గ్రెక్సిట్: పెట్టుబడిదారీ సంక్షోభ ఫలితం -2


Greece bailout

మొదటి భాగం తరువాత………………

గ్రీసు అబద్ధాలు?!

గ్రీసు 2001లో తన జాతీయ కరెన్సీ ‘డ్రాక్మా’ను రద్దు చేసుకుని ‘యూరో’ను స్వీకరించింది. సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘యూరో జోన్’ లో చేరింది. ఆనాటి గ్రీసు ప్రభుత్వం తమ ఆర్ధిక పరిస్ధితి గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, అబద్ధాలు చెప్పి యూరో జోన్ లో చేరిందని పశ్చిమ పత్రికలు, ఈ.యు, ఇ.సి.బి అధికారులు ఇప్పటికీ చెబుతారు. గ్రీసు దాచిపెట్టిన ఆర్ధిక సమస్యల వల్ల గ్రీసు అప్పు పెరుగుతూ పోయిందని, అది తడిసి మోపెడై భారంగా మారిందని, దరిమిలా యూరో జోన్ కూటమికి కూడా భారం అయిందని వారు చెబుతారు.

ఇంతకీ గ్రీసు చెప్పిన అబద్ధం ఏమిటి? యూరో జోన్ లో చేరాలంటే లేదా యూరో కరెన్సీని తమ జాతీయ కరెన్సీగా చేసుకోవాలంటే సభ్య దేశాలు విధిగా కొన్ని షరతులను పాటించాలి. వాటిలో ఒకటి: జాతీయ బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్) తమ జి.డి.పిలో 3 శాతం కంటే తక్కువ ఉండాలి. యూరోలో చేరేనాటికి అప్పటి గ్రీసు సోషలిస్టు ప్రభుత్వం 1997-99 కాలంలో (ఈ 3 సంవత్సరాల ఆర్ధిక గణాంకాల ఆధారంగా యూరోలో చేరే దేశాలను నిర్ణయించారు) తమ బడ్జెట్ లోటు, జి.డి.పిలో 1 శాతం మాత్రమే అని చెప్పిందట. దానితో గ్రీసును ఆనందంగా యూరో జోన్ లో చేర్చుకున్నారట. తీరా చూస్తే గ్రీసు వాస్తవ బడ్జెట్ లోటు 1997-99 కాలంలో 5 శాతం పైనే ఉన్నట్లు కనిపెట్టామని 2004లో ఈ.యు, ఇ.సి.బి అధికారులు ప్రకటించారు. 2009 నాటికి అది 11 శాతానికి చేరిందని వారు వాపోయారు. ఆ తర్వాత 11 కాదు 12.7 శాతం అన్నారు. కొద్ది వారాల తర్వాత అదీ కాదు 13.6 అన్నారు. అయితే పత్రికలు ఎప్పటికీ చెప్పని విషయం ఏమిటంటే సభ్య దేశాల ఆర్ధిక పరిస్ధితిని నిర్ణయించడం ఆయా జాతీయ ప్రభుత్వాలు ఏకపక్షంగా సాగించిన వ్యవహారం కాదు. ‘మా లోటు ఇంత’ అని ఒక దేశం వచ్చి చెప్పగానే ‘అయితే, సరే. సభ్యత్వం తీసుకో’ అన్నంత సులువుగా అది జరగలేదు. యూరోపియన్ కమిషన్, ఇ.యు, ఇ.సి.బి లు సభ్యత్వం కోరే ప్రతి దేశ ఆర్ధిక పరిస్ధితిని క్షుణ్ణంగా పరిశీలించి, మదింపు చేసి, సంతృప్తి చెందాకనే సభ్యత్వం ఇచ్చాయి. అప్పుడు కనపడని తప్పు 2004లో ఎలా కనపడింది? ఇది ఆలోచించవలసిన విషయం.

