తాత్కాలిక సెలవుకు ముగింపు…!


Are we busy

ఔను!

తాత్కాలికంగా మూడు నెలల పాటు (కాస్త అటూ ఇటుగానే లెండి!) నేను తీసుకున్న సెలవు ఇక ముగిసింది.

నా సెలవుకి కారణాలు? షరా మామూలుగా నేను ఇంతకు ముందు చెప్పినవే. మా ఇంటికి తలపెట్టిన షోకులు (పెయింట్లు, ఇంటి చుట్టూ ఫ్లోరింగ్, కొత్త లైట్లు, కొత్త కర్టెన్లు, ఇంటి బయట ఓ బాత్ రూమ్ మొ.వి) మూడు రోజుల క్రితమే పూర్తయ్యాయి. నేనేదో చెమట చిందించేసేనని కాదనుకోండి. కానీ పని సక్రమంగా -డబ్బుకి తగినట్లుగా-  జరుగుతోందా లేదా అన్న ఆలోచన పని చేస్తుంటుంది కదా! ఆ విధంగా ఒక డైవర్షన్!

ఈ మూడు నెలలూ నేను మా ఊరూ, నా ఊరూ మధ్య చక్కర్లు కొట్టాను. వారం వారం, మధ్యలో సెలవుల్లోనూ ఒకటే తిరుగుడు. టైల్స్ సెలక్షన్, కర్టెన్స్ సెలక్షన్, షో లైట్స్ సెలక్షన్, పెయింట్స్ సెలక్షన్స్, కలర్స్ సెలక్షన్, ఫాల్స్ సీలింగ్ డిజైన్ సెలక్షన్… ఒకటా రెండా! ఒకటే తిరుగుడు అంటే నమ్మాలి మరి! డబ్బులు మరిన్ని ఉంటే ఇంకా చాలా సెలక్షన్స్ ఉండేవి. అదృష్టవశాత్తూ మనకంత డబ్బు లేదు. కాబట్టి బతికిపోయాం. (వణిజులు నష్టపోయారు!)

ముఖ్యమైన కారణం నా కొత్త ఆఫీసు. సిబ్బంది కొరత వల్లా, డిపార్ట్ మెంట్ లో ఇతర ఒకరిద్దరు సిబ్బందికి పని తెలియనందునా నాకు ఊపిరి సలపని పని! పొద్దున వెళ్ళి సీట్లో కూర్చుని తల వంచితే మళ్ళీ 2 గంటలకే తల ఎత్తడం. మూడు, మూడున్నరకి ఆఫీస్ కి వెళ్తే మళ్ళీ ఆరూ, ఏడున్నరకే తిరిగి ఇంటికి చేరడం.

ఎంత చేసినా ఇంకా పని మిగులుతూనే ఉండే సీటు నాది. మా డిపార్ట్ మెంట్ కి మరొకర్ని ఇవ్వాలని ఇక్కడికి వచ్చినప్పట్నుండి డిమాండ్ చేస్తున్నా. కానీ యూనియన్ గొడవల వల్లా, పై అధికారులకు సంబంధించిన కొన్ని వైఖరుల వల్లా అది వీలు పడలేదు.

పైగా నేను చేసే పని చూసి ‘అమ్మో ఇంత పనా, నేను రానంటే నేను రాను’ అంటూ నా కొలీగ్స్ వంతులు పెట్టుకున్నారు. మొత్తానికి గొడవలు, ఫిర్యాదులు, అలకలు, బుజ్జగింపులు… అన్నీ అయ్యాక ఒక అసిస్టెంట్ ని ఇవ్వడానికి నిర్ణయం జరిగింది. 10 రోజుల క్రితం నిర్ణయం జరిగితే ‘మంచి రోజు’ అంటూ వాయిదా వేస్తూ ఆయన నిన్ననే కొత్త సీట్లోకి మారారు. ఆ విధంగా నాకు సమయం మిగిలే అవకాశం లభించింది. పని ఒత్తిడి, యూనియన్ గొడవలు ఒక పెద్ద డైవర్షన్!

పనులు మొదలవుతాయనగా మా మామగారు కాలం చేశారు. దాంతో వాటిని రెండు వారాలు వాయిదా వేసుకున్నాము. మధ్యలోనేమో మా బంధువు ఒకరికి తీవ్రమైన జబ్బు చేసింది. చనిపోయారన్న కబురూ అందింది. కానీ ఇంతలోనే, బతికి తీరాలన్న స్ధిర నిశ్చయం వల్లనో ఏమో, 15 ని.ల సేపు చనిపోయిన ఆయన రీసస్టికేషన్ చర్యల సహాయంతో మళ్ళీ ఊపిరి పీల్చడం ప్రారంభించారు. కానీ ఈ క్రమంలో కొన్ని అవయవాలు పాడయ్యాయి. ఫలితంగా ఆయన సెమీ కోమాలో కొనసాగుతున్నారు.

