గ్రెక్సిట్: గ్రీసు ప్రజా విముక్తి పోరాటం (సివిల్ వార్) -6


ELAS Guerilla fighters

ELAS Guerilla fighters

5వ భాగం తరువాత………..

ప్రజా విముక్తి పోరాటం

1941 ఏప్రిల్ 6 తేదీన హిట్లర్ సేనలు రంగంలోకి దిగాయి. ఇటలీ అంతిమ ఓటమికి గురయితే అది జర్మనీకి పాకడానికి ఎంతోసేపు పట్టదు. మిత్రరాజ్యాలు రెట్టింపు ఉత్సాహం పొందవచ్చు. అదీకాక ఐరోపా వనరులన్నీ తమ ప్రయోజనాలకే అంకితం కావాలన్న లక్ష్యం ఎలాగూ ఉంది. అప్పటికే చమురు భూముల రక్షణ కోసమని చెబుతూ రుమేనియాలో సైనిక స్ధావరం ఏర్పరుచుకున్న జర్మనీ ఆ పొరుగునే ఉన్న బల్గేరియా పాలకులను కూడా తన ఏలుబడిలోకి తెచ్చుకున్నది. జర్మనీ సేనలు బల్గేరియా మీదుగా గ్రీసుపైకి దండెత్తాయి. గ్రీసు సేనలు అల్బేనియాలో ఇటలీతో తలపడుతూ తీరిక లేకుండా ఉన్నాయి. దానితో జర్మనీ సేనలకు అడ్డు లేకుండా పోయింది. అత్యంత తేలికగా గ్రీసుల్లో ఒక్కో నగరాన్ని వశం చేసుకుంటూ జర్మనీ జైత్రయాత్ర సాగించింది. ఇటలీతో యుద్ధాన్ని విరమించి గ్రీసు సేనలు లొంగిపోయాయి. జర్మనీ సేనలకు ఎదురు నిలిచి పోరాటాన్ని కొనసాగించింది గ్రీసు జనం మాత్రమే. గ్రీకు రాజు ప్రాణాలు అరచేత పట్టుకుని క్రీట్ మీదుగా పశ్చిమాసియాకు అక్కడి నుండి బ్రిటిష్ ఏలుబడిలోని ఈజిప్టుకు పారిపోయాడు. (అనంతరం లండన్ లో విడిది చేశాడు. ఆయన్ను గ్రీసు రాజుగా నియమించింది బ్రిటిష్ పాలకులే మరి!) బూర్జువావర్గ రాజకీయ నాయకత్వం కూడా కొంతమంది సాయుధ సైనికలతో సహా కైరోకు పారిపోయింది. గ్రీసు జనాన్ని జర్మనీ సేనలకు వదిలి రాజుతో కలిసి అక్కడే గ్రీసు ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పుడిక గ్రీసు జర్మనీ, ఇటలీ, బల్గేరియా సేనల ఆధీనంలోకి వచ్చేసింది. గ్రీసుకు సాయం వచ్చిన బ్రిటిష్ సైన్యం కూడా వెనక్కి పారిపోయింది. (పారిపోతూనే 13,000 మంది బ్రిటిష్ సేనలు జర్మనీ సేనలకు బందీలుగా చిక్కాయి.) ఆనాడు జర్మనీ సేనలకు భయపడి ఎవరైతే దేశం విడిచి పారిపోయారో వారి వారసులే నేడు గ్రీసు సంపదల్ని అనుభవిస్తున్నారు. అప్పులతో కూడబెట్టిన సంపదల్ని తమ ఖాతాలో జమ చేసుకుని అప్పులను మాత్రం జనానికి అప్పజెప్పారు. ఇళ్లూ, వాకిళ్లూ వదిలి పిల్లలతో సహా గెరిల్లాలుగా మారి ఏ ప్రజలైతే సర్వ శక్తులు ఒడ్డి జర్మనీ సేనలతో పోరాడి తమ నేలను కాపాడుకునేందుకు తెగించారో ఆ ప్రజలు నేడు అప్పుల భారాన్ని మోస్తూ, పైసా పైసా చెల్లిస్తూ కూడా దేశం సొమ్ము తింటున్న తిండిపోతులుగా, ప్రభుత్వంపై ఆధారపడ్డ సోమరిపోతులుగా ముద్ర పొందుతున్నారు. ఇంతకు మించిన ఆటవిక న్యాయం ఉండగలదా?

