గ్రెక్సిట్: మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రీసు -4


Eleftherios Venizelos with his son -1921

Eleftherios Venizelos with his son -1921

మూడో భాగం తరువాయి…………………

గ్రీసు పెట్టుబడిదారుల దుస్సాహసం

20వ శతాబ్దం ఆరంభంలో టర్కీ సామ్రాజ్యం బలహీనపడడం, మార్కెట్ల పంపిణీలో వైరుధ్యాలు తలెత్తిన ఫలితంగా ఐరోపా రాజ్యాల మధ్య కుమ్ములాటలు తీవ్రం కావడంతో గ్రీసు పెట్టుబడిదారీ వర్గం తనను తాను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసింది. అయితే టర్కీ బూర్జువాల మద్దతుతో టర్కీ ఆర్మీలోని రెండవ శ్రేణి సైనికాధికారులు ‘యంగ్ టర్క్ మూవ్ మెంట్’ ఆరంభించి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వారి చర్యలు టర్కీ జాతీయవాదాన్ని ప్రేరేపించడంతో టర్కీలోని గ్రీకు వ్యాపార వర్గాలపై దాడులు జరిగాయి. ఈ పరిణామంతో ఇస్తాంబుల్ లాంటి చోట్ల స్ధిరపడిన గ్రీకు సంపన్నులు, గ్రీసులోని ధనికవర్గాలు అప్రమత్తమై గ్రీసు ప్రాంతాలను ఐక్యం చేసే ప్రయత్నాలు ఆరంభించారు. ‘యంగ్ టర్క్ మూవ్ మెంట్’ ను అనుకరిస్తూ గ్రీసులో ‘మిలట్రీ లీగ్’ సంస్ధను గ్రీసు బూర్జువావర్గం నెలకొల్పింది. రాజ్యాంగబద్ధ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని గ్రీసు రాచరికాన్ని డిమాండ్ చేసింది. క్రీట్ లో గ్రీకు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వెనిజేలోస్ ను 1910లో ‘మిలట్రీ లీగ్’ గ్రీసుకు ఆహ్వానించి ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరింది. ఆ విధంగా గ్రీసు జాతీయోద్యమ నాయకుడిగా అవతరించిన వెనిజేలోస్ గ్రీసు పెట్టుబడిదారీ వర్గం ప్రతినిధిగా 1920ల వరకు దశాబ్దం పాటు గ్రీసు రాజకీయాలను శాసించాడు.

1912-13 కాలంలో వెనిజేలోస్ నేతృత్వంలోని గ్రీసు బల్గేరియా, సెర్బియాలతో జట్టు కట్టి గ్రీసు భూభాగాల నుండి టర్కీని వెళ్లగొట్టింది. అనంతరం గ్రీసు భూభాగాలను పూర్తిగా దక్కించుకునేందుకు గ్రీసు, సెర్బియాతో జత కట్టి బల్గేరియాతో తలపడి విజయం సాధించింది. 1913 నాటికి క్రీట్, మెజారిటీ ఏజియన్ ద్వీపాలు, ఎపిరస్, ధేస్సలేలు గ్రీసులో కలిసిపోయాయి. దాదాపు సంపూర్ణ గ్రీసుకు ప్రాణం పోసిన నేతగా వెనిజేలోస్ గ్రీకు జాతీయ నేత (హీరో)గా అవతరించాడు. 6 లక్షల ప్రజల గ్రీసు 60 లక్షల గ్రీసుగా ప్రపంచ పటంలో చోటు సంపాదించింది. వాణిజ్యం వృద్ధి చెందింది. సంపదలు పెరిగాయి. ఈ పరిణామాలలో శ్రామిక ప్రజలదే ప్రధాన పాత్ర అయినప్పటికీ వారికి యధావిధిగా సేవక పాత్రలు, వేతన జీవితాలు మాత్రమే దక్కగా సింహభాగం కొద్దిమంది ధనిక పెట్టుబడిదారులు, పాత కులీన వంశాల చేతుల్లో కేంద్రీకృతం అయింది. కొద్దిమంది బ్యాంకర్లు, వాణిజ్యవేత్తలు, నౌకల యాజమానుల చేతుల్లో గ్రీసు సంపదలు కేంద్రీకృతం అయ్యాయి.