అసలు సంక్షోభం అని చెప్పగలిగేటంత భారీ అప్పు గ్రీసు కలిగి ఉన్నదా అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే గ్రీసు కంటే భారీ పరిమాణంలో అప్పును మోస్తున్న దేశాలు ఐరోపా లోపలా బైటా ఉన్నాయి. భారీ రుణాలే సంక్షోభం అయినట్లయితే అవి కూడా ఋణ సంక్షోభంలో ఉన్నట్లు చెప్పాలి. కానీ అలాంటిది ఏమి జరగడం లేదు. పైగా ఆ దేశాలకు మార్కెట్లో రుణాలు దండిగా అందుబాటులో ఉంటున్నాయి. ఉదాహరణకి జపాన్ అప్పు ఇప్పుడు ఆ దేశ జి.డి.పిలో 230 శాతం. గ్రీసు ఋణ సంక్షోభంపై గగ్గోలు మొదలైన 2009లో 174 శాతం అప్పును జపాన్ మోసింది. గ్రీసుకు ట్రొయికా బెయిలౌట్లు ఇవ్వడం ఆరంభించిన 2010లో జపాన్ అప్పు 194 శాతానికి పెరిగింది. 1980-2014 కాలంలో జపాన్ సగటు అప్పు 122 శాతం. అయినా జపాన్ ఋణ సేకరణ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. జపాన్ అడపా దడపా ప్రతి ద్రవ్యోల్బణంలో కొనసాగుతూ ఆర్ధిక స్తంభన, మాంద్యం ఎదుర్కొంటున్నప్పటికీ రుణాలు ఆగలేదు. యూరో దేశం ఇటలీ అప్పు 2009 లో జి.డి.పిలో 106 శాతం, 2010 లో 116 శాతం ఉండగా ఇప్పుడు 132 శాతానికి చేరింది. 1988-2014 కాలంలో ఇటలీ సగటు అప్పు 111 శాతం. అయినా ఇటలీ పట్ల మార్కెట్లు నిర్దయగా వ్యవహరించడం లేదు.

మరో యూరో దేశం బెల్జియం అప్పు 2010లో జి.డి.పి లో 96 శాతం ఉండగా ఇప్పుడు 107 శాతానికి చేరింది. 1980-2014 కాలంలో బెల్జియం సగటు అప్పు 109 శాతం. అయినా బెల్జియంను ఋణ పీడిత దేశంగా మార్కెట్లు పరిగణించడం లేదు. యూరో ఒప్పందం ప్రకారం సభ్య దేశాల అప్పు జి.డి.పిలో 60 శాతం మించకూడదు. కానీ జర్మనీ అప్పు 1995 నుండి ఇప్పటివరకు ఎప్పుడూ ఈ పరిమితికి కట్టుబడిలేదు. ఆ దేశ అప్పు 2009లో జి.డి.పిలో 66.8 శాతంగా 2011లో 80 శాతానికి పెరిగింది. ఇప్పుడు 75 శాతం. 1995-2014 కాలంలో జర్మనీ సగటు అప్పు 67 శాతం. ఐరోపాలో ప్రభావశీల ఆర్ధికవేత్తగా పరిగణించే ఫ్రెంచి ఆర్ధికవేత్త ధామస్ పికెట్ ప్రకారం జర్మనీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఎప్పుడూ తన అప్పులు తీర్చివేసిన చరిత్ర లేదు. ఇప్పటి గ్రీసు కంటే చాలా పెద్ద మొత్తంలో ఋణ సంక్షోభాన్ని జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఎదుర్కొన్నాయని కానీ ఋణ దాతలు ఆ రుణాల్లో భారీ మొత్తాన్ని రద్దు చేయడంతో బైట పడ్డాయని పికెట్ గుర్తు చేశాడు. మరీ ముఖ్యంగా జర్మనీ అప్పు 1945లో జి.డి.పి లో 200 శాతం ఉండగా పదేళ్ళ తర్వాత అది 20 శాతానికి తగ్గిందని రుణాలు రద్దు చేయడం వల్లనే అది సాధ్యపడిందని గుర్తు చేశాడు. అలాంటి జర్మనీ ఈ రోజు అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించడం తప్పనిసరి విధి అని బోధించడం ‘పెద్ద జోక్’ అని పికెట్ అభివర్ణించాడు.

