గ్రెక్సిట్: ఆంగ్లో-అమెరికన్ భౌగోళిక రాజకీయ వ్యూహంలో పావు, గ్రీసు -3


Balkan peninsula before 1991

Balkan peninsula before 1991 (Except Italy, Austria, Turkey)

రెండో భాగం తర్వాత………………………….

పశ్చిమ పెట్టుబడిదారీ వ్యవస్ధ గ్రీసును అభివృద్ధి చెందిన దేశంగా 1961 నుండి పరిగణిస్తోంది. (అభివృద్ధి చెందిన దేశాల క్లబ్ గా చెప్పే ఓ.ఇ.సి.డి కూటమిలో గ్రీసు సభ్య దేశం.) కానీ అక్కడి ప్రజలు, ముఖ్యంగా శ్రామిక ప్రజలు ఎన్నడూ ఆ అభివృద్ధిని అనుభవించలేదు. ఆధునిక గ్రీసు చరిత్రను ప్రజల దృక్కోణంలో పరిశీలిస్తే పాలకవర్గాల అణచివేతలతో పాటు, ప్రజల తిరుగుబాటు పోరాటాలు కూడా సమృద్ధిగా కనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ హిట్లర్ బందిఖానాలో మగ్గిన గ్రీసు ప్రజలు మరే ఇతర ఐరోపా దేశమూ ఇవ్వనటువంటి తీవ్రస్ధాయి ప్రతిఘటనను హిట్లర్ సేనలకు రుచి చూపారు. హిట్లర్ ఆక్రమణను సమర్ధవంతంగా తిప్పికొడుతున్న గ్రీసు ప్రతిఘటన కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లిపోతున్న పరిస్ధితుల్లో ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదులు జోక్యం చేసుకుని గ్రీసుని మళ్ళీ పాత రాచరిక, సంపన్న కుటుంబాల చేతుల్లోకి బద్రంగా అప్పగించి విద్రోహానికి పాల్పడ్డారు. నిజాంని బూచిగా చూపి నెహ్రూ సైన్యాలు తెలంగాణలో ప్రవేశించి ఏ విధంగా కమ్యూనిస్టులను ఊచకోత కోసి భూములు, ఆస్తులను తిరిగి భూస్వాములకు అప్పగించి నిజాముకు నష్టపరిహారం చెల్లించారో అదే రీతిలో హిట్లర్-ముస్సోలినీ సైన్యాలతో పోరాడే పేరుతో బ్రిటిష్ సేనలు గ్రీసులో ప్రవేశించి ప్రజల తిరుగుబాటును హైజాక్ చేసి గ్రీసును తిరిగి నియంతలకు, రాచరికానికి, బడా సంపన్నులకు అప్పగించాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తీవ్రంగా దెబ్బతిన్న దరిమిలా గ్రీసును ఏలుబడిలో ఉంచుకునే పాత్రను, బ్రిటన్ సామ్రాజ్యవాదుల అప్పగింతలతోనే, అమెరికా స్వీకరించింది. కమ్యూనిస్టు రష్యాను నిలువరించడమే లక్ష్యంగా రూపొందించిన ‘ట్రూమన్ డాక్ట్రిన్’ ద్వారా అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆర్ధికంగానూ, సైనికంగానూ గ్రీసును తన అదుపులో ఉంచుకునే పధకాన్ని రచించారు. (ఈ వ్యూహంలోని ఆర్ధిక పార్శ్వాన్ని పశ్చిమ ఐరోపాకు విస్తరించినదే మార్షల్ ప్లాన్. హ్యారీ ట్రూమన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు కాగా జార్జి మార్షల్, ట్రూమన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి/సెక్రటరీ ఆఫ్ స్టేట్.) రెండు ప్రపంచ యుద్ధాలకు ముందూ, యుద్ధాల కాలంలో, ఆ తర్వాతా దాదాపు అర్ధ శతాబ్దం పైగా బ్రిటన్ పోషణలోని రాచరికాల కిందా, అమెరికా పోషణలోని నియంతల కిందా నలిగిన గ్రీసు ప్రజలు అటు జర్మనీ ఫాసిజంతో పాటు ఇటు ఆంగ్లో-అమెరికన్ కుట్రలను చవి చూశారు. గ్రీసు శ్రామిక వర్గం విముక్తికి దాదాపు చేరువగా వచ్చి కూడా ఆనాటి భౌగోళిక రాజకీయాల ఆటలో పావులుగా మారిన ఫలితంగా విముక్తినుండి నెట్టివేయబడ్డారు. ఈ చారిత్రక పరిణామాల నేపధ్యం ఇప్పటికీ గ్రీసు ప్రజల వర్తమానంతో ఆటాడుతుండడం చరిత్ర పుస్తకాలు చెప్పని వాస్తవం. ఈ వివరాలను క్లుప్తంగా చూడడం ఉపయోగకరం, అవసరం కూడా.

