వ్యాపం స్కాం: నిష్క్రియ, అబద్ధాలు, హత్యలు! -2


మొదటి భాగం తరువాత……

.

సాక్షులు, నిందితుల హత్యలు

కుంభకోణంలో అత్యంత దారుణమైన విషయం నిందితులు, సాక్షుల మరణాలు. సాక్షులను మాయం చేస్తే కేసు అనుకున్న విధంగా తిప్పుకోవచ్చన్నది పాత సూత్రమే. కానీ వ్యాపం కుంభకోణంలోని సాక్షులు, నిందితులు ఇరువురూ డజన్ల సంఖ్యలో అనుమానాస్పద రీతిలో మరణించడం -కనీసం సమీప గతంలో- ఎన్నడూ ఎరుగనిది. సంఘటిత నేరస్ధ ముఠాలు పధకం ప్రకారం పని చేస్తే తప్ప ఇలాంటి మరణాలు సాధ్యం కావు. అత్యున్నత స్ధాయిలో ఉన్న సాక్షులు, నిందితులు సైతం అనుమానాస్పద రీతిలో మరణించడం బట్టి అసలు నిందితులను కాపాడేందుకు ఏ స్ధాయిలో పధక రచన జరుగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు.

మధ్య ప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ ఇద్దరూ వ్యాపం కుంభకోణంలో నిందితులే. కాంట్రాక్టు టీచర్లు, కానిస్టేబుళ్ల నియామకంలో వీరు ఇరువురు తమ తమ అభ్యర్ధులకు సిఫారసు చేసి ఉద్యోగాలు ఇప్పించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గవర్నర్ కి వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలు లభ్యం కావడంతో ఆయనపై కేసు మోపి అరెస్టు చేసేందుకు ఎస్.టి.ఎఫ్ హై కోర్టు అనుమతి కోరింది. గవర్నర్ కి రాజ్యాంగ రక్షణ ఉంటుంది కనుక ఆయనను అరెస్టు చేయవద్దని చెబుతూ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను హై కోర్టు రద్దు చేసింది. అయితే విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది. శైలేష్ యాదవ్ అరెస్టు అవుతాడనగా మార్చి 25, 2015 తేదీన ఆయన తన బెడ్ రూమ్ లో చనిపోయి కనిపించారు. 50 సం.ల శైలేష్ మధుమేహ వ్యాధి పీడితుడని నిద్రలో మెదడుకు రక్తం ద్వారా తగిన మొత్తంలో ఆక్సిజన్ అందక చనిపోయి ఉండవచ్చని ఆయన కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా పత్రికలు తెలిపాయి. కానీ ప్రాధమిక పోస్ట్ మార్టం రిపోర్టులో ఆయన తలపై లోతైన గాయం ఉందని వెల్లడి అయింది. నౌకర్లు, చాకర్లు దండిగా ఉండే ఒక సంపన్న రాజకీయ నాయకుడు సమయానికి చూసేవారు లేక మధుమేహం వ్యాధితో చనిపోవడం సాధ్యమా? శైలేష్ కుటుంబ సభ్యులే ఇలాంటి కారణం చెప్పి నేరాన్ని కప్పిపుచ్చేటంతగా కుట్రపూరిత ఒత్తిడిలు ఎదుర్కొన్నట్లు ఇక్కడ స్పష్టం అవుతోంది.

