గ్రెక్సిట్: కార్మికవర్గ ఉద్యమాలు, మెటాక్సస్ నియంతృత్వం -5


Greece Dictator Ionnias Metaxas

Greece Dictator Ionnias Metaxas

4వ భాగం తరువాత………………….

1929 నుండి ప్రబలంగా ఉనికిలోకి వచ్చిన ‘గ్రేట్ డిప్రెషన్’ రెండో ప్రపంచ యుద్ధానికి తగిన ఆర్ధిక భూమికను ఏర్పరిచింది. 2008 నాటి ‘గ్రేట్ రిసెషన్’ (ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం) లాగానే ఆనాటి ‘గ్రేట్ డిప్రెషన్’ కూడా అమెరికాలోనే ప్రారంభం కావడం గమనించవలసిన విషయం. మొన్నటి గ్రేట్ రిసెషన్ వాల్ స్ట్రీట్ లోని బడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ‘లేమాన్ బ్రదర్స్’ కుప్పకూలిన దరిమిలా ఉనికిలోకి రాగా ఆనాటి గ్రేట్ డిప్రెషన్ అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన దరిమిలా ఉనికిలోకి వచ్చింది.

[అవగాహన కోసం: గ్రేట్ డిప్రెషన్, గ్రేట్ రిసెషన్ ల మధ్య తేడా సంక్షోభం తీవ్రతకు, పరిమాణానికి సంబంధించినది. ఉదాహరణకు గ్రేట్ రిసెషన్ లో దేశాల జి.డి.పిలు 10 శాతం కుచించుకుపోగా గ్రేట్ డిప్రెషన్ లో దేశాల జి.డి.పి లు 20 నుండి 30 శాతం వరకు కుచించుకుపోయాయి. ఆర్ధిక మాంద్యం తక్కువ తీవ్రతతో సుదీర్ఘకాలం కొనసాగడాన్ని గ్రేట్ రిసెషన్ గానూ, ఆర్ధిక మాంద్యం ఎక్కువ తీవ్రతతో సుదీర్ఘ కాలం కొనసాగడాన్ని గ్రేట్ డిప్రెషన్ గానూ ఆర్ధికవేత్తలు పరిగణిస్తున్నారు. గ్రేట్ డిప్రెషన్, మార్కెట్ల పునః పంపిణీ కోసం అత్యంత వినాశకరమైన రెండో ప్రపంచ యుద్ధానికి దారితీయగా గ్రేట్ రిసెషన్, భౌగోళిక రాజకీయార్ధిక వ్యవస్ధ ఏక ధ్రువం నుండి బహుళ ధ్రువం వైపు ప్రయాణించేందుకు, మార్కెట్ల కోసం సరికొత్త పెనుగులాటకు దారి తీసింది. ఈ పెనుగులాట ఇంకా కొనసాగుతోంది.]

నాటి గ్రేట్ డిప్రెషన్ లో భాగంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏలుబడిలో ఉన్న గ్రీసులోనూ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు ఏర్పడ్డాయి. సామ్రాజ్యవాద సాధారణ సంక్షోభ దావానలం అమెరికాలో ముట్టుకుని ఐరోపాకు విస్తరించి ఆనాటి అగ్రరాజ్యం బ్రిటన్ ను చుట్టుముట్టడంతో అవి గ్రీసు ఆర్ధిక వ్యవస్ధను కూడా ఆవహించాయి.

బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలకు సేవలు చేస్తున్న అర్ధవలస గ్రీసు నాయకత్వం తమ యాజమానుల ప్రయోజనాల మేరకు గ్రీసు ఆర్ధిక వ్యవస్ధను నడిపించిన ఫలితంగా రైతులు, కార్మికుల జీవన ఆదాయాలు కొడిగట్టాయి. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. అనగా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధలోని మౌలిక వైరుధ్యం గ్రీసును తన విష కౌగిలిలో బిగించింది. ఫలితంగా గ్రీసు కార్మికులు, రైతులు విప్లవకర వర్గాలుగా ఉద్యమాలలోకి దూకవలసిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఈ సామ్రాజ్యవాద సంక్షోభమే వివిధ సామ్రాజ్యవాద శక్తుల మధ్య వైరుధ్యాన్ని తీవ్రం చేసింది. ఫాసిస్టు పాలన ఆలంబనగా వృద్ధిలోకి వచ్చిన జర్మనీ, ఇటలీ, జపాన్ పెట్టుబడిదారీ వర్గాలు ప్రపంచ మార్కెట్ల పునః పంపిణీని డిమాండ్ చేశాయి. గ్రేట్ డిప్రెషన్ లో ఈదుతున్న బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ లు ఆ డిమాండ్ కు సానుకూలంగా స్పందించి సర్దుబాట్లు చేసుకునే పరిస్ధితిలో లేవు.

