మద్యపానం: కనీస వయసు తగ్గించిన బి.జె.పి ప్రభుత్వం


Achche din to Mumbai night life

Achche din to Mumbai night life

వ్యాపారాలు చేసుకోవడానికి బ్రహ్మాండమైన సానుకూల వాతావరణం ఏర్పరుస్తామని ఎన్నికలకు ముందు బి.జె.పి వాగ్దానం చేసింది. ఆ సంగతి చెప్పడానికే ప్రధాని నరేంద్ర మోడి దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. గతంలో ఏ ప్రధానీ తిరగనన్ని దేశాలు అతి తక్కువ కాలంలోనే పర్యటిస్తూ ఆయన కొత్త రికార్డుల్ని స్ధాపిస్తున్నారు కూడా. ఇలా వ్యాపారులకు సంపూర్ణ సహకారం ఇవ్వడంలో బి.జె.పి ఏలుబడిలోకి వచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతు పాత్రను ఘనంగా పోషిస్తున్నాయి.

ముంబై నగరపు ఉత్సాహకరమైన రాత్రి జీవనాన్ని (Vibrant night life) మరింతగా ప్రోత్సహించే గొప్ప సదుద్దేశంతో మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడి ప్రజలకు తాగుడు వయసు తగ్గించేశారు. ముంబై నగరం యొక్క రాత్రి జీవనాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో బహుళజాతి ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్ధ ఏక్సంచర్ (Accenture) తయారు చేసిన నివేదికకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసేశారు. ఈ ఆమోదం మేరకు మద్య పానం చేసేందుకు ఇక నుండి 25 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆగనవసరం లేదు. 21 సం.లు వస్తే చాలు.

అసలు 25 సం.ల వయసు రావడం అటుంచి, ముంబైలో 21 వచ్చేవరకైనా తాగకుండా ఆగుతున్నారా అన్నది ఇప్పుడు హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రశ్న! కనీసం వయోజన ఓటింగు హక్కు సమకూరే వయసు (18 సం.లు) వచ్చేవరకైనా ఆగుతున్నారా? నా క్లాస్ మేట్లు 10వ తరగతిలోనే మద్యం రుచి చూడడానికి మహా ఉబలాటపడడం నాకు బాగా గుర్తుంది. అనగా 15 యేళ్ళు నిండీ నిండకుండానే వాళ్ళు మద్యాన్ని రుచి చూశారు. ఇది కూడా 1980ల నాటి సంగతి. అందునా గుంటూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలోని సంగతి!

ఇదే క్లాస్ మేట్లు, నేను యూనివర్సిటీలో నాలుగేళ్ళు గడిపిన తర్వాత కూడా మద్యం రుచి చూడలేదని తెలుసుకుని మహా హాశ్చర్యపడిపోయేశారు. నాకు ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినప్పుడు ‘తాగుడు పార్టీ’ ఇవ్వలేదని వాళ్ళలో ఇద్దరు నా మీద అలిగారు కూడాను. ఆఫ్ కోర్స్! వారిలో ఎవరూ ఒళ్ళు గుల్ల చేసుకునేంతగా మద్యానికి బానిసలు కాలేదనుకోండి!

ముంబై విషయానికి వస్తే చట్టం రీత్యా 25 సం.లు వచ్చేవరకూ మద్యం ముట్టుకోకూడదన్న శాసనం చాలా మందికి న్యూసెన్స్ గా మారిపోయింది. ముఖ్యంగా వ్యాపారస్ధులకి. ‘ఇలాగైతే వ్యాపారాలు ఎలా చేస్తాం?’ అన్నది వారి ప్రశ్న. ‘ఇలాగైతే పెట్టుబడులు ఎలా వస్తాయి?’ అని విదేశీ కంపెనీలు (ఎఫ్.డి.ఐ) లు కూడా నిలదీశాయి. ‘ఇలాగైతే ముంబై కి టూరిస్టులు ఎలా వస్తారు?” అని ఏక్సంచర్ కంపెనీ తన నివేదికలో ప్రశ్నిస్తూ పరిష్కారం కూడా చూపించింది.

‘పిలకాయల్ని కూడా తాగనిస్తే పోలా?’ అన్నదే ఏక్సంచర్ చూపించిన గొప్ప పరిష్కారం. మద్యపానం ప్రోత్సహించడం ద్వారా బడ్జెట్ రెవిన్యూలో సింహభాగాన్ని (పాత) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సంపాదించడం గుర్తు తెచ్చుకుంటే ఏక్సంచర్ పరిష్కారం శక్తి ఏమిటో అర్ధం అవుతుంది. వేల కోట్లు ఆదాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఆర్జించేది. మద్యం వ్యాపారులు ఆర్జించే సంపాదనకైతే లెక్కే లేదు. ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ చట్టం తెచ్చిన ఎన్టీఆర్, మద్యం లాబీ కుట్రల వల్లనే అధికారం కోల్పోవలసి వచ్చిందని గుర్తు చేసుకోవడం ఈ సందర్భంగా సముచితం కాగలదు.

ఆల్రెడీ పిల్లలు తాగేస్తున్నారు కదా, ఇక చట్టం ఎందుకు? ఇక్కడే ఉంది తిరకాసు. హిందూత్వ గ్రూపుకు చెందిన సంస్కృతీ పరిరక్షక సంస్ధల నుండి రక్షణ పొందాలంటే చట్టం తప్ప మరోదారి లేదని మద్యం కంపెనీలు గ్రహించాయి. ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సంస్కృతి పరిరక్షణ పేరుతో రాత్రిళ్ళు బార్లు, పబ్ లపై దాడులు చేయడం, మామూలు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే సామాన్లన్నీ ధ్వంసం చేసి “హిందూ సంస్కృతిని మంటగలుపుతారా?” అంటూ ఆర్భాటంగా ప్రకటించడం… సాధారణం అయిపోయింది.

