధితికి నెట్టబడ్డారు.
తమ జీవిత కాల కృషికి వచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వడం ఎవరికీ సరదా కాదు. అదేమీ సంతోషం కలిగించే విషయం కాదు. పట్టపగలు ఇంటికి వచ్చి వరుసపెట్టి హత్యలు జరుగుతుంటే, రేపు ఎవరు? అన్న ప్రశ్న అనివార్యం అవుతుంటే, ఆ ప్రశ్నలకు అధికారంలో ఉన్నవారి నుండి సమాధానం రాకపోగా ‘అర్ధాంగీకార మౌనాల్ని’ ప్రదర్శిస్తుంటే మరో దారి లేక ఒక వృద్ధతరం ఎంచుకున్న దారి ‘అవార్డ్ వాపసి’.
లవ్ జిహాద్ అనీ, ఘర్ వాపసీ అనీ, మందిర నిర్మాణం అనీ ఒక మతాన్ని, కింది కులాలని అదే పనిగా లక్ష్యం చేసుకుని చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వం నుండే మద్దతు వస్తున్నపుడు ప్రజల నుండి వచ్చే నిరసనను కూడా ‘అసహనం’ అంటూ మోసపూరిత వాదనలకు దిగడం ఏ తరహా ప్రాచీన భారతీయ సహన సంస్కృతిని నిలబెడుతుంది?
వెంకయ్య నాయుడుగారు ఉందని అంగీకరిస్తున్న ‘కాస్త అసహనం’ పై ఇప్పటికైనా చట్టపరమైన చర్యలు మొదలైతే ఆ ఒప్పుకోలుకు కాస్తన్నా విలువ ఉంటుంది. లేకుంటే జి.ఎస్.టి కోసమే ఆ ఒప్పుకోలు అని నిస్సందేహంగా రుజువైపోతుంది.
ఇప్పుడు నరేంద్ర మోదీ అసహనఘటనలపై ప్రదర్శిస్తున్న వ్యూహాత్మకమౌనం నాడు యుపిఎ 2 హయంలో వరుస కుంభకోణాలపై ప్రధాని సింగ్ గారి మౌనాన్ని గుర్తుకుతెస్తోంది.ఆనాడు సింగ్ గారి మౌనాన్ని కడిగిపారేసిన మోదీ ఇప్పుడు తాననుసరిస్తున్న మౌనంపై ఏమనిసమాధానం చెపుతారు?
ఈ దేశప్రదాని తన తీరుతో “ఆత్మ స్తుతి-పర నింద”కు పరాకాష్టగా నిలుస్తున్నారు.
ఇక్కడ మరోవిషయం రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు ఆయా రాష్ట్రప్రభుత్వాల చేతుల్లోని అంశంకదా!వారి అధికారాల్ని(జవాబుతారీదనాన్ని) ప్రశ్నిస్తూ చేపడుతున్న అంశాలకి తగిన ప్రచారం ఎక్కడా కనబడదేం?