మొదటి భాగం……………….
గత అయిదేళ్లుగా అంతర్జాతీయ స్ధాయిలో పతాక శీర్షికలలో నానుతున్న వార్త గ్రెక్సిట్! గత రెండేళ్లుగా గ్రెక్సిట్ వార్తల మధ్య వ్యవధి తగ్గుతూ వచ్చింది. ఈ యేడు జనవరిలో ‘రాడికల్ లెఫ్ట్’ గా పిలువపడుతున్న సిరిజా కూటమి అధికారం చేపట్టాక గ్రెక్సిట్ క్రమం తప్పని రోజువారీ వార్త అయింది. గ్రీక్ + ఎక్సిట్ కలిసి గ్రెక్సిట్ అయింది. ఎక్సిట్ అంటే బయటకు వెళ్లిపోవడం. గ్రీసు యూరో జోన్ నుండి బైటికి వెళ్లిపోయే పరిస్ధితులను గ్రెక్సిట్ అని సంబోధిస్తున్నారు.
2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఐరోపా దేశాల్లో ఋణ సంక్షోభం తలెత్తిన సంగతి విదితమే. 2009 చివరి రోజుల్లో ఊపిరి పోసుకుని 2010 మే నెల నాటికి గ్రీకు ఋణ సంక్షోభం బద్దలయినట్లు పశ్చిమ కార్పొరేట్ పత్రికలు మనకు చెబుతాయి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం, 2010 గ్రీకు లేదా ఐరోపా లేదా యూరో జోన్ ఋణ సంక్షోభం రెండూ వేరు వేరు అని అవి నమ్మబలుకుతాయి. కానీ అది వాస్తవం కాదు. 2008 ద్రవ్య-ఆర్ధిక సంక్షోభానికి కొనసాగింపుగానే ఐరోపా ఋణ సంక్షోభం ఏర్పడింది తప్ప అదేదో ఉన్నట్లుండి మొలిచిన పుట్టగొడుగు కాదు. సంక్షోభాల్లో మునిగి తేలుతూ సంక్షోభాలను కూడా సొమ్ము చేసుకునే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్ధ గత నలభై యేళ్లుగా ఎదుర్కొంటున్న సాధారణ పెట్టుబడిదారీ సంక్షోభంలో భాగంగా జరిగిన ఒకానొక కీలక పరిణామమే గ్రీసు/యూరో జోన్ ఋణ సంక్షోభం. పెట్టుబడిదారీ వ్యవస్ధ తన సంక్షోభం గురించి జనానికి నాగరికంగా తెలియజెప్పే పద్ధతులను అనేకం అభివృద్ధి చేసుకుంది. ఈ పద్ధతులకు ప్రధాన వాహకం పశ్చిమ కార్పొరేట్ మీడియా కంపెనీలు. జర్మనీ నాజీ ప్రభుత్వంలో సమాచార మంత్రిగా పనిచేసిన గోబెల్స్ వారికి గురువు. నిజానికి ఈనాటి పశ్చిమ కార్పొరేట్ వార్తా సంస్ధల ముందు నాటి గోబెల్స్ ఎందుకూ కొరగాడు.
గ్రీసు ఋణ సంక్షోభం ఐరోపా సంక్షోభం ఎందుకు అయింది?
