అరుణుడి పరిణామంబెట్టిదనిన…! -కార్టూన్


GST Bill

అరుణుడు అంటే అంగారకుడు కాదు. మన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు!

పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకూ బి.జె.పి ప్రభుత్వ నేతల ప్రకటనల పరిణామాన్ని గమనించినట్లయితే వారు ఒక్కో మెట్టూ దిగుతూ రావడం మనకు కనిపిస్తుంది.

లోక్ సభ ఎన్నికలు ముగిసి ఫలితం వచ్చాక బి.జె.పి నేతల ఆర్భాటపు ప్రకటనలు, ‘ఇక చూస్కోండి’ అన్నట్లుగా వారు మైకుల ముందు ప్రదర్శించిన భంగిమలు… ఆ తీరే వేరు. అదో ఊర్ధ్వ లోకం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, పట్టుమని 5 శాతం సీట్లు కూడా తెచ్చుకోలేక చతికిలబడ్డ దరిమిలా బి.జె.పి నేతల మాటలు మెత్తనయ్యాయి. అప్పటిదాకా వ్యాపారాలకి, కంపెనీలకి వాగ్దానాల వర్ధం కురిపిస్తూ, చట్టాల వరద పారిస్తూ వచ్చిన మంత్రులు హఠాత్తుగా పేదలు, పేదరికం, ప్రజలు… అనడం మొదలు పెట్టారు. కానీ ఢిల్లీదేముంది, చిన్నది, పూర్తిగా రాష్ట్రం కూడా కాదు. బీహార్ లో చూస్కోండి! అన్నారు.

బీహార్ ఎన్నికలూ అయ్యాయి. ఫలితాలూ వచ్చాయి. దిమ్మ తిరిగి బొమ్మ కనపడిపోయింది. బీహార్ లో బి.జె.పి ఓడితే పాకిస్తాన్ లో సంబరాలు జరుగుతాయని బి.జె.పి వ్యూహ చతురులు అమిత్ షా హెచ్చరించినా జనం వినలేదు. ఎస్.సి, ఎస్.టి, ఓ.బి.సి ల నుండి వారి రిజర్వేషన్ లలో కొంత భాగం దొంగిలించి ఒక నిర్దిష్ట మతానికి అప్పజెప్పడానికి లాలూ, నితీశ్ లు కుట్ర పన్నారని సాక్షాత్తు హిందూ హృదయ నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నచ్చజెప్పినా బీహారీయులు పట్టించుకోలేదు.

ఈ నేపధ్యంలో బి.జె.పి ప్రభుత్వానికి సముద్రాల ఆవల నుండి హెచ్చరికల మీద హెచ్చరికలు అందుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల అనంతరం ఐరోపా ఆధిపత్య కేంద్రాలయిన లండన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలను,  ఇటీవలనే బీహార్ ఎన్నికల అనంతరం మళ్ళీ లండన్ వెళ్ళిరావడంతో పాటు టర్కీలో జి20 సమావేశాలకూ ప్రధాని హాజరై వచ్చిన పిమ్మట బహుళజాతి కంపెనీలు కర్తవ్యబోధ చేశాయని తదుపరి పరిణామాలు తెలియజేస్తున్నాయి.

ఆరు నూరైనా వెనువెంటనే జి.ఎస్.టి బిల్లు ఆమోదించేస్తామన్న బి.జె.పి నేతల హామీలు నీటి మూటలే అయ్యాయని ‘వారికి’ ఆగ్రహంగా ఉంది. ఉండదా మరి! ‘వీరి’ గెలుపు కోసం ప్రత్యేక మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ప్రత్యేక నిపుణులను, కార్పొరేట్ వ్యూహదారులను పంపించి… ఇంతా చేస్తే అదిగో, ఇదిగో అంటూ జి.ఎస్.టి బిల్లును వాయిదా వేస్తారా?

జి.ఎస్.టి బిల్లు చట్టం అయితే దేశం ఆర్ధికంగా శరవేగంతో దూసుకుపోతుందని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు బి.జె.పి ప్రభుత్వమూ చెబుతోంది. దేశం అంతా ఒకే తరహా పన్నుల వ్యవస్ధను తీసుకు వచ్చే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లు నిజానికి విదేశీ కంపెనీల వాణిజ్య అవసరాల కోసం తయారు చేసినది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ధాయిలో పన్నులు ఉండడం బహుళజాతి కంపెనీలకు (ఆర్ధిక భాషలో చెప్పాలంటే, ఎఫ్.డి.ఐ లకు) పరమ కంపరంగా ఉంటోంది.

ఒక చోట కంపెనీయో, కార్యాలయామో తెరిస్తే ఎం.ఎన్.సి (మల్టీ నేషనల్ కార్పొరేషన్స్) లకు అక్కడి నుండి దేశం అంతా అతి తేలికగా తమ కబంద హస్తాలను (టెంటకిల్స్) చాచే వీలు కావాలి. కానీ ఒక్కో రాష్ట్రం ఒక్కో పన్ను వేస్తూ ‘స్ధానిక పన్నులు అదనం’ అంటూ ఉంటే తమ సరుకులు, సేవలు అమ్ముకోవడానికీ, అతి త్వరగా లాభాలు గుంజుకోవడానికి ఆటంకాలు కలుగుతున్నాయని అవి ఫిర్యాదు చేస్తున్నాయి. ఇంకా ఎంత కాలం? అని లండన్, బర్లిన్, ప్యారిస్, అనతోలియా (టర్కీ) లలో మనవారికి తలంటు పోయబడింది.