ఎవరికీ రాకూడని జబ్బు ఆయన్ని పట్టుకుంది. చక్రాల కుర్చీకి పరిమితం అయిన ప్రఖ్యాత ఫిజికిస్టు స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు కదా. ఆయన్ని పీడిస్తున్న ‘మోటార్ న్యూరాన్ డీసీజ్’ మా బంధువునీ పీడిస్తోంది. ఈ హడావుడి వల్ల మేము రెండుసార్లు హైద్రాబాద్ పరుగెత్తాము. ఆయన్ని రెండోసారి చూడ్డానికి వెళ్లినప్పుడు ఐ.సి.యులో ఉన్నారు. అది పేద్ధ ఐ.సి.యు. రోగులకి అంతేలేనట్లున్న ఐ.సి.యు. అక్కడ చాలా చిత్రమైన వైరుధ్యాల్ని నేను చూశాను.

అక్కడ ఎంతోకొంత ప్రశాంతంగా ఉన్నది మంచం పైన ఉన్న రోగులే. చలనం ఉండీ లేనట్లుగా… భారంగా ఊపిరి పీలుస్తూ… కానీ ప్రశాంతంగా. వారి దగ్గర ఉన్న డాక్టర్లు, నర్సులు యంత్రాలే. ఆ చూడ్డానికి వచ్చినవారిలోనే బోలెడు వైరుధ్యాలు. (జీవం ఉన్న చోటనే వైరుధ్యం, వైరుధ్యం ఉన్న చోటనే జీవం!) కొందరు ఆందోళనగా, భయంగా, ఆతృతగా ఉంటే మరికొందరు ఎందుకొచ్చిన చావు (బతుకు)రా బాబూ అన్నట్లున్నారు. కొందరు దీర్ఘంగా, దిగులుగా, శూన్యంలో చూస్తుంటే, మరికొందరు సాలోచనగా తమలో తామే మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్నారు. ఎక్కువమందిలో కనిపించింది విసుగు. తక్కువమందిలో కనిపించింది తమపని తాము చేస్తున్నామన్న సంతృప్తి.

ఒక చావు ఎన్నో బతుకుల్ని కదిలిస్తుందని నాకనిపిస్తుంది. చనిపోయింది ఎవరైనా సరే, వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒక సెట్ ఆఫ్ బావోద్వేగాలతో ఛార్జి చేస్తుంది.  ఆ భావోద్వేగాల నుండి బైటికి రావడం కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చావు మనలోని మనకే తెలియని మూలల్లోకి చొరబడుతుంది. చనిపోయారన్న వార్త కంటే ఎలా చనిపోయారన్నది మనో నిశీధిని పలు రకాలుగా చిందర వందర చేస్తుంది. తర్జన భర్జనలు కలిగిస్తుంది. నేను చెప్పేది చావు పట్ల ఉన్న భయం గురించి కాదు. చావు పేరుతో బతుకులో పడుతున్న అగచాట్ల గురించి.

సన్నిహితుల మరణం మనకు సరికొత్త మానవ ముఖాల్ని పరిచయం చేస్తుంది. సరికొత్త ప్రవర్తనల గాలి మనల్ని తట్టేలా చేస్తుంది. ఒక్కోసారి మనల్ని మనకి పరిచయం చేసినా ఆశ్చర్యం లేదు. సంవత్సరాల తరబడిన బతుకు చూపించని అగాధాల్నీ, ఎత్తులనూ ఒక చావు అంతిమయాత్ర మనకు చూపవచ్చు. ఇదంతా ఎందుకంటే మామగారి మరణం, బంధువు మృత్యువుతో చేస్తున్న పోరాటం నాలో అలజడి కలిగించాయని చెప్పడానికి.

ఇది చావు తప్పదన్న అలజడి కాదు. ఇక ముందు నచ్చినట్లుగా బతగ్గలమా అన్న అలజడి ఇది. ఇన్నాళ్లూ అనుకున్నట్లుగా బతకలేకపోయినప్పుడు ఇక ముందు అనుకున్నట్లుగా బతకగలం అన్న హామీ ఉండదు కదా మరి! This appears like pessimism. But, sometimes, that is how the truth appears. A society full of contradictions makes innumerable impressions on a human(istic) mind. Isn’t it?

ఆ ఆ వస్తున్నా, వస్తున్నా. ఇంతకీ ఎక్కడున్నాం? సెలవుకి కారణాలు ఏమిటి అన్న దగ్గర. పై కారణాలన్నీ నా సెలవుని పొడిగిస్తూ పోయాయి. మొత్తం మీద, ఇక ఆలస్యం కాకుండా, మళ్ళీ రాత మొదలు పెట్టగలిగినందుకు సంతోషంగా ఉంది.

ఈ రెండు మూడు నెలలూ పాఠక మిత్రులు నన్ను కదిలిస్తూనే ఉన్నారు. ముల్లు గర్రతో పొడుస్తూనే ఉన్నారు. కొందరు పెద్దలు ఆందోళన చెందారు కూడాను. ఆందోళన అవసరం లేదని తెలిశాక, సున్నితంగా అదిలించి మందలించారు.

ఇంకా మిత్రులు అనేకులు క్షేమ సమాచారాలు ప్రత్యక్షంగా ఆరా తీశారు. వారంతా నా అనుభవంలోకి వచ్చినవారు. బ్లాగ్ ద్వారానే నన్ను వెనక్కి లాక్కువచ్చేందుకు పలువురు మిత్రులు ప్రయత్నించారని నేను మళ్ళీ గ్రీసు ఆర్టికల్ పోస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే తెలిసింది. వారు సెలవు కాలంలో నా ఎరుకలో లేరు. ఈ సెలవులో నేను బ్లాగ్ ముఖం చూళ్ళేదు. సెలవంటే సెలవే కదా మరి. నిజానికి చూసే ధైర్యం లేకనే చూళ్లేదు.

బాధ్యతను గుర్తు చేసి నన్ను నాకు తెలిపిన ఈ మిత్రులందరికీ మనసారా కృతజ్ఞతలు!  పెద్దలకి నమస్సులు!

ఇక మొదలెడదాం! (ఈ డైలాగ్ పైన కాపీ -రైట్స్- హక్కులు తీసేసుకున్నా. ఎవరూ సినిమా టైటిల్ గా పెట్టరాదు!)

18 thoughts on “తాత్కాలిక సెలవుకు ముగింపు…!

  1. చాలా సంతోషం గా ఉంది విశేఖర్ గారు మిరు మళ్ళీ బ్లాగింగ్ లొకి వచ్చినందుకి. రోజుకి ఒక్కసారయినా మీ బ్లాగు చూడడం ఒక అలవాటుగా అయిపోయింది నాకు. ఈ మూడునెలలూ రకరకాలు గా అలోచించాను ఎమైపోయారా అని. మొత్తానికి తిరిగి వచ్చారు చాలా సంతోషం. ఇక ఇప్పట్లో మళ్ళీ శెలవు తీసుకోరని ఆసిస్తున్నాను…… 🙂

  2. కారణాలు ఏమైనా విరామం ఎక్కువే తీసుకున్నారు. దేశం- ఆ మాటకొస్తే ఇతర దేశాల దృష్టిని కూడా ఆకర్షించిన బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందూ వెనకా మీ బ్లాగు పోస్టుల్లేని లోటు బాగా కనపడింది.

    ఐసీయు గురించి మీరు రాసింది ఆలోచనాత్మకంగా ఉంది.

    ఏమైనా సమస్యలు కొలిక్కి వచ్చి, సెలవు ముగిసి, ‘ఇక మొదలెడదాం’ అన్నారు. సంతోషం. మీ పోస్టుల పరంపరకు స్వాగతం!

  3. వేణు గారు

    దేశంలో, అంతర్జాతీయంగానూ కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఈ పరిణామాల మీద నా టేక్ ఏమిటా అని బ్లాగ్ పాఠకులు ఎదురు చూసి ఉండవచ్చు. బహుశా అందుకే నా విరామం మామూలుగా కంటే ఎక్కువలాగా అనిపించి ఉండవచ్చు. అప్పుడప్పుడూ అయినా ఒకటీ రెండూ టపాలు రాసి ఉంటే గ్యాప్ అనిపించి ఉండేది కాదేమో. కానీ (నేను చెప్పని) కొన్ని ఇతర కారణాల వల్ల అది కూడా కష్టం అయింది.

    ఐ.సి.యు గురించి ఇంకా రాసేవాడ్నే. బలవంతంగా ముగించేశా.

    మీ స్వాగతానికి ధన్యవాదాలు!