ఫలితంగా ఘర్షణ అనివార్యం అయింది. సామ్రాజ్యవాద గొలుసు మరోసారి బలహీనపడే క్రమం మొదలయింది. రెండో ప్రపంచ యుద్ధం బద్దలయింది. ఐరోపాలో మధ్యధరా సముద్రం ఒడ్డున, పాత ఒట్టోమాన్ సామ్రాజ్యం పక్కన, ఫాసిస్టు జర్మనీ, ఇటలీల పొరుగున కీలకమైన వ్యూహాత్మక స్ధానంలో ఉన్న గ్రీసు అనివార్యంగా సామ్రాజ్యవాద పోటేళ్ళ మధ్య మేక పిల్లలా చిక్కుకుపోయింది. గ్రీసు ప్రజల అవసరాలు, ప్రయోజనాలతో ఏ మాత్రం సంబంధం లేకుండానే గ్రీసు పాలకులు తమ దేశాన్ని తీసుకెళ్లి పోటేళ్ళ మధ్యన నిలబెట్టారు. అందుకు నిరాకరించిన రైతులు, కార్మికులను ఉక్కుపాదంతో అణచివేసేందుకు గ్రీసులో సైతం ఫాసిస్టు పాలనకు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రోత్సహించింది. ఇక్కడ గమనించవలసింది ‘గ్రీసు ఆర్ధిక వ్యవస్ధ క్షీణతకు కారణం గ్రీసు ప్రజలు కాదు, మార్కెట్ అవసరాల కోసం గ్రీసును ఫాసిస్టు పాలనలోకి, యుద్ధ పీడనలోకి ఈడ్చుకెళ్లిన అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గాలే’ అని.

1930లలో గ్రీసు పాలకవర్గాలు తమలో తాము తీవ్రంగా ఘర్షణపడుతూ ప్రజలను గాలికి వదిలేసిన పరిస్ధితిని ఆసరా చేసుకుని సైనికాధికారి జనరల్ లోనిస్ మెటాక్సస్ మిలట్రీ కుట్రతో అధికార పగ్గాలను స్వాధీనం చేసుకున్నాడు. 1924లో జరిగిన రిఫరెండంలో రాచరికాన్ని ప్రజలు తిరస్కరించడంతో ప్రవాసం వెళ్ళిన రాజును నియంత మెటాక్సస్ తిరిగి దేశానికి ఆహ్వానించాడు. గత భాగంలో చెప్పినట్లుగా బ్రిటిష్ ప్రాపకంలోని కొద్దిమంది గ్రీసు సంపన్నుల అణచివేత, దోపిడీల ఫలితంగా దేశంలో రైతులు, వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రోజులవి. పొగాకు తదితర పంటల రైతులు చురుకుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అనేక పరిశ్రమల్లో కార్మికులు సైతం మెరుగైన జీవన ప్రమాణాల కోసం విస్తృతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక అలజడి అంతకంతకూ తీవ్రం అయింది. మెటాక్సస్ డిక్రీల పాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని విప్లవ ట్రేడ్ యూనియన్లతో సహా వివిధ ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి. ఉమ్మడిగా కార్యవర్గ సమావేశాలు జరుపుకుని ఆగస్టు 5, 1936 తేదీన దేశవ్యాపిత సమ్మెకు పిలుపు ఇచ్చారు. విప్లవ కమ్యూనిస్టులు ఈ ఉద్యమాలలో ప్రధాన శక్తిగా నాయకత్వపాత్ర వహించడం విశేషం. అటు కార్మికవర్గం లోనూ ఇటు గ్రామాల్లోనూ గణనీయమైన పలుకుబడిని విప్లవ కమ్యూనిస్టులు అప్పటికి కలిగి ఉన్నారు.