గ్రీసు జాతీయ ఆకాంక్షలను అణచివేసిన బ్రిటన్, ఫ్రాన్స్

1789 నుండి 1799 వరకు సాగిన ఫ్రెంచి విప్లవ పరిణామాలు ఐరోపాలో విస్తారమైన ప్రభావాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఐరోపాలో చారిత్రక పాత్ర పోషించిన జాతీయ చైతన్యాన్ని రగిలించాయి. 19వ శతాబ్దం ఆరంభంలో సెర్బుల తిరుగుబాటు మొదలుకుని ఇతర బాల్కన్ రాజ్యాల (యుగోస్లేవియా, బల్గేరియా, బోస్నియా, క్రొయేషియా, మాసిడోనియా, గ్రీసు మొ.న ఆగ్నేయ యూరప్ రాజ్యాలు) వరకు ప్రభావితం చేసిన ఈ జాతీయ చైతన్యం 20వ శతాబ్దం ఆరంభంలో ఒట్టోమాన్ సామ్రాజ్యం స్ధానే ఆధునిక టర్కీ స్ధాపన వరకు దారి తీసింది. జాతీయ చైతన్యం ఉద్దీపనలోనూ, విస్తరణ లోనూ గ్రీసు ప్రజలు ప్రబల పాత్రను పోషించారు. అంతకు ముందు 500 యేళ్ళపాటు ఒట్టోమాన్ సామ్రాజ్యంలో/టర్కుల పాలనలో మగ్గిన గ్రీసు ప్రజలు ఆ కాలమంతటా తమ జాతీయతా చైతన్యాన్ని ఏదో ఒకరూపంలో కాపాడుకుంటూ వచ్చారు. టర్కుల పాలనకు వ్యతిరేకంగా అనేక రూపాల్లో తలెత్తిన తిరుగుబాట్లుగా ఈ చైతన్యం వ్యక్తీకృతం అయింది.

అయితే గ్రీసు ప్రజల జాతీయ చైతన్యానికి అమెరికా, బ్రిటన్, జారిస్టు రష్యాలు తమ ప్రయోజనాల రీత్యా పరిమితులు విధించడం వలన గ్రీసు ప్రజలు పదే పదే మోసాలకు గురయ్యారు. ప్రజలకు నిర్దిష్ట ఫలితం అందకుండానే తిరుగుబాట్లు ముగిసిపోతూ వచ్చాయి. ప్రజల పోరాటాలు అంతిమంగా వివిధ సామ్రాజ్యాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణల చట్రంలోనే ఇరుక్కునిపోవడం దీనికి ప్రధాన కారణం. అనగా గ్రీసులోని అంతర్గత/స్వీయాత్మక శక్తుల ఘర్షణ ఫలితం ప్రజలకు అందకుండా చేయడంలో బాహ్య శక్తులు చరిత్ర పొడవునా ప్రతిసారీ సఫలం అవుతూ వచ్చాయి. నేటికీ ఈ పరిస్ధితి కొనసాగడం గ్రీసు ప్రజలు ఎదుర్కొంటున్న ఒక ప్రత్యేక పరిస్ధితి. భౌగోళికంగా ఒక కీలక స్ధానంలో గ్రీసు ఉండడం ఇందుకు ఒక కారణంగా కాగా గ్రీసు ధనిక వర్గాలు గ్రీసు ప్రజల పోరాటాలను ఎప్పటికప్పుడు సొమ్ము చేసుకుంటూ వివిధ సామ్రాజ్యాలకు దాసోహం కావడం మరో కారణం.

1821లో ఒట్టోమాన్ సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా గ్రీసు ప్రజలు మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇది 8 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ తిరుగుబాటు కొనసాగడం ఇష్టం లేని బ్రిటిష్, ఫ్రెంచి, రష్యా రాజ్యాలు టర్కీ సుల్తాన్ తో బేరసారాలు జరిపి స్వతంత్ర గ్రీసు ఏర్పాటుకు 1829లో టర్కీని ఒప్పించాయి. కానీ ఈ స్వతంత్ర గ్రీసు కేవలం 6 లక్షల జనాభాతో కూడిన చాలా చిన్న ప్రాంతం. గ్రీకు ప్రజలు నివసించే అనేక ప్రాంతాలు స్వతంత్ర గ్రీసుకు బైటనే టర్కుల ఆధీనంలో ఉండిపోయాయి. అయినప్పటికీ 1829 సంవత్సరంలో గ్రీసు స్వతంత్రం సాధించిందని పశ్చిమ చరిత్రకారులు చెబుతారు. అతిచిన్న భూభాగంతో కూడిన స్వతంత్ర గ్రీసును కూడా బ్రిటన్ వదలలేదు. ఐరోపాలోని ఇతర రాచరిక వంశాల నుండి రాజులను అరువు తెచ్చి గ్రీసుకు రాజులుగా నియమించింది. జర్మనీకి చెందిన సాక్సే-కొబర్గ్ యువరాజుకు గ్రీసును ఇవ్వజూపగా ఆయన తిరస్కరించాడు. గ్రీసుపై రుద్దబడిన ఈ రాజు రాజకీయంగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల అదుపాజ్ఞలకు లోబడి వ్యవహరించాడు. దరిమిలా ఆ దేశం పేరుకు మాత్రమే స్వతంత్ర దేశంగా మనగలిగింది.

Balkan peninsula -Now

Balkan peninsula -Now

ఈ మూడు ‘రక్షక రాజ్యాల’ లోని బ్యాంకులు గ్రీసు ఆర్ధిక, ద్రవ్య వనరులను నియంత్రించాయి. ఈ రుణాన్ని బ్రిటిష్ బ్యాంకులు నియంత్రించాయి. టర్కీతో మూడు ‘రక్షక రాజ్యాలు’ కుదిర్చిన ఒప్పందం వలన గ్రీసు ప్రజల పరిస్ధితి మెరుగుపడక పోగా పన్నుల భారం వల్లా, ఒప్పందం రుద్దిన షరతుల వల్లా మరింతగా దిగజారింది. అప్పటికే గ్రీసు బ్రిటిష్ బ్యాంకులకు 15 మిలియన్ డాలర్లు బాకీ పడి ఉంది. గ్రీసును రుణం నుండి బైటపడవేసే పేరుతో బ్రిటిష్ బ్యాంకులు 1833లో సమకూర్చిన మరొక విడత రుణంతో పన్నుల భారం ఇంకా పెరిగింది. దానితో గ్రీసు ప్రజలు మరోసారి పర్వతాలకు తరలి గెరిల్లా పోరాటాలు నిర్వహించారు. 1843 నాటికి విస్తృతమైన తిరుగుబాటు బద్దలయింది. ఈ తిరుగుబాటు ఫలితంగా గ్రీసుపై బ్రిటన్ రుద్దిన బవేరియా (జర్మనీ) రాజు ఒధో, రాచరికాన్ని రద్దు చేసి జాతీయ అసెంబ్లీని నియమిస్తానని, రాజ్యాంగం ఏర్పాటు చేస్తానని ప్రమాణ పత్రాన్ని ప్రకటించాడు. కానీ ఈ ప్రమాణం రక్షక రాజ్యాల ప్రయోజనాలకు విరుద్ధం కనుక ఆచరణలో నెరవేరలేదు. నామమాత్రంగా ఏర్పరిచిన జాతీయ అసెంబ్లీ గ్రీసు ప్రజలకు బదులు మూడు రక్షక రాజ్యాలకు ఊడిగం చేయడమే విధిగా పని చేసింది.