గ్రీసు పెట్టుబడిదారీ వర్గం యధావిధిగా గ్రీసు శ్రామికవర్గాన్ని పట్టించుకోలేదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంపై ఆసక్తి చూపలేదు. ఆదాయం కోసం ప్రజలపై మరిన్ని పన్నులు మోపారు. ప్రజల ఆదాయం కుచించుకుపోయి కొనుగోలు శక్తి ఇంకా ఇంకా పడిపోవడంతో పెట్టుబడిదారీ మౌలిక వైరుధ్యం తనపని తాను చేసుకుపోయింది. ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ దివాళా అంచుకు చేరింది. గ్రీసు పాలకవర్గాలు పశ్చిమ సామ్రాజ్యవాదులను ఆశ్రయించడం కొనసాగించాయి. మూడు రక్షక రాజ్యాలు సైతం వెనిజేలోస్ ప్రభుత్వాన్ని గుర్తించి అండదండలు ఇచ్చాయి. ఈలోపు మొదటి ప్రపంచ యుద్ధం బద్దలయింది. మొదటి ప్రపంచ యుద్ధానికి తగిన పరిస్ధితులు పక్వానికి రావడంలో గ్రీసు, సెర్బియా, బల్గేరియాలు నిర్వహించిన రెండు బాల్కన్ యుద్ధాలు సైతం తమ పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.

మొదటి ప్రపంచ యుద్ధం గ్రీసులో అనుకోని పరిణామాలకు ప్రాణం పోసింది. జర్మనీ విజయంపై నమ్మకం పెట్టుకున్న గ్రీసు రాజు కానిస్టాంటిన్ తటస్ధ పాత్ర వహించగా బడా పెట్టుబదారీ వర్గాల ప్రతినిధిగా వెనిజెలోస్ మిత్రరాజ్యాల వైపు మొగ్గు చూపాడు. రాజుకు సమాంతరంగా తాను సొంతగా మరో ప్రభుత్వాన్ని, సమాంతర సైన్యాన్ని నెలకొల్పి యుద్ధంలోకి దిగాడు. వెనిజెలోస్ సహకారంతో మిత్రరాజ్యాల సేనలు గ్రీసులో ప్రవేశించి రాజు కానిస్టాంటిన్ ను ఆసనంనుండి తప్పుకోవాలని శాసించాయి. యుద్ధంలో మిత్రరాజ్యాల విజయం దరిమిలా వెనిజేలోస్ సరికొత్త ఆలోచనలతో గ్రీసుకు ఏతెంచాడు. ఫ్రెంచి నీగ్రో సేనల అధిపతిగా గ్రీసులో ప్రవేశించిన వెనిజేలోస్ తన మొదటి చర్యగా రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశాడు. ఎమర్జెన్సీ డిక్రీలతో పాలన మొదలు పెట్టాడు. దేశం నిండా గూఢచారులను, ఇంఫార్మర్లను నింపాడు. రాజకీయ ఖైదీలతో జైళ్లను నింపాడు. ‘సైనిక పాలన’ ప్రకటించాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు నమ్మకమైన సేవకుడుగా అవతరించాడు. సోవియట్ సేనలతో తలపడేందుకు లక్షమంది గ్రీసు సేనలను బ్రిటిష్ తరపున ఉక్రెయిన్ కు తరలించాడు. పాత ఒట్టోమన్ సామ్రాజ్యం తరహాలో గ్రీసు సామ్రాజ్యం నెలకొల్పడానికా అన్నట్లుగా టర్కీ నగరాలు ధ్రెస్, స్మిర్నాలకు తన సేనలను పంపాడు. గ్రీసుకు మరిన్ని ప్రాంతాలను అప్పజెపుతామన్న మిత్రరాజ్యాల హామీతో టర్కీ పైకి దూకాడు.