ఋణ సంక్షోభం అంటే స్ధూలంగా అప్పులు పుట్టని పరిస్ధితి. పెట్టుబడి ప్రపంచీకరణ నేపధ్యంలో గ్రీసు ఋణ సంక్షోభం ‘అంటు వ్యాధి’ తరహాలో ఇతర యూరో జోన్ దేశాలకు కూడా వ్యాపించి మరోసారి ప్రపంచాన్ని సైతం కబళించే ప్రమాదం ఏర్పడిందని చెబుతూ సదరు ప్రమాదాన్ని నివారించే కర్తవ్యాన్ని ఈ.సి.బి (యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్), ఈ.సి (యూరోపియన్ కమిషన్), ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ.ఎం.ఎఫ్) లు ఉమ్మడిగా స్వీకరించాయి. [ఈ మూడు సంస్ధలను కలిపి ‘యూరోపియన్ ట్రొయికా’ లేదా ‘ట్రొయికా’ అని పిలుస్తున్నారు.] గ్రీసు దేశం తలకు మించి అప్పులు చేసి అవి తీర్చలేక చతికిల పడిందని, రోజువారీ అవసరాలకు కొత్త అప్పులు పుట్టని పరిస్ధితి ఏర్పడిందన్నది పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల విశ్లేషణ. ఆ పరిస్ధితిలో ఈ మూడు సంస్ధలు రంగంలోకి దిగి సరసమైన వడ్డీలకు అప్పులు ఇచ్చి గ్రీసు దేశాన్ని ఆదుకున్నాయని పశ్చిమ పత్రికలు ఐదేళ్లుగా చెబుతున్నాయి.
యూరో ఇప్పుడు 19 ఐరోపా దేశాలకు ఉమ్మడి కరెన్సీ. గ్రీసు ఋణ సంక్షోభం తీవ్రం అయితే దాని ప్రభావం యూరో పై పడుతుంది. యూరో విలువ ఒడిదుడుకులకు గురవుతుంది. కరెన్సీ విలువ పడిపోయి ఋణ పరిణామం ఇంకా పెరుగుతుంది. ఫలితంగా గ్రీసు తరహాలో అప్పుల భారాన్ని మోస్తున్న ఇతర యూరో దేశాల (ఉదా: ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్, సైప్రస్, పోర్చుగల్ మొ.వి) ఋణ పరిణామమూ పెరుగుతుంది. అప్పులు ఎక్కువగా ఉండే దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై మార్కెట్లకు (ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, హెడ్జ్ ఫండ్ లు, ఇన్వెస్ట్ మెంట్ సంస్ధలు, సంపన్న మదుపుదారులు మొ.న వారు దేశాలు జారీ చేసే సార్వభౌమ ఋణ పత్రాలను కొనుగోలు చేయడం ద్వారా ఆయా దేశాల అప్పుల్లో పెట్టుబడులు పెడతారు. కనుక అవే అప్పులకు మార్కెట్) నమ్మకం సన్నగిల్లుతుంది. కనుక యూరో జోన్ లోని ఇతర ఋణ పీడిత దేశాలకూ మార్కెట్ లో అప్పులు పుట్టని పరిస్ధితి ఏర్పడుతుంది. అనగా గ్రీకు ఋణ సంక్షోభం మరిన్ని యూరో దేశాలు ఋణ సంక్షోభంలో జారిపోవడానికి దారితీస్తుంది. చివరికిది యూరో భవిష్యత్తునే ప్రమాదంలో పడేస్తుంది. అమెరికాతో పోటీగా శక్తివంతమైన మరో ధృవంగా అవతరించాలన్న ఐరోపా దేశాల (ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్) కల భగ్నం అవుతుంది. ఇలాంటి పరిస్ధితి ఎదుర్కునేందుకు ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి సంపన్న ఉత్తర ఐరోపా దేశాలు సహజంగానే ఇష్టపడవు.