గ్రీసులో ఉత్తర సర్రిహద్దులో ప్రవేశించిన పది రోజుల్లో జర్మనీ సేనలు, ఇటలీ సేనలతో కలిసి గ్రీసు దక్షిణ తీరాన్ని చేరాయి. ఆ విధంగా గ్రీసును పూర్తిగా ఆక్రమించాయి. మూడో వంతు భాగం ఇటలీ ఆధీనంలో ఉండగా ఒకటో వంతు జర్మనీ ఆధీనంలో ఉంచుకుంది. గ్రీసు పాలకవర్గాలు దేశం విడిచి పారిపోవడంతో దేశాన్ని కాపాడుకోవలసిన కర్తవ్యాన్ని ప్రజలే తమ భుజ స్కందాలపై వేసుకున్నారు. జర్మనీ, ఇటలీల ఆక్రమణతో తలపడేందుకు వివిధ ప్రతిఘటనా పోరాట సంస్ధలు ప్రజల నుండి స్వతంత్రంగా పుట్టుకొచ్చాయి.

వారిలో అత్యంత ప్రజాదరణ పొంది శక్తివంతమైన సాయుధ సంస్ధగా రూపొందినది విప్లవ కమ్యూనిస్టు గెరిల్లా సంస్ధ ఇ.ఎ.ఎం ఇది గ్రీకు భాషా పదజాలం నుండి సంగ్రహించినది. ఆంగ్లంలో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అంటారు. అనగా జాతీయ విముక్తి సంఘటన అని. ఇది గ్రీకు కమ్యూనిస్టు పార్టీ (కె.కె.ఇ) సెప్టెంబర్ 1941లో ఏర్పాటు చేసిన సంస్ధ. దురాక్రమణదారులకు సాయుధ ప్రతిఘటన ఇవ్వడానికి విముక్తి తర్వాత ఏ తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలన్న విషయమై ప్రజలకు మార్గదర్శకం వహించే లక్ష్యంతో దీనిని కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1942లో పార్టీకి అనుబంధంగా పని చేసేందుకు సొంత మిలట్రీ విభాగం ఇ.ఎల్.ఏ.ఎస్ (నేషనల్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ – జాతీయ ప్రజా విముక్తి సైన్యం) ను కూడా కమ్యూనిస్టు పార్టీ నిర్మించింది. ఈ రెండు సంస్ధలే గ్రీసులో విస్తారమైన, అత్యధిక ప్రాంతాల్లో ప్రతిఘటనా ఉద్యమాన్ని నిర్మించాయి. పెలోపోన్నెసే, క్రీట్, ధెస్సలే, మాసిడోనియా లాంటి విస్తారమైన భూభాగాల్లో ఉద్యమాన్ని ఇవి నిర్మించాయి.

ఈ సంస్ధల సభ్యుల సంఖ్య ఉద్యమ ఉచ్ఛ దశలో 2 మిలియన్లు (జనాభా 6.5 మిలియన్లు) ఉందంటే కమ్యూనిస్టు పార్టీ బలం ఎంతటిదో అంచనా వేయవచ్చు. బంగారు భవిష్యత్తును ఆశిస్తూ గ్రీకు ప్రజలు ఈ సంస్ధల వెనుక స్ధిరంగా సమీకృతం అయ్యారు. పాత ప్రభుత్వాల కంటే భిన్నమైన, మెరుగైన పాలనను ఆశించిన యువత, సనాతన క్రైస్తవ, పితృస్వామిక అణచివేతలో మగ్గుతున్న స్త్రీలు, రాజకీయాల నుండి దూరంగా నెట్టివేయబడ్డ రైతాంగం… వీరంతా కమ్యూనిస్టు పార్టీ వెనుక చేరారు. దురాక్రమణ శక్తులతో చేయి కలిపిన వారిని ఎవ్వరిపైనా వారు దయ చూపలేదు. శత్రువుతో ఏ కాస్త చేయి కలపడం అన్నా భవిష్యత్తు శూన్యం చేసుకోవడమే అని అర్ధం అయినప్పుడు ఎవరైనా అలాగే వ్యవహరిస్తారు. దీనినే గ్రీసు పాలకవర్గాలు, వారికి మద్దతుగా నిలిచిన ఆంగ్లో-సాక్సన్ సామ్రాజ్యవాదులు రక్త పిపాసతగా ప్రచారం చేశారు. అనేక కట్టుకధలు కల్పించి ప్రచారంలో పెట్టారు. అందువలన ఆనాటి గ్రీసు కమ్యూనిస్టు పార్టీ గురించి, గెరిల్లా సైన్యం గురించి అనేక కట్టు కధలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. గ్రీసు దేశాన్ని దోచారనీ, టెర్రర్ తో ముంచెత్తారనీ ఇలా. ఈ ప్రచారానికి ప్రధాన కర్తలు బ్రిటిష్ ప్రభువులే.