25 యేళ్ళ నమ్రత దామోర్ ఇండోర్ మెడికల్ కాలేజీ విద్యార్ధిని. మొదటి సం.లో ఉండగా 2012లో ఉజ్జయినిలో రైల్వే ట్రాక్ పై శవమై తేలింది. మొదట శవం ఎవరిదో తెలియక పూడ్చిపెట్టిన పోలీసులు, ఆమె నమ్రత అని మృతదేహం ఫోటో చూసి కుటుంబ సభ్యులు గుర్తించడంతో శవం వెలికి తీసి అటాప్సి నిర్వహించారు. ఆమెది మొదట పోలీసులు హత్య అన్నారు. ఆ తర్వాత ఆత్మహత్య అని చెప్పి కేసు మూసేశారు. 2014లో ఆమె కూడా వ్యాపం కుంభకోణంలో నిందితురాలిగా వెల్లడి అయింది. దానితో ఆమె మరణంపై అనుమానాలు తలెత్తాయి. నమ్రత మరణంపై టి.వి టుడే విలేఖరి అక్షయ్ సింగ్ పరిశోధన ప్రారంభించాడు. జులై 4 తేదీన ఝాబువాలోని నమ్రత తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసి ఇంటినుండి బైటికి వస్తూ అకస్మాత్తుగా నురగలు కక్కుతూ కిందపడి చనిపోయాడు. గుండె ఆగి మరణించాడని పోస్ట్ మార్టం నివేదికలో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ అప్పటికే అక్షయ్ సింగ్ బెదిరింపులు ఎదుర్కొన్న వాస్తవం దృష్ట్యా నివేదికపై తీవ్ర అనుమానాలు కొనసాగుతున్నాయి. అక్షయ్ సింగ్ మరణం నేపధ్యంలో నమ్రత అటాప్సీపై డాక్టర్లు మళ్ళీ పోస్టుమార్టం చేశారు. ఆమెది ఆత్మహత్య కాదని హత్య చేశారని జులై 7, 2015 తేదీన వెల్లడి అయింది. నమ్రత మరణానికి ముందు పరీక్షల మాఫియాకి ఆమె తల్లి దండ్రులకు మధ్య ఘర్షణ జరిగిందని అక్షయ్ పరిశోధనలో తెలిసింది. నమ్రత దుస్తులపై వీర్యం మరకలు ఉన్నట్లు తేలడంతో ఆమెను మాఫియా సభ్యులు బ్లాక్ మెయిల్ చేసి, అత్యాచారం చేశారని, అనంతరం హత్య చేశారని విజిల్ బ్లోయర్ డా. ఆనంద్ రాయ్ ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక, వీర్యం మరకలు దానిని ధృవపరుస్తున్నాయి కూడా.

డా డి.కె.సకల్లే, డా. అరుణ్ శర్మలు జబల్పూర్ లో నేతాజీ మెడికల్ కాలేజీ డీన్ గా పని చేస్తూ అనుమాస్పద రీతిలో మరణించారు. తమ కాలేజీలో వ్యాపం కుంభకోణం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్ధుల జాబితాను తయారు చేస్తున్న క్రమంలోనే ఇద్దరూ చనిపోయారు. డా. సకల్లే అయితే అప్పటికే కొందరు విద్యార్ధులను తొలగించాడు. వారినుండి ఒత్తిడిలు తీవ్రం కావడంతో నెలరోజులు సెలవు పెట్టి ఇంటివద్ద ఉండిపోయారు. ఆయన ఇంటివద్ద ఉండగా జులై 4, 2014 తేదీన ఇంటివెనుక కాలిన గాయాలతో చనిపోయి కనిపించారు. ఆయన డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కానీ ఆత్మహత్య నోట్ ఏమీ దొరకలేదు. ఆత్మహత్య అనేందుకు తగిన సాక్ష్యాలు పోలీసులకే దొరకలేదు. డా. సకల్లే స్ధానంలో అరుణ్ శర్మ నియమితులయ్యారు. ఆయన కూడా అక్రమంగా సీట్లు పొందిన విద్యార్ధులను గుర్తించే పనిలో నిమగ్నం అయిన నేపధ్యంలో ఢిల్లీలో ఓ హోటల్ గదిలో చనిపోయి కనిపించారు. హత్య అని గుర్తించేందుకు ఆధారాలు దొరకలేదని ఢిల్లీ పోలీసులు ప్రకటిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు నరేంద్ర మోడి ప్రభుత్వానికి జవాబుదారీ వహిస్తారు. ఎ.ఎ.పి ప్రభుత్వంపై కేంద్రం సాగిస్తున్న వేధింపులలో ప్రధాన ఉపకరణం ఢిల్లీ పోలీసులే. కనుక ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపై అనేక అనుమానాలు ఉన్నాయి.