ఆగస్టు 5 సమ్మెను నియంత మెటాక్సస్ అందివచ్చిన అవకాశంగా మార్చుకున్నాడు. అధికారం స్వాధీనానికి, ఉద్యమ అణచివేతకు వ్యూహాలు పన్నాడు. సమ్మెకు ఒక రోజు ముందు, రాజు మద్దతుతో పార్లమెంటును రద్దు చేసి ఎమర్జెన్సీ విధించాడు. మార్షల్ లా (సైనిక పాలన) ప్రకటించాడు. రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ రద్దు చేసి కనీస ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేశాడు. క్రైసిస్ కేబినెట్ ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో ప్రజల ఆందోళనలను అణచివేశాడు. సనాతన క్రైస్తవ మత విలువలకు ప్రాధాన్యం కల్పించాడు. ప్రాచీన గ్రీకు ఔన్నత్యం పేరుతో మితవాద సంస్కృతిని ప్రోత్సాహించాడు. రాచరికానికి, క్రైస్తవానికి ప్రజలు విధేయులుగా ఉండాలని శాసించాడు. జర్మనీ నియంత హిట్లర్ ఆదర్శంగా ఉక్కు క్రమశిక్షణను ప్రబోధించాడు. హిట్లర్ పోషణలో అభివృద్ధి అయిన గెస్టపో తరహాలో రహస్య పోలీసు వ్యవస్ధను నిర్మించి వేలాదిమందిని అరెస్టు చేసి జైళ్ళలో కుక్కాడు. (ఈ పరిస్ధితులు అనివార్యంగా నేడు భారత దేశంలో నెలకొన్న మిత-తీవ్రవాద (Right-Extremist) రాజకీయ-ఆర్ధిక పరిస్ధితిని గుర్తుకు తేకుండా పోవు.) “స్వేచ్ఛ అన్నది 19వ శతాబ్దపు భ్రమ మాత్రమే” అని హుంకరించాడు.

సంవత్సరం తిరిగేసరికల్లా వేలాదిమంది కార్మిక ఉద్యమకారులను, యూనియన్ల నేతలను పనికిరాని భూములతో నిండిన ఎజియన్ ద్వీపాలకు ప్రవాసం పంపాడు. అక్కడ తిండి తిప్పలు లేక, చలి-ఆకలి-మురికి నీరు బారినపడి వేలాదిమంది ప్రాణాలు విడిచారు. మెటాక్సస్ నియతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మరింతగా ఉద్యమాల్లోకి దూకుతున్న పరిస్ధితుల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

ఇటలీ నియంత ముసోలిని గ్రీసును ఆక్రమించడానికి దాడికి దిగడమే ఆ పరిణామం. అప్పటికే అల్బేనియాను ఆక్రమించిన ఇటలీ సైన్యాలు గ్రీసుపైకి దండు వచ్చాయి. ముసోలిని దాడితో గ్రీసు ప్రజలకు ముందు ఎవరితో తలపడాలన్న ప్రశ్న ఎదురయింది. దేశంలో చెలరేగిపోతున్న దేశీయ నియంత మెటాక్సస్ తో తలపడడమా లేక దేశాన్ని కబళిస్తున్న విదేశీ ఫాసిస్టులతో తలపడడమా అన్న చిక్కు ఎదురయింది. చివరికి విదేశీ దురాక్రమణదారును పారద్రోలాడానికి నిశ్చయించుకున్నారు. మెటాక్సస్ నియంతృత్వ వ్యతిరేక ఆందోళనను పక్కనబెట్టారు. దేశభక్తియుత పోరాటానికి సిద్ధపడ్డారు. ప్రజలు తమకు తాము స్వతంత్రంగా విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటాలకు పూనుకున్నారు.

గ్రీసు ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక విప్లవ కమ్యూనిస్టు సంస్ధలు ప్రధాన పాత్ర వహించాయి. మావో-స్టాలిన్ లు ప్రబోధించిన ‘ప్రజాతంత్ర ఐక్య సంఘటన’ సూత్రాన్ని గ్రీసు కమ్యూనిస్టులు అమలు చేస్తూ ‘పీపుల్స్ ఫ్రంట్’ ఏర్పాటు చేయాలని పాలకవర్గ పార్టీ అయిన లిబరల్ పార్టీకి ప్రతిపాదించారు. విదేశీ ఫాసిస్టు దాడిని తిప్పి కొట్టడానికి నియంత మెటాక్సస్ తో సైతం జట్టు కట్టడానికి వారు సిద్ధపడ్డారు. అయితే గ్రీసు ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో కలిసి ఉన్న ట్రాట్స్కీయిస్టు వర్గం ఈ ఎత్తుగడను తిరస్కరించింది. గ్రీసులో ప్రజాస్వామిక విప్లవం పూర్తి కాలేదన్న సత్యాన్ని చూడడానికి నిరాకరించింది. ‘స్టాలినిస్టు నియంతృత్వ భూతం’ అంటూ ఫాసిస్టు హిట్లర్-గోబెల్స్ జత ముందుకు తెచ్చిన విష ప్రచారాన్ని గ్రీసులోకి మోసుకొచ్చింది.