మరో కోణంలో చూస్తే: కారణాలు ఏవైతేనేమి (వాటి గురించి తర్వాత చూద్దాం) గ్రీసు రుణం బాగా పెరిగిపోయింది. సంక్షోభంగా గుర్తించిన 2009లో గ్రీసు అప్పు ఆ దేశ జి.డి.పిలో 113 శాతం. 2010 చివరికి అది 130 శాతంకి పెరిగింది. 2014 చివరి నాటికి గ్రీసు అప్పు జి.డి.పిలో 175 శాతానికి పెరిగింది. ఇప్పుడు 177 శాతం. తాజాగా ఇస్తామంటున్న అప్పును కలిపితే 200 శాతం దాటిపోతుంది. పైన చెప్పినట్లు అప్పులు పెరిగితే ఆర్ధిక వ్యవస్ధపై నమ్మకం సన్నగిల్లి కొత్త అప్పులు పుట్టవు. గ్రీసును ఆదు(డు)కోవడానికి ఇ.సి.బి, ఇ.యు, ఐ.ఎం.ఎఫ్, ఇ.సి లు వరుస సమావేశాలు జరుపుతూ ఉమ్మడిగా కొన్ని నిధులు ఏర్పాటు చేశాయి. ఈ నిధుల నుండి గ్రీసుకు రుణాలు ఇచ్చే ఒప్పందం చేసుకున్నాయి. గ్రీసు ప్రతినిధులు ఒకవైపు ట్రోయికా ప్రతినిధులు మరోవైపు ఉండి చర్చలు జరిపి ఈ ఒప్పందాలు చేశాయి. ఈ వ్యవహారాన్ని ఇంతవరకే చూస్తే తప్పు పట్టడానికి ఏమీ కనపడదు. కొన్ని దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వారిలో ఒకరికి కష్టం వచ్చింది. మిగిలినవారు తలా కొంత, తమ శక్తిమేరకు, వేసుకుని ఆదుకున్నారు. ఇందులో తప్పేముంది?
కానీ జరిగింది అది కాదు. గ్రీసుకు మార్కెట్ కంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే పేరుతో విషమ షరతులను ఆ దేశంపై రుద్దారు. బలవంతపు ప్రయివేటీకరణ అమలు చేశారు. ఉద్యోగాలు అనేకం రద్దు చేశారు. ఉద్యోగుల సదుపాయాలు కత్తిరించారు. పెన్షన్ లలో కోటలు పెట్టించారు. ప్రజల కోసం ప్రభుత్వం చేసే వ్యయాన్ని బాగా తెగ్గోశారు. దానితో గ్రీసు సంక్షోభం పరిష్కారం కాకపోగా మరింత తీవ్రం అయింది. రుణం జి.డి.పిలో 113 నుండి 177 శాతానికి పెరిగింది. ఇచ్చిన రుణాలు గ్రీసు ప్రజలకు బదులు పాత అప్పుల చెల్లింపుల రూపంలో మళ్ళీ ఇచ్చినవారికే చేరాయి. ఖర్చులకు కూడా డబ్బులు మిగల్లేదు. దానితో ప్రజలు ఉద్యమాల్లోకి దూకారు. పొదుపు విధానాలపై తిరగబడ్డారు. జులై 5 రిఫరెండంలో ట్రొయికా విధానాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ ఓటు వేశారు. కానీ బడ్జెట్ వ్యయం కోసం కొత్త అప్పులు చేయాలి. ట్రొయికా కాకుండా అప్పు ఇచ్చేవారు బ్రిక్స్ తప్ప మరొకరు లేరు. బ్రిక్స్ ని ఆశ్రయించడం అంటే యూరోనుంచి బైటపడడమే. పోనీ యూరోలో కొనసాగుదాం అంటే సరికొత్త పొదుపు విధానాలు, విషమ షరతులు అమలు చేయాలి. అలా చేసినా రుణం ఇంకా పెరగి, సంక్షోభం ఇంకా ముదరడమే గాని పరిష్కారం కాదు. రీ షెడ్యూల్ కి జర్మనీ ససేమిరా అంటోంది. కనుక యూరోను రద్దు చేసుకుని పాత కరెన్సీ డ్రాక్మాను పునరుద్ధరించుకోవాలి. అప్పు కోసం బ్రిక్స్ ను ఆశ్రయించాలి. ఇలా ఏ దారిలో వెళ్ళినా గ్రెక్సిట్ తప్పదు. గ్రెక్సిట్ కు జర్మనీ, ఈ.యులు సిద్ధంగానే ఉన్నాయి. కానీ అమెరికాకి అది ఇష్టం లేదు. కారణాలు తర్వాత చూద్దాం.