అంతుచిక్కని చావులు:

ఇవి పత్రికల దృష్టిని ఆకర్షించిన హై ప్రొఫైల్ మరణాల్లో కొన్ని. ఛోటా బ్రోకర్లుగా వ్యవహరించిన వారిలో పలువురు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. కొందరి శవాలు మనుషులు సంచరించని చోట్ల దొరికాయి. కొందరు ఏదో ఒక జబ్బుతో చనిపోయారు. ఆ జబ్బులకు చికిత్స ఉన్నప్పటికీ, చికిత్స పొందగల శక్తి ఉన్నప్పటికీ వారు చనిపోతారు. ఇంకొందరు అకస్మాత్తుగా కారణాలు తెలియకుండా ఆత్మహత్య చేసుకుంటారు. వారికి డిప్రెషన్ వ్యాధి ఉన్నట్లు అప్పుడే కనిపెడతారు. 2009 చివరిలో మొదలైన మరణాలు ప్రతి యేడూ పెరుగుతూ వచ్చాయి. 2015లో ఇప్పటివరకు డజనుకు పైగా చనిపోయారు. లెక్కతేలినవారు 42 మంది ఉండగా అధికారికంగా గుర్తించని హత్యలు ఇంకా ఉన్నాయని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.

వరుసగా హత్యలు జరుగుతున్న నేపధ్యంలో విజిల్ బ్లోయర్లు డా. ఆనంద్ రాయ్, ఐ.టి నిపుణుడు ప్రశాంత్ పాండే, సామాజిక కార్యకర్త ఆశిష్ చతుర్వేది పలుమార్లు బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఆశిష్ చతుర్వేది 2003-2013 మధ్యలో జరిగిన మెడికల్, పి.జి అడ్మిషన్ లలో 5,000 అడ్మిషన్లపై విచారణ చేయాలని పిటిషన్ వేశాడు. దానితో ఆయనకు క్రమం తప్పకుండా బెదిరింపులు వస్తున్నాయి. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరగా నెలకు 50,000 కట్టాలని వారు షరతు విధించారు. (ఆశిష్ నెలసరి ఆదాయమే 38,000/-) అంత డబ్బు లేకపోవడంతో ఆయనకు రక్షణ దక్కలేదు. డా. ఆనంద సాగర్ కు ఒక కానిస్టేబుల్ ను ఇచ్చారు. ప్రశాంత్ పాండేను పోలీసులే అరెస్టు చేసి బెదిరించడం విశేషం. కుంభకోణంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హతం ఉందని గట్టిగా చెబుతూ కోర్టుకు సాక్ష్యాలు కూడా ఇచ్చినందునే ఆయనకి ఆ దుస్ధితి ఎదురయింది.

బడా బ్రోకర్ లలో ఒకరైన సుధీర్ శర్మ అనే నిందితుడి కంప్యూటర్ లోని సమాచారాన్ని సంగ్రహించి వెలికి తీయడంలో ప్రశాంత్ పాండే ఎస్.టి.ఎఫ్ పోలీసులకు సహకరించాడు. సదరు కంప్యూటర్ లో దొరికిన ముఖ్యమైన పత్రం ఒక ఎక్సెల్ షీట్. ఈ పత్రంలో ఎవరెవరు అక్రమంగా సీట్లు, ఉద్యోగాలు పొందారో, వారిని సిఫారసు చేసింది ఎవరో వివరాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఈ పత్రాన్ని ప్రశాంత్ పాండే తన స్వాధీనంలో ఉంచుకుని పత్రికలకు వెల్లడి చేశాడు. ముఖ్యమంత్రి చౌహాన్, గవర్నర్ యాదవ్, ఆయన పుత్రుడు శైలేష్, చౌహాన్ భార్య సాధనా సింగ్, హోమ్ మంత్రి బాబూలాల్ గౌర్ తదితర అనేకమంది మంత్రులు, బ్యూరోక్రాట్ అధికారులు, సంపన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అక్రమంగా సిఫారసు చేసినవారిలో ఉన్నారని ప్రశాంత్ పాండే వెల్లడి చేశాడు. చిత్రం ఏమిటంటే పాండే వెల్లడి చేసిన ఎక్సెల్ పత్రంలో ముఖ్యమంత్రి పేరు ఉండగా ఎస్.టి.ఎఫ్ దగ్గర ఉన్న అదే ఎక్సెల్ పత్రంలో ఆయన పేరు మాయం అయింది. కంప్యూటర్ నుండి పత్రాన్ని స్వాధీనం చేసుకున్నాక ముఖ్యమంత్రిని కాపాడేందుకు దాన్ని సవరించారని పాండే ఆరోపిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఫోరెన్సిక్ నిపుణులు పాండే వద్ద ఉన్న ఎక్సెల్ పత్రమే నకిలీదని కోర్టులో చెప్పడంతో హై కోర్టు దానికి అనుగుణంగా తీర్పు చెప్పింది. కానీ ప్రైవేటు ఐ.టి నైపుణ్య సంస్ధ ‘ట్రూత్ లాబ్స్’ పాండే వద్ద ఉన్న పత్రమే అసలుది అని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఫోరెన్సిక్ నిపుణులు సైతం రాష్ట్ర ప్రభుత్వం జేబులో ఉన్నారని దీనితో స్పష్టం అయింది.