నిజానికి గ్రీసు ప్రజలను అత్యంత భీతావహ పరిస్ధితుల్లోకి నెట్టిన ఘనత జర్మనీ సేనలదే. గ్రీసు ప్రజల నుండి జర్మనీ సేనలు సమస్తం లూటీ చేశారంటే అతిశయోక్తి కాదు. “వారు సమస్తం దోచుకున్నారు. చివరికి గ్రీసు ప్రజల బూటు లేసుల్ని కూడా వారు వదిలిపెట్టలేదు” అని ఇటలీ నియంత ముసోలిని స్వయంగా వ్యాఖ్యానించాడంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. కానీ జర్మనీని వదిలి గ్రీసు విముక్తి కోసం శ్రమించి, ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టు గెరిల్లాలపై దుష్ప్రచారం చేసేందుకే బ్రిటన్ ఎక్కువ శ్రమించింది.

KKEకమ్యూనిస్టేతర గెరిల్లా సంస్ధలు కూడా జర్మనీ, ఇటలీ సేనలపై పోరాడిన వారిలో ఉన్నాయి. అయితే వారి సంఖ్య, బలం నామమాత్రమే. వారిలో ఇ.డి.ఇ.ఎస్ ముఖ్యమైనది. దీని నాయకుడు నెపోలియన్ జెర్వాస్. పేరుకు సోషలిస్టుగా చెప్పుకున్న ఈ సంస్ధ ఆచరణలో గ్రీకు పాలకవర్గాల ప్రయోజనాలకు కట్టుబడి పని చేసింది. మరొక సంస్ధ కల్నల్ సారోస్ నేతృత్వంలోని ఇ.కె.కె.ఏ. సోషల్ డెమోక్రసీ అవగాహన కలిగిన ఈ సంస్ధ కూడా ఆచరణలో గ్రీకు లిబరల్ బూర్జువా ప్రయోజనాలకు కట్టుబడింది. అంతిమ దశలో ఇవి రెండూ గ్రీసు ప్రజా పోరాటానికి విద్రోహం చేస్తూ బ్రిటిష్ ఆజ్ఞలను పాటించాయి. ఈ సంస్ధల ప్రభావం ఎపిరస్, రౌమేలి ప్రాంతాలకే పరిమితం అయింది. ఫాసిస్టు కూటమికి తీవ్ర ప్రతిఘటన ఇస్తున్నందుకు ఇ.ఏ,ఎం, ఇ.ఎల్.ఏ.ఎస్ లను మిత్ర సంస్ధలుగా బ్రిటన్ పరిగణించాలి. మిత్రులుగా పరిగణించడంతో పాటు తగిన సహాయం కూడా ఇవ్వాలి. కానీ గెరిల్లాలకు బ్రిటిష్ సాయం ఒకటి రెండు ఘటనల వరకే పరిమితం అయింది. గ్రీసు రాజు, ప్రవాస ప్రభుత్వాలు తిరిగి గ్రీసు రావడానికి ఇ.ఏ.ఎం ససేమిరా వ్యతిరేకించడం బ్రిటన్ కు నచ్చలేదు. పైగా ఇ.ఎ.ఎం కమ్యూనిస్టు పార్టీ సంస్ధ కూడా. ఎంత ఫాసిస్టులతో పోరాడుతున్న వారినైనా వ్యతిరేకించేందుకు ఇంతకంటే కారణం బ్రిటన్ కు అవసరం లేదు. రాచరికాన్ని వ్యతిరేకించింది ఒక్క కమ్యూనిస్టులే కాదు మొత్తం గ్రీసు ప్రజలే రాచరికాన్ని ద్వేషించారు. నియంత మెటాక్సస్ ను రాజే అండదండలు ఇచ్చి దేశంపై రుద్దాడన్న సంగతి వారికి బాగానే తెలుసు. కానీ ఆ రాచరికాన్ని గ్రీసుపై పదే పదే రుద్దింది బ్రిటన్ పాలకులే కనుక, గ్రీసుపై పట్టు కొనసాగడానికి రాజు కావాలి కనుక బ్రిటన్ కు రాజును వ్యతిరేకించేవారు ఎవరైనా శత్రువులే. వారు గ్రీసు ప్రజలైనా సరే.

