ప్రధాని మోడి: నూవ్వింకా వేగంగా పరుగెత్తాల్సి ఉంది. వాళ్లందరికీ నేను నువ్వు పులివి అని చెప్పి వస్తిని…
******************
సింగపూర్ లో భారత ప్రధాని చేసిన ప్రసంగం వింటే నోటిపై వేలు వేసుకోకుండా ఉండలేము. ఆయన తన మాటల మాయాజాలంతో ఆకాశంలో విహరింపజేస్తూ చెప్పింది ఏ ఇండియా గురించో అర్ధంకాక తలలు పట్టుకోకుండా ఉండలేము.
తాము అధికారం చేపట్టిన 18 నెలలు గడిచాయో లేదో అప్పుడే భారత దేశం వెనకడుగు మానుకుని చుక్కల్లోకి దూసుకు పోతోందట! “ప్రపంచం ఇప్పుడు ఇండియాను నమ్మకంతో చూస్తోంది. విశ్వం అంతా ఇప్పుడు భారత దేశాన్ని తనతో సమానంగా చూస్తోంది. ఇండియా పెద్ద బజారు, సరుకులు అమ్ముకుందాం అని కాకుండా ఇండియాతో భాగస్వామ్యం కోసం పరితపిస్తోంది” అని చెబుతూనే “ఇండియాకు విదేశీ పెట్టుబడుల అవసరం ఉంది” అని ఒప్పేసుకున్నారు. ఇండియాతో పార్టనర్ షిప్ కోసం పరితపిస్తున్న విదేశాలకు ఇండియాలో ఎఫ్.డి.ఐల చొరబాటుతో ఏం అవసరమో విశ్వంతో సమానమైన ఇండియాకి ఎఫ్.డి.ఐ లతో ఏమి అవసరమో ప్రధాని చెప్పలేదు.
కానీ ఎఫ్.డి.ఐ లు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ కాదనీ తన ఉద్దేశం ‘ఫస్ట్ డవలప్ ఇండియా’ అని ప్రధాని తన మాటల మర్మం ఎరుకపరిచారు. దానితో అక్కడ (ఇండియన్ డయాస్పోరా సమావేశం) చప్పట్ల మోత! ఈ మాటల మాయాజాలం ఉత్తేజపరిచే ప్రసంగానికి పనికి రావచ్చు గాక! వాస్తవంలో, ఆచరణలో ఎఫ్.డి.ఐ ల కోసం ఈ 18 నెలలలోనే 33 దేశాలను చుట్టి వచ్చిన సంగతిని ఏ మాయాజాలం మరుగుపరచగలదు? ప్రపంచ నలుమూలలకీ, ఒక్క దక్షిణ అమెరికా ఖండం తప్ప, ప్రతి ఒక్క ఖండమూ చుట్టి వచ్చిన ప్రధాని ‘ఫస్ట్ డవలప్ ఇండియా’ ఉద్దేశంతోనా లేక ‘ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్’ ఉద్దేశంతోనా?
భీమారంగంలో 26 నుండి 49 శాతానికి విదేశీ పెట్టుబడుల్ని మోడి ప్రభుత్వం పెంచి వేసింది. రైల్వేల్లో 100 శాతం ఎఫ్.డి.ఐ లకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం మొన్ననే ప్రకటించింది. చివరికి దేశ రక్షణకు ఎంతో కీలకమైన రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్న ప్రభుత్వానికి ఆ పెట్టుబడుల వల్ల వచ్చే లాభాలతో చుక్కల చెంతకు చేరేది విదేశీ కంపెనీలే లాభాలే అనీ, భారత అభివృద్ధి కాదనీ తెలియదనుకోవాలా? వెరసి ఎఫ్.డి.ఐ లకు ఆహ్వానం అంటే భారత్ ను మంచి బజారుగా చూడడమే కాదా? భారత దేశం విదేశీ కంపెనీలకు బ్రహ్మాండమైన పెట్టుబడుల మార్కెట్ ని ప్రధాన మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు ఎన్నిసార్లు బహుళజాతి కంపెనీలను ఊరించలేదు?