సామ్రాజ్యవాదం: పెట్టుబడిదారీ అత్యున్నత దశ
పైన చెప్పినట్లు సరసమైన వడ్డీ పేరుతో ట్రొయికా మంజూరు చేసిన రుణాలు ఒంటరిగా గ్రీసులో ప్రవేశించలేదు. అవి తమతో పాటే అత్యంత కఠినమైన, పాషాణ సమానమైన షరతులను, మోసపూరిత పొదుపు విధానాలను గ్రీసులోకి తీసుకువచ్చాయి. ఫైనాన్స్ పెట్టుబడిని బలహీన దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా సామ్రాజ్యవాద దేశాలు ఏ విధంగా ‘సూపర్ ప్రాఫిట్స్’ గుంజుతాయో మహోపాధ్యాయుడు వి.ఐ.లెనిన్ తన ‘సామ్రాజ్యవాదం: పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ’ సిద్ధాంతంలో స్పష్టంగా చెప్పాడు. గ్రీసు సంక్షోభం వివరాలలోకి వెళ్ళే ముందు లెనిన్ బోధనలను ఒకసారి మననం చేసుకోవడం అవసరం. లెనిన్ చెప్పిన అంశాలను క్లుప్తంగా (సాహసమే అయినా) చూద్దాం.
అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలను లేదా పరిపక్వ దశకు చేరుకున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలు కలిగిన దేశాలను లెనిన్ పైన ఉదహరించిన తన వ్యాసంలో ‘కోర్’ (అంతర్భాగం)గా సూచించారు. అప్పటికి అవి ఐరోపా ఖండంలోనే కేంద్రీకృతం అయి ఉండగా వాటి వలసలు, అర్ధ వలసలు ఇతర ఖండాల్లో వ్యాపించి ఉన్నాయి. కోర్ దేశాల దోపిడి కింద నలుగుతున్న దేశాలను ‘బాహ్య దేశాలు’ (పెరిఫరీ) గా లెనిన్ ప్రస్తావించారు. కోర్ దేశాలు పెరిఫరీ దేశాలలో ఆర్ధిక దోపిడి కార్యకలాపాలను తీవ్రం చేస్తున్న నేపధ్యంలో లెనిన్ తన రచనను వెలువరించారు. ఓ పక్క కోర్ దేశాలలో పెట్టుబడి అంతకంతకు ఎక్కువగా కొద్ది సంఖ్యలోని బడా గుత్త కంపెనీల వద్ద కేంద్రీకృతం అవుతుండగా మరో పక్క ముడి సరుకుల కోసం, పెట్టుబడి మార్కెట్ కోసం బాహ్య దేశాలతో కార్యకలాపాలను కోర్ దేశాలు విస్తరిస్తూ పోయాయి. ఈ రెండు పరిణామాలు ఒకే పరిణామంలో భాగంగా లెనిన్ సూత్రీకరించారు. పాత వలస విధానానికి కొనసాగింపుగా సామ్రాజ్యవాద వ్యవస్ధ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో లెనిన్ తన సూత్రీకరణలో చూపారు.
కోర్ దేశాలలో పెట్టుబడి కేంద్రీకరణ అసమానతలను తీవ్రం చేసింది. ఈ అసమానతలు సరుకుల డిమాండ్ (అగ్రిగేట్ డిమాండ్) పై పరిమితి విధించాయి. అనగా ఉత్పత్తికి తగినట్లు డిమాండ్ పెరగలేదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ సాధించిన భారీ సరుకుల ఉత్పత్తి సామర్ధ్యానికి తగిన డిమాండ్ ను స్ధానిక మార్కెట్ సంతృప్తిపరచలేకపోయింది. అసమానతల వల్ల సాధారణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఈ పరిస్ధితి అనివార్యం అయింది. డిమాండ్ తగ్గుదల వల్ల పెట్టుబడికి పెట్టుబడిగా మనగల దారులు ఇరుకయ్యాయి. కొత్త వనరులు, మార్కెట్ల కోసం వేట అనివార్యం అయింది. మరోవైపు స్ధానికంగా ముడి సరుకుల ధరలు పెరిగి లాభాల రేటు పడిపోయింది. సూపర్ లాభాల రేటు ఎప్పటిలా కొనసాగాలంటే 1. పెట్టుబడులు పెట్టడానికి సరికొత్త ప్రాంతాలు కావాలి. 2. ముడి సరుకులు తక్కువ ధరలకు లభించేలా వనరులు అందుబాటులో ఉండాలి. 3. వినియోగానికి కొత్త మార్కెట్ లు కావాలి. 4. చౌక ధరకు శ్రామికులు అందుబాటులో ఉండాలి.