గట్టిగా అడిగితే వారికి చట్టాలే అక్కరకు వస్తున్నాయి. 25 సం.ల లోపు వయసు ‘పిల్లలకు’ మద్యం తాగబోయించడం చట్ట విరుద్ధం కనుక కోర్టుల్లో కేసులు పెట్టలేని దుస్ధితి! బి.జె.పి అధినేతలు కూడా ఏమీ అనలేని పరిస్ధితి! అదీ కాకుండా పోలీసులు, లైసెన్సింగ్ అధికారుల చేతివాటం కూడా జాస్తి అయిపోయింది. అసలీ న్యూసెన్స్ అంతా ఎందుకు, చట్టాన్నే సవరిస్తే పోలా?

అదండీ సంగతి! కంపెనీల వ్యాపారాలకు అత్యంత సానుకూల వాతావరణం కల్పించడం అంటే ఇష్టారీతిన వనరుల దోచుకొమ్మని విదేశీ కంపెనీలకు ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడం మాత్రమే కాదు. తమ మానాన తాము ఎలాగోలాగు బతుకులు నెట్టుకొస్తున్న జనం ధన, మాన, ప్రాణాలతో ఆడుకోవడం కూడా. నిజానికి ఈ రెండూ వేరు వేరు కాదు. విదేశీ పెట్టుబడుల దోపిడీకి భారత పాలకులు కింది నుండి మీది వరకూ సహకరిస్తున్న ఓ పెద్ద ప్రక్రియలో ఇవి అనివార్యమైన భాగం.

ఉదాహరణకి ఏక్సంచర్ కంపెనీనే తీసుకుంటే ఇది అమెరికా-ఇంగ్లండ్ కంపెనీ అయితే 120 దేశాల్లో దాని కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఒక్క మేనేజ్ మెంట్ సలహాలు మాత్రమే కాకుండా టెక్నాలజీ సర్వీసులు, సాఫ్ట్ వేర్ సర్వీసులు, వ్యాపార వ్యూహాలు, వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్.. ఇలా అనేక రంగాల్లో ఈ కంపెనీ వేళ్లూనుకుంది. ఇలాంటి కంపెనీకి ఇండియాలోని సేవల మార్కెట్ పై కన్నుపడితే ఆశ్చర్యం ఏముంది? అసలు ఆశ్చర్యం ఏమిటంటే ‘స్వదేశీ’ ‘హిందూ సంస్కృతి’ అంటూ గొంతులు చించుకోవడమే కాకుండా తమ సొంత యాక్షన్స్ కూడా చేసేసే ‘దేశీయ’ సంస్ధలు మరియు పార్టీల ప్రభుత్వమే, ముంబైలో తాము ఏ చట్టాలు తేవాలన్న విషయాన్ని విదేశీ కంపెనీ సలహాలు కోరడం!

ముంబైలో తాగి చిందులేయడానికి ఏ వయసు దాటితే సరిపోతుందన్న సంగతి విదేశీ ప్రైవేటు బహుళజాతి కంపెనీ చెబితే తప్ప మన భారతీయ జన ప్రభుత్వానికి తెలియలేదా?

ఏక్సంచర్ లాజిక్ ఏమిటి అంటే ముంబైని సందర్శించే టూరిస్టులు మరింత కాలం నగరంలో గడపాలంటే తాగుడు వయో పరిమితి తగ్గించాలీ అని. ప్రస్తుతం ముంబై వచ్చే విదేశీ టూరిస్టులు 4 రోజుల పాటు నగరంలో గడిపితే స్వదేశీ టూరిస్టులు 2 రోజులు మాత్రమే ఉంటున్నారు. ఇలా ముంబైలోనే ఉండిపోయే సమయాన్ని పెంచితే ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుందని ఏక్సంచర్ అంచనా! అది జరగాలంటే తాగుడు వయో పరిమితిని తగ్గించడం మహ భేషైన మార్గం అని ‘మన’ విదేశీ కంపెనీ సిఫారసు!

గత వారం కంపెనీ తన నివేదికని సమర్పిస్తే బి.జె.పి ప్రభుత్వం వారం తిరక్కుండానే ఆ నివేదిక పైన ఆమోద ముద్ర వేసేసింది. ‘వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని సులభతరం చేయడం’ లో ఇలా వేగంగా ఆమోద ముద్ర వేయడం కూడా ఒక భాగమే. అదే ఏ లోక్ పాల్ బిల్లునో తీసుకోండి. యుగాలు గడవాలి. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును చూడండి. యుగాలు కూడా చాలవు. పొరుగు పాలపుంతకి వెళ్ళి ఇంకేవో సుదీర్ఘ కాల వ్యవధుల్ని అరువు తెచ్చుకోవాల్సిందే. అంతెందుకు? రాష్ట్రంలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వారానికి పైగా వర్షాలు విడవకుండా కురుస్తున్నాయి. చాలా మంది నివాసాలు నష్టపోయారు. నష్ట నివారణ చర్యలకు 1000 కోట్లు కావాలని మన ముఖ్యమంత్రి కోరారు. ఆ సాయం ఎప్పుడు వస్తుందో…. చూడండి. ఇవ్వడం మాట అటుంచి, ఇస్తాం అన్న మాటయినా ఎప్పుడు వెలువడుతుందో చూడండి!

ఇవేనా భారతీయులకు హామీ ఇచ్చిన మంచి రోజులు! హతవిధీ!!

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s