సింగపూర్ సమావేశాల్లో 2016 కల్లా జి.ఎస్.టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) బిల్లు ఆమోదం ఖాయం అని మోడీ హామీ ఇవ్వడం ఎవరికి? విదేశీ కంపెనీలకే. విదేశీ కంపెనీలకు ఇచ్చే హామీ ఇండియాను మొదట ఎలా అభివృద్ధి చేయగలదు? అక్కడ జి.ఎస్.టి బిల్లుపై హామీ ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఇండియాలో “జి.ఎస్.టి బిల్లు ఆమోదానికి సహకరించాలి” అని ప్రతిపక్షాలను బతిమిలాడుకుంటోంది. అంత గొప్ప జి.ఎస్.టి ని అసలు తాను ప్రతిపక్షంలో ఉండగా బి.జె.పి ఎందుకు వ్యతిరేకించింది? ఇది రాష్ట్రాల హక్కులను కాలరాసే బిల్లు అని బి.జె.పి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోయడం నిజం కాదా?
నీలి నక్క తాను నక్కల గుంపులో ప్రత్యేకం అని ఎంత నమ్మజూపినా ఆ నీలి రంగు బులుపు కాస్తా వదిలేసరికి అదీ మామూలు నక్కే అని గుంపు గ్రహించకుండా ఊరుకున్నదా? తాబేలులా పరుగెడుతున్న భారత ఆర్ధిక వ్యవస్ధ “నువ్వు పులివి, పులిలా పరుగెట్టాలి” ఎని ఎంత ఉబ్బించినా దానివి తాబేలు కాళ్లే గనక పులిలా పరుగులు పెట్టడం సాధ్యం కాదు. విశ్వం అంతా అలా చూస్తోంది, ఇలా చూస్తోంది అంటూ స్వజనానికి ఎన్ని గొప్పలు చెప్పినా మన పాలకవర్గాల ఇండియా సరుకు ఏమిటో ఆ విశ్వానికి తెలియకుండా పోయిందా!
ఇండియా అంటే జనం. 120 కోట్ల జనం. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా గల జనం. నూటికి 65 మంది భూముల్ని నమ్మి బతుకుతున్న జనం. ఆ మిగిలిన 35 మంది ఆధారపడే కంపెనీలకు కూడా వ్యవసాయం నుండే ముడి సరుకులు, ద్రవ్య వనరులు రావాలి. ఆ మాటకొస్తే ఇండియాలో ఋతుపవనాల కోసం పశ్చిమ దేశాలు కూడా ఎదురు చూస్తాయంటే ఏమిటి అర్ధం? ఇక్కడి వ్యవసాయంపైన అనేక బహుళజాతి కంపెనీల లాభాలు కూడా ఆధారపడి ఉన్నాయని.
కనుక ప్రధాని చెబుతున్న ‘ఫస్ట్ డవలప్ ఇండియా’ నినాదమే నిజమైతే మొదట రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. భూములు లేని జనానికి భూములు ఇచ్చే భూసంస్కరణలు అమలు చేయాలి. విశ్వానికి ఆకర్షణగా కనపడుతున్న భారత మధ్యతరగతి మార్కెట్ అసలు అభివృద్ధి చెందిందే ‘ప్రభుత్వరంగ కంపెనీల వలన’ అన్న నిజాన్ని గ్రహించి పెట్టుబడుల ఉపసంహరణ (Disinvestments) మానుకోవాలి. మరిన్ని ప్రభుత్వ కంపెనీలను స్ధాపించి మరిన్ని ఉద్యోగాలను కల్పించాలి. చదువుకున్న వారికి పని కల్పించాలి. దేశ ఆర్ధిక కార్యకలాపాలు అంటే ప్రధానంగా ఇవే. ఇవి కాకుండా ఎన్ని చెప్పినా అంతా ఉత్త గాలే!