ఓపక్క పెట్టుబడిదారీ వ్యవస్ధ ‘పెట్టుబడి రియలైజేషన్ సంక్షోభం’ను ఎదుర్కొంటుండగా సోషలిస్టు సిద్ధాంతకర్తల్లోనూ సైద్ధాంతిక అయోమయంతో కూడిన సంక్షోభం నెలకొంది. హిల్ఫర్డింగ్ (ఆస్ట్రియన్ సోషల్ డెమొక్రాట్), కారల్ కాట్స్కీ తదితర సోషలిస్టు సిద్ధాంతకర్తలు “పెట్టుబడిదారీ వ్యవస్ధ పరిపక్వ దశకు చేరుకుని పూర్తి అంతర్జాతీయ స్ధాయి వ్యవస్ధగా రూపొందింది. జాతీయ సరిహద్దులను చెరిపివేస్తోంది. ఇది నూతన దశ” అని తీర్మానించారు. జాతీయ దురహంకార భావాలను తమవిగా చేసుకుని అనేక సోషలిస్టు పార్టీలు, నేతలు తమ ప్రభుత్వాల యుద్ధాలను సమర్ధిస్తూ అందుకు మార్క్సిజాన్ని సైతం మద్దతుగా తెచ్చుకున్నారు. పెట్టుబడిదారీ దేశాల యుద్ధాల వల్ల కార్మికవర్గం శాంతియుతంగా సోషలిజం సాధించేందుకు పెట్టుబడి సహకరిస్తుందని సూచించారు. పూర్తిగా ఆర్ధిక కోణాన్ని మాత్రమే దర్శించిన ఈ అవగాహన, కార్మికులు పెట్టుబడి తరపున ప్రపంచ యుద్ధంలో పాల్గొంటూ ఒకరినొకరు చంపుకుంటున్న పరిస్ధితిని విస్మరించింది. మరోపక్క బుఖానిన్ లాంటి సిద్ధాంతకర్తలు ‘జాతీయ నినాదాలకు కాలం చెల్లింది’ అన్న వాదనను ముందుకు తెచ్చారు. కార్మిక వర్గం ప్రజాస్వామిక ఉద్యమాలను, స్వయం నిర్ణయాధికార పోరాటాలను విడనాడాలని పిలుపులు కూడా ఇచ్చారు. (గ్రీసు రిఫరెండంలో ప్రజలు పొదుపు విధానాలను తిరస్కరించడాన్ని చూసి ఇప్పుడు కూడా కొందరు మేధావులు ఇదే తరహా పిలుపులు ఇవ్వడం గమనార్హం.)
వీరి వాదనల్లోని కొన్ని సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే కా. లెనిన్ సామ్రాజ్యవాదం గురించిన సంపూర్ణ అవగాహనను తన ‘అత్యున్నత దశ’ వ్యాసంలో అందజేశారు. కార్మికవర్గం యొక్క రాజకీయ సమస్యలను ముందు పీఠిన నిలపడంలో వీరు విఫలం అయ్యారని ఎత్తి చూపారు. పెట్టుబడిదారీ వర్గం రాజ్యాన్ని రాజకీయంగా నియంత్రిస్తుందన్న మార్క్సిస్టు మౌలిక సూత్రాన్ని లెనిన్ మరింతగా అభివృద్ధి చేశారు. పెట్టుబడికి ఆధిపత్య రూపం అయిన ద్రవ్య పెట్టుబడి (ఫైనాన్స్ పెట్టుబడి) రాజ్యాంగ యంత్ర బలగాన్ని ఉపయోగించి పెరిఫరీ దేశాలను తన ప్రభావంలోకి తెచ్చుకోవడానికి కృషి చేస్తుందని ఆయన సూత్రీకరించారు. తద్వారా పెట్టుబడి పెరిఫరీ దేశాలలో 1. అణచివేతలో ఉన్న దేశాల శ్రామికులను వినియోగించి ప్రాధమిక సరుకులను, ముడి సరుకులను చౌకగా రాబడుతుంది; 2. కోర్ దేశాల నుండి ఎగుమతి చేసే ఖరీదైన సరుకులను వినియోగించేందుకు ధనికులను తయారు చేస్తుంది; 3. స్ధానిక పారిశ్రామిక రంగాన్ని బలహీనపరిచి కోర్ దేశాల పెట్టుబడిపై ఆధారపడేలా చేసుకుంటుంది. అంతిమంగా బాహ్య దేశాల నుండి సంపదలు నికరంగా కోర్ దేశాలకు ప్రవహిస్తాయి. ఈ సంపదలు కోర్ దేశాలలో పడిపోతున్న లాభాలను నిలబెడతాయి. లాభాలలో కొంత వాటాను తమ కార్మికవర్గానికి తరలించి వారి విధేయతను కొనుగోలు చేసే వెసులుబాటు సమకూర్చుతుంది. ఈ పరిణామాల మొత్తాన్ని లెనిన్ ‘సామ్రాజ్యవాదం’ అని చెప్పారు.
సామ్రాజ్యవాదం దరిమిలా తలెత్తిన పరిణామాలలో రెండు ముఖ్యమైనవి. 1. కోర్ దేశాలలోకి ప్రవహించే అదనపు విలువ శ్రామికులలో సంపన్న పొరను (లేబర్ అరిస్టోక్రసీ) సృష్టిస్తుంది. ఇది పెట్టుబడిదారీ వర్గానికి విధేయతగా ఉంటుంది; 2. సామ్రాజ్యవాద కోర్ లోని జాతి-రాజ్యాల వైరం బద్దలై శ్రామికుల మధ్య జాతి సెంటిమెంట్ కు సంబంధించిన విభేదాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా అక్కడ కార్మికుల వర్గ పోరాటాలు తాత్కాలికంగా దారి తప్పుతాయి. ఈ రెండూ కోర్ దేశాలలో కార్మికవర్గంపై బూర్జువా వర్గం పైచేయి సాధించడానికి తోడ్పడతాయి. అయితే ఇది తాత్కాలికమే. దీర్ఘ కాలంలో ఇది మొదట సామ్రాజ్యవాదాన్ని, అనంతరం పెట్టుబడిదారీ విధానాన్ని బలహీనపరుస్తుంది. జాతి రాజ్యాల వైరం సామ్రాజ్యవాద యుద్ధాలకు దారి తీసిన దరిమిలా యుద్ధాల ఖర్చు ద్రవ్య పెట్టుబడిని హరించివేస్తుంది. ఓడిన కోర్ దేశాలు ఎదుర్కొనే ప్రతికూల ఒప్పందాల వల్లా బాహ్య దేశాలలో తలెత్తే జాతీయోద్యమాలు మరియు వలస వ్యతిరేక ఉద్యమాల వల్లా ఉత్పత్తి సామర్ధ్యం, లాభదాయకత పడిపోతాయి. కోర్ దేశాలలో ఆర్ధిక వ్యవస్ధ స్తంభనకు గురవుతుంది. తద్వారా సామ్రాజ్యవాద దేశాల గొలుసు కొన్ని చోట్ల బలహీనపడుతుంది. సామ్రాజ్యవాద గొలుసు బలహీనపడే పరిస్ధితిని సద్వినియోగం చేసుకోగల స్వీయాత్మక పరిస్ధితులు సిద్ధంగా ఉన్న దేశాలలో విప్లవం విజయవంతం అయ్యేందుకు తగిన పరిస్ధితులు ఏర్పడతాయి. “సామ్రాజ్యవాదం యొక్క ముఖ్యమైన లక్షణం- ప్రపంచం, అణచివేత అమలు చేసే దేశాలు మరియు అణచివేతకు గురయ్యే దేశాలుగా (Oppressor and Oppressed) విభజనకు గురికావడం” అని లెనిన్ బోధించారు.