‘పీపుల్స్ ఫ్రంట్’ ఏర్పాటు చేయడం అంటే కార్మికవర్గం ఓటమి చెందడమే అని పేర్కొంది. నియంత మెటాక్సస్ తో జట్టు కట్టబూనడం ‘తీవ్ర తప్పిదం’ అని వాదించింది. ఐక్య సంఘటన ఎత్తుగడను తిరస్కరిస్తూ బహిరంగంగా ముందుకు వచ్చింది. కార్మికవర్గ ఉద్యమాన్ని నిలువునా చీల్చి వేరు కుంపటి పెట్టింది. తద్వారా కార్మిక శక్తిని బలహీనపరిచింది. ఏ నియంత మెటాక్సస్ తో జట్టు కడితే ఉద్యమ ఓటమి అని వాదించిందో అదే ఓటమి ప్రమాదాన్ని తానే తెస్తూ దేశభక్తియుత ప్రతిఘటన ఉద్యమాన్ని బలహీనం కావించింది. ఆ విధంగా కార్మికవర్గ ఉద్యమానికి విద్రోహం చేసింది. వారికి తగ్గట్టుగానే లిబరల్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించిన ‘పీపుల్స్ ఏర్పాటు’ ఏర్పాటుకు అంగీకరించలేదు. లిబరల్ పార్టీ వెనుక ఉన్న దళారీ బూర్జువా వర్గం తమ సామ్రాజ్యవాద యాజమానుల ఆజ్ఞలను అనుసరించి నియంత మెటాక్సస్ అధికారం చేపట్టడానికి సహకరించింది.

ట్రాట్స్కీయిస్టుల గురించి కొంత చెప్పుకోవాలి. వారి వింత వాదనలు ఈనాటికీ కొనసాగుతుండడం వలన వాటి గురించి చెప్పుకోవడం అవసరం. ‘కార్మికవర్గ అంతర్జాతీయత’ అని కారల్ మార్క్స్ ఇచ్చిన సాధారణ నినాదాన్ని తక్షణ రాజకీయ పోరాట నినాదంగా వారు ప్రతిపాదిస్తారు. అనగా కార్మికవర్గం అంతర్జాతీయంగా సహకరించుకోకుండా ఏ ఒక్క దేశం లోనూ విప్లవం విజయవంతం కాబోదని వారి ప్రబల వాదన. బూర్జువావర్గం అంతర్జాతీయ స్ధాయిలో పెనవేసుకుని ఉమ్మడి అధికారాన్ని, అణచివేతను అమలు చేస్తున్నందున వారి అంతర్జాతీయ శక్తిని ఎదుర్కొని కార్మిక వర్గం విప్లవాన్ని ఒకే దేశంలో విజయవంతం చేయలేదని, సామ్రాజ్యవాదులకు మల్లేనే దేశ దేశాలలోని కార్మికవర్గం పరస్పరం సహకరించుకుంటూ అంతర్జాతీయ స్ధాయిలో విప్లవం తేవడానికి కృషి చేయాలని వీరు గట్టిగా వాదిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం ముందు నాటి గ్రీసులో ఈ వాదన చేసిన ట్రాట్స్కీయిస్టులు ఇప్పటి గ్రీసు సంక్షోభంలో కూడా అదే వాదనతో ఉండడం గమనార్హం. 1930లలో లిబరల్ పార్టీతో ‘పీపుల్స్ ఫ్రంట్’ ను ప్రతిపాదించడం ద్వారా గ్రీసులో చేరువగా వచ్చిన కార్మికవర్గ విప్లవ విజయాన్ని స్టాలినిస్టులు దూరం చేశారని వారు వాదిస్తారు. చిన్న దేశమైన గ్రీసులో విప్లవం అసాధ్యమని ఓపక్క వాదిస్తూ చేరువగా వచ్చిన కార్మికవర్గ విజయాన్ని దూరం చేశారని మరోపక్క వాదించారు. అసాధ్యం అయిన విప్లవం చేరువ ఎలా అవుతుంది, దూరం ఎలా అవుతుంది? సిద్ధాంత గందరగోళంలో ఉన్న ట్రాట్స్కీయిస్టులే తమ గందరగోళాన్ని గ్రీసు కార్మికవర్గంలో ప్రవేశపెట్టి ఉద్యమాన్ని చీల్చి బలహీనపరిచారన్నది నిర్వివాదాంశం. ఈ బలహీనతను పసిగట్టారు కనుకనే గ్రీసు పాలకవర్గాలు –లిబరల్ పార్టీ, ఆ తర్వాత మెటాక్సస్- కమ్యూనిస్టులు ప్రతిపాదించిన ‘పీపుల్స్ ఫ్రంట్’ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించగలిగాయి.