యువ సాహసికులు

ఈ నేపధ్యంలో విజిల్ బ్లోయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జడ్జిల పిల్లలు కూడా అక్రమంగా సీట్లు పొందినందున మధ్య ప్రదేశ్ హై కోర్టు విచారణపై తమకు నమ్మకం లేదని సుప్రీంకు విన్నవించారు. కాంగ్రెస్ నేత మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా మరో పిటిషన్ వేశారు. సి.బి.ఐ చేత విచారణ చేయించాలని కోరారు. అయితే సి.బి.ఐ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నందున సి.బి.ఐ విచారణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరగాలని విజిల్ బ్లోయర్లు కోరుతున్నారు. వారి కోరిక న్యాయమైనది. వారి పిటిషన్లతో పాటు మధ్య ప్రదేశ్ గవర్నర్ ను తొలగించాలన్న పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ జులై 9 తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు ‘ఇక ముందు ఒక్క హత్య కూడా జరగడానికి వీలు లేదని’ శాసనం లాంటి ఆదేశాన్ని జారీ చేశారు. మధ్య ప్రదేశ్ హై కోర్టు విచారణ తీరును కూడా సుప్రీం కోర్టు అభిశంసించడం విశేషం.

ఆరున్నర దశాబ్దాల భారత స్వతంత్రం స్ధానిక సంస్ధలు, రాష్ట్రాల శాసన సభలు, బ్యూరోక్రటిక్ వ్యవస్ధ, పార్లమెంటు, రాష్ట్రపతి, పోలీసులు, సి.బి.ఐ, హై కోర్టులు… ఇలా అన్ని గేట్లూ దాటుకుని ఇప్పుడు సుప్రీం కోర్టు గేటు ముందు శరణు వేడుతోంది. నాలుగు స్తంభాలపై నిలబడవలసిన ప్రజాస్వామ్య వ్యవస్ధ ఒంటి స్తంభం మేడగా మారి 120 కోట్ల ప్రజా సామాన్యాన్ని ‘ఎవరు నీకు దిక్కంటూ’ వెక్కిరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజానేతలు కూర్చునే దేవాలయంగా చెప్పే చట్ట సభలు వాస్తవంగా ఎవరికి రక్షకులో ఈ దీన పరిస్ధితి స్పష్టంగా విప్పి చూపుతోంది. కిందినుండి మీదివరకు దొంతర దొంతరలుగా ఏర్పరచిన అధికార, రాజకీయ, రక్షణ, న్యాయ వ్యవస్ధలన్నీ విధి నిర్వహణలో విఫలం అవడం కాదు, నేరుగా మాఫియా సామ్రాజ్యాలతో భుజం కలిపి వికటాట్టహాసం చేస్తుంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘ఇకపై ఒక్క హత్యా జరగడానికి వీలు లేదు’ అని శాసించి అది అమలవుతుందని హామీ ఇస్తే అందుకు భారత ప్రజలు వెర్రి వాజమ్మలై నమ్మి తలలూపాలా? సుప్రీం కోర్టు ఆదేశాలు ఏ తీరులో అమలవుతాయో ఒక్క ‘ఆధార్ కార్డు వ్యవహారం’ సరిపోతుంది. ఆధార్ కార్డుతో ప్రభుత్వ సేవలు ఏ ఒక్కదానినీ అనుసంధానించడానికి వీలు లేదు అని సుప్రీం కోర్టు ఎన్నిసార్లు గర్జించలేదు? సుప్రీం అధిపతులు ఎన్నిసార్లు గాండ్రించినా రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని ఆపిన పోలీసు కానిస్టేబుల్ సైతం ఆధార్ కార్డు చూపాలని అడుగుతున్న పరిస్ధితి నెలకొని ఉన్నదే! ఈ రోజు ఆధార్ కార్డు అడగని ఒక్క ప్రభుత్వ అంగమూ, సంస్ధా లేకపోయింది. ఇదంతా సుప్రీం అధిపతులకు తెలియదా?