లెనిన్ అందించిన కర్తవ్య బోధన ఎంత సరైనదో అక్టోబర్ బోల్షివిక్ విప్లవం రుజువు చేసింది. ఈ అవగాహన మౌలికంగా ఈనాటికీ సరైందేనని గ్రీసు, ఇతర ఋణ పీడిత యూరోపియన్ పెరిఫరీ దేశాలలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఐరోపాలోని ఆధిపత్య రాజ్యాలు (జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, ఆస్ట్రియా…) యూరోపియన్ యూనియన్ మరియు యూరో కరెన్సీలకు ప్రధాన లబ్దిదారులు కాగా గ్రీసు, ఐర్లాండ్, సైప్రస్, మాల్టా, స్పెయిన్, పోర్చుగల్ మొ.న బలహీన పశ్చిమ యూరప్ దేశాలు, పోలండ్, రుమేనియా, చెక్, హంగేరి, స్లొవేనియా లాంటి తూర్పు యూరప్ దేశాలు అర్ధ వలసలుగానూ జూనియర్ సామ్రాజ్యవాద భాగస్వాములుగానూ ఆధిపత్య రాజ్యాల బహుళజాతి కంపెనీలకు మార్కెట్ వనరులను, చౌక శ్రమను సమకూర్చిపెడుతున్నాయి. కనుక ఐరోపాలోని ఆధిపత్య రాజ్యాల ఉత్పత్తి శక్తులు జాతి రాజ్యాల సరిహద్దులకు అతీతంగా విస్తరించి అంతర్జాతీయ స్ధాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తే తప్ప లాభదాయకత కాపాడుకోలేని పరిస్ధితికి వ్యక్తీకరణలు గానే యూరోపియన్ యూనియన్, యూరో కరెన్సీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరో జోన్ ఆర్ధిక మంత్రుల సదస్సు, యూరోపియన్ ట్రొయికా లను చూడాలి.
బహుళ ధృవ ప్రపంచం అవతరించిన నేపధ్యంలో ఇతర ధృవాలైన అమెరికా, జపాన్, చైనా, రష్యా (ఇప్పుడు బ్రిక్స్ కూటమి) లతో ఐరోపా ఆధిపత్య రాజ్యాలు పోటీ పడిన, పడుతున్న ఫలితమే ఈ.యు, యూరోల ఆవిర్భావం. ఈ పరిస్ధితిని గ్రహించకపోతే గ్రీసు లాంటి దేశాల సార్వభౌమాధికారాన్ని అత్యంత నగ్నంగా, పచ్చిగా, బహిరంగంగా హరించివేసే విషమ షరతుల పొదుపు విధానాలను, వాటి ఫలితాలను అర్ధం చేసుకోలేము. ఐరోపా ఆధిపత్య రాజ్యాలకు నాయకుడుగా అవతరించిన జర్మనీ ప్రధానంగా అమెరికా, చైనాల సామ్రాజ్యవాదంతో పోటీ పడుతూ అత్యంత క్రూరమైన ఆర్ధిక దమనకాండను ఐరోపా పెరిఫరీ దేశాలపై అమలు చేస్తోంది. గ్రీసు సంక్షోభం ముదురుతున్న కాలం అంతటా అమెరికా తెరవెనుక సాగించిన భౌగోళిక రాజకీయాలను పరిగణనలోకి తీసుకోకపోతే గ్రీసుపై చర్చ అసంపూర్ణమే కాగలదు. బ్రిక్స్ కూటమి ఆవిర్భావం గ్రీసు సంక్షోభం త్వరితంగా పక్వ దశకు చేరుకునేందుకు దోహదం చేసిందని కూడా గ్రహించాలి. లెనిన్ బోధనల నుండి మనం గ్రహించవలసింది: గ్రీసు సంక్షోభం మౌలికంగా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద సంక్షోభానికి కాచిన కాయల్లో ఒకటి అని.
………………………..ఇంకా ఉంది