[“Aamir Khan’s right to speak” శీర్షికన ఈ రోజు (నవంబర్ 26) ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్]
****************
భారతీయ జనతా పార్టీ పరివారం సవరించుకున్న లెక్కలో ఇప్పుడు అమీర్ ఖాన్ ఇండియాకు చెడ్డపేరు తెస్తున్న విలన్. రచయితలు, నటులు, శాస్త్రవేత్తలకు మద్దతుగా వస్తూ, తన సొంత ఆందోళనకు, బహుశా మాటల ఒరవడిలో, మరోచోటికి వెళ్లవలసి వస్తుందా అంటూ తన భార్య వ్యక్తపరిచిన ఆతృత మరియు ఆలోచనలకు గొంతుక ఇవ్వడం ద్వారా దేశంలో అసహనంపై జరుగుతున్న చర్చను అమీర్ ఖాన్ పునః ప్రారంభించిన రోజున ఈ సవరణ జరిగిపోయింది.
కేంద్రంలో బి.జె.పి నేతృత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆయనను ‘స్వచ్ఛ భారత్’ కు బ్రాండ్ అంబాసడర్ గా నియమించి ఎంతో కాలం గడవలేదు. తమ ‘ఇంక్రెడిబిల్ ఇండియా’ కు బహిర్ముఖంగా ఆయన కొనసాగుతున్నారు కూడా. ఖాన్ పై కుమ్మరిస్తున్న విమర్శల వెల్లువ అంతరార్ధం ఏమిటంటే, గతంలో (తమకు) ప్రతికూలమైన అవగానల వ్యక్తీకరణకు ఈ నటుడు పేరుపడినప్పటికీ ఆయన పట్ల నరేంద్ర మోడి ప్రభుత్వం ఎంతో దయ చూపుతుండగా ఖాన్ మాత్రం మొండిగా, కృతజ్ఞత లేకుండా, తనపై కురిపిస్తున్న దయను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడని.
కనుక ఖాన్ పై వస్తున్న విమర్శలు అందరూ ఊహించగల పద్ధతిలోనే ఉండగలదు. తమ అవార్డులను వెనక్కి ఇచ్చేసిన రచయితలు దేశభక్తిలేమితో, జాతి-వ్యతిరేకతతో, దురుద్దేశాలతో వ్యహరిస్తున్నారని తోటి రచయితలు నిందిస్తే, అమీర్ ఖాన్ తన సహ నటుల నుండి (అదే విధమైన) విమర్శలను ఎదుర్కొంటున్నారు. వారిలో కొందరు ప్రస్తుత రాజకీయ నాయకత్వానికి అనుకూలంగా గొంతు విప్పే బహిరంగ మద్దతుదారులు. ఈ కోలాహలంలో ఖాన్ ఆందోళనలకు, ముఖ్యంగా ఏ ప్రజాస్వామిక వ్యవస్ధకైనా అత్యవసర మూల ధాతువులైన భద్రత మరియు న్యాయం కలుగుతాయన్న నమ్మకం కలిగి ఉండడం ముఖ్యం అని ఆయన చేసిన వ్యాఖ్యకు, యధావిధిగా లిప్తకాలపు మన్నన మాత్రమే లభించింది.
ఈ రెండూ (భద్రత, న్యాయం) కొరవడ్డాయన్న అంచనా వల్లనే రచయితలు/శాస్త్రవేత్తలు/కళాకారులు మరియు ఫిలిం మేకర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిరసనగా తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. వారి వలెనే ఖాన్ కూడా ఈ రెండింటిని రాజకీయ నాయకత్వం -ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి- కల్పించవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేశ ప్రజలు ఎంచుకున్న నాయకుడనీ, ఆయన ప్రజల ఆందోళనలను పట్టించుకోవాలని ఖాన్ గుర్తు చేశారు.
ప్రధాన మంత్రి కొనసాగిస్తున్న మౌనం పౌర సమాజ సభ్యులను, ముఖ్యంగా మైనారిటీ మతాల వారిని అనేక విధాలుగా ఆందోళనకు గురిచేస్తున్న కారణంగా ఉంటోంది. బీహార్ ప్రచారం సందర్భంగా మైనారిటీ మతాన్ని ఉద్దేశిస్తూ, వారిని నేరుగా ప్రస్తావించకుండానే, మోడి చేసిన వ్యాఖ్యలు గణనీయ స్ధాయిలో కలవరం కలిగించాయి. కేంద్ర ప్రభుత్వం, మరియు బి.జె.పిల లోని రాజకీయ నాయకత్వం ప్రశ్నలను స్వీకరించడం ద్వారా ఈ ఆందోళనలను పరిష్కరించడంలో ప్రతిఘటన చూపిస్తోంది. తద్వారా వారి ఆందోళనలను బలీయం కావిస్తోంది.
బి.జె.పి మిత్రులు శివసేన “అమీర్ ఖాన్ ను పాకిస్తాన్ పంపవచ్చు” అంటూ చేసిన సూచనలో తీవ్రమైన కలవరపాటుకు గురి చేసే అంశమేదో ఉన్నది. ఖాన్ ముస్లిం కనుక (శివసేన మాటల) పొందికలో దాపరికాన్ని పొందుపరచాల్సిన పనేమీ లేదన్నమాట! ఖాన్ ని ఓ సమగ్ర భాగంగా కలిగి ఉన్న బాలీవుడ్ పరిశ్రమ మతపర గుర్తింపులను ఎన్నడూ పట్టించుకోలేదు. తనకు గానీ, తన భార్యకు గానీ ఇండియా వదిలివెళ్లే ఉద్దేశమే లేదని అమీర్ స్పష్టత ఇచ్చుకోక తప్పని పరిస్ధితి ఏర్పడింది.
తమ దేశభక్తిని రుజువు చేసుకోక తప్పని పరిస్ధితిని పౌరులకు కల్పించడం ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్ధకు సంకేతం కాదు. ప్రతి భారతీయునికీ తన దేశాన్ని విమర్శించే హక్కు ఉండి తీరాలి. తోటి పౌరులు విమర్శను విద్రోహానికి సంకేతంగా చూడడం మొదలు పెడితే అది ఉదారరాహిత్యానికి సంకేతం. అలాంటి తోటి భారతీయులు నేరుగా గానీ లేదా రాజకీయంగా గానీ అధికారంతో సంబంధం కలిగి ఉన్నవారయితే అప్పుడు ప్రజాస్వామ్యం నిజంగా ప్రమాదంలో ఉన్నట్లే.