స్వతంత్ర గ్రీసుగా ప్రకటించిన గ్రీసుకు ఆవలనే మెజారిటీ గ్రీసు ప్రాంతాలు, ప్రజలు మిగలడంతో వారి అసంతృప్తి చల్లారలేదు. 20 యేళ్ళ తరువాత 1862లో చెలరేగిన మరో తిరుగుబాటుతో గ్రీసు రాజు బ్రిటన్ సమకూర్చిన యుద్ధ నౌకలో దేశం వదిలి పారిపోయాడు. మూడు రక్షక రాజ్యాలు (“protecting states”) మళ్ళీ గ్రీసు ప్రజల్ని అదుపు చేసే రాజు కోసం వెతుకులాట ప్రారంభించాయి. డెన్మార్క్ యువరాజు విలియం జార్జి (ఆయనకూ 17 యేళ్లే) ని గ్రీసుకు రాజుగా నియమించాయి. రాజు నియామకాన్ని ఆమోదింపజేయడానికి ‘క్యారట్ అండ్ స్టిక్స్ – ఆశ చూపడం, దండాన్ని ప్రయోగించడం’ అనే ద్విసూత్రాలను ప్రయోగించాయి. ఓ పక్క తాము నియమించిన రాజును ఆమోదిస్తేనే తమ ఆర్ధిక సాయం కొనసాగుతుందన్న దండాన్ని ప్రయోగించాయి. మరోపక్క 1833 నాటి రుణంపై చెల్లించాల్సిన వార్షిక వడ్డీలో 20,000 డాలర్లను వెనక్కి చెల్లిస్తామన్న క్యారట్ తో ఆశపెట్టాయి. స్వతంత్ర గ్రీసులో అయోనియన్ ద్వీపాలను అంతర్భాగం చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ ప్రతిపాదనకు ఎలాంటి స్వతంత్ర అధికారం లేని గ్రీసు జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ విధంగా బైటి నుండి రాజును రుద్దాక బ్రిటన్ బ్యాంకులు మరో విడత రుణాన్ని మంజూరు చేశాయి. 1864లో కుదిరిన ఋణ ఒప్పందం విధించిన దారుణమైన షరతుల ప్రకారం మూడు రక్షణ రాజ్యాలలోని ఇతర రెండు రాజ్యాల అనుమతితో –గ్రీసు ప్రజల అనుమతితో పని లేకుండానే- మరే ఒక్క దేశమైనా గ్రీసు భూభాగం పైకి సైనికులను పంపవచ్చు. ఆ విధంగా గ్రీసు ప్రజల దైనందిన ఆర్ధిక జీవనం బ్రిటిష్ బ్యాంకులకు తనఖా పెట్టబడింది. గ్రీకు స్వతంత్రం నామమాత్రంగా మిగిలిపోయింది. ఆచరణలో అది బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు అర్ధ వలస రాజ్యంగా మాత్రమే మిగిలింది. బాల్కన్ రాజ్యాలన్నీ దాదాపు ఇదే పరిస్ధితిని అనుభవించాయి.

అతి చిన్న స్వతంత్ర గ్రీసుకు బయట ఉన్న గ్రీసు ప్రాంతాలు (క్రీట్, ధెస్సలే, ఎపిరస్, ఎజియన్ ఐలాండ్స్ మొ.వి) సో కాల్డ్ స్వతంత్ర గ్రీసుతో కలవకుండా బ్రిటన్, ఫ్రాన్స్ లు అడ్డుపడుతూ రావడం బాల్కన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక చారిత్రక పరిణామం. జారిస్టు రష్యా ప్రభావం మధ్యధరాను దాటి ఐరోపా లోపలికి విస్తరించకుండా ఉండేందుకుగాను బ్రిటన్, ఫ్రాన్స్ లు గ్రీసుపై టర్కీ ఆధిపత్యం దెబ్బ తినకుండా చూశాయి. మధ్యధరా, బాల్కన్ రాజ్యాల్లో స్ధిరత్వం, తూర్పు యూరప్ లో బలాబలాల సమతూకం కొనసాగడం ఈ దేశాల అవసరం. గ్రీసుపై టర్కీ ఆధిపత్యం జారిస్టు రష్యా పశ్చిమ విస్తరణను అడ్డుకుంటుందన్నది బ్రిటన్, ఫ్రాన్స్ ల భౌగోళిక రాజకీయ వ్యూహం. ఈ అవగానతో టర్కీకి వ్యతిరేకంగా స్వతంత్ర గ్రీసు బాహ్య ప్రాంతాలు గ్రీసులో కలవకుండా ఆటంకపరిచాయి. ఆ విధంగా గ్రీసును తిరుగుబాటు రహితం చేయడం ద్వారా -గ్రీసు ప్రజల జాతీయ ఆకాంక్షలను అణచివేయడం ద్వారా- టర్కీ సామ్రాజ్యాన్ని జారిస్టు రష్యాకు వ్యతిరేకంగా చివరి రక్షణ దుర్గంగా బ్రిటన్, ఫ్రాన్స్ లు మలుచుకున్నాయి. అనగా బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం గ్రీసును దశాబ్దాల తరబడి విడి భూభూగాలుగా ఉంచుతూ టర్కీకి సహకరించాయి. స్వతంత్ర గ్రీసుతో ఐక్యం కావడానికి గ్రీసు ప్రాంతాలు చేసిన ప్రయత్నాలన్నింటిని బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ సైనికులను పంపి అణచివేశాయి. టర్కిష్ సామ్రాజ్య పెత్తనం నుండి బైటపడకుండా సైనిక చర్యలతో నిరోధించాయి. పదే పదే సైనిక చర్యలకు పాల్పడ్డాయి. ఆ విధంగా గ్రీసు ప్రజల జాతీయ ప్రయోజనాలను బ్రిటన్, ఫ్రాన్స్ లు తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలకు బలిపెట్టాయి. తూర్పు యూరప్ లోని చిన్న చిన్న జాతి రాజ్యాలు జాతీయ స్వతంత్రం పొందకుండా ఆటంకం కలిగించడం; “ఐరోపా జబ్బు మనిషి”గా పేరు పొందిన టర్కీ సామ్రాజ్యాన్ని కృత్రిమంగా నిలబెట్టడం, బాల్కన్ రాజ్యాలపై అదుపు కొనసాగించడానికి అవి తమలో తాము తగవులాడుకునేలా ఘర్షణలు రగిలించడం… వీటిని ఒక విధానంగా ఐరోపా ప్రధాన రాజ్యాలు శతాబ్దం పాటు అమలు చేశాయి.

ఈ విధంగా బాల్కన్ రాజ్యాలను చిన్న చిన్న రాజ్యాలుగా విడగొట్టి వారి సామ్రాజ్యవాద ప్రతిఘటనను, జాతీయోద్యమాలను బలహీనపరిచే వ్యూహాన్ని 18వ శతాబ్దం నుండే పశ్చిమ సామ్రాజ్యవాదులు అమలు చేశారు. ఆనాడు బ్రిటిష్, ఫ్రాన్స్ లు ప్రధానంగా గ్రీసుపై ఈ వ్యూహాన్ని అమలు చేయగా 1991-2001 కాలంలో సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమెరికా యుగోస్లోవియా (ఇప్పటి బోస్నియా-హెర్జిగొవినా, క్రొయేషియా, మాంటినీగ్రో, కొసోవో, స్లొవేనియా, సెర్బియా, మాసిడోనియాలు యుగోస్లేవియాగా 1991 వరకు ఉనికిలో ఉన్నాయి.) పై ప్రయోగించి చిన్న చిన్న రాజ్యాలుగా విడగొట్టింది. ఈ విభజన ఎలా జరిగిందంటే ఈ రాజ్యాలు నిరంతరం పరస్పరం తగవులాడుకుంటూ ఉంటాయి. ప్రతి రాజ్యంలోనూ మైనారిటీ జాతులు నివసించే భూభాగం ఉంటుంది. వారిపై అణచివేత అమలు జరుగుతూ ఉంటుంది. ఫలితంగా జాతుల ఘర్షణ నిత్యనూతనమై వర్ధిల్లుతూ పరిష్కారం కోసం అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద పెత్తందారీ దేశాలపై ఆధారపడుతాయి. 1998-99 నాటి కొసోవో యుద్ధంలో నాటో కూటమి విచ్చలవిడిగా బాంబు దాడులు నిర్వహించి సర్వ విధ్వంసానికి ఒడిగట్టడం పాఠకులు ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే ఆనాటి గ్రీసు ప్రజల పరిస్ధితిని కాస్తయినా అర్ధం అవుతుంది.

1880ల్లో గ్రీసు పెట్టుబడిదారీ వర్గం మొదటిసారి అధికారం చేపట్టింది. (అయితే ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై ఆధారపడిందే తప్ప స్వతంత్రమైనది కాదు.) పశ్చిమ యూరప్ లో వెల్లివిరుస్తున్న అధిక ఉత్పత్తి గ్రీసుకు కూడా కాస్త విస్తరించింది. క్రమంగా గ్రీసు జి.డి.పి వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ధెస్సలే, క్రీట్ లు గ్రీసుతో ఐక్యం అయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 1896-97లో క్రీట్ ప్రజలు జాతీయోద్యమంలోకి దూకారు. వారికి సాయంగా గ్రీసు తన సైన్యాన్ని పంపింది. అనగా టర్కీ పాలకులతో నేరుగా యుద్ధానికి తలపడింది. ఈ యుద్ధంలో గ్రీసు దారుణంగా ఓడిపోవడంతో ఆర్ధికంగా మళ్ళీ దెబ్బతిన్నది. దరిమిలా పదేళ్లకే గ్రీసు పెట్టుబడిదారీ బుడగ బద్దలై గ్రీసును తీవ్రమైన మాంద్యంలోకి తోసివేసింది. ఓటమి చెందిన గ్రీసుపై 20 మిలియన్ల పరిహారం మోపడంతో యూరోపియన్ బ్యాంకులకు గ్రీసు చెల్లించవలసిన అప్పు మరింతగా పెరిగిపోయింది.