ఈ చర్య గ్రీసు భవిష్యత్తుపై చెరగని మరక వేసింది. టర్కీతో యుద్ధం కొనసాగుతూ పోయింది. 300 మిలియన్ డాలర్ల ఖర్చుతో పాటు వేలాది సేనల ప్రాణాలను అర్పించాడు. ‘చివరి గ్రీసు సైనికుడి ప్రాణం అర్పించే వరకు బ్రిటిష్ పోరాటం కొనసాగుతుంది’ అన్న జోక్ ప్రచారం లోకి వచ్చింది. అప్పటివరకూ బ్రిటిష్ మిత్రరాజ్యంగా ఉన్న ఫ్రాన్స్ గ్రీసు పాలకుల దుందుడుకు చర్యలతో అప్రమత్తమైంది. టర్కీ సైన్యాలకు ఆయుధాలు సరఫరా చేసింది. ఫ్రెంచి మద్దతుతో గ్రీసు సేనలు టర్కీలో ఊచకోతకు గురయ్యారు. టర్కీలో స్ధిరపడిన 7.5 లక్షల గ్రీకులను టర్కీ తన్ని తరిమేసింది. పరిస్ధితి తీవ్రరూపం దాల్చడంతో టర్కీతో ప్రజల మార్పిడి ఒప్పందం చేసుకుని గ్రీసు బయటపడింది. ఆ విధంగా గ్రీసు పెట్టుబడిదారీ వర్గం తలపెట్టిన దుస్సాహసం గ్రీసును తిరిగి పాతాళంలోకి నెట్టివేసింది. యుద్ధం మోపిన భారంతో జాతీయ అప్పు భారీగా పెరిగిపోయింది. గ్రీసు కరెన్సీ డ్రాక్మా చిత్తు కాగితంగా మారిపోయింది. గ్రీకు పెట్టుబడిదారీ వర్గం ఇష్టంగా కన్న గ్రేటర్ గ్రీకు కల పేకమేడలా కూలిపోయింది.

గ్రీసు పెట్టుబడిదారీ వర్గం దేశంలో సైనిక పాలన ప్రవేశపెట్టడానికి స్వీయాత్మక కారణాలు ప్రబలంగా పని చేశాయి. పెట్టుబడిదారీ వర్గంతో పాటుగా కార్మికవర్గం దేశంలో అభివృద్ధి చెందడం ప్రారంభించింది. గ్రీసు కార్మికవర్గం పుట్టడంతోనే దేదీప్యమైన రష్యన్ బొల్షివిక్ విప్లవ వెలుగును చూస్తూ పుట్టింది. సోషలిస్టు రష్యా వృద్ధితో పాటే సొంత కలల్ని మోస్తూ పెరిగింది. మరోవైపు గ్రీసు పెట్టుబడిదారీ వర్గం పశ్చిమ సామ్రాజ్యవాదుల ‘కమ్యూనిస్టు పీడ కల’ను తన సొంతం చేసుకుంది. దరిమిలా “జాతీయవాదం, రాజ్యాంగబద్ధ ప్రభుత్వం, రిపబ్లికన్ వాదం” అంటూ గ్రీసు పెట్టుబడిదారీ వర్గం పెట్టిన పాత పొలికేకలను నిశ్శబ్దంగా సమాధి చేసింది. ప్రగతిశీల ముసుగును నిలువునా చించేసుకుంది. ఫ్యూడల్ సమాజాన్ని సమాధి చేయడంలో ఎంతో ప్రగతిశీలంగా కనిపించే పెట్టుబడిదారీ విధానం, కార్మికవర్గం విసిరే సవాలుతో అత్యంత ప్రగతి వ్యతిరేక, ప్రగతి నిర్మూలక, విప్లవ ప్రతీఘాతక శక్తిగా మారిపోతుందన్న కారల్ మార్క్స్ మహోన్నత సూత్రీకరణను గ్రీసు పెట్టుబడిదారీ వర్గం చరిత్రలో మరోసారి అక్షరం అక్షరమూ రుజువు చేస్తూ కార్మికవర్గంపై దమనకాండకు సిద్ధపడింది.

