గ్రెక్సిట్: బ్రిటన్ పెనం నుండి అమెరికా పొయ్యి లోకి -7


Harry S Truman

Harry S Truman

6వ భాగం తరువాత……………

ఇ.ఎల్.ఏ.ఎస్ బలగాలు ఏథెన్స్ పై అంతకంతకూ పట్టు బిగిస్తూ పోయాయి. దాదాపు ఏథెన్స్ లోని పోలీసు స్టేషన్లన్నింటినీ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. చివరికి 3 చదరపు కి.మీ భాగమే బ్రిటిష్ తాబేదారు ప్రభుత్వానికి మిగిలింది. గ్రీసులోని ఇతర ప్రాంతాల్లో పోరాటం చేయాల్సిన అవసరం ఇ.ఎల్.ఏ.ఎస్ కు లేదు. ఒక్క ఎపిరస్ తప్ప గ్రీసు అంతా దాని ఆధీనంలోనే ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఇ.ఎల్.ఏ.ఎస్ ఘోరమైన తప్పిడానికి పాల్పడింది. ఇక ఏథెన్స్ తమ వశం అయినట్లే అన్న అంచనాతో ఇ.డి.ఇ.ఎస్ ఆధీనంలో కొనసాగుతున్న ఎపిరస్ ను వశం చేసుకోవాలని నిర్ణయించింది. డిసెంబర్ 18 తేదీన తమ బలగాల్లో మెరికల్లాంటి సైనికులు 15,000 మందిని ఎంచుకుని ఎపిరస్ పైకి పంపింది. వారు రెండు వైపుల నుండి ఇ.డి.ఇ.ఎస్ బలగాలపై దాడి చేశారు. కానీ వారు ఇ.డి.ఇ.ఎస్ నేత జెర్వాస్ ను పట్టుకోలేకపోయారు. మరోవైపు బ్రిటన్ మరిన్ని సేనలను ఏథెన్స్ కు పంపింది. మరిన్ని ఆయుధాలను పంపింది. విమానాలు, క్షిపణులు, మోర్టార్లు, ట్యాంకులు వచ్చాయి. మెరికల్లాంటి ఇ.ఎల్.ఏ.ఎస్ బలగాలు ఏథెన్స్ కు దూరంగా ఎపిరస్ లో ఉండిపోగా ఏథెన్స్ లో వారి మందుగుండు తగ్గిపోయింది.

ఈ సమయంలో బ్రిటిష్ ప్రధాని చర్చిల్ స్వయంగా ఏథెన్స్ ని సందర్శించాడు. ఆయన రాక బ్రిటిష్, దాని తాబేదారు సైనికుల్లో ఉత్సాహాన్ని పెంచింది. గ్రీసులోని ఇతర రాజకీయ పక్షాల కోరిక మేరకు వెంటనే రాజు పునరాగమనంపై ఫ్లెబిసైట్ జరపాలని ఆ తర్వాతనే రాజును రప్పించాలని కోరారు. ఏథెన్స్ లో బలహీన పరిస్ధితిలోకి జారిపోయిన ఇ.ఎల్.ఏ.ఎస్ తన బలగాలను వెనక్కి ఉపసంహరించుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఇదే అవకాశంగా బ్రిటన్ వినాశకరమైన షరతులను ఇ.ఎల్.ఏ.ఎస్ పై రుద్దింది. రాజధానికి 150 కి.మీ ఆవల ఉండాలని, ధేస్సాలోనికే, పెలోపోనెసే తదితర ద్వీపాలను వదిలి వెళ్లాలని షరతులు విధించింది. ఈ షరతులకు ఇ.ఎల్.ఏ.ఎస్/కె.కె.ఇ/ఇ.ఎ.ఎం అంగీకరించక తప్పలేదు. ఎపిరస్ మీదికి వెళ్లాలన్న తొందరపాటు నిర్ణయం వల్ల గ్రీసు కమ్యూనిస్టులు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. అయితే దోషం అంతటినీ ఈ నిర్ణయం మీదికే నెట్టివేయడం అంటే విషయాన్ని సమగ్రంగా చూడకపోవడం అవుతుంది. అంతర్గతంగా ఉద్యమంలో ఇది పెద్ద తప్పిదమే అయినా బాహ్యకారణం అయిన బ్రిటన్ పాత్రను తక్కువ చేయలేము.