రెండో ప్రపంచ యుద్ధం – ఇటలీ దాడి

సామ్రాజ్య విస్తరణ కాంక్షను ఇటలీ నియంత ముసోలిని ఏనాడూ దాచుకోలేదు. అధిక ఉత్పత్తికి ఇరుకుగా మారిన ఇటలీకి మరిన్ని ప్రాంతాలు అవసరమని బహిరంగంగానే ప్రకటించాడు. 1939లో ఉత్తర ఆఫ్రికాలోని బ్రిటిష్ వలసల మీదికి దండెత్తి బ్రిటిష్ సోమాలీని ఆక్రమించాడు. అదే సమయంలో గ్రీసు పొరుగు దేశం అల్బేనియాను కూడా ఇటలీ దురాక్రమించింది. అయితే ఈజిప్టు మీద చేసిన దండయాత్రలో ఇటలీ సఫలం కాలేకపోయింది. నాజీ జర్మనీ ఐరోపాను కబళించే దిశలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న నేపధ్యంలో ముసోలినికి తనకిక భూభాగాలు మిగలవన్న బెంగ పట్టుకుంది. తన ప్రభావ ప్రాంతంగా భావించిన బాల్కన్ దేశాలను జర్మనీ కంటే ముందు వశం చేసుకోవాలని భావించాడు. బాల్కన్ లో భాగమైన రుమేనియా రాజు తమ చమురు నేలలను జర్మనీ రక్షణలో ఉంచడానికి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకోవడం ముసోలినిని మరింత తొందర పెట్టింది.

జులై లోనే గ్రీసుపై దండయాత్రకు ఏర్పాట్లు చేసిన ముసోలిని హిట్లర్ నివారించడంతో ఆగిపోయాడు. బ్రిటన్, ఫ్రాన్స్ లను పూర్తిగా ఓడించకుండా బాల్కన్స్ జోలికి వెళ్లవద్దని హిట్లర్ నచ్చజెప్పాడు. కానీ తనకు చెప్పకుండానే హిట్లర్ రుమేనియాపై దండెత్తడం అక్కడి చమురు భూములను స్వాయత్తం చేసుకోవడంతో ఆలస్యం చేయడం తగదని భావించి వెంటనే గ్రీసు నియంత లోనిస్ మెటాక్సస్ కు అల్టిమేటం జారీ చేశాడు. గ్రీసు భూభాగాలు కొన్నింటిని తమకు అప్పజెప్పాలన్నది సదరు అల్టిమేటం సారాంశం. గ్రేటర్ గ్రీసు కలల్ని మర్చిపోని మెటాక్సస్ ఈ అల్టిమేటంను తిరస్కరించాడు. దానితో 28 అక్టోబర్ 1940 తేదీన ఇటలీ సేనలు అల్బేనియా నుండి గ్రీసులో ప్రవేశించాయి. గ్రీసు ప్రజలు విదేశీ దాడికి జంకలేదు. అప్పటికే మెటాక్సస్ నియంతృత్వంపై పోరాడుతున్న గ్రీసు కార్మికవర్గం తరుముకు వచ్చిన ఇటలీ దండయాత్రపైకి దృష్టి మరల్చింది.