ప్రపంచ యుద్ధం ముగిసి గ్రీసు విముక్తి అయితే పరిస్ధితి ఏమిటి? కమ్యూనిస్టులు దేశాన్ని హస్తగతం చేసుకుని సోవియట్ రష్యా ప్రాభవం కిందకు దేశాన్ని తీసుకెళ్తారా? ఇదే బ్రిటన్ భయం. బ్రిటన్ కు కావలసింది ఫాసిస్టుల నుండి గ్రీసు ప్రజల విముక్తి కాదు. గ్రీసు ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య పాలనలో సుఖ సంతోషాలతో జీవించడమన్న సంగతే బ్రిటన్ కు అవసరం లేదు. జర్మనీ నుండి బైటపడి తన ఏలుబడిలోకి గ్రీసు రావడమే బ్రిటన్ అవసరం. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారన్న ఆలోచనే అప్పటి బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ కు వణుకు పుట్టించింది. సోవియట్ రష్యా ప్రభావం తూర్పు యూరప్ లో విస్తరిస్తున్న ఛాయలు కనిపిస్తున్న నేపధ్యంలో మధ్యధరా సముద్రంలో అత్యంత వ్యూహాత్మక స్ధానంలో ఉన్న గ్రీసు, టర్కీలు సోవియట్ ప్రాభవంలోకి వెళ్ళడం అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాద పెట్టుబడిదారులకు పక్కలో బల్లెం ఉన్నట్లే. (అప్పటి అగ్ర రాజ్యం బ్రిటన్ అన్న సంగతి గమనంలో ఉంచుకోవాలి.)

ఈ పరిస్ధితిని నివారించాలంటే రాజును తిరిగి గ్రీసులో ప్రతిష్టించడం మిగిలిన ఏకైక మార్గం అని చర్చిల్ తలపోశాడు. ఈ వ్యూహంతోనే ఇ.ఏ.ఎం/ఇ.ఎల్.ఏ.ఎస్ ప్రభావానికి వ్యతిరేకంగా ఇ.డి.ఇ.ఎస్ కు ఆర్ధిక, ఆయుధ సరఫరాలను దండిగా అందించాడు. ఇ.ఎ.ఎం కు కూడా సరఫరాలు చేసినప్పటికీ అది పరిమితంగానే. ఇ.డి.ఇ.ఎస్ కు సాయం చేస్తూ అందుకు ప్రతిగా తన రిపబ్లికనిజాన్ని (రాచరిక వ్యతిరేక వాదం) వదులుకుని రాచరికానికి మద్దతు ఇవ్వాలని సంస్ధ నేత జెర్వాస్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం బ్రిటన్! ఆ విధంగా కైరోలోని ప్రవాస గ్రీసు ప్రభుత్వం గ్రీసులోని ఒక పోరాట సంస్ధ ఇ.డి.ఇ.ఎస్ లు బ్రిటన్ ఆదేశాలను పాటిస్తూ వచ్చారు.

బ్రిటన్ అంతటితో సంతృప్తి పడలేదు. కమ్యూనిస్టులు, ప్రవాస ప్రభుత్వానికి మధ్య ఏదో విధంగా ఒక సానుకూల అవగాహన కుదర్చడానికి ప్రయత్నాలు చేసింది. శక్తివంతంగా మారిన కమ్యూనిస్టులను దారికి తెచ్చుకోవాలని బ్రిటన్ తాపత్రయం. ఎత్తుగడ రీత్యా ఐక్య సంఘటన ఏర్పాటు చేయాలన్న అవగాహనతో ఉన్న కమ్యూనిస్టు పార్టీ సైతం అందుకు ‘వ్యూహాత్మక సుముఖత’ వ్యక్తం చేసింది. ఈ కృషిలో భాగంగా రాజుతో చర్చించడానికి గ్రీసు కమ్యూనిస్టు బృందం కైరో రావడానికి అంగీకరించింది. ఇ.ఏ.ఏం, ఇ.ఎల్.ఏ.ఎస్ లతో పాటు ఇతర పోరాట సంస్ధల ప్రతినిధులు 1943 ఆగస్టు 9 తేదీన ఇ.ఏ.ఏం ఆధీనంలోని కొండ ప్రాంతాల నుండి ఓ చిన్న విమానంలో కైరో వెళ్లారు.

అక్కడ బ్రిటిష్ అధికారులు, రాజు, ప్రవాస ప్రభుత్వంతో వారు చర్చలు జరపాలి. అక్కడ చర్చలు జరిగాయి కానీ ఆరంభంలోనే బెడిసి కొట్టాయి. ఇ.ఏ.ఏం రెండు ప్రధాన డిమాండ్ లను ముందు పెట్టింది. హోమ్-న్యాయ-రక్షణ శాఖలను తమకు అప్పగించడం, రాజు రావాలా వద్దా అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం. ఈ రెండింటికి బ్రిటన్, ప్రవాస ప్రభుత్వం అంగీకరించలేదు. మొదటి డిమాండ్ వల్ల అధికారం అంతా కమ్యూనిస్టులకు అందుతుంది. రెండవ అంశంపై అప్పటికే బ్రిటన్, ప్రవాస ప్రభుత్వాలు నిర్ణయం చేసేశారు. విముక్తి అనంతరం రాజు గ్రీసు వచ్చి అధికారం చేపట్టాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ విధంగా కైరో రాయబారం మొదలు కాకుండానే ముగిసిపోయింది. ఆ విధంగా మొదటి పౌర యుద్ధానికి బీజం పడింది.