ఆ తర్వాత గ్రీసు మీదికి తెల్ల భీభత్సం (వైట్ టెర్రర్) విరుచుకుపడింది. విముక్తి అనంతరం జర్మనీ, ఇటలీ ఆక్రమణదారులతో కుమ్మక్కు అయినవారిని, యుద్ధ నేరస్ధులను శిక్షించాలన్నది ఇ.ఎల్.ఏ.ఎస్ – బ్రిటిష్ దళారీ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో ఒక ప్రధాన భాగం. కానీ ఆచరణలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఆక్రమణదారులతో కుమ్మక్కు అయినవారిని పట్టుకుని శిక్షించడానికి బదులు పదవులు కట్టబెట్టి ఇ.ఎల్.ఏ.ఎస్ మద్దతుదారులపైకి ఉసిగొల్పారు. క్రమంగా మితవాదులు పై చేయి సాధించారు. జర్మనీ, ఇటలీ ఆక్రమణను ఆహ్వానించి, వారితో కుమ్మక్కై, పెను ద్రోహానికి తలపడిన వారంతా దొరలుగా మారిపోగా దేశం కోసం అన్నీ వదులుకుని పోరాడిన కమ్యూనిస్టులు, వారి మద్దతుదారులు, సానుభూతిపరులపై అంతులేని ప్రతీకారంతో తీవ్రమైన అణచివేత అమలయింది.

తెల్ల నేరస్ధ ముఠాలు గ్రామాలపై విరుచుకుపడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. గూండాయిజం, హత్యలతో వనరులను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు దొరలయ్యారు. శ్రామిక ప్రజలు నిర్బంధాలకు గురయ్యారు. 1946 నాటికి 1200 మంది హత్యకు గురయ్యారని, 150 మంది మహిళలపై అత్యాచారాలు చేశారని తీవ్ర-మితవాదుల (Right-extremists) చేతుల్లో హింసలకు గురై 500 మంది వరకు గాయాలపాలై అవయవాలు కోల్పోయారని పరిశీలకులు తమ నివేదికల్లో వెల్లడించారు. అయితే ఇవి లెక్కకు వచ్చినవి మాత్రమే. లెక్కకు రాకుండా మాయమైన వారి అతీగతీ తెలియదు.

అనంతరం ఎన్నికలు, ఫ్లెబిసైట్ నిర్వహించినప్పటికీ వాటిలో ప్రజల పాత్ర నామమాత్రమే. సాధారణ ఎన్నికల్లో 10 శాతం కంటే ఎక్కువ ప్రజలు పాల్గొనలేదు. అయినప్పటికీ 60 శాతం పాల్గొన్నారని అంతర్జాతీయ పరిశీలకులతో చెప్పించారు. రాజు రాకపై నిర్వహించిన ఫ్లెబిసైట్ కూడా ఇదే రీతిలో సాగింది. రాచరికాన్ని తీవ్రంగా ద్వేషించిన జనమే రాజు మళ్ళీ రావాలని కోరుకున్నట్లుగా తీర్పు ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికలను, ఫ్లెబిసైట్ ను బహిష్కరించడంతో జనం ఎన్నికల జోలికి వెళ్లలేదు. ఫ్లెబిసైట్ తీర్పు సాకుతో రాజు కింక్ జార్జ్ II ను దేశంలో ప్రవేశపెట్టడంలో బ్రిటన్ సఫలం అయింది.