పత్రికల ధోరణి

ప్రజాస్వామ్య సౌధాన్ని నిలిపి ఉంచే నాలుగో స్తంభంగా భావించే పత్రికలు కూడా మిగిలిన మూడు స్తంభాలైన రాజకీయులు (చట్ట సభలు), బ్యూరోక్రట్లు, కోర్టులతో కుమ్మక్కైనప్పుడు కుంభకోణాలు ఏళ్ల తరబడి కూడా కొనసాగుతాయని వ్యాపం కుంభకోణం రుజువు చేస్తోంది. నాలుగో స్తంభాన్ని పోషిస్తున్నదే మొదటి మూడు స్తంభాలు కనుక అది సహజంగానే మూడు స్తంభాలకు కట్టుబడి పని చేస్తుంది. రిలయన్స్ కంపెనీ ఆధీనంలోని పత్రికలు, ఛానెళ్లు వ్యాపం కుంభకోణాన్ని విమర్శిస్తున్నట్లు కనిపిస్తూనే ‘గతంలో ఇలాంటివి ఎన్ని జరగలేదు’ అన్న వాదనను ముందుకు తెస్తున్నాయి. ఇతర కుంభకోణాలను ఒక పద్ధతి ప్రకారం ప్రస్తావిస్తూ అంతకంటే ఇది దారుణం ఏమీ కాదన్న ఆలోచనను పాఠకుల్లో చొప్పించేందుకు కృషి చేస్తున్నాయి.

“ఏ కుంభకోణం అయినా ప్రజా ధనాన్ని స్వాహా చేసేదే. ప్రతి కుంభకోణంలోని నిందితులను పట్టుకుని చట్టం ప్రకారం శిక్షించాలి” అన్న ప్రజాస్వామిక అవగాహనను, బాధ్యతను విస్మరిస్తున్నాయి. కొన్ని పత్రికలు నామమాత్రంగా ప్రస్తావించి వదిలేస్తున్నాయి. చాలా పత్రికలు నిన్న మొన్నటివరకు అలాంటి కుంభకోణం ఒకటి ఉందన్న సంగతే తెలియనట్లు నటించాయి. జూన్, జులై నెలల్లో నిందితులు, సాక్ష్యులు వరుసపెట్టి అనుమానాస్పద పరిస్ధితుల్లో మరణించడంతోనే కుంభకోణం వార్తలను కవర్ చేయక తప్పని పరిస్ధితి చాలా పత్రికలకు వచ్చిపడింది. శ్రీ శ్రీ చెప్పిన ‘పత్రికలు పెట్టుబడిదారీ విష పుత్రికలు’ అన్న పరిశీలనను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అలాగని పత్రికలు అంటేనే ‘విష పుత్రికలు’గా భావించనవసరం లేదు. వర్గ వ్యవస్ధలో శ్రామిక వర్గాల ప్రయోజనాల కోసం పని చేసే పత్రికలను ఆదరించి ప్రోత్సహిస్తే విష పుత్రికలు మరీ అడ్డగోలుగా కుంభకోణాల్ని కొట్టిపారేసే సాహసానికి పూనుకోవు.

వేళ్లూనుతున్న ఫాసిజం

పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధ సంక్షోభంలో కూరుకుపోయి బైటపడే మార్గం కనుమరుగయ్యే కొద్దీ, ప్రజల్లో అసంతృప్తి సెగలు వేడి పుంచుకునే కొద్దీ పాలక వ్యవస్ధలు ఫాసిస్టు స్వభావం సంతరించుకుంటాయి. అమెరికా మొదలుకొని ఉక్రెయిన్ వరకూ ఈ అంశాన్ని మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తున్నాయి. అమెరికాలో అట్టడుగున ఉన్న నల్లజాతి ప్రజలు ప్రతిరోజూ ఏదో ఒక పేరుతో పాశవిక హత్యలకు గురవుతుంటే ఉక్రెయిన్ లో ఆ అమెరికా మద్దతుతోనే ఫాసిస్టు నాజీ భావాలు కలిగిన గ్రూపులు ప్రభుత్వం నడుపుతున్నాయి. ఉక్రెయిన్ ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని అంతర్యుద్ధాన్ని అక్కడి పాలకులు తమ ప్రజలపై రుద్దుతూ కడగళ్లకు గురి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అమెరికా సామ్రాజ్యవాద ద్రవ్య కంపెనీల మద్దతుతో భారత దేశ పార్లమెంటును హిందూత్వ శక్తులు స్వాధీనం చేసుకోవడం కాకతాళీయం కాదు.