ఆ తలంటు ఫలితాన్నే కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఇనుముని మనకు కావలసిన రీతిలో మలుచుకోవడానికి మనం ఎం చేస్తాం? నిప్పుల్లో వేసి ఎర్రగా కాల్చుతాం. ఆనక చుట్టూ చేరి సుత్తులతో మోదుతాం. ఎక్కడ వంచాలో, ఎక్కడ నిలపాలో లక్ష్యం చేసుకుని గురి చూసి బాదిపారేస్తాం. ఆ తర్వాత మనకు కావలసిన షేపులు వచ్చాక నీళ్ళలో ముంచి చూసుకుని విజయగర్వంతో వాడుకలోకి తెస్తాం.

GST బిల్లుకు త్వరితగతిన ఆమోదింపజేసుకోవాలన్న బోధన ఎంత ఘాటుగా, మోటుగా జరిగిందో కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఎంత ఘాటుగా అంటే GST ఆకారంలో మన ఆర్ధిక మంత్రిగారే ప్రతిపక్షాల ముందు మోకరిల్లి ప్రణమిల్లేటంతగా! ఈ రోజు ప్రధాని మోడి మొదటిసారి కాంగ్రెస్ నేతలు సోనియా, మన్మోహన్ లను చర్చలకు ఆహ్వానించారంటే అది కేవలం బీహార్ ఎన్నికల ఫలితాల వల్ల మాత్రమే అనుకుంటే పొరపాటు. బీహార్ ఎన్నికలూ కారణమే. కానీ ఆ ఎన్నికల దరిమిలా రాజ్యసభలో బలం పెంచుకునే దారులు బి.జె.పి కి మూసుకుపోయాయి. అనగా లోక్ సభలో బిల్లు నెగ్గినా రాజ్య సభలో ఓడిపోతుంది.

కనుక రాజ్యసభలో బలం పెంచుకునే వ్యూహాలు చాలు గానీ, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోండి! అని ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాలు ప్రతిపక్షాలకూ అందాయని రాహుల్ గాంధీ ప్రకటనను బట్టి అర్ధం అవుతోంది. “జి.ఎస్.టి బిల్లు మేము తయారు చేసిందే. కానీ బి.జె.పి దాన్ని మార్చింది. మాకు 3 అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను బట్టి బిల్లును సవరిస్తే ప్రభుత్వంతో సహకరించడానికి ఇబ్బంది లేదు” అని రాహుల్ అసలు సంగతి చెప్పేశారు. ఆఫ్టరాల్ జి.ఎస్.టి బిల్లుకు కర్త కాంగ్రెస్ గాక మరెవరు?

ఇప్పుడు ఏం జరుగుతుంది?

ఒకటి: కాంగ్రెస్ నేతలు కొద్దిగా బెట్టు చేస్తారు (ఇది ఇప్పటికే కొంత జరిగింది). పార్లమెంటు బయటా లోపలా చర్చలు జరుగుతాయి. ఈ లోపు ఇరు సభల్లో ఆవేశకావేశాలు ప్రదర్శించబడతాయి. ట్రెజరీ బెంచీలు అటూ ఇటూ నచ్చజెబుతాయి. సవరణలు కాని సవరణలు మరికొన్ని సవరణలతో ఆమోదించబడతాయి. మొత్తం మీద బిల్లు చట్టం అవుతుంది.

రెండు: కాంగ్రెస్ తీవ్రంగా బెట్టు చేస్తుంది. ఆందోళనలు, నినాదాలు, వాకౌట్లు… లాంటివన్నీ జరుగుతాయి. ప్రతిష్టంభన కొనసాగుతూ పోతుంది. చివర్లో సస్పెన్షన్లు జరగవచ్చు. సస్పెన్షన్ల ద్వారా రాజ్యసభ హాజరు తగ్గుతుంది. చిన్నా చితకా పార్టీల సహకారంతో ఇరు సభల్లో బిల్లు చట్టం అవుతుంది.

ఈ రెండిట్లో మొదటిదానికే ఎక్కువ అవకాశం ఉన్నది. కాస్త అటూ ఇటుగా మూడోది, నాలుగోది కూడా జరగవచ్చు. అంతిమంగా బిల్లు చట్టం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2016లో జి.ఎస్.టి చట్టం తెస్తామని ప్రధాని జి20 సమావేశాల్లో గట్టి హామీ ఇచ్చారు గనక చలికాలం సమావేశాల్లోనే బిల్లు చట్టం కావచ్చు.

ఒకవేళ ఇప్పుడు చట్టం కాకపోతే అది బి.జె.పి కి విదేశాల్లో మహా అవమానం అవుతుంది. అనుమానమూ వస్తుంది. పెట్టుబడులు బైటికి పరుగెడతాయి. జి.డి.పి వృద్ధి రేటు (ప్రభుత్వం దృష్టిలో అభివృద్ధి) టపీమని పడిపోతుంది. కనుక ఎట్టి పరిస్ధుతుల్లోనూ జి.ఎస్.టి బిల్లు చట్టం అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే అది బి.జె.పి వైఫల్యంగా పశ్చిమ పత్రికలు విరుచుకుపడడం ఖాయం!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s