సుప్రీం కోర్టు రంగంలోకి దిగడంతో హడావుడిగా సి.బి.ఐ విచారణను కోరి ‘ఆ క్రెడిట్ నాదే’ అని చెప్పుకుంటున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బండారం క్రమంగా బయిటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా మధ్య ప్రదేశ్ శాసన సభకు నాయకత్వం వహించే చౌహాన్ తన శాఖలో జరిగిన కుంభకోణం గురించిన సమాచారాన్ని తొక్కిపెట్టి సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. అసలు కుంభకోణాన్ని వెలికి తీసిందే తానని డంబాలు పలుకుతున్న చౌహాన్ సభను తప్పుదారి పట్టించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పవలసి ఉంది.
వ్యాపం కుంభకోణం అత్యున్నత స్ధాయికి చేరింది 2008-2013 మధ్య కాలంలోనే. 2008 నుండి 2012 వరకు ముఖ్యమంత్రి చౌహాన్ వైద్య విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పటివరకూ మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితమై ఉన్న వ్యాపం సంస్ధ పరిధిలోకి ఇతర అనేక కోర్సులతో పాటు ఉద్యోగాల నియామకాన్ని కూడా తెచ్చినది ఈ కాలంలోనే. 2008 నాటికే వ్యాపం ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్ధలోకి మరిన్ని పరీక్షలను చేర్చడం ఏ ఉద్దేశంతో జరిగింది?
వైద్య శాఖ మంత్రిగా ప్రీ-మెడికల్, పి.జి మెడికల్ ప్రవేశ పరీక్షలలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ప్రశ్నలకు శాసన సభలో చౌహాన్ సమాధానాలు (సమాచారం) ఇచ్చారు. కనీసం రెండు సందర్భాల్లో చౌహాన్ సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని పత్రికల నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఫిబ్రవరి 23, 2012 తేదీన విధాన్ సభ (మధ్య ప్రదేశ్ శాసన సభ) లో ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి చౌహాన్ సమాధానం ఇచ్చారు. నకిలీవిగా అనుమానిస్తున్న అభ్యర్ధుల సంతకాలు, ఫోటోలను రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించామని రెండో అభిప్రాయం కోసం వాటిని హైద్రాబాద్, చండీఘర్ లలోని ప్రతిష్టాత్మక ఫోరెన్సిక్ ల్యాబ్ లకు కూడా పంపించామని చెప్పారు.
విజిల్ బ్లోయర్ ఆశిష్ చతుర్వేదికి ఈ సమాధానంపై అనుమానం వచ్చింది. 2012లోనే ఆయన ఆర్.టి.ఐ చట్టం కింద హైద్రాబాద్, చండీఘర్ ఫోరెన్సిక్ ల్యాబ్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చౌహాన్ సభలో చెప్పినట్లుగా పరీక్షల కోసం సంతకాలు, ఫోటోలు ల్యాబ్ లకు చేరాయో లేదా చెప్పాలని కోరారు. తన లేఖకు ల్యాబ్ లనుండి వచ్చిన సమాధానం ఆయన అనుమానించినట్లే వచ్చింది.
“మా వద్ద ఉన్న రికార్డుల ప్రకారం మా డాక్యుమెంట్ డివిజన్ కు అలాంటి కేసుకు సంబంధించిన పత్రాలేవీ రాలేదు” అని హైద్రాబాద్ లోని ‘సెంటర్ ఫర్ ఫోరెన్సిక్ సైన్సెస్ లేబొరేటరీ’ సమాధానం ఇచ్చింది. ఒక వారం రోజుల తర్వాత చండీఘర్ ల్యాబ్ నుండి కూడా ఇదే సమాచారం చతుర్వేదికి అందింది.
బి.జె.పి ప్రతినిధి (spokesperson) జి.వి.ఎల్ నరసింహారావు ఆకుకు అందని పోకకు పొందని సమర్ధనను పత్రికలకు తన వంతు కృషిగా అందజేశారు. “కాంగ్రెస్ పార్టీ పాత వ్యవహారాలను లేవనెత్తుతోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన సమాచారం తప్పు అని తెలిస్తే ఆ విషయం ఏదో అసెంబ్లీలోనే అడగవచ్చు కదా!” అని జి.వి.ఎల్ కాంగ్రెస్ వాదనను తిప్పికొట్టారు. లేదా తిప్పి కొట్టానని భావించారు.
బి.జె.పి ప్రకారం పాత అంశాలను కొత్తగా లేవనెత్తి రచ్చ చేయకూడదన్నమాట! కానీ బి.జె.పి ప్రచార సామాగ్రి అంతా -పాత కూడా కాదు- ప్రాచీన అంశాలతో కూడినదే కదా! 2012 నాటి అంశమే పాతబడిపోతే బాబ్రీ మసీదు, సరస్వతి, రామ్ సేతు, ఉమ్మడి శిక్షా స్మృతి, ఆర్టికల్ 370, శ్రీకృష్ట జన్మస్ధానం…. ఇత్యాది అంశాలన్నీ ఎంత పాతవి కావాలి? పైగా వ్యాపం కుంభకోణంపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించి ఒక్క రోజే పూర్తయింది. అంతలోనే వ్యాపం ఎలా పాతబడిపోయింది? కాంగ్రెస్ కుంభకోణం అయితే దశాబ్దాల తరబడి సాగాలా? బి.జె.పి కుంభకోణం అయితే అసలు విచారణ మొదలు కాకముందే ముగిసిపోవాలా?
