బ్రిటన్ కేంద్రంగా పని చేసే బహుళజాతి మీడియా కార్పొరేట్ సంస్ధ రాయిటర్స్ ఈ రోజు ఓ వార్తా కధనాన్ని ప్రచురించింది. మోడి పాలనలో ఇండియాను సందర్శించే అమెరికా అధికారుల పరిస్ధితి ఏమిటో విశ్లేషించడానికి ప్రయత్నించిన కధనం అది. భారత రాయబారి దేవయాని ఖోబ్రగాదేను అక్రమంగా అరెస్టు చేసి జైలుపాలు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో తేడా ఏమన్నా వచ్చిందా అని ఈ కధనం విశ్లేషించేందుకు ప్రయత్నించింది.
దేవయాని ఖోబ్రగాదే వ్యవహారం గురించి మర్చిపోతే గనక దాని కోసం ఈ కింది లంకెను సందర్శించండి.
అంతర్జాతీయ రాయబార చట్టాలను ఉల్లంఘించి భారత రాయబారి దేవయానిని అరెస్టు చేసిన దరిమిలా అమెరికా, ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడ్డాయని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం స్ధానంలో మోడి/బి.జె.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా మెరుగు పడ్డాయని కధనం విశ్లేషించింది. అయినప్పటికీ అమెరికా అధికారులకు ఇండియా వీసాలు దొరకడం కష్టంగానే ఉన్నదని రాయిటర్స్ వార్తా సంస్ధ వాపోయింది. అందుకు ఉదాహరణగా ఇటీవలి ఘటనను ఉటంకించింది.
అక్రమంగా ప్రజలను రవాణా చేయడాన్ని నివారించే విభాగానికి అమెరికా కొత్తగా నియమించిన రాయబారి సుసాన్ కోపెడ్జ్, ఎల్.జి.బి.టి హక్కుల రాయబారి ర్యాండి బెర్రీ లు ఈ నెలలో ఇండియా సందర్శించవలసి ఉంది. అయితే వారికి వీసాలు జారీ చేయడానికి ఇండియా మీనమేషాలు లెక్కిస్తోందని అమెరికా రాయబార వర్గాలు చెప్పాయని పత్రిక తెలిపింది. ఈ సందర్శనల విషయం మొదటి సారి నవంబర్ 4 తేదీన అమెరికా విదేశాంగ శాఖ కాంగ్రెస్ లో జరిగిన హియరింగ్ లో బహిరంగం కావించింది.
“ఈ సందర్శనలు కొత్తవి కాదు. ముందుగానే అనుకున్నవి. ఈ సమయానికల్లా వారు ఇండియాలో ఉండాలి. కానీ కొన్ని సమస్యలు ఎదురు కావడం వల్ల వీలు కాలేదు” అని అమెరికా రాయబార వర్గాలు చెప్పాయని రాయిటర్స్ ఫిర్యాదు చేసింది. అయితే అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయంలో “వ్యాఖ్యానించడానికి” నిరాకరించిందట. కానీ “ఇరు వర్గాలకు అంగీకార యోగ్యమైన తేదీల కోసం ఇరువైపులా చర్చలు చర్చలు జరుగుతున్నాయి” అని మాత్రం చెప్పారట.
అలాగే భారత విదేశాంగ శాఖ కూడా ఈ అంశంపై వ్యాఖ్యానించాలని కోరితే “స్పందించలేద”ట. అమెరికాలో భారత రాయబారి అరుణ్ కె. సింగ్ (ఈయన్ని ఇటీవలే మే 2015 లో నియమించారు) అమెరికా రాయబారులకు ఇంకా అనుమతి ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో “వివరణ” ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని రాయిటర్స్ తెలిపింది.
“చూద్దాం. మేము పరిశీలిస్తున్నాం. ఎవరైనా వ్యక్తికి వీసా ఎప్పుడు ఇస్తారని అమెరికా అధికారులను అడిగితే ‘వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మేము (ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని) మదింపు చేస్తాం…..’ అని ఎప్పుడూ చెబుతుంటారు కదా. అలాంటి అమెరికా స్పందనకు మించి మేమయినా ఏమి చెప్పగలం” అని అరుణ్ కె. సింగ్ చురక తగిలించారు.
ఈ మాత్రం చురక తగిలించడానికి ధైర్యం చేసినందుకు అరుణ్ కె. సింగ్ ను ‘భళా!’ అని మెచ్చుకోవచ్చు. గతంలో ఈ మాత్రం మాట్లాడిన అధికారులు కూడా మనకు లేరు మరి. పాకిస్తాన్ మంత్రులు, అధికారులు అయినా అనేకసార్లు, కనీసం ప్రకటనల రూపంలో నైనా’ అమెరికాను తిట్టిపోయాడమో, ఎగతాళి చేయడమో, మాటకు మాట అంటించడమో చేశారు గానీ భారత మంత్రులు, అధికారులకు మాత్రం అలాంటి చరిత్ర లేదు. ఎప్పుడూ చూసినా నీళ్ళు నమలడం, నంగి నంగిగా మాట్లాడ్డం, లేకపోతే ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడం…. ఇదే జరుగుతుంది.
అరుణ్ కె. సింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడికి ఎదురైన అనుభవాన్ని పరోక్షంగా గుర్తు చేశారనడంలో సందేహం లేదు. గుజరాత్ మతోన్మాద హింసను దగ్గరుండి ప్రోత్సహించారన్న ఆరోపణతో ఆయనకు అమెరికా అనేక యేళ్లపాటు వీసా ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. మోడిని తమ ప్రధాని అభ్యర్ధిగా బి.జె.పి మొదటిసారి ప్రకటించినప్పటి నుండి ‘అయితే మోడీకి వీసా ఇస్తారా’ అని విలేఖరులు అడిగినప్పుడల్లా అమెరికా విదేశాంగ శాఖ అధికారులు “వీసా కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇవ్వాలా వద్దా అని మదింపు చేస్తాం” అని చెప్పేవారు.
ఈ స్పందననే అరుణ్ సింగ్ రాయిటర్స్ విలేఖరికి గుర్తు చేశారు. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా మోడీకి వీసా ఇవ్వడానికి ఆదిలో నిరాకరించాయి. ఆ తర్వాత మోడి గెలవబోతున్నారని గ్రహించి ప్లేటు ఫిరాయించి ‘గతాన్ని పట్టుకుని వెళ్లాడకూడదు’ అంటూ తమకు తామే హితబోధలు చేసుకుని మోడీకి వీసా ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అమెరికా మాత్రం అలా చేయలేదు. ‘దేశాధినేతలకు వీసా ఇవ్వడమా లేదా అన్న ప్రశ్నే ఉదయించదు’ అనడమే గాని నరేంద్ర మోడికి వీసా ఇస్తాం అని మాత్రం ఎప్పుడూ కమిట్ కాలేదు. అవసరం అయితే, పదవి పోయాక, మోడీపై మళ్ళీ నిబంధనలు మోపే అవకాశాన్ని అట్టే పెట్టుకుంది.
అలాంటి అమెరికా మద మాత్సర్యాలను గుర్తు చేసి మీరు చేస్తే ‘రూల్’ మేము చేస్తే ‘సహకార నిరాకరణా?’ అని అరుణ్ సింగ్ పరోక్షంగా ప్రశ్నించారు. అందుకే ‘భళా అరుణ్ కె. సింగ్!’
అయితే ఇందులో అనేక తిరకాసులు ఉన్నాయి. వీసా ఇవ్వడానికి మోడి ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నది అరుణ్ కె. సింగ్ చెప్పిన కారణమా లేక మరొకటా? ఒక రాయబారి ర్యాండి బెర్రి ఎల్.జి.బి.టి హక్కుల రాయబారి. ఎల్.జి.బి.టి అంటే లెజ్బియన్-గే-బై సెక్సువల్-ట్రాన్స్ జెండర్ అని అర్ధం. ఈ అంశం గురించి కొంత చెప్పుకోవాలి.