గ్రీకు సైన్యం గ్రీకు ప్రజలతో భుజం కలిపింది. మెటాక్సస్ సేనలు అప్పటికే ఇటలీ దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సైనికులు, ప్రజలు (కమ్యూనిస్టుల నేతృత్వంలోని గెరిల్లా సేనలు, వారి సానుభూతిపరులు) ఇరువురు కలిసి ఇటలీ సైన్యానికి చుక్కలు చూపారు. గ్రీకు సైన్యం, ప్రజలు సంయుక్తంగా ఎదురుదాడికి దిగడంతో ఇటలీ సైన్యానికి ఊపిరి అందలేదు. దాడి మొదలు పెట్టిన రెండు వారాలకే ఇటలీ సేనలు వెన్ను చూపడం ప్రారంభించాయి. గ్రీకు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నందున సైన్యానికి ప్రజలు సహకరించరన్న వేగు సమాచారాన్ని నమ్మడం, గ్రీకు సైన్యం తగినంత సన్నద్ధంగా లేదని భావించడం, గ్రీసు-అల్బేనియా సరిహద్దులో భౌగోళిక పరిస్ధితులు సహకరించకపోవడం… ఈ కారణాల వలన ఇటలీ సైన్యం ముందడుగు వేయకపోగా చావు దెబ్బలు తిన్నది. నవంబరు 14, 1940 తేదీకల్లా ఇటలీ దాడి ముగిసి గ్రీసు సేనల ఎదురు దాడి మొదలయింది. డిసెంబర్ చివరికల్లా ఇటలీ సేనల్ని తరుముతూ అల్బేనియాలోకి గ్రీసు సేనలు చొచ్చుకెళ్ళాయి. 1941 జనవరి నుండి ఏప్రిల్ మొదటివారం వరకూ 5 లక్షల పైబడిన ఇటలీ సైన్యాన్ని అల్బేనియాలో గ్రీసు సేనలు అదిమిపెట్టాయి.

తన సహచరుడు ముస్సోలినీ దీన పరిస్ధితుల్లో ఉన్న సంగతి గ్రహించిన హిట్లర్ మొదటికే మోసం వస్తుందని పసిగట్టి ఇటలీకి సాయం వెళ్ళేంతవరకూ ఇటలీపై గ్రీసు సేనలు ఆధిపత్యం వహించాయి. జనవరి నుండి ఏప్రిల్ వరకు గ్రీసు సేనలను ఇటలీ నిలవరించినప్పటికీ అది అల్బేనియా వరకే పరిమితమైంది. గ్రీసు నేలపైకి ఇటలీ మళ్ళీ అడుగుపెట్టలేకపోయింది. హిట్లర్ సేనలు వచ్చాకనే గ్రీసు వెనకడుగు సాధ్యపడింది. ఇటలీతో తలపడేందుకు సాయం రావాలని గ్రీసు అర్ధించ్చినప్పటికీ బ్రిటన్ ముందుకు రాకపోవడం గమనించవలసిన విషయం. గ్రీసుకు సాయం వెళితే తన బలగాలు అక్కడే కూరుకుపోతాయని ఉత్తర ఆఫ్రికాలో రక్షణ సాధ్యం కాదని బ్రిటన్ భయపడింది. ఇటలీ సేనలపై గ్రీసు పై చేయి సాధించిన తర్వాత మాత్రమే మార్చి 1941లో స్వల్ప సంఖ్యలో బలగాలను, సరఫరాలను బ్రిటన్ అందజేసింది. గ్రీకు-ఇటలీ యుద్ధంలో ఇటలీ గ్రీసులు చెరో 13000 మంది సైన్యాన్ని కోల్పోయాయి. గాయాలు కూడా కలుపుకుంటే ఇటలీ 1,50,000 మందిని గ్రీసు 80,000 మందిని కోల్పోయాయి.

గ్రీసుపై ఇటలీ ఓటమి మిత్ర రాజ్యాల కూటమికి ఎంతగానో స్ఫూర్తిని కలిగించింది. అక్ష రాజ్యాలపై (జర్మనీ, ఇటలీ, జపాన్) కూడా విజయం సాధించవచ్చన్న నమ్మకాన్ని కలిగించింది. ఫాసిస్టు సేనలు ఓటమి ఎరుగని వారేమీ కాదన్న తెలివిడిని కలిగించింది. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దిగ్గజాలు హిట్లర్, ముసోలిని సేనలు ఎదురుకాకుండా తప్పించుకుని వెళుతున్న తరుణంలో ఎలాంటి ఆధునిక ఆయుధ సంపత్తి లేకపోయినప్పటికీ గ్రీకు సైన్యం అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన ఇటలీ సేనలను మట్టి కరిపించడం కేవలం సైనికుల బలం వల్లనే సాధ్యం కాలేదు. గ్రీసు-అల్బేనియా సరిహద్దు కొండల్లో, ఎముకలు కోరికే చలిలో గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన కమ్యూనిస్టు గెరిల్లాలు, వారికి అండగా నిలిచిన కార్మికవర్గ ప్రజానీకం సహకారం వల్లనే అది సాధ్యపడింది. అయితే హిట్లర్ ప్రవేశంతో ఈ విజయానందం త్వరలోనే ఆవిరైపోయింది.

……………………………ఇంకా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s