1943 అక్టోబర్ నెలలో మధ్య, పశ్చిమ గ్రీసులో అంతర్యుద్ధం బద్దలయింది. ఇ.ఎల్.ఏ.ఎస్, ఇ.డి.ఇ.ఎస్ గెరిల్లాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇ.డి.ఇ.ఎస్ శ్రేణులు ఆక్రమణ సేనలతో కుమ్మక్కై ప్రతీఘాతక చర్యలకు దిగడంతో ఘర్షణ అనివార్యం అయింది. ఈ వార్త విని ఇరు వర్గాలకు సరఫరాలు బంద్ చేస్తున్నట్లు ప్రవాస ప్రభుత్వం లేదా బ్రిటన్ ప్రకటించింది. కానీ అంతలోనే ఇ.డి.ఇ.ఎస్ కు సరఫరాలు పునరుద్ధరించింది. ఇ.ఎల్.ఏ.ఎస్ కు సరఫరాలు చేయడం ఆపేసింది. కానీ ఇది కమ్యూనిస్టు గెరిల్లాలపై ప్రభావం చూపలేదు. ఎందుకంటే అప్పటికే ఇటలీ సేనలు లొంగుబాట పట్టాయి. అక్ష రాజ్యాలు వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపధ్యంలో సెప్టెంబర్ లో గ్రీసునుండి సేనలు వెనక్కి వెళ్ళడం ప్రారంభం అయింది. వారు వెళ్తూ వెళ్తూ తమ ఆయుధ సామాగ్రిని అక్కడే వదిలి వెళ్లారు. ఆ ఆయుధాలు ఇతర రవాణా, భోజన సామాగ్రి ఇప్పుడు ఇ.ఎల్.ఏ.ఎస్ వశం అయ్యాయి. గెరిల్లా సంస్ధల మధ్య వైరాన్ని జర్మనీ అవకాశంగా తీసుకుని తమ వంతేదారులతో ‘సెక్యూరిటీ బెటాలియన్’ లు ఏర్పాటు చేసి ప్రతిఘటన దారులపైకి ఉసిగొల్పింది. దానితో అంతర్యుద్ధంలో మరో పార్శ్వం వచ్చి చేరింది.

కానీ కమ్యూనిస్టులు తెలివిగా వ్యవహరించడంతో 1944 ఫిబ్రవరికే ఈ అంతర్యుద్ధం ముగిసిపోయింది. ఉమ్మడి అవగాహన కోసం, ఘర్షణల నివారణ కోసం గెరిల్లా సంస్ధలు సమావేశం కావాలని నిర్ణయించాయి. ఇ.ఎల్.ఏ.ఎస్, ఇ.డి.ఇ.ఎస్, ఇ.కె.కె.ఏ లు చర్చలు చేయాల్సి ఉండగా ఇ.కె.కె.ఏ తన మద్దతు పూర్తిగా ఇ.డి.ఇ.ఎస్ కె అని చెప్పేసింది. ఇ.డి.ఇ.ఎస్ యేమో బ్రిటిష్ అధికారులను సలహాలు అడిగింది. అంతిమంగా గ్రీసు పోరాట సంస్ధల మధ్య జరగవలసిన చర్చలు బ్రిటన్-ఇ.ఎల్.ఏ.ఎస్ మధ్య చర్చలుగా మారాయి. గ్రీసు అంతర్యుద్ధంలో బ్రిటన్ ఎంత లోతుగా చొరబడిందో ఈ సమావేశం వెల్లడి చేసింది. చివరికి ఒకరి ప్రాంతంలోకి మరొకరు వెళ్లకూడదని, ఒకరిపై ఒకరు దాడులు వద్దని, అవసరం రీత్యా ఇతరుల ప్రాంతంలోకి వెళ్తే దానిని చొరబాటుగా తీసుకోరాదని అంగీకారానికి వచ్చాయి.

