(నవంబర్ 14 తేదీన ‘ది హిందు’ పత్రిక ప్రచురించిన “BJP’s larger stock-taking” సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.)
భారతీయ జనతా పార్టీ ప్రస్తుత నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ వృద్ధ నాయకులు చేసిన దాడి శబ్దరహిత మధనాన్ని పార్టీపై రుద్దడం కొనసాగుతోంది. అది ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందన్నదే ఇంకా స్పష్టం కాలేదు. బుధవారం నలుగురు బి.జె.పి పెద్దలు -ఎల్.కె.అద్వానీ, ఎం.ఎం.జోషి, శాంతా కుమార్, యశ్వంత్ సిన్హా- బీహార్ లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం “గత సంవత్సరంలో పార్టీ నిస్సారంగా మారిపోవడమే” అని ఆరోపించారు. ఓటమికి బాధ్యతను నిర్ధారించాల్సిందేనని పట్టుబట్టడం ద్వారా వారు ప్రధాన మంత్రి మోడీ (నియమించిన) బృందాన్ని -నిర్దిష్టంగా బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ను లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టం అవుతోంది.
బి.జె.పి నుండి మొదటి స్పందన ఆ పార్టీ యొక్క ముగ్గురు మాజీ అధ్యక్షులు, మోడి మంత్రివర్గంలో సభ్యులు అయిన రాజ్ నాధ్ సింగ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కారీ ల నుండి -ఉమ్మడి బాధ్యత తీసుకోవాలని నొక్కి చెప్పడం ద్వారా-వెలువడింది. ఆ తర్వాత రోజుల నుండి చిన్నా చితకా పార్టీ సభ్యులందరూ ఈ రెండు గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపు పక్షం వహిస్తూ ముందుకు వచ్చారు. కానీ ఈ పరిణామాలను పార్టీలోని ప్రభుత్వాధికారంలో ఉన్న నేతలకు అధికారం నుండి దూరంగా నెట్టివేయబడిన నాయకులకు మధ్య తలెత్తిన ఘర్షణగా మాత్రమే చూసినట్లయితే బీహార్ ఫలితాలు లేవనెత్తిన అత్యంత క్లిష్టమైన ప్రశ్నల నుండి దృష్టిని మరల్చినట్లే కాగలదు. బీహార్ ఓటు బి.జె.పికి అతి పెద్ద సవాలు విసిరింది. కేంద్ర ప్రభుత్వం గానీ, అధికార పార్టీ గానీ ఏ సూత్రాల ప్రాతిపదికన భారత పౌరులతో వ్యవహరిస్తాయన్న విషయంలో స్పష్టత కావాలన్న డిమాండే ఆ సవాలు!
మోడి, షాలు బీహార్ లో అత్యంత కేంద్రీకృతీకరించబడిన ప్రచార పర్వాన్ని నిర్వహించడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో తెలియని నేపధ్యంలో ఆ ప్రచారాన్ని ముందుండి నడిపించారు కూడా. 2014 లోక్ సభ ఎన్నికల నుండి బీహార్ ఎన్నికల పందెంలో బి.జె.పి జావగారిపోవడం, మోడీ చుట్టూ ‘ఓటమి ఎరుగని అభేధ్యుడంటూ’ కమ్మిన మాయ… వీటన్నింటి నేపధ్యంలో ఇంతటి ఘనతరమైన ఓటమి సహజంగానే సంస్ధాగతమైన ప్రకంపనలకు దారితీస్తుంది. అయితే అది ఎంత అస్ధిరత కలిగించేది అయినా అక్కడే (సంస్ధ లోనే) సాధారణంగా పరిమితం కావాల్సి ఉంది. కానీ బి.జె.పి బీహార్ లో విచ్ఛిన్నకర ప్రచారాన్ని నిర్వహించింది. అప్పుడప్పుడూ ప్రధాన మంత్రి, బి.జె.పి అధ్యక్షులు సైతం ప్రజల్ని విడదీసే ప్రకటనలు జారీ చేశారు. బి.జె.పి ఓడిపోయినట్లయితే పాకిస్తాన్ లో సంబరాలు చేసుకుంటారన్న హెచ్చరికలు, ముస్లింలను లక్ష్యం చేసుకుంటూ వరదలా పారించిన విద్వేష ప్రకటనలు, నిర్దిష్ట సమూహం యొక్క దురాక్రమణ నుండి రిజర్వేషన్లను కాపాడతామన్న ప్రచారం… అన్నీ ఒక్క పెట్టున తిరస్కారానికి గురయ్యాయి.