కనుక గ్రీసు ఋణ సంక్షోభం అంటూ గగ్గోలు మొదలు కావడం వెనుక ఇతరేతర కారణాలు ఉన్నాయి తప్ప అప్పు పరిమాణం కారణం కాదని స్పష్టం అవుతోంది. గ్రీసు రుణాలను పాక్షికంగా రద్దు చేయడానికి కూడా ససేమిరా అంటున్న జర్మనీ తన సామ్రాజ్యవాద విస్తరణకు గ్రీసు దేశాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకున్నది. గ్రీసు అబద్ధాలు చెప్పి యూరో జోన్ లో చేరిందన్నది ఒట్టి డొల్ల వాదన. తన ఏలుబడిలోని బలహీన దేశాల ఆర్ధిక వ్యవస్ధలను బడ్జెట్ రచనలతో సహా పూర్తిగా అదుపులోకి తీసుకుని తన ప్రయోజనాలకు అనుగుణంగా అక్కడి ఆర్ధిక వ్యవస్ధను వ్యవస్ధాగతంగా మార్చివేసే లక్ష్యంతోనే ‘సంక్షోభం’ అంటూ చప్పుళ్ళు ప్రారంభించింది. తగిన వాటా పొందే లక్ష్యంతో ఇతర ఐరోపా పెత్తందారీ దేశాలు కూడా జర్మనీ కుయుక్తులకు వంత పాడాయి.

Greece - EU restoration

చట్టబద్ధత లేని యూరో జోన్!

పశ్చిమ పత్రికలు నమ్మబలికేటట్లుగా యూరో జోన్ అన్న కూటమి వాస్తవంలో ఉనికిలో లేదు. ఉన్నదల్లా యూరోపియన్ యూనియన్ కూటమి మాత్రమే. ఇ.యు సభ్య దేశాలు ఉమ్మడిగా ఏర్పరచుకున్న ఇ.సి.బి, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ పార్లమెంట్… ఇవి మాత్రమే ఉమ్మడి ఒప్పందాల ప్రాతిపదికన ఏర్పడిన చట్టబద్ధ కూటమి సంస్ధలు. ఇ.యు సభ్య దేశాల పార్లమెంటులన్నింటి ఆమోదంతో ఏర్పడిన సంస్ధలు ఇవే. యూరో కరెన్సీ జర్మనీ, ఫ్రాన్స్ ల చొరవతో ఏర్పడినది. యూరో కరెన్సీ కలిగిన దేశాలను కలిపి యూరో జోన్ అనీ, యూరో ఏరియా అనీ, యూరోపియన్ మానిటరీ యూనియన్ (ఇ.ఎం.యు) అనీ పత్రికలు అధికారులు, రాజకీయ నాయకులు వాడుకలోకి తెచ్చారు. యూరో కరెన్సీ దేశాల పార్లమెంటుల చట్టబద్ధ ఆమోదం ఈ పేర్లకు గానీ ఆ పేర్లతో ఉనికిలో ఉన్నట్లు చెప్పే సంస్ధలకు గానీ లేదు.

కనుక ఇ.ఎం.యు పేరుతో పత్రికలు చెలామణీ చేసే అధికారిక పరిణామాలన్నీ చట్టవిరుద్ధమైనవి. ఇ.ఎం.యు పేరుతో యూరో జోన్ దేశాల ఆర్ధిక మంత్రులు, ఇ.సి, ఇ.యు, ఇ.సి.బిల అధికారులు సమావేశాలు జరుపుతూ గ్రీసుపై రుద్దుతున్న అమానుష పొదుపు విధానాల నిర్ణయాలు ఆ విధంగా వాస్తవంలో యూరోపియన్ కూటమి ప్రకటిత స్ఫూర్తికి విరుద్ధమైనవి. అలాగే ట్రొయికా అన్న పేరు కూడా వాడుక మాత్రమే. అలాంటి చట్టబద్ధ సంస్ధ ఏమీ ఉనికిలో లేదు. ఇ.యు, ఇ.సి.బి, ఇ.సిలు అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు చట్టబద్ధ పనిముట్లు కాగా ఇ.ఎం.యు, యూరో ఆర్ధిక మంత్రుల సదస్సులు, ట్రొయికా… ఇవన్నీ చట్టాల ఆమోదం లేని చట్ట విరుద్ధ సంస్ధలు. చట్టబద్ధంగా చేయలేని, రుద్ధలేని నిర్ణయాలను ఇ.ఎం.యు, ట్రొయికా సమావేశాల ద్వారా ఐరోపా నాయకుడు జర్మనీ, దాని జూనియర్ భాగస్వామి ఫ్రాన్స్ లు అమలు చేయిస్తున్నాయి.