ఈ పరిణామాలను ఆర్ధిక కోణంలో కూడా పరిశీలించాలి: ఐరోపాలో అత్యంత పేద దేశాల్లో ఒకటయిన గ్రీసు 1830-1860 మధ్య కాలంలో తమ రక్షక రాజ్యాలు రుద్దిన అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని పరిస్ధితిలో కొనసాగింది. బ్రిటిష్-జారిష్టు రష్యాల విద్రోహం వల్ల తమ జాతీయ పోరాటాల ఫలితాన్ని గ్రీసు ప్రజలు అనుభవించలేకపోయారు. విమోచన పరిహారం కింద 6 లక్షల జనాభాపై మోపిన 15 మిలియన్ల రుణం తీర్చేందుకు గ్రీసు తమ బడ్జెట్ లో కోతలు పెట్టుకుని జి.డి.పిని తగ్గించుకోవలసి వచ్చింది. అనగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. గ్రీసు రుణంలో పెట్టుబడులు పెట్టిన బ్రిటిష్ బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించడానికి కూడా గ్రీసు ఆదాయ వనరులు సరిపోలేదు. 1860-90 మధ్య కాలంలోనూ గ్రీసు బడ్జెట్ లోటు యేటికేడూ పెరుగుతూ పోయింది. ఫలితంగా అప్పు కూడా పేరుకుపోయింది. చివరికి స్వల్పకాలిక రుణాలను కూడా చెల్లించలేని పరిస్ధితి ఏర్పడింది. అలాంటి గ్రీసుపై 1893 నాటి జాతీయవాద యుద్ధ ఓటమి మరో 20 మిలియన్ల పరిహారాన్ని మోపారు. తమ పాత అప్పు 15 మిలియన్లపై వడ్డీలు చెల్లించలేకనే తీసుకుంటున్న గ్రీసు మరో 20 మిలియన్లు ఎక్కడ నుండి తెస్తుంది.

ఈ కష్ట పరిస్ధితిలో టర్కీకి చెల్లించాల్సిన పరిహారం కంటే తమ అప్పులపై వడ్డీ చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలని బ్రిటిష్, ఫ్రెంచి బ్యాంకులు గ్రీసుపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు వార్షిక బడ్జెట్ లోటులు పెరుగుతూ పోయాయి. దరిమిలా గ్రీసు దివాళా స్ధితికి చేరుకుంది. వడ్డీలకే లేక అసలు చెల్లింపులను వాయిదా వేసింది. పాత అప్పులు చెల్లింపులు లేకుండా కొత్త అప్పులు ఇవ్వబోమని బ్రిటిష్, ఫ్రాన్స్ బ్యాంకులు అల్టిమేటం జారీ చేశాయి. పైగా కొత్త రుణాలకు మూడు రక్షక రాజ్యాలు –బ్రిటన్, ఫ్రాన్స్, జారిస్టు రష్యా- గ్యారంటీ ఇచ్చి తీరాలని తెగేసి చెప్పాయి. ఈ పరిస్ధితుల మధ్య గ్రీసుపై జాలి చూపుతున్నట్లు నటిస్తూ ఆ దేశానికి సాయం చేసే లక్ష్యంతో ‘ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్’ ఏర్పాటును రక్షక రాజ్యాలు ప్రకటించాయి. 15 మిలియన్ డాలర్ల గ్రీసు జాతీయ రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం, టర్కీకి ఇవ్వవలసిన 20 మిలియన్ల పరిహారం చెల్లింపుల కోసం ఈ సంస్ధ ద్వారా కొత్త రుణాలు ప్రకటించాయి. అందుకు ఫలితంగా దాదాపు గ్రీసు సార్వభౌమాధికారం మొత్తాన్ని కమిషన్ చేతుల్లో పెట్టారు. గ్రీకు-టర్కీ యుద్ధానికి దారి తీసిన తిరుగుబాటు లేవదీసినందుకు శిక్షగా క్రీట్ ను అంతర్జాతీయ నియంత్రణలో ఉంచాలని నిర్ణయం చేశారు. ఆ విధంగా గ్రీసు జాతినీ, రాజ్యాన్ని, సార్వభౌమాధికారాన్ని పూర్తి స్ధాయిలో ముట్టడించి, లొంగదీసుకుని, అణచివేసే ప్రక్రియ అప్పటికి పరిసమాప్తమైంది.

ఈ భాగంలో ఇంతవరకు మనం గమనించవలసిన అంశాలు: గ్రీసు పై మోపబడిన రుణాలు ఏవీ గ్రీసు ప్రజల కోసం చేసినవి కావు. 1830ల నాటి 15 మిలియన్ డాలర్ల రుణం గ్రీసును తన అదుపులో ఉంచుకోవడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు విసిరిన విష వల. ఈ వలకు లబ్దిదారులు కొద్ది మంది గ్రీకు సంపన్న భూస్వామ్య వర్గాలు కాగా ఆ రుణాలపై వడ్డీలు చెల్లించింది మాత్రం ప్రధానంగా గ్రీసు శ్రామిక వర్గాలైన రైతులు, కార్మికులే. గ్రీసు జాతిని ముక్కలు ముక్కలుగా విడగొట్టి కొద్ది భాగాన్ని స్వతంత్ర గ్రీసుగా చేయడం ద్వారా రుణాలు తీర్చలేని పరిస్ధితికి నెట్టింది బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రయోజనాలే తప్ప గ్రీసు ప్రజల ప్రయోజనాలు కాదు. ఒక జాతి అణచివేతకు గురయినప్పుడు ఆ జాతి విముక్తి కోరుకోవడం సహజ ప్రాకృతిక నియమం మాత్రమే. ఆ నియానుసారమే గ్రీసు జాతి ఒట్టోమాన్ సామ్రాజ్యం పైన తిరుగుబాటు చేశారు. కానీ బ్రిటిష్, ఫ్రెంచి, జారిస్టు రష్యన్ పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల నిమిత్తం, తమ సొంత భౌగోళిక రాజకీయ వ్యూహాలు నెరవేర్చుకోవడం కోసం గ్రీసు తిరుగుబాటులోకి స్నేహితుల ముసుగులో చొరబడి గ్రీసు జాతీయవాదాన్ని తిరిగి ముసలి టర్కీ వరుడికి వధువుగా కట్టబెట్టారు.

గ్రీసు జాతికి జరిగిన ఈ పెను విద్రోహంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానిది ప్రధాన పాత్ర కాగా ఫ్రెంచి, జారిస్టు రష్యాలు శక్తికొద్దీ సహకరించి తమ వాటా తాము పొందాయి. గ్రీసు జాతి మాత్రం ఎప్పటిలా అణచివేత, పీడనల కింద మగ్గిపోయింది. బైటి దేశాలు రుద్దిన అసమాన ఒప్పందాలను, రాచరికాలను మోస్తూ సర్వవిధాలుగా చితికిపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యాధీశుల స్వార్ధపర జోక్యమే లేనట్లయితే గ్రీసు ప్రజల పరిస్ధితి నేడు వేరుగా ఉండేదా అన్నది, చరిత్రను వెనక్కి తిప్పలేము గనుక, వూహాత్మక ప్రశ్న అవుతుంది. గ్రీసు సమాజం, సహజ సామాజిక నియమాల ప్రకారం అభివృద్ధి చెందకుండా బ్రిటిష్, ఫ్రెంచి, జారిస్టు రష్యన్ పాలక వర్గాలు ఆటంకపరిచాయని మాత్రమే మనం గ్రహించవలసిన విషయం. రెండో ప్రపంచ యుద్ధం దరిమిలా బ్రిటిష్ సామ్రాజ్యవాదం చతికిలబడ్డాక గాని గ్రీసు ప్రజలకు బ్రిటిష్ పీడ వదల్లేదు. కానీ వారి స్ధానాన్ని జర్మనీ, ఇటలీ ఫాసిస్టులు ఆక్రమించి మరోసారి పీడనలకు గురి చేశారు. వారి తర్వాత అమెరికా సామ్రాజ్యవాదులు గ్రీసును అదుపులోకి తెచ్చుకుని ఇప్పటికీ పట్టి పల్లారుస్తున్నారు.

……………………………………..ఇంకా ఉంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s