  4. చావు, బ్రతుకు అనే పదాలకు ప్రతిగా మరణము జీవనము అని వాడాలేమో అనిపిస్తున్నది. ఎంచేేతనంటే, ‘జీవనము, మరణము’ అనే పదాలలో వున్న సార్వత్రికత ‘బ్రతుకు, చావు’లలో కనిపించక పోగా, ఎదురు ఒక caution లాగా, ఎవరో మనల్ను శాసిస్తున్నట్లుగా తోస్తున్నది. ఇది నిజం కాక పోవచ్చు, కానీ నా భావన ఈ క్షణానికి ఇది.

    వాన బాగా కురిస్తే, వరద వస్తే చాలా మందికి ఇబ్బంది కొంతమందికి (ఎవరైతే రైతులు వానలకై నిరీక్షిస్తున్నారో వారికి) ఆనందమూనూ.

    అలానే మీ విరామం చాలా మందికి definite గా ఒక లోటుగా తోస్తే, నాకు మటుకు happy ఎందుకంటే అనారోగ్య కారణం చేత నేను పెద్దగా మీ మా ఈ బ్లాగు వైపుకు రాలేదు.

    అదేదో సినిమా ‘నువ్వే నువ్వే’ అనుకుంటా,,,

    కథానాయకుడు డబ్బులు లేని కారణంగా ఓ హోటల్‌ లో ప్లేట్లు కడగాల్సిన సన్నివేశంలో, కడగాల్సిన ప్లేట్లు పొరపాటున వేరొకతని వల్ల క్రిందపడితే, thanks తమ్ముడూ కడగాల్సిన ప్లేట్లు 10 తగ్గించావ్‌ అంటాడు. అలానే మీరు సెలవిచ్చి చదవాల్సిన పోస్టులు లేకుండా చేశారు.

    మీ రాతలు త్రికాల అబాధితం అయినప్పటికి ఎప్పటి పోస్టులు అప్పుడు చదివితేనే, అందునా తొలుత కామెంట్‌ చేస్తే వుండే కిక్కే వేరప్పా!

    అంచేత

    మోడీ విదేశీ పర్యటన గురించే రాస్తారో
    ప్యారెస్‌ తీవ్రవాదుల దాడి గురించే రాస్తారో
    లేక మాకు తెలియని ఇంకేదైనా రాస్తారో

    రాయండి, చదివేందుకు సిద్ధం

  5. ?! గారూ,

    ఎప్పటి లాగా మీ వ్యాఖ్యలో మీ ముద్ర కనిపిస్తూనే ఉంది.
    “త్రికాల అబాధితం!” కొత్త ప్రయోగం లాగా ఉంది.
    మీరు ప్రస్తావించిన అంశాల గురించి మెల్లగా రాస్తాను.

  6. చాలా థాంక్స్ శేఖర్ గారు,
    మీరు బ్లాగ్ మళ్ళీ మొదలు పెట్టినందుకు. మూడ్నెల్లుగా మేము(ఫాఠకులు) పడిన అందోళనను అర్ధం చేసుకున్నందుకు. 🙂

  7. సార్…కొంచెం ఆలస్యంగా చూశాను.. నేను మీకు ఆరోగ్యసమస్యల వల్ల ఏదైనా ఇబ్బంది పడుతున్నారేమో అనుకున్నాను. మొత్తానికి మీ పునరాగమనం …మంచి పోస్టులు అందించాలని కోరుకుంటున్నాను. నేనూ తిరుపాలు గారైతే…వేరే దగ్గర పరామర్శించుకుంటూ కాలం వెళ్లబుచ్చాం. హ్యాపీ..
    కానీ వస్తూనే కొత్త రకం అంటే మీరిప్పటి వరకూ రాయని అంశం గురించి చర్చపెట్టారే..
    నిజం సార్..చావును కళ్ల ముందు చూసిన వ్యక్తిలో పరిణతి పెరుగుతుంది..
    అది మన దగ్గరకు వచ్చే లోపు …మన పని మనం చేద్దాం…
    ఇరక మీరు మొదలు పెట్టండి..మేం చదివి పెడతాం..

  8. చందుతులసి గారు
    ఆహ్వానం!
    ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది.
    అలాగే మరి. చదవడం ఎలాగూ చేస్తారు. చదివించడం కూడా చేయాలి మీరు. విలేఖరి కదా!
    ఈ పూట టపా రాద్దామంటే ఇంకా కుదర్లేదు. అతిధి ఒకరు వచ్చారు. ఆయన కొత్తగా కొన్న ఫోన్ ని ఎలా ఆపరేట్ చెయ్యాలో తెలుసుకుందామని వచ్చారు. దానితో రాయడం కుదర్లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s