ఇక్కడ ఒక అంశాన్ని చెప్పుకోవాలి. ఆర్ధిక పరిభాషలో ఒక దేశ బడ్జెట్ లోటు క్రమంగా అప్పులో చేరుతూ ఉంటుంది. బడ్జెట్ లో ప్రతిపాదించిన ఖర్చుకు తగిన ఆదాయం ఒక ఆర్ధిక సంవత్సరంలో సమకూరకపోతే అదే లోటుగా తేలుతుంది. ఈ లోటును ఆ సంవత్సరం చేసే అప్పుల ద్వారా పూడ్చుకుంటారు. ఇలా ప్రతి యేటా లోటులను అప్పులతో పూడ్చుతూ జాతీయ ప్రభుత్వాలు ఖర్చులు చేస్తాయి. కనుక లోటు పెరగడం అంటే అప్పు మరింత పెరగడం. ఈ నేపధ్యంలో బడ్జెట్ లోటుకు ప్రాముఖ్యత ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు చేయడం, ఆ భారాన్ని పన్నుల రూపంలో జనంపై వేయడం పెట్టుబడిదారీ వర్గ ప్రభుత్వాలకు, వారికి సేవలు చేసే దళారీ ప్రభుత్వాలకూ ఆనవాయితీ.

అసలు, సంక్షోభం ఏమిటి?

పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలు తమ రోజువారీ అవసరాల కోసం పన్నులు మొ.న వసూళ్లపై ఆధారపడాలి. ఐతే పన్నుల వసూళ్లు అవసరానికి తగినట్లు అందుబాటులోకి రావు. కానీ ఈ లోపు అవసరాలు గడవాలి. అందుకోసం ప్రైవేటు మార్కెట్ల నుండి రుణాలు సేకరిస్తాయి. పబ్లిక్ సెక్టార్ కంపెనీల నుండి రుణం సేకరించినా, సాంకేతికంగా అవికూడా ప్రైవేటు రుణాలే. సార్వభౌమ ఋణ పత్రాలను (Sovereign Debt Bonds) జారీ చేయడం ద్వారా ప్రధానంగా ఋణ సేకరణ జరుగుతుంది. ఆరు నెలల నుండి 25 లేదా 30 సంవత్సరాల వరకూ వివిధ కాల వ్యవధులు కలిగిన సావరిన్ బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. మార్కెట్లో ఎంత తక్కువ వడ్డీకి రుణాలు సేకరించగలిగితే అంత ఎక్కువ నమ్మకం ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధపై ఋణ దాతలకు (బాండ్ల కొనుగోలుదారులకు) ఉన్నట్లు లెక్క. ఇలా బాండ్ల ద్వారా సేకరించిన రుణాలకు ప్రభుత్వాలు త్రైమాసికం/అర్ధ సంవత్సరం/వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపులు చేస్తాయి. గడువు తేదీన చెల్లింపులు చేయలేకపోతే అది ఎగవేత (default) కిందికి వస్తుంది. ఆర్ధిక వ్యవస్ధపై నమ్మకం సన్నగిల్లితే ఋణ దాతలు అధిక వడ్డీ డిమాండ్ చేస్తారు. అధిక వడ్డీలకు సిద్ధపడడం అంటే సంక్షోభంలో ఉన్నామని చెప్పినట్లే. కనుక దేశ ఆర్ధిక వ్యవస్ధ అవసరాల కోసం అప్పులు పుట్టకపోవడమే ఋణ సంక్షోభం. 2009-10లో అలవికాని మొత్తంలో వడ్డీ రేట్లను మార్కెట్లు డిమాండ్ చేయడంతో ఋణ సేకరణకు గ్రీసుకు దారులు మూసుకుపోయాయి. అప్పటికే గ్రీసు రుణం ఆ దేశ జి.డి.పి కంటే ఎక్కువ కావడం, ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోవడం, కరెంటు ఖాతా లోటు భారీగా పెరగడం… ఈ కారణాల వలన ప్రైవేటు మదుపుదారులు (సూపర్ ధనికులు, ఇన్వెస్ట్ మెంటు బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, హెడ్జ్ ఫండ్ లు, వివిధ కంపెనీలు మొ. వారు) గ్రీసు ఆర్ధిక వ్యవస్ధపై నమ్మకం కోల్పోయారు. దానివలన వాళ్ళు ఎక్కువ వడ్డీని డిమాండ్ చేశారు. మదుపరులు డిమాండ్ చేసిన వడ్డీకి రుణం తీసుకుంటే ఆర్ధిక వ్యవస్ధ దివాళా తీస్తుంది. అధిక వడ్డీలకు మార్కెట్లలో అప్పు తీసుకోలేక, అవసరాలు గడిచే దారిలేక సంక్షోభ పరిస్ధితిని గ్రీసు ఎదుర్కొంది. ఇదే గ్రీసు ఋణ సంక్షోభం.