బోల్షివిక్ స్ఫూర్తిని, సోషలిస్టు రష్యా నిర్మాణాన్ని గుండెల నిండా నింపుకున్న గ్రీసు కార్మికవర్గం అనతికాలంలోనే ప్రబల శక్తిగా ఎదిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి గ్రీసులో రైతాంగం పెద్ద సంఖ్యలోనే ఉన్నది. వారు ఐరోపాలోనే అత్యంత పేదలుగా గుర్తింపు సంపాదించారు. అందుకు గ్రీసు పెట్టుబడిదారీ వర్గం ఏమీ సిగ్గుపడలేదు. వెనిజెలోస్ దుస్సాహసం ఫలితంగా గ్రీసు వాణిజ్య లోటు 50 శాతం పైన నమోదయింది. ప్రతి యేటా జాతీయ ఆదాయంలో 25 శాతం వడ్డీ చెల్లింపులకే వెళ్లిపోయేది. మరో 20 శాతం మిలట్రీ ఖర్చులకు, 14 శాతం బ్యూరోక్రసీ పోషణకు వెళ్లిపోయింది. మిగిలిన 40 శాతంతో దేశాన్ని నడపలేక ప్రజలపై మరిన్ని పన్నులు మోపారు. బడ్జెట్ లోటు పూడ్చేందుకు మరిన్ని అప్పులు తెచ్చారు. జీవన వ్యయానికి ఆకాశం కూడా లెక్కలేకుండా పోయింది. మిలట్రీ ఖర్చు, విదేశీ అప్పులు భారం, బ్యూరోక్రాట్ల విలాసాలు అన్నీ కలిసి సామాన్య గ్రీకులపై మోయలేని భారాన్ని మోపాయి. ఈ భారాన్ని మోసేందుకు బడా సంపన్నులు, పెట్టుబడిదారులు, వణిజులు ముందుకు రావడం అటుంచి జాతీయ ఆదాయంలో సింహభాగాన్ని తన్నుకుపోయారు. అప్పటికి గ్రీసు కార్మికవర్గం సాపేక్షికంగా చిన్నదే. 70 లక్షల జనాభాలో 4 లక్షలు మాత్రమే కార్మికవర్గంలో చేరింది. కార్మికుల్లో నాలుగో వంతు మంది యూనియన్ల కింద సమీకృతం అయ్యారు. యూనియన్లలో అత్యధికం కమ్యూనిస్టు పార్టీ కింద సమీకృతం అయ్యాయి.

వెనిజెలోస్ యుద్ధోన్మాద దుస్సాహసాన్ని రైతులు, కార్మికులు గట్టిగా వ్యతిరేకించారు. ఆయన నియంతృత్వ పాలనను తిరస్కరించారు. 1920 ఎన్నికల్లో ఓడించి కల్నల్ ప్లాస్టిరాస్ ను గద్దెనెక్కించారు. దానితో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు గ్రీసు పెట్టుబడిదారీ వర్గంతో కలిసి మరోసారి కుట్రపన్నారు. (మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా మిత్రరాజ్య సేనలు తన్ని తగలేసిన) రాజు కానిస్టాంటిన్ ను వెనక్కి రప్పించాలా? వద్దా? అంటూ ప్రజలు కోరని ‘ప్రజాభిప్రాయ సేకరణ’ (ఫ్లెబిసైట్) నిర్వహించారు. ఓటర్ల సంఖ్యను మించిన ఓట్లు పోలయ్యెంతగా ఫ్లెబిసైట్ ను రిగ్గింగ్ చేశారు. రాజును వెనక్కి పిలవాలని గ్రీసు ప్రజలు కోరినట్లు కృత్రిమ అభిప్రాయాన్ని సృష్టించి వెనక్కి పిలిచారు. తద్వారా రాజు సాయంతో గ్రీసు రాజకీయ వ్యవస్ధను నియంత్రించే పధకాన్ని బ్రిటన్ రచించింది.

గ్రీసు ఆర్ధిక సంక్షోభాన్ని ప్రతిఫలిస్తూ 1920 నుండి 1936లో మరో నియంత మెటాక్సస్ అధికారం చేజిక్కించుకునేవరకూ ఏ ప్రభుత్వమూ స్ధిరంగా నిల్వలేదు. గ్రీసు ఆర్ధిక సంక్షోభం వాస్తవానికి ఆనాటి ప్రపంచ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధ ఎదుర్కొంటున్న సాధారణ సంక్షోభంలో భాగమే. ఆర్ధిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం స్పష్టంగా జమిలిగా కలిసి ప్రయాణం చేయడం గ్రీసులో స్పష్టంగా అగుపడింది. ఆర్ధిక సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలకు, సామాజిక సంక్షోభాలకు దారి తీస్తాయన్న కార్మికవర్గ అవగాహనను గ్రీసు సామాజిక-రాజకీయార్ధిక సమాజం అప్పుడూ, ఇప్పుడూ రుజువు చేయడం గమనించవలసిన అంశం. దేశంలో దినదిన ప్రవర్ధమానమవుతున్న కార్మికవర్గ చర్యలు కూడా ప్రభుత్వాల మార్పిడిపై ప్రభావం పడవేశాయి.

కోరి నెత్తిమీదకు తెచ్చుకున్న టర్కీ యుద్ధం గ్రీకు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించడంతో వారి అసంతృప్తిని చల్లార్చేందుకు పెట్టుబడిదారీ వర్గం ఎప్పటికప్పుడు కొత్త ముఖాల్ని మార్చుతూ పోయింది. ప్రజల అసంతృప్తిని రాజు మీదికి మళ్లించడానికి ప్లాస్టిరాస్ ప్రభుత్వం ఆయన మళ్ళీ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. టర్కీపై ఓటమికి బాధ్యులుగా చేస్తూ రాచరికానికి మద్దతు ఇచ్చిన రాజకీయ నాయకులు కొంతమందిని ఉరితీయించాడు. మరో ఫ్లెబిసైట్ నిర్వహించి రాచరికం లేని రిపబ్లిక్ ఏర్పడినట్లు ప్రకటించాడు. ఎన్ని వేషాలు వేసినా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న ‘గ్రేట్ డిప్రెషన్’ ముందరి పరిస్ధితులు రాజకీయ స్ధిరత్వానికి గ్యారంటీ లేకుండా చేశాయి. ప్రతి యెడూ దేశాధినేతలు మారుతూ పోయారు. ఓసారి వెనెజీలోస్ ను కూడా గద్దెపై నిలిపినా సంక్షోభం పరిష్కారం కాలేదు. గ్రీసు ఆర్ధిక సంక్షోభం తీవ్రం అవుతూ వెళ్లింది.

1930ల నాటికి కార్మికవర్గంలో నిరుద్యోగం 25 శాతానికి చేరగా జీవన వ్యయం 20 రెట్లు పెరిగింది. వేతనాలు అందుకు తగినట్లుగా పెరగకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతూ వచ్చింది. ఈ నేపధ్యంలో గ్రీసు కార్మికులు విస్తృతంగా సమ్మె పోరాటాలకు దిగారు. పన్నుల మోతకు వ్యతిరేకంగా రైతాంగం కూడా ఉద్యమాల్లోకి దూకింది. సాయుధ కొట్లాటలు పెరిగాయి. దానితో రెండో మారు అధికారం చేపట్టిన వెనిజెలోస్ కమ్యూనిస్టు పార్టీని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. విప్లవ ట్రేడ్ యూనియన్ లని చెబుతూ కొన్ని యూనియన్లను కూడా నిషేధించాడు. ‘రాజ్య రక్షణ కోసం ఎమర్జెన్సీ బిల్లు’ అంటూ చట్టం తెచ్చి ఉద్యమకారులను విచక్షణారహితంగా సుదూర ద్వీపాల్లోకి కారాగారవాసం పంపే ఏర్పాటును చేసుకున్నారు. నియంతృత్వాన్ని, కఠిన చట్టాలను అమలు చేయడంలో వెనిజెలోస్ పనితనాన్ని గుర్తించారు కనుకనే గ్రీసు పెట్టుబడిదారీ వర్గం ఆయనను మళ్ళీ తెచ్చి అధికారాన్ని అప్పగించి అవసరమైన చట్టాలను చేయించుకుంది. సామాన్య ప్రజానీకం తమ హక్కుల కోసం, గౌరవప్రదమైన జీవనం కోసం ప్రశ్నించడం మొదలు పెట్టిన ప్రతి సందర్భం లోనూ కఠిన విధానాలు అమలు చేసే పాలకులను పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గాలు అధికారం లోకి తెచ్చుకుంటాయి. ఇది ప్రపంచ వ్యాపితంగా మళ్ళీ రుజువైన సత్యం. ఇండియా కూడా అందుకు మినహాయింపు కాదు.

………………………….ఇంకా ఉంది

13 thoughts on “గ్రెక్సిట్: మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రీసు -4

  1. పింగ్‌బ్యాక్: గ్రెక్సిట్: మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రీసు -4 | ugiridharaprasad

  2. శెఖర్ గారూ మీరు బొత్తిగా ఇటు రావటం మానుకున్నారు . మీ టపాల్ని ఇస్టపడే మాలాంటి వారికొసం అప్పుడప్పుడు ఇలా చుడండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s