మరోవైపు కె.కె.ఇ లో సంక్షోభపు ఛాయలు బయలుదేరాయి. తెల్ల భీభత్సం నుండి తప్పించుకోవడానికి నాయకులు, కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లారు. సరిహద్దుల వద్ద దాగారు. అనేకమంది యుగోస్లావియాలో తలదాచుకున్నారు. మార్షల్ టిటో నాయకత్వంలోని సోషలిస్టు ప్రభుత్వం గ్రీసు కమ్యూనిస్టు పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించింది. డిసెంబర్ 15, 1945లో బల్గేరియాలోని పెట్రిక్ పట్టణంలో కె.కె.ఈ కేంద్ర కమిటీ సమావేశమై ఉద్యమాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించింది. యుగోస్లావ్, బల్గేరియా అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరై తమ మద్దతు తెలిపారు. ఇ.ఎల్.ఏ.ఎస్ లో మిగిలి ఉన్న శ్రేణులను సమీకరించి ‘డెమోక్రటిక్ ఆర్మీ’ (డి.ఎస్.ఇ లేదా డి.ఎ.జి –డెమోక్రటిక్ ఆర్మీ ఆఫ్ గ్రీస్) పేరుతో మిలట్రీని నిర్మించాలని నిర్ణయించారు. ఇలా ఏర్పడిన సైన్యం గ్రీసు ఉత్తర సరిహద్దులోని లిట్టోఖోరోన్ పట్టణంలోని పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. ఈ దాడితో మూడో విడత విముక్తి యుద్ధం (సాధారణ పరిభాషలో -సివిల్ వార్) బద్దలయింది.

ఇ.ఎల్.ఏ.ఎస్ లోని సైనిక నేత జనరల్ మార్కోస్ వఫియాడిస్ కు డి.ఎస్.ఇ కమాండింగ్ బాధ్యతలు కట్టబెట్టారు. 1996 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన జనరల్ మార్కోస్ గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన నేత. ఆయన నేతృత్వంలో డి.ఎస్.ఇ శక్తివంతమైన సంస్ధగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇ.ఎల్.ఏ.ఎస్ బలంగా ఉన్న ప్రాంతాలతో మొదలు పెట్టి కార్యకర్తలను సమీకరించారు. క్రమంగా దేశవ్యాపితంగా ఉన్న సభ్యులను సమీకరించారు. మిగిలి ఉన్న ఆయుధాలను సమీకరించి యుగోస్లావ్, బల్గేరియాలలో డిపోలు ఏర్పరిచారు. ఇవన్నీ అత్యంత రహస్యంగా సాగించారు. తద్వారా సరిహద్దులకు ఆవల ఆయుధ సరఫరా కేంద్రాలు నెలకొల్పారు. తిరిగి గెరిల్లా యుద్ధ ఎత్తుగడలను అమలు చేశారు. వేగంగా దాడి చేసి, అంతే వేగంతో మాయం అవుతూ శత్రువుకు భయం పుట్టించారు. చిన్న చిన్న బృందాలుగా దాడులు నిర్వహించారు. ఆరంభంలో 5 నుండి 10 వరకు ఉన్న దళాలు అనంతరం 30 నుండి 80 వరకు సభ్యత్వం కల దళాలుగా అభివృద్ధి చెందారు. పెద్ద దళంగా ఉన్నప్పుడూ కూడా దాడి చేసిన వెంటనే చిన్న చిన్న బృందాలుగా విడిపోయి జనంలో కలిసి పోతూ ఉండేవారు. యూనిఫారం నియమాన్ని అమలు చేయకపోవడంతో వేగంగా అంతర్ధానం కావడం మరింత తేలిక అయింది. ఒకేసారి అనేక చోట్ల చిన్న బృందాలతో దాడులు చేయడం, పోలీసు స్టేషన్ లపై మూకుమ్మడి దాడులు చేసి పై చేయి సాధించడం, తెల్ల భీభత్సం నాయకులను మట్టుబెట్టడం… మొదలైన చర్యలతో డి.ఎస్.ఇ బ్రిటిష్ దళారీ ప్రభుత్వాన్ని బెంబేలు పెట్టింది. యుగోస్లావ్, బల్గేరియా, అల్బేనియా రాజ్యాలు గెరిల్లాలకు అవసరమైన సహాయం చేశాయి. మరోసారి విప్లవ తరంగం గ్రీసుపై వెల్లువెత్తుతున్నట్లు స్పష్టం అయింది.

మరోవైపు ఐరాసలో గ్రీసు తరపున సోవియట్ రష్యా గొంతు విప్పింది. తెల్లభీభత్సాన్ని ఎత్తిచూపుతూ గ్రీసు పాలకులకు ప్రజాస్వామ్యంపై మమకారం లేదని చాటింది. గ్రీసులో బ్రిటిష్ సైన్యాల ఉనికిని ప్రశ్నించింది. వివిధ ఘటనలపై విచారణ చేస్తామని గ్రీసు ప్రభుత్వం ఐరాసలో హామీ ఇచ్చింది. విచారణకు భద్రతా సమితి బృందాన్ని పంపాలని ఐరాస తీర్మానించింది. ఇలాంటి తీర్మానాన్నే సెప్టెంబర్ 1946లో వీటో చేసిన రష్యా డిసెంబర్ లో ఆమోదం తెలిపింది. ఈ కమిటీ గెరిల్లాలకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినప్పటికీ గ్రీసు కమ్యూనిస్టులు వెనక్కి తగ్గలేదు. మెటాక్సస్ ప్రభుత్వంలో అరెస్టయి జైలు శిక్ష పడిన పార్టీ కేంద్ర కార్యదర్శి నికోస్ జఖరియాడిస్ విడుదలై మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టాడు. ఐరాస విచారణ కోసం గ్రీసు వచ్చిన బృందంలోని సోవియట్, పోలాండ్ ప్రతినిధులను ఆయన ఎలాగో కలిశాడు. వారు గ్రీసు విప్లవ పరిస్ధితిపై తమ అభిప్రాయాలూ వివరించారు. పరిస్ధితి అధికారిక సాయుధ పోరాటానికి అనువుగా ఉందని చెప్పారు. విజయం సాధ్యమేనని వివరించారు. పార్టీ తగిన నిర్ణయం తీసుకోవాలని ఉద్భోదించారు. మరీ ముఖ్యంగా గ్రీసులో ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ప్రాతినిధ్య ప్రభుత్వం (ప్రొవిజనల్ గవర్నమెంట్) ఏర్పాటు చేస్తే దానిని కమ్యూనిస్టు రాజ్యాలు గుర్తిస్తాయని వ్యాపార సంబంధాలు నెలకొల్పుతాయని తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ సభలకు హాజరయిన నికోస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించాడు.

ఇక 1947 లో దేశం అంతటా దాడులు పెరిగాయి. ఏప్రిల్ నాటికి గెరిల్లాల సంఖ్య 16,000 కు పెరిగింది. అనుబంధ, సహాయ సేవల్లో అనేక వేలమంది చేరి పని చేస్తున్నారు. సానుభూతిపరుల సంఖ్యకు లెక్కలేదు. గెరిల్లా దాడులను తిప్పి కొట్టలేని పరిస్ధితిలో ప్రభుత్వ బలగాలు ఉన్నాయి. లొంగిపోతే క్షమా భిక్ష ఇస్తామని ప్రకటించినా పెద్ద ఫలితం రాలేదు. మార్కోస్ ప్రధానిగా ప్రొవిజనల్ గవర్నమెంట్ ను ఏర్పాటు చేశామని డిసెంబర్ 24, 1947 తేదీన డి.ఎస్.ఈ తమ రేడియోలో ప్రకటించింది. విదేశీ సామ్రాజ్యవాదులు, వారి తొత్తులయిన గ్రీసు పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయడమే లక్ష్యం అని ప్రకటించింది. విదేశీ సామ్రాజ్యవాదుల నుండి దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడమే ధ్యేయమని చాటింది. అన్నీ జాతులకు సమాన అధికారులు కల్పిస్తామని చాటింది. దేశ రక్షణకు శక్తివంతమైన భూ, నౌకా, వాయు దళాలను నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేసింది. కొనిస్టా తమ రాజధాని అని ప్రకటించింది.

క్రిస్టమస్ రోజున కొనిట్సా పట్టణంపై డి.ఎస్.ఈ దాడి చేసింది. అప్పటికే ప్రభుత్వ బలగాలు అక్కడ సిద్ధంగా ఉండడంతో ఐదు రోజులు పోరు భీకరంగా సాగింది. డిసెంబర్ 29 తేదీన ఐరాస ఈ దాడికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. యుద్ధం కొనసాగడంతో అదనపు బలగాల అవసరం వచ్చింది. ఏ పక్షంలో అదనపు మొదట అదనపు బలగాలు వచ్చి చేరితే వారిదే విజయం వరించే పరిస్ధితి ఏర్పడింది. డిసెంబర్ 30 తేదీన ప్రభుత్వ బలగాలకు అదనపు బలగాలు వచ్చి చేరగా డి.ఎస్.ఈ కి బలగాలు చేరలేదు. దానితో డి.ఎస్.ఈ ఓటమికి గురయింది. ఈ పరిస్ధితికి బాహ్య (అంతర్జాతీయ) పరిస్ధితులు ప్రబలంగా తోడ్పడ్డాయి.

ట్రూమన్ డాక్ట్రిన్

రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి బ్రిటన్ బాగా బలహీనపడింది. గ్రీసు పాలక వర్గాలకు సహాయ సహకారాలు ఇచ్చే పరిస్ధితి లేదు. గ్రీసు బాధ్యతను తీసుకోవాలని అమెరికాను అర్ధించింది. 1947 ఫిబ్రవరిలో అమెరికా విదేశీ మంత్రికి ఈ మేరకు సమాచారం పంపింది. గ్రీసులో గెరిల్లాలను అంతం చేయనిదే గ్రీసు సమస్యకు పరిష్కారం లేదని నొక్కి చెప్పింది. గ్రీకు స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడంలో బ్రిటన్, అమెరికా అభిప్రాయాలకు తేడా లేనందున, తన ఆర్ధిక పరిస్ధితి క్షీణించినందున గ్రీసు బాధ్యత తీసుకోవాలని కోరింది. ఏప్రిల్ 1 లోపు 240-280 మిలియన్ డాలర్లు గ్రీసుకు అందించాలని కోరింది. అనగా గ్రీసు అంతర్గత పరిస్ధితిలో జోక్యం చేసుకుని గెరిల్లాలను అంతం చేసి తన తాబేదారులైన గ్రీసు దోపిడీ వర్గాలను రక్షించాలని బ్రిటన్, అమెరికాను కోరింది. గ్రీసు ప్రభుత్వం సైతం ఈ మేరకు అమెరికాకు విజ్ఞాపన చేసింది.

అమెరికా ఏప్రిల్ 1 దాకా ఆగలేదు. మార్చి రెండో వారంలో ఈ బాధ్యతను స్వీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ అమెరికా కాంగ్రెస్ లో ప్రకటన చేశాడు. గ్రీసు, టర్కీలకు సహాయం చేయాల్సిందేనని కాంగ్రెస్ ను కోరాడు. ‘సహాయం చేయడమా లేక ఈ రెండు దేశాలు మన కళ్ళముందే కమ్యూనిజం ఒడిలో చేరుతుండగా చూస్తూ ఉండడమా” తేల్చుకోవాలని హెచ్చరించాడు. “గ్రీసును కోల్పోయినట్లయితే కమ్యూనిజం సముద్రం మధ్యలో ఒంటరిగా మారే టర్కీ మన ఔట్ పోస్ట్ గా మనగలగడం అసాధ్యం; లేదా సోవియట్ డిమాండ్లకు టర్కీ తల ఒగ్గితే గ్రీసు అత్యంత ప్రమాదంలో పడిపోవడం తధ్యం” అని కాంగ్రెస్ సభ్యులకు భవిష్యత్తును చూపాడు. ఫలితంగా ట్రూమన్ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ ఆగమేఘాలపై ఆమోదం వేసింది. గ్రీసుకి 300 మిలియన్లు, టర్కీకి 100 మిలియన్లు ఆర్ధిక, మిలట్రీ సహాయం నిమిత్తం విడుదల అయింది. కమ్యూనిస్టు ప్రభావం నుండి దేశాలను బైటికి లాక్కు వచ్చేందుకు ఉద్దేశించిన ఈ ట్రూమన్ సహాయ చట్టమే ‘ట్రూమన్ డాక్ట్రిన్’ (ట్రూమన్ సిద్ధాంతం) గా చరిత్రలో నిలిచిపోయింది.

పేరుకు కమ్యూనిస్టు ప్రభావం అని చెప్పినప్పటికీ విదేశాలలో అత్యంత నగ్నంగా జోక్యం చేసుకోవడాన్ని చట్టబద్ధం చేసిన సిద్ధాంతం ఇది. దేశాలు తమ అంతర్గత సమస్యలను తామే పరిష్కరించుకోవాలన్న సార్వత్రిక సిద్ధాంతానికి బద్ధ వ్యతిరేకం ఈ సిద్ధాంతం. ఐరాస చట్టాలను గేలి చేసిన చట్టం ఇది. అనంతర కాలంలో ఈ సిద్ధాంతం నీడలో అమెరికా ప్రపంచ వ్యాపితంగా అనేక బడుగు దేశాలపై సాగించిన అరాచకాలకు పునాది వేసింది. ఆదిలో కమ్యూనిస్టు భూతం! ఆ తర్వాత అది నియంతృత్వ భూతంగా మారింది. ఆనక టెర్రరిస్టు భూతం అయింది. ఇప్పుడు ముస్లిం టెర్రరిస్టు భూతమై అందులోనూ ఆల్-ఖైదా, ఇసిస్ అంటూ శాఖోప శాఖలుగా అమెరికా కనిపెట్టిన భూతాలు విస్తరిస్తున్నాయి. ఇక్కడ బ్రిటన్, అమెరికాల లక్ష్యం గ్రీసు, టర్కీ ఇత్యాదిగా గల దేశాల ప్రజల ప్రజాస్వామ్య వ్యవస్ధల పరిరక్షణ కానే కాదు. ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న తమ తాబేదారులు, దళారీ దోపిడీదారులకు ఆయా దేశాలలో ఆధిపత్యం కొనసాగేలా చేయడమే బ్రిటన్, అమెరికా సామ్రాజ్యవాదాల లక్ష్యం. తద్వారా తమ మార్కెట్ దోపిడీ అవసరాలు తీర్చుకోవడమే వారి పరమావధి.

మరోవైపు ఏ కమ్యూనిస్టు దేశమూ పరాయి దేశాన్ని కబళించిన చరిత్ర లేదు. స్టాలిన్ మరణానంతరం రివిజనిస్టు పెట్టుబడిదారీ దేశంగా అవతరించిన రష్యాయే సామ్రాజ్య విస్తరణకు తలపడింది తప్ప సోషలిస్టు సోవియట్ రష్యా ఎన్నడూ ఎలాంటి దుష్కార్యాలకు తలపడలేదు. పైగా గ్రీసు లాంటి అనేక దేశాలలో సామాన్య శ్రామిక జనం విముక్తి కోసం ఉద్యమించిన చోటల్లా తగిన సాయం చేసిన చరిత్ర స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ రష్యాది. అమెరికా, బ్రిటన్, తదితర పశ్చిమ పెత్తందారీ దేశాలు ఆయా దేశాల్లోని కొద్ది సంఖ్యలోని దోపిడీ వర్గాలకు అండదండలు ఇస్తే సోషలిస్టు రష్యా సామాన్య శ్రామిక జన విముక్తికి అండదండలు అందించింది. ఎంతటి ప్రజాదరణ గల నేత అయినా వారు పశ్చిమ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తే రాత్రికి రాత్రి పచ్చి నెత్తురు తాగే నియంతగా మార్చివేయడంలో దిట్ట అయిన పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వాస్తవ సమాచారం ప్రపంచ ప్రజలకు అందకుండా ప్రపంచం నలుమూలలా కాపు కాస్తున్నాయి. ఈ వాస్తవాన్ని గ్రహించకపోతే పచ్చి అబద్ధాలనే నగ్న సత్యాలుగా నమ్మగలం.

పొరుగు దేశాల భూభాగాలు తమవే అని యుగోస్లేవియా నేత మార్షల్ టిటో వాదించడమే కాక వాటిని వశం చేసుకునే పనిలో పడడంతో టిటో-స్టాలిన్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. బల్గేరియా సాయంతో గ్రీసు, అల్బేనియాలతో ప్రత్యేకమైన బ్లాక్ ఏర్పాటు చేసేందుకు టిటో రచించిన పధకాలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి వ్యతిరేకంగా పరిణమించాయి. కమ్యూనిస్టు శిబిరం రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. టిటో స్ధానికంగా పెద్దన్న పాత్ర పోషించే పోకడలు పోయాడు. చివరికి యుగోస్లావియాను కమ్యూనిస్టు శిబిరం నుండి బహిష్కరించేవరకు పరిస్ధితి దారితీసింది. ఈ పరిణామాల ప్రభావం గ్రీసు ఉద్యమంపై తీవ్రంగా పడింది. టిటోను విమర్శిస్తే ఆపన్న హస్తాన్ని కోల్పోయినట్లే. ఆహార, ఆయుధ సరఫరా ఆగిపోతుంది. టిటో పక్షం చేరితే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం నుండి వేరు పడాల్సి వస్తుంది.

మరోవైపు సోవియట్ తో వర్తకం బలహీనపడడంతో పశ్చిమ దేశాలతో వర్తకాన్ని వృద్ధి చేసుకునేందుకు టిటో మొగ్గు చూపాడు. పశ్చిమ దేశాలతో వర్తకం అంటే గ్రీసు కమ్యూనిస్టులకు సహాయం ఆపివేయాలి. ఎదురు దెబ్బలు తింటున్న డి.ఎస్.ఈ కి మద్దతుగా నిలవడం కంటే తన సొంత ప్రతిష్టను నిలుపుకోవడం కోసం పశ్చిమ దేశాలతో సంబంధాలు పెంచుకోవడమే ఉత్తమం అని టిటో భావించాడు. దానితో గ్రీసు గెరిల్లాలకు యుగోస్లేవియా నుండి మద్దతు ఆగిపోయింది. గ్రీసుతో సరిహద్దును మూసివేశారు. అంతటితో ఆగకుండా తమ భూభాగంలోకి ప్రవేశించి గ్రీసు గెరిల్లాలపై దాడి చేయడానికి కూడా గ్రీసు దోపిడీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చాడు. ఆ విధంగా పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మార్షల్ టిటో విద్రోహానికి పాల్పడ్డాడు.

టిటో-స్టాలిన్ విభేదాలు గ్రీసు కమ్యూనిస్టు పార్టీపై ప్రభావం పడవేశాయి. యుగోస్లావియా సహాయం కొనసాగడం కోసం స్టాలిన్-టిటో విబేధాల విషయంలో తటస్ధంగా ఉండాలని భావించిన మార్కోస్ ను పార్టీ నాయకత్వం నుంచి తప్పించారు. స్టాలిన్ పక్షం వహించిన నికోస్ ను కొత్త నేతగా ఎన్నుకున్నారు. కానీ నికోస్ నేతృత్వంలో గ్రీసు కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమ తప్పిదాలకు పాల్పడింది. జాతీయ సైన్యంపై గెరిల్లా ఎత్తుగడలతో యుద్ధం సాగించడం మాని రెగ్యులర్ సైన్యంగా ఏర్పరచి నేరుగా తలపడింది. అమెరికా ఆర్ధిక సహాయంతోనూ, ఆయుధ సరఫరాలతోనూ అనేక రెట్లు బలం పెంచుకున్న సైన్యం ముందు కమ్యూనిస్టు సైన్యం నిలవకుండా పోవడానికి అట్టే కాలం పట్టలేదు.