తీర్పు వెలువడి కొద్ది రోజులే. ఈ ఓటమి బి.జె.పి మేధావులను ఒకింత సాపేక్షిక (మతోన్మాద తీవ్రత) సవరణల వైపుకు ఆకర్షించవచ్చు. అటువంటి పునఃమూల్యాంకనమో లేదా పునఃమూల్యాంకనా రాహిత్యమో అన్నదానితో సంబంధం లేకుండా తమ ప్రచారం (ప్రజలపై) కలుగజేసిన ఆందోళనలను ప్రధాన మంత్రి ఖచ్చితంగా తన పరిగణనలోకి తీసుకోవాలి. ఆయన బహుళ పాత్రలు పోషించగల మెత్తదనాన్ని (flexibility) ప్రధాన మంత్రికి ఆయన కార్యాలయం ఇవ్వదు. తన పార్టీ కోసం ప్రచారం చేసేందుకు బైటికి అడుగు పెట్టినప్పుడు ప్రధాని కాకుండా పోగల అవకాశం ఒక్క క్షణం పాటు కూడా ఆయనకు ఉండదు. పార్టీ పరిభాషాలంకారాలను ఆయన వదులుతున్నప్పుడు ఒక్క ఓటర్ మహాశయులతో మాత్రమే కాదు; మొత్తం భారతీయులతో ఆయన మాట్లాడుతున్నట్లు లెఖ్ఖ! బి.జె.పి యొక్క సంస్ధాగత వ్యవహారాల్లో మునుముందు ఏమి జరుగుతుందన్నది ఆసక్తికరమే, కానీ పార్టీ వేదికలకు బయట ప్రధాన మంత్రి భారతీయులతో వ్యవహారాన్ని సమం చేసుకోవలసి ఉంది.
*******************
(ది హిందు నుండి వెలువడిన సంపాదకీయాల్లో ఇది మేలిమి తరగతికి చెందినది. రెండవ పేరాలో చివరి వాక్యం -ముద్ద అక్షరాల్లో ఉన్నది- అద్భుతమైన పరిశీలన. ఈ తరహా పరిశీలన ఒక్క హిందూకి మాత్రమే సాధ్యం అనుకుంటాను. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్ధ పరిమితిని ఇది కలిగి ఉన్న సంగతి మరువరాదు. ఆ పరిమితిలోనైనా సరే బీహార్ లో బి.జె.పి సాగించిన విద్వేష పూరితమైన, మతోన్మాద, ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని అంతటినీ ఈ వాక్యం అత్యంత మర్యాదగా ఛీ కొట్టింది.
చివరి పేరాలో హైలైట్ చేసిన వాక్యం ఒక ప్రధాన మంత్రి ఎలా వ్యవహరించకూడదో తేల్చి చెప్పింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మతోన్మాద మూకల వికృత హత్యాకాండను ‘చర్యకు ప్రతిచర్య’ గా అభివర్ణించిన నరేంద్ర మోడి నుండి ఇంత కంటే సొంపయిన మాటలను ఆశించగలమా అన్నది సమాధానం ఊహించగల ప్రశ్న! ప్రధాన మంత్రిగా మొత్తం దేశ ప్రజలకు, వారి ఉమ్మడి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించవలసిన వ్యక్తి దిగజారి గ్యాలరీ కోసం ఆడుతున్న ఆటగాడిలా మాట్లాడడం ఏ ప్రజాస్వామ్య ప్రాభవానికి ప్రతీక? -విశేఖర్)
ఒకసారి ప్రయోగించిన బ్రహ్మస్త్రం/బూచి(2014 ఎన్నికల సంధర్బంగా ఉ.ప్ర లో మత ప్రాతిపదికన ప్రజలను వేరుపరిచిన తీరు) ఈ సారి దాద్రి ఘటన ద్వారా తనకే ఎదురుతిరుగుతుందని మోదీ/అమిత్ షా లు కూడా ఊహించలేదేమో!
ఎల్లవేలలా ప్రజలను ఒకేఅంశ ప్రాతిపదికన మభ్యపెట్టలేరని ఈ ఘటన రుజువుచేస్తోంది.
ఇంతకుముందు బీహార్లో ఎన్నడూ ప్రధానపక్షాన అధికారాన్ని అనుభవించలేదు కనుక ఈసారి కొత్తగా పోయేదేమీలేదని సంతృప్తి చెందడమొక్కటే బి.జె.పి కి మిగిలిన సానుకూలాంశం.