1944 కల్లా గ్రీసు కమ్యూనిస్టు పార్టీ కిందికి మెజారిటీ గ్రీసు వచ్చేసింది. విస్తారమైన ప్రాంతం, పాలనా యంత్రాంగం, శక్తివంతమైన సైన్యం అన్నీ సమకూరాయి. ఈ దన్నుతో మార్చి 26, 1944 తేదీన సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం పేరు పి.ఇ.ఇ.ఏ (జాతీయ విముక్తి రాజకీయ కమిటీ) గా ప్రకటించింది. తమ అధికారులను మంత్రులకు బదులు కార్యదర్శులుగా ప్రకటించింది. ఈ చర్యలతో ప్రవాస ప్రభుత్వం న్యాయబద్ధత ప్రశ్నార్ధకం అయింది. బ్రిటన్ కు కె.కె.ఇ నేరుగా సవాలు విసిరినట్లు అయింది. ఈ ప్రభుత్వాన్ని గుర్తించడానికి మిత్ర రాజ్యాలు నిరాకరించాయి. కానీ కమ్యూనిస్టు రాజ్యాలయిన సోవియట్ రష్యా, యుగోస్లోవియాలు పి.ఇ.ఇ.ఏ అసలైన ప్రభుత్వంగా గుర్తిస్తూ ప్రకటించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనతో కైరోలోని గ్రీసు సేనల్లో ముసలం పుట్టింది. వారిలో ఒక వర్గం తిరుగుబాటు లేవదీసింది. ఆర్మీ, వాయు సేన, నౌకా సేనలకు చెందిన అధికారులు ప్రవాస ప్రధాని సౌడెరోస్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల అనంతరం వారిలో అనేకమందిని సముద్రంలో తోసి చంపేశారు. అనేకమందిని అరెస్టు చేశారు. ఐనా తిరుగుబాటు విస్తరించింది. బ్రిటన్ సేనలు రంగంలో దిగి తిరుగుబాటు సేనలను చుట్టుముట్టడంతో అది సమసిపోయింది.

అయితే ఇది ప్రవాస ప్రభుత్వాన్ని ఆలోచనలో పడవేసింది. గెరిల్లా సంస్ధలతో మరింత సహకారం పెంపొందించుకోవాలని గ్రహించింది. కానీ ఈ సహకారాన్ని మోసపూరిత ఎత్తుగడలకే బ్రిటన్ పరిమితం చేసింది. లెబనాన్ లో మరో కాన్ఫరెన్స్ కు పిలుపు ఇచ్చింది. గ్రీసులో డెమోక్రటిక్-సోషలిస్టు పార్టీ నేతగా ఉన్న జార్జి పపాండ్రూ తన నమ్మిన బంటుగా ఎంచుకుంది. జార్జి నాయకత్వంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇ.ఏ.ఎం ను అందులోకి ఆహ్వానించింది. యుద్ధానంతరం జార్జి ప్రభుత్వం, బ్రిటిష్ సేనలు వ్యతిరేకత లేకుండా గ్రీసులో ప్రవేశించాలంటే ఇ.ఏ.ఎంను ప్రభుత్వంలోకి తీసుకోవడం తప్ప గత్యంతరం లేదు. ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించకపోతే జాతీయ ఐక్యతకు వారు ఆటంకం అని ప్రజల్లో ప్రచారం చేయాలని భావించింది. అంగీకరించిన పక్షంలో ప్రాధాన్యత లేని మంత్రిత్వ శాఖలు ఇవ్వజూపింది. గెరిల్లా ప్రతినిధులు ఈ ప్రతిపాదనలకు వెంటనే అంగీకరించకుండా తమ నాయకత్వంతో చర్చించి చెబుతామని వెనక్కి వెళ్లారు. అనంతరం మోసపూరిత ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

ఇదే సమయంలో గ్రీసు భవితవ్యాన్ని నిర్ణయించడానికి చర్చిల్, స్టాలిన్ లు సమావేశం అయ్యారు. గ్రీసుతో పాటు ఇతర బాల్కన్, తూర్పు యూరప్ దేశాలపై కూడా తన ప్రతిపాదనలను చర్చిల్ స్టాలిన్ ముందు ఉంచాడు. ఈ ప్రతిపాదనే పర్సెంటేజ్ ఒప్పందంగా ప్రచారంలోకి వచ్చింది. వివాదాస్పదంగా ఉన్న బాల్కన్, తూర్పు యూరప్ దేశాలను ఎలా పంచుకోవచ్చో చర్చిల్ ప్రతిపాదించాడు. ఈ ఒప్పందం స్ధూలంగా ఇలా ఉంది.