అమెరికా ప్రజల దృష్టిని తమ విధానాలపై నుండి మళ్లించేందుకు అమెరికా పాలకులు ప్రజల్లో సామాజికంగా కొత్త, వింత పోకడలు తలెత్తేలా ప్రోత్సహిస్తారు. లేదా తలెత్తిన వింత పోకడలకు ప్రోత్సాహం కల్పిస్తారు. తద్వారా ప్రజల మధ్య సమస్యలు అనడానికి వీలు లేని సరికొత్త సమస్యలు ఉద్భవించేలా చేసి ఆ సమస్యలపై వారిలో వారు కొట్టుకునేలా చేస్తారు. అలా వారిలో వారు కొట్టుకోవడం ఉద్యమం రూపం దాల్చేవరకూ ప్రోత్సాహం కల్పిస్తారు. ఆయా పోకడలపై రాజకీయ దుమారం కూడా లేవదీస్తారు. ఇక జనం తమ అసలు సమస్యలు మర్చిపోయి పనికిమాలిన సమస్యల పైన తమలో తాము చర్చలు చేసుకుంటూ, పోట్లాడుకుంటూ, ఉద్యమాలు నిర్వహిస్తూ, సంస్ధలను స్ధాపిస్తూ బిజీ అయిపోతారు.
అలాంటి పనికిమాలిన ఉద్యమాల్లో ఎల్.జి.బి.టి ఉద్యమం ఒకటి. వ్యక్తులు ప్రైవేటుగా ఎన్ని రకాలుగా లైంగిక పోకడలు పోయినా మరొకరి సొంత హక్కులోకి జొరబడనంత వరకూ అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. అలాంటి ప్రైవేటు వ్యవహారాన్ని రచ్చకు ఎక్కించి జనాల్లో వివిధ గ్రూపుల్ని తయారు చేసి, వారి చేత ఉద్యమాలు చేయించి, చట్టాలు కూడా తెచ్చి సమాజాన్ని అర్ధంకాని రీతిలో ఛిద్రం చేయడమే అభ్యంతరకరం.
భారత ప్రభుత్వం ప్రస్తుతం హిందూత్వ సంస్ధల చేతుల్లో ఉన్నందున ఎల్.జి.బి.టి రాయబారి ఆగమనం సహజంగానే సమస్యలతో కూడినదే. ఎల్.జి.బి.టి ధోరణి సనాతన హిందూ సంస్ధలు సహించవు. అమెరికా ఎల్.జి.బి.టి రాయబారి రావడం అంటే ఇక్కడ అలాంటి గ్రూపులకు ప్రోత్సాహం అవుతుంది. కొన్ని సమావేశాలు జరుగుతాయి. విలేఖరులతో మాట్లాడతారు. ఎల్.జి.బి.టి హక్కులు కాపాడాలని పిలుపులు ఇస్తారు. పత్రికల నిండా తమకు ఇష్టం లేని లైంగిక పోకడలపై చర్చలు జరగడం ఆర్.ఎస్.ఎస్ తదితర హిందూత్వ సంస్ధలకు ససేమిరా ఇష్టం ఉండదు. అది జరిగితే అలాంటి చర్చలపైనా, పోకడలపైనా తమ అభిప్రాయమూ చెప్పాలని పత్రికలు నిలదీస్తారు. అప్పుడు హిందూత్వ అధినేతలు తీవ్రంగా విరుచుకు పడడం ఖాయం. అది కాస్తా బి.జె.పి కి వ్యతిరేకంగా మారితే ఏమిటి పరిస్ధితి?!
కోపెడ్జ్, బెర్రీ ల సందర్శనకు అంత త్వరగా వీసా ఇవ్వడానికి మోడి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడానికి ఇది కారణం కావచ్చు. ఇదే కారణం కావచ్చు కూడా. అందుకే దొడ్డి దారిన ఇండియాలో చర్చను ప్రవేశపెట్టేందుకు రాయిటర్స్ ద్వారా చొరవ జరిగి ఉన్నా ఆశ్చర్యం లేదు.