కానీ గ్రీసుకు విచక్షణారహితంగా అలవిమాలిన మొత్తంలో అప్పులు ఇచ్చిన పాపం ఎవరిది? ఈ ప్రశ్న వేసినవారు చాలా తక్కువ. ఋణ దాత, ఋణ గ్రహీతల మధ్య తగాదా వస్తే ఋణ గ్రహీతలనే ముఖ్య దోషులుగా పరిగణించడం తెలిసిన విషయమే. అక్రమ సంపాదనను అప్పులుగా ఇచ్చి మారు వడ్డీలకు, చక్ర వడ్డీలకు తిప్పుతూ ఇతరుల కష్టార్జితాన్ని గుంజే ఆశపోతులను ఎవరూ వేలెత్తి చూపరు, ఒక్క విప్లవకర మార్క్సిస్టు పరిశీలకులు తప్ప. 2008లో అమెరికాలో ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం బద్దలు కావడానికి దారితీసిన తక్షణ కారణం సబ్ ప్రైమరీ గృహ రుణాలు. ఆదాయం, చెల్లింపు సామర్ధ్యం చూడకుండా, గ్యారంటర్లు లేకపోయినా ప్రజలకు బ్యాంకులు గృహ రుణాలు ఇస్తూ పోయాయి. గృహ రుణాలను వాణిజ్య బ్యాంకుల ఇవ్వగా ఆ రుణాలను వాల్ స్ట్రీట్ లోని బడా బ్యాంకులు, ద్రవ్య సంస్ధలు కొనుగోలు చేశాయి. ఇలా కొనుగోలు చేసిన సబ్ ప్రైమరీ రుణాలను, నాణ్యమైన రుణాలను కలిపేసి, వాటిని చిన్న చిన్న మొత్తాల్లో విభజించి, వాటిని మళ్ళీ జంబ్లింగ్ చేసి సరికొత్త డెరివేటివ్ ద్రవ్య ఉత్పత్తులుగా (సెక్యూరిటీలు) వాల్ స్ట్రీట్ బ్యాంకులు తయారు చేసి అమ్మకాలు చేశాయి. ఈ ఉత్పత్తులకు సి.డి.ఓ (కోలేటరలైజ్డ్ డెట్ ఆబ్లిగేషన్స్) అనీ, సి.డి.ఎస్ (క్రెడిట్ డీఫాల్ట్ స్వాప్స్) అనీ సామాన్యుడికి అర్ధం కానీ పేర్లు పెట్టాయి. జంబ్లింగ్ వల్ల రిస్కు కనీస స్ధాయికి తగ్గించామని ప్రచారం చేశాయి. వీటిని ప్రపంచవ్యాపితంగా ఉన్న ప్రైవేటు ద్రవ్య సంస్ధలు ఎగబడి కొన్నారు. రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లింపులు చేస్తే దానిని ఇలా కొన్నవారు లాభాలుగా పంచుకున్నారు.