రుమేనియా: రష్యా – 90%, ఇతరులు – 10%

గ్రీస్: గ్రేట్ బ్రిటన్ (అమెరికాతో సహా) – 90%, రష్యా – 10%

యుగోస్లేవియా: 50-50%

హంగేరి: 50-50%

బల్గేరియా: రష్యా – 75%, ఇతరులు – 25%

ఈ ఒప్పందానికి స్టాలిన్ అక్కడ అంగీకారం చెప్పారు. ఈ ఒప్పందం ఆధారంగా గ్రీసుకు స్టాలిన్ విద్రోహం తలపెట్టారని ఆయన వ్యతిరేకులు ఇప్పటికీ ఆరోపిస్తారు. తూర్పు యూరప్ దేశాలపై ఆధిపత్యం సాధించాలన్న కాంక్షతో గ్రీసు ప్రజలను వారి ఖర్మానికి ఆయన వదిలిపెట్టారని, నట్టేట ముంచాడని తిట్టిపోస్తారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అది తప్పని రుజువు చేస్తాయి. ఒప్పందంలో గ్రీసును త్యజించినట్లు కనిపించినప్పటికీ గ్రీసు గెరిల్లాలకు అందుకు భిన్నమైన మార్గదర్శకం స్టాలిన్ చేశారని అనంతర పరిణామాలు స్పష్టంగా రుజువు చేశాయి. అప్పటికే బాల్కన్ దేశాల్లో అధిక ప్రాంతాన్ని సోవియట్ సేనలు ఆధీనంలో ఉంచుకున్నాయి. పోలాండ్, బాల్టిక్ రిపబ్లిక్ దేశాల్లోనూ పై చేయి సాధించాయి. ఈ ప్రాంతాల్లో సోషలిస్టు ఆధిపత్యాన్ని స్ధిరపరచడానికి మిత్రరాజ్యాలతో మిత్రత్వం కోరుకుంటున్నట్లుగానే కనిపించాలి.

గ్రీసులో అన్నింటా పై చేయిగా ఉన్న కమ్యూనిస్టు గెరిల్లాలను త్యజించడం అన్న సమస్యే ఉండదు. గ్రీసు గెరిల్లాలకు కావలసింది గ్రీసు ప్రజల మద్దతే గాని అలంకార ప్రాయమైన పర్సెంటేజీ మద్దతు కాదు. నిజానికి ఈ సమావేశం సంగతి ఇ.ఎల్.ఏ.ఎస్ కు తెలియదు. చర్చిల్ తో ఒప్పందం అనంతరం జులై 25, 1944 తేదీన సోవియట్ అధికారులు విమానంలో ఇ.ఎల్.ఏ.ఎస్ ఆధీన ప్రాంతాల్లో దిగి పరిణామాలు తెలియజేశారు. అనంతరం జార్జి పపాండ్రూ (2010 వరకు గ్రీసు ప్రధానిగా ఉన్న జార్జి పపాండ్రూకి ఈయన తాత) ప్రభుత్వంలో చేరుతున్నట్లుగా ఇ.ఎల్.ఏ.ఎస్ ప్రకటించడం, అక్టోబర్ 18, 1944 తేదీన బ్రిటిష్ సైనికుల రక్షణలో ప్రవాస ప్రభుత్వం గ్రీసుకు రావడం జరిగిపోయింది. ఒప్పందం మేరకు ఫ్లెబిసైట్ తర్వాతనే రాజు దేశానికి తిరిగి రావాలని నిర్ణయించడంతో ఆయన రాలేదు.

ప్రభుత్వం అయితే ఏర్పడింది గానీ దాని ఆధీనంలో దేశం మాత్రం లేదు. ఒక్క ఏథెన్స్ మినహా మిగిలిన ప్రాంతం అంతా ఇ.ఏ.ఎం/ఇ.ఎల్.ఏ.ఎస్ ఆధీనంలోనే కొనసాగింది. జర్మనీ ఆక్రమణదారులతో కుమ్మక్కు అయినవారిని గెరిల్లాలు శిక్షించడం కొనసాగింది. జర్మనీ ఏర్పారు చేసిన సెక్యూరిటీ బెటాలియన్ల సభ్యులను అరెస్టు చేసి ‘ప్రజా కోర్టుల్లో’ విచారించడమూ కొనసాగింది. రాజధాని తప్ప మిగిలిన ప్రాంతాలన్నిటా ఇ.ఎల్.ఏ.ఎస్ దే రాజ్యం తప్ప కొత్త ప్రభుత్వానిది కాదు. ప్రధాన మిలట్రీ కేంద్రాలన్నీ ఇ.ఎల్.ఏ.ఎస్ ఆధీనంలో ఉన్నాయి. గెరిల్లాలు ఆయుధాలను అప్పగించాలన్న ఒప్పందాన్ని పాటించలేదు. ఒప్పందం మేరకు గెరిల్లా సైన్యం ప్రభుత్వం ఆధీనంలోకి రావాల్సి ఉన్నప్పటికీ అది అమలు చేయలేదు. (ఈ పరిణామాలను బట్టి కమ్యూనిస్టు పార్టీకి ‘తగిన’ సలహాయే స్టాలిన్ ఇచ్చారని స్పష్టం అవుతోంది.)

ఈ పరిస్ధితుల్లో గెరిల్లా సైన్యం ఎప్పటికైనా ముప్పే అని బ్రిటన్ గ్రహించింది. తన కీలు బొమ్మ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ ఆదేశాల మేరకు సైన్యాధ్యక్షుడు ఒక ఆదేశం జారీ చేశాడు. దాని ప్రకారం ఇ.ఎల్.ఏ.ఎస్, ఇ.డి.ఇ.ఎస్ తదితర సంస్ధల సభ్యులు ఆయుధాలతో పెట్రోలింగ్ నిర్వహించడం ఆపాలి. సాయుధంగా ఏథెన్స్ లో ప్రవేశిస్తే బ్రిటిష్ సేనలు వారిపై బలప్రయోగం చేసి నిరాయుధులను చేస్తాయి. ఇ.డి.ఇ.ఎస్ వెంటనే ఈ ఆదేశాలను అమలు చేసింది. ఇ.ఎల్.ఏ.ఎస్ ఆదేశాలను తిరస్కరించింది. పపాండ్రూ మంత్రివర్గం నుండి ఇ.ఏ.ఎం సభ్యులు రాజీనామా చేశారు. ఇక సాయుధ సైన్యాలను రద్దు చేస్తూ ప్రకటన వెలువడింది.

దానితో రెండో విడత విముక్తి పోరాటం మొదలయింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కె.కె.ఇ (కమ్యూనిస్టు పార్టీ) ఏథెన్స్ లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఆ మరుసటి రోజు డిసెంబర్ 4, 1944 తేదీన కార్మికుల సమ్మెకు పిలుపు ఇచ్చింది. సమ్మెకు ముందు రోజు 60,000 మంది నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా బ్రిటిష్ సైన్యం వారిపై మెషీన్ గన్ లతో కాల్పులకు తెగించింది. కాల్పుల్లో 25 మంది చనిపోగా 150 మంది అవయవాలు కోల్పోయారు. ఇ.ఎల్.ఏ.ఎస్ బలగాలు రాజధానిని స్వాధీనం చేసుకునేందుకు నడుం బిగించారు. వారు ఏథెన్స్ శివారు ప్రాంతాల్లోకి ప్రవేశించడం ప్రారంభించారు. ఈ సమయంలో చర్చిల్ నుండి సైన్యాధ్యక్షుడు జనరల్ స్కోబీకి కేబుల్ అందింది. “వీలయితే రక్తపాతం జరక్కుండా, కానీ తప్పకపోతే రక్తపాతం జరిపయినా సరే. మీరు ఆక్రమిత పట్టణంలో ఉన్నట్లుగానూ, స్ధానిక తిరుగుబాటుదారులు దాడి చేస్తున్నట్లుగానూ భావిస్తూ ఏ చర్యకైనా వెనుదీయవద్దు” అని కేబుల్ సారాంశం. యుద్ధం తీవ్రం అయింది. ఇ.ఎల్.ఏ.ఎస్ బలగాలు ఏథెన్స్ పోలీసు స్టేషన్ లను వశం చేసుకోవడం ప్రారంభించారు. వారిపై బ్రిటిష్ బలగాలు ఉధృతంగా కాల్పులు జరిపాయి. గ్రీసు వీధుల్లో గ్రీసు ప్రజా బలగాలకూ బ్రిటిష్ బలగాలకూ తీవ్ర యుద్ధం చెలరేగింది. ఇక్కడ గమనించవలసింది ఇ.ఎల్.ఏ.ఎస్ సభ్యులు గ్రీసు దేశ ప్రజలు. తమ దేశ భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి సర్వ హక్కులూ వారికి ఉన్నాయి. కానీ ఏథెన్స్ వీధుల్లో ఏథెన్స్ ప్రజలపై కాల్పులకు తెగబడే హక్కు బ్రిటన్ కు ఎక్కడిది? వారికి (బ్రిటిష్ ఒత్తిడితోనే సుమా) ఆ అవకాశం ఇచ్చిన జార్జి పపాండ్రూ, జనరల్ స్కోబీలు దేశ ద్రోహులు అవుతారా లేక దేశ రక్షకులు అవుతారా?

……………………ఇంకా ఉంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s