యుగోస్లావియా నుండి సరఫరాలు ఆగిపోయిన ఫలితంగా కె.ఇ.ఇ. బలహీనపడుతూ పోయింది. మధ్య గ్రీసు నుండి ఉత్తర సరిహద్దుల వరకు సైన్యం కె.ఇ.ఇ పై ఎదురు దాడిగి దిగింది. గ్రామ గ్రామాన జల్లెడ పడుతూ గెరిల్లాలను అంతం చేస్తూ పోయింది. అనేక చోట్ల కె.ఇ.ఇ సైన్యం గట్టి ప్రతిఘటన ఇచ్చింది. సైన్యానికి తీవ్ర నష్టాల్ని చవి చూపింది. కానీ అల్బేనియా కూడా సహాయ నిరాకరణ చేయడంతో తనకు జరిగే నష్టాల్ని పూడ్చే వనరులు లేక ఓటమి పాలయింది. ఆగష్టు 30, 1949 తేదీన కమ్యూనిస్టుల చివరి స్ధావరం గ్రమ్మోస్ సైన్యం వశం కావడంతో గ్రీసు అంతర్యుద్ధం/విముక్తి పోరాటం ముగిసింది.

గ్రీకు అంతర్యుద్ధం (సివిల్ వార్) గా చరిత్రకెక్కిన గ్రీసు కమ్యూనిస్టు విముక్తి పోరాటం ఆచరణలో అంతర్యుద్ధం కానే కాదు. అమెరికా, బ్రిటన్ లు సకల విధాలుగా గ్రీసు దోపిడీ వర్గాల పక్షం వహించాయి. బ్రిటిష్ సైన్యాలు సైతం స్వయంగా ఏథెన్స్ వీధుల్లో గ్రీసు ప్రజా యోధులతో తలపడి నెత్తురు పారించారు. కాగా సోవియట్ రష్యా సహాయం కేవలం సలహాల వరకే పరిమితం అయింది. నిజానికి అంతకంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఏ దేశంలోనైనా విప్లవాలు అంతర్గత శక్తుల విజయం వల్ల సిద్ధిస్తేనే కలకాలం నిలుస్తాయి తప్ప విదేశాల నుండి ఎగుమతి చేసిన విప్లవాలు నిలవజాలవు. మరోవైపు గ్రీసు అంతర్గత వ్యవహారాల్లోకి వర్గ శత్రువుకు అమెరికా, బ్రిటన్ లు ముఖ్యంగా బ్రిటన్, చరిత్ర పొడవునా, అడుగడుగునా చొరబడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు ఫలితం దక్కకుండా చేస్తూ వచ్చింది. గ్రీసు ప్రజలు తమ భవిష్యత్తును తాము నిర్మించుకోకుండా బ్రిటన్ అన్ని మలుపుల్లోనూ అడ్డు పడింది. అమెరికా కూడా ఆ పాపంలో భాగం పంచుకుంది. ట్రూమన్ డాక్ట్రిన్ తో మొదలైన అమెరికా చొరబాటు నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తోంది. అమెరికాకు పోటీగా జర్మనీ రంగంలోకి దిగిన దరిమిలా గ్రీసు ప్రజల జీవనం మరింత దుర్భరంగా మారింది.

……………..ఇంకా ఉంది

One thought on “గ్రెక్సిట్: బ్రిటన్ పెనం నుండి అమెరికా పొయ్యి లోకి -7

  1. హమయ్య!!!!!!!
    ఈ రోజే మిమ్మల్ని జి మైల్ ద్వారా పలకరిద్దామనుకొన్నాను.
    ఇంతలో మీరే ప్రత్యక్షమయ్యారు.
    దేవునికి కోరిక కోరకుండానే వరమిచ్చినంత సంతొషంగా ఉంది!
    ఏది ఏమైనప్పటికీ మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s