కానీ సబ్ ప్రైమరీ రుణాలు వసూలు కాకపోవడంతో పెట్టుబడి ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి ద్రవ్య సంక్షోభం బద్దలయింది. హౌసింగ్ రుణాలే కాక, క్రెడిట్ కార్డు రుణాలు, వాహన రుణాలు కూడా ఇదే తరహాలో విషతుల్యమైన (వసూలు కాని) సెక్యూరిటీలను ఉత్పత్తి చేసేందుకు వినియోగించారు. వీటిలో ప్రపంచం నలుమూలలలోని కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో సంక్షోభం ప్రపంచం నిండా వ్యాపించింది. అమెరికా తర్వాత తీవ్రంగా దెబ్బ తిన్నది ఐరోపా రాజ్యాలే. చివరికది ఆర్ధిక సంక్షోభంగా మారింది. దాదాపు పెట్టుబడిదారీ దేశాలన్నీ, ఐరోపా దేశాలతో సహా, జి.డి.పి పడిపోయి ఆర్ధిక మాంద్యానికి గురయ్యాయి. గ్రీసు కూడా అందులో ఒకటి. గ్రీసు ఎదుర్కొన్న ఋణ సంక్షోభం హఠాత్తుగా ఉద్భవించింది కాదు. అందులో అమెరికా తయారు చేసిన ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ఒక ముఖ్యపాత్రను పోషించింది. ఈ సంక్షోభం యూరో విలువను ఒడిదుడుకులకు గురిచేసింది. అనగా గ్రీసు కరెన్సీ ఒడిదుడుకులకు గురయింది. అది ఎగుమతి, దిగుమతులపై ప్రభావం చూపింది. అప్పు పరిమాణాన్ని మరింతగా పెంచివేసింది. కరెంటు ఖాతాపై ఒత్తిడి పెంచింది. ఈ విధంగా 2008 ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం వలన గ్రీసు గట్టి దెబ్బ చవి చూసిందన్న సంగతి గమనంలో ఉంచుకోవాలి.

గ్రీసు ఋణ సంక్షోభం గ్రీసుకు మాత్రమే చెడ్డవార్త కావాలి. కానీ వాస్తవంలో అమెరికాలోని వాల్ స్ట్రీట్ ద్రవ్య కంపెనీలు మొదలుకొని ద సిటీ (లండన్), ప్యారిస్, ఫ్రాంక్ ఫర్ట్, బ్రసెల్స్ లాంటి ప్రధాన సామ్రాజ్యవాద ద్రవ్య-ఆర్ధిక కేంద్రాలు గ్రీసు సంక్షోభంతో ఉలిక్కి పడ్డాయి. ఎందుకంటే అక్కడి వాణిజ్య బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలు గ్రీసు అప్పుల్లో పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. వాల్ స్ట్రీట్ లోని గోల్డ్ మేన్ సాక్స్ లాంటి బడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులైతే గ్రీసుకు రహస్యంగా విషతుల్యమైన సెక్యూరిటీలను అంటగట్టాయి. అనేక బిలియన్ డాలర్ల మేర ద్రవ్య ఆస్తులు అంటగట్టి ఆ సంగతి రహస్యంగా ఉంచాయి. అమెరికా మిలట్రీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కు చెందిన బడా ఆయుధ కంపెనీలు పదుల బిలియన్లు గ్రీసు నుండి వసూలు చేసి ఆయుధాలను అమ్ముకుంది. ఆయుధ కొనుగోళ్ళు రుణాలతోనే జరుగుతాయి. ఈ ఆయుధ రుణాలను గ్రీసు తన బ్యాలన్స్ షీట్లలో చూపకుండా అమెరికా సహకరించింది. బ్యాలన్స్ షీట్లలో చూపలేదన్నమాటే గానీ నిజానికి ఆ సంగతి తెలియని వాజమ్మలు ఎవరూ యూరో జోన్ లో లేరు. వీటినే చెప్పని నిజాలుగా ఇ.సి.బి, ఇ.యు, ఇ.సిలు ఆరోపిస్తున్నాయి.