2011లో సి.ఎం చౌహాన్ సభకు మరో సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ప్రకారం 2007-2010 మధ్య కాలంలో రాష్ట్ర మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో ఏ ఒక్క అభ్యర్ధి తప్పుడు పద్ధతుల్లో సీటు సంపాదించలేదు. అక్రమంగా సీటు పొందిన ఏ ఒక్క అభ్యర్ధినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు.
“కానీ నవంబర్ 19, 2009లో ఎం.పి. నగర్ పోలీసులు 9 మంది నకిలీ అభ్యర్ధులను గుర్తిస్తూ కేసు పెట్టి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. 2010లో 40 మంది నకిలీ అభ్యర్ధులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి మాత్రం ఈ కేసులు నమోదైన సంవత్సరాల తర్వాత కూడా ఒక్క కేసూ నమోదు కాలేదని చెప్పి సభను తప్పుదోవ పట్టించారు” అని మధ్య ప్రదేశ్ విధాన్ సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సత్యదేవ్ కతారే చెప్పారు. వ్యాపం అధికారి ఫిర్యాదు అనంతరమే ఈ ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు కావడం విశేషం. కానీ చౌహాన్ రాష్ట్ర చట్ట సభకు తద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు.
ప్రతిపక్ష ఎం.ఎల్.ఏ ఒకరు మెడికల్, డెంటల్ కాలేజీ ప్రవేశాల అక్రమాలపై ప్రశ్నించడంతో ఆ అంశాన్ని పరిశీలించడానికి 2009 డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ పరిశీలనలో ఏ ఒక్క అభ్యర్ధి తప్పుడు పద్ధతుల్లో సీటు పొందినట్లు తెలియలేదని చౌహాన్ చెప్పారు. కానీ ఆయన చెప్పినదానికి విరుద్ధంగా ప్రభుత్వ సంస్ధ అధికారులే తప్పుడు ప్రవేశం పొందిన అభ్యర్ధులను కనిపెట్టి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ సైతం నమోదు చేశారు. 2014 జనవరిలో 1000 మంది నకిలీ అభ్యర్ధులు పరీక్షలు రాశారని సి.ఎం ఒప్పుకోవలసి వచ్చింది.
నవంబర్ 19, 2009 తేదీన నమోదైన ఎఫ్.ఐ.ఆర్ లో 9 మంది నకిలీ అభ్యర్ధులను గుర్తించినట్లు పేర్కొనగా మార్చి 31, 2011 తేదీన సభలో ‘ఒక్క నకిలీ అభ్యర్ధిని కూడా గుర్తించలేద’ని చౌహాన్ ప్రకటించారు. అభ్యర్ధుల సంతకాలు, ఫోటోలు నకిలీవో, అసలువో తెలుసుకోవడానికి రాష్ట్ర ల్యాబ్ లో పరీక్షించడంతో పాటు రెండో అభిప్రాయం కోసం హైద్రాబాద్, చండీఘర్ లలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పత్రాలు పంపామని ఫిబ్రవరి 23, 2012 తేదీన చౌహాన్ సభకు తెలిపారు. ఈ విధంగా ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి రెండు మార్లు తన ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారు.
మధ్య ప్రదేశ్ ను ఆగమేఘాలపైన అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ‘నీతిమంతమైన పాలన’ ఇలా ఉన్నది!
భూటన్‌లోని భూకంపాన్ని భూటన్ రాజుకన్నా ముందుగా పసికట్టి ట్వీటగల సమర్ధుడు మన ప్రధాని. ఆయనేమన్నా గత ప్రధానిలాగా ‘నికమ్మా’, ‘ఘూంగా’ అనుకున్నారా? ఆయ్!! మన ప్రధానిగారు ఇట్లాంటి తుఛ్ఛమైన విషయాలన్నింటిమీదా ఒకేసారి టోకుగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఆయనకు ఇలాంటి లౌకిక విషయాలన్నింటిమీదా స్పందించేంత తీరిక లేదంతే (ఆయన స్థాయి పై స్థాయి అన్నది దీనితోనైనా అర్ధం కాకుంతే మీకు నా సానుభూతి)! ఎందుకంటే ఆయన basically సమర్ధుడు మరియు మంచివాడు ఐన ప్రధాని. ఈలోగా మీరు ఆవేశ పడడం ఒక ‘దేశభక్తుడిగా’, ఒక హిందూత్వ వాదిగా మరియు ప్రధానిగారి ఘోరాభిమానిగా అనవసరమని నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నాను… ఉమ్ముతున్నాను… తున్నాను…. న్నాను… ను..
సర్, 10 రోజులకుపైగా అవుతోంది మీరు కొత్త టపాను ప్రచురించి.కారణాలు ఏమైనప్పటికీ ఇంతకాలం నిరీక్షించడానికి మాకు కొంచం ఇబ్బందిగానే ఉన్నది.మీ బ్లాగ్ లో ఈ కొత్త ఫార్మేట్,ముందరి ఫార్మేట్ కన్నా బాగుంది.కానీ,ఉన్న టపా నుండి ముందరి టపాకిగానీ లేదా వెనుక టపాకి గానీ చేరుకోవడానికి లింక్ లేనట్లుంది గమనించగలరు.
మూల గారు, టపా పేజీలో కుడివైపు సైడ్ బార్ లో మూడో అంశంగా ‘మార్గదర్శిని’ అని ఉంటుంది చూడండి. అక్కడ మీరు కోరిన లంకెలు ఉంటాయి.