బీహార్ ఎన్నికల ఫలితాలు బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ తదితర హిందూత్వ సంస్ధలకు గట్టి షాకే ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఓటమి ఎరగని జగజ్జేతగా హిందూత్వ గణాల చేత అదే పనిగా పొగడ్తలు అందుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడి మొఖంపై నెత్తురు చుక్క లేకుండా చేశాయి. పాచిక విసిరితే తిరుగే ఉండని గొప్ప వ్యూహకర్తగా మన్ననలు అందుకుంటున్న అమిత్ షా అవాక్కై నెత్తి గోక్కునేలా చేశాయి.
పుండు మీద కారం అన్నట్లుగా ఇప్పుడు నితీశ్ కుమార్ జాతీయ స్ధాయిలో మోడిని గెలిచిన నేతగా, సరిజోడీగా, తదుపరి ప్రధాని అభ్యర్ధిగా అవతరించాడు. ‘ఇవి కేవలం ఒక రాష్ట్రంలో జరిగిన రాష్ట్ర స్ధాయి ఎన్నికలే’ అంటూ నాలిక చప్పరిస్తున్నట్లుగా కనిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న బి.జె.పి నేతలు ఎన్నికల ప్రచారానికి మోడి -పాలనను పక్కన పెట్టి మరీ- స్వయంగా రంగంలో దిగి 30 కి పైగా బహిరంగ సభల్లో ప్రసంగించి ప్రచారం చేసిన సంగతిని మర్చిపోతున్నారు. లేదా జనం మర్చిపోవాలని ఆశిస్తున్నారు. నితీశ్ కుమార్ స్ధాయిని పెంచింది జె.డి(యు), ఆర్.జె.డి లు కాదు, మోడి-అమిత్ షా-బి.జె.పి లే ఆయనను జాతీయ స్ధాయికి పెంచి వేశారు.
ఇలాంటి గడ్డు పరిస్ధితి అనివార్యంగా పార్టీలో అలజడిని రేపుతుంది. మోడి-షా ద్వయం శక్తి ఏమిటో తెలుసు గనక సహ నేతలు, జూనియర్ నేతలు ఏమీ అనడానికి సాహసించకపోవచ్చు గానీ, పక్కకు నెట్టబడిన సీనియర్ నేతలు ఎందుకు ఊరుకుంటారు? వారికి పోయేదేమిటో ఇప్పటికే అంతా పోయింది. ఇక వారికి కొత్తగా పోయేదేమీ లేదు. దరిమిలా సీనియర్ నేతలు ఒక్క పెట్టున గాండ్రించారు. బీహార్ ఓటమి అవకాశంగా… లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంతా కుమార్, యశ్వంత్ సిన్హా లు ఆక్రమించబడిన తన స్ధానాలను తిరిగి పొందడానికి ఆ విధంగా చివరి దాడికి పూనుకున్నారు.
కానీ ఏం లాభం?! పార్టీ, ప్రభుత్వాలలో అన్ని స్ధానాలను గుప్పిట్లో పెట్టుకున్న మోడి, షా ల ముందు పొన్ను కర్ర తప్ప ఏ శక్తీ లేని వృద్ధ తరం ఎంత గాండ్రించినా ఏం ఒరుగుతుంది? అని కార్టూనిస్టు ప్రశ్నిస్తున్నారు. పొన్ను కర్ర వృద్ధ తరానికి తమ ఊతపు కర్రలే ఆయుధంగా మిగిలిపోయిన దినాన చివరి దాడి ఏ ఫలితాన్ని ఇస్తుందో ఊహించడానికి పెద్ద శ్రమ అవసరం లేదు.
ఇంతకీ ఆ పొన్ను కర్ర తల మళ్ళీ వృద్ధ తరం పైనే ఎదురు దాడికి దిగుతున్నట్లుందేమిటి చెప్మా?!