………………………..ఇంకా ఉంది

14 thoughts on “గ్రెక్సిట్: పెట్టుబడిదారీ సంక్షోభ ఫలితం -2

  1. మీ వ్యాసం ఇంకో కోణం లో ఆలోచించడానికి నాకు అవకాశం ఇచ్చింది .
    గ్రీసు ఖర్చు గురించి మీరు ఎక్కడ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది . సామాజిక పధకాల అవసరం ఎంత వరకు ఉంటుంది. ఒక గ్రీసు colleague చెప్పింది ఏంటంటే .. ఆ దేశం లో ప్రతీ 10 మంది లో 8 మంది గవర్నమెంట్ ఉద్యోగులే. రిటైర్ అయిన తరువాత , 96% పెన్షన్ వస్తుంది . బయట ఇంటర్నెట్ లో చదివిన ప్రకారం సామాజిక పదకాలకి అంతు లేదు .
    ఇవన్ని మీరు ప్రస్తావించకుండా కేవలం రుణ దాతలని నిందించడం ఎంత వరకు న్యాయం.

  2. విశేఖర్ గారు.. ఏమయ్యింది చాలారోజులనుంచి పోష్టులు లేవు… కబుర్లు లేవు… ప్రొఫెషనల్ జీవితంలో బిజీగా ఉన్నారా.. 🙂
    మన చుట్టూ ప్రపంచంలో బోల్డు విషయాలు జరిగిపోతున్నాయి. మీతరహా విస్లేషణ గురించి మేమంతా ఎదురుచూస్తున్నాము.

  3. క్రిష్ గారూ, నేను బ్లాగ్ ని చూసి చాలా రోజులయింది. మీరు ఊహించినట్లు ఆఫీసు బిజీతో పాటు ఈ పరిస్ధితికి ఇంకా కారణాలు ఉన్నాయి.

    మొదట ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కోలుకుని రొటీన్ లో పడ్డానికి పది రోజులు పట్టింది. ఆ తర్వాత హఠాత్తుగా మామగారు చనిపోయారు. అటూ ఇటూ తిరగవలసి వచ్చింది. కాస్త సర్దుకున్నాక కారుకు వరుస యాక్సిడెంట్ లు అయ్యాయి. మనుషులకు ఎవరికీ ఏమీ కాలేదు కానీ ఖర్చు మాత్రం బానే అయింది. ఆ తర్వాత పది రోజుల నుండి ఇంటికి లోపలా, బయటా పెయింటింగ్ వెయిస్తున్నాము. ఆ పనికోసం మళ్ళీ మళ్ళీ తిరగవలసి వచ్చింది. అదింకా పూర్తికాలేదు.

    గ్రీసు ఆర్టికల్ కోసం ప్రజాపంధా పత్రిక ఎడిటర్ గుర్తు చేయడం వల్ల నిన్నటి నుండి ఏకధాటిగా రాసి రెండో భాగం (మనకు 3, 4 భాగాలు) పూర్తి చేయడం కుదిరింది గానీ లేదంటే రాసేవాడిని కాదేమో.

    ఆర్టికల్ కోసం మీరు బాగా చూసినట్లున్నారు. బ్లాగ్ చూడకపోవడం వల్ల మీ వ్యాఖ్యలు చూడలేదు. మిగిలిన భాగాలు కూడా త్వరలో పూర్తి చేస్తాను. మీ పలకరింపుకు ధన్యవాదాలు.

  4. నాగశ్రీనివాస గారు,

    అవును. చాలా పరిణామాలు జరిగిపోతున్నాయి. గ్రీసు ఆర్టికల్ అయ్యాక చైనా పరిస్ధితి గురించి రాస్తాను. గ్రీసు ఇంకా రెండు మూడు భాగాలు ఉండవచ్చు.

    ధన్యవాదాలు.

  5. శేఖర్ గారు,
    మీరేదో ప్రమోషన్ లో పోయారు గనుక బిజీ గా ఉన్నరనుకున్నాం. బాగున్నారు కదూ. ఇన్ని విషయాలు జరిగి పోయాయి అన్న మాట

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s