అమెరికా సామ్రాజ్యవాదం తన సంక్షోభాన్ని ప్రపంచం పైన రుద్దుతుంది. ఈ యజ్ఞంలో ఇండియా లాంటి జూనియర్ భాగస్వాములు పావులుగా మారితే అక్కడి ప్రజలు శలభాల్లా మాడిపోతుంటారు. నానాటికీ కుచించుకుపోతున్న దేశీయ మార్కెట్ వల్ల వృద్ధి పడిపోతుండడంతో స్వదేశంలో ప్రజల సదుపాయాలను స్వాధీనం చేసుకుంటూ ఇండియా లాంటి మిత్ర దేశాల్లోనూ ప్రజలకు సంబంధించిన వ్యవస్ధలను స్వాధీనం చేసుకుని తన మార్కెట్ కు అనువుగా మార్చాలని శాసిస్తోంది. సదరు శాసనాలకు అనుగుణంగానే నరేంద్ర మోడి ప్రభుత్వం స్వదేశీ, విదేశీ విధానాలు రూపుదిద్దుకున్నాయి.

ఈ నేపధ్యంలో తగిన మార్గదర్శకత్వం సమకూర్చి గద్దెపై కూర్చుండబెట్టిన మోడీ ప్రభుత్వం విదేశీ ప్రభువుల ఆదేశాలను (నూతన ఆర్ధిక విధానాలను) అనుకున్నట్లుగా అమలు చేయలేని పరిస్ధితిని ఎదుర్కొంటోంది. దానితో అమెరికా, పశ్చిమ రాజ్యాల నుండి ఒత్తిడిలు తీవ్రం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో బి.జె.పి ప్రభుత్వం అప్రతిష్టపాలు కావడం ఎంతమాత్రం సహించలేని వ్యవహారం. ఆరు నూరైనా తమ ప్రతిష్ట మసకబారకుండా కాపాడుకోవలసిన బాధ్యత బి.జె.పి నేతలపై మోపబడుతోంది. ఈ వైరుధ్యాన్ని గత యు.పి.ఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పధకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం తదితర ముసుగులు తొడగడం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసింది. అవి విఫలం అయ్యాయని వాటి స్ధానంలో ‘దండాయుధ’ పాలన రావాలని పశ్చిమ సామ్రాజ్యవాదులు ఆశించారు.

సదరు దండాయుధ పాలనలో భాగమే బి.జె.పి నేతృత్వంలోని మధ్య ప్రదేశ్ లో విచక్షణా రహితంగా వరుసపెట్టి సాగుతున్న హత్యలు. సాధారణంగా ఇలాంటి కుంభకోణాల సమస్యలను కమిటీల కంటితుడుపు విచారణలతో, ఏళ్ల తరబడి సాగే కోర్టు కేసులతో పాలకులు పరిష్కరించుకుంటారు. కానీ ఆ ఆయుధాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాడిపారేసింది. అవి ప్రజలను మభ్యపుచ్చేందుకు పెద్దగా పనికిరావు. ఇక మిగిలింది దండాయుధమే. వ్యవస్ధలో చెడుగులపై నామమాత్రంగా తిరుగుబాటు చేసే శక్తులను సైతం సహించే స్ధితిలో మన పాలకులు గానీ వారి వెనుక ఉన్న సామ్రాజ్యవాదులు కానీ లేరు. అడ్డు వచ్చినవారిని నిర్దాక్షిణ్యంగా నిర్మూలిస్తే ఇంకెవరూ నోరు తెరిచే సాహసం చెయ్యరు. ఫాసిస్టుల లక్షణాల్లో ఇది ఒకటి. తన ఫాసిస్టు స్వభావాన్ని హిందూత్వ శక్తులు ఇప్పటికే రుజువు చేసుకున్నాయి. గుజరాత్ అల్లర్లు మొదలుకొని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన స్వల్ప స్ధాయి టెర్రరిస్టు పేలుళ్లు, ముజఫర్ నగర్ హత్యాకాండ, ఢిల్లీ మత కొట్లాటల వరకూ హిందూత్వ కీర్తి కిరీటంలో కలికితురాళ్లే.

అయితే హిందూత్వ నేతలు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తున్నారా? అని అడిగితే అది అమాయకత్వమే అవుతుంది. దగ్గరుండి చేశారా, దూరం నుండి చేశారా అన్నది సమస్య కాదు. ఇదంతా దేశంలోని గాలిని ఒక భయోత్పాతమైన భావజాలంతో నింపే ప్రయత్నంలో భాగంగా చూడకపోతే మన పరిశీలన విజిల్ బ్లోయర్ల వలె కోర్టు మెట్లవద్దకు వెళ్ళి ఆగిపోతుంది. దేశంలో మళ్ళీ ఎమర్జెన్సీ విధించబోరన్న గ్యారంటీ లేదని సాక్ష్యాత్తూ బి.జె.పి భీష్మాచార్యుడు ఎల్.కే.అద్వానీయే వ్యాఖ్యానించారంటే ఏమిటి అర్ధం? యేళ్లతరబడి సాగిన కుంభకోణాన్ని అన్నే యేళ్ళ తరబడి సాగుతున్న హత్యలతో మాఫీ చేయాలని చూసే నేరమయ దుస్ధితిని వ్యవస్ధాగత దృక్పధంతో చూడలేకపోతే కారణాలు అంతుబట్టవు. పరిష్కారాలు అసలే దొరకవు. కావున ప్రజలు జాగ్రత్త పడాలి. వచ్చిపడుతున్న ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.

………………అయిపోయింది.

4 thoughts on “వ్యాపం స్కాం: నిష్క్రియ, అబద్ధాలు, హత్యలు! -2

  1. లొక్ సభ ఎన్నికలలో స్వదేశీ,విదేశీ సామ్రాజ్యదాదుల ప్రొద్భలంతో పూర్తీమెజారిటీతో గద్దెనెక్కిన బి.జె.పి/ఎన్.డి.ఎ/మోదీ ప్రభుత్వం ఇలా వరుస కుంభకోణాలతో తన గోతినితానే తవ్వుకుంటున్నప్పుడు దానిని పూడ్చడం ప్రస్తుతానికి కాంగ్రేస్ వల్ల అయ్యేపనికాదు, ఆ స్థానాన్ని భర్తీచేయడానికి భస్వామ్యలక్షణాలు దండిగా ఉన్న ప్రంతీయ పర్టీలు ముందుకు వస్తాయి. ఇలా రాజ్యంలోని తమ ప్రయోజనాలను నెరవేచుకొనే గ్రూపులే ఉన్నాయిగానీ,ప్రజలపక్షాన నిలబడగల గ్రూపుల ఉనికి చాలా చాలా తక్కువుగా ఉంది(నిజానికి లేదనడం సరిపోతుందేమో).

    నిజమే ప్రభుత్వంలోని పెద్దతలకాయల పాత్రలేకుండా వ్యాపంకుంభకోణం జరిగే ప్రసక్తేలేదు.లేకపోతే ఇలా 60 పైగా అనుమానస్పదంలో,ఒక పద్ధతిప్రకారం హత్యలుజరిగే అవకాశమేలేదు.అంతేకాకుండా మీరు తెలిపినట్లు బి.జె.పి పై పడినమరకలను ఏదో ఒక విధంగా(దేనికైనా తెగించి) కప్పిపుచ్చడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పస్టమౌతుంది.

    వ్యాపం కుంభకోణంలో దాదాపు రూ.2000 కోట్లకుపైగా,గత 20 సం,, నుండి జరుగుతుందంటే ఎంతగా వ్యవస్థీకృతం చేశారో తెలుస్తుంది. ఈ వ్యాపం కుంభకోణంలో మధ్యతరగతి ప్రజల నుండి ఉన్నతధనిక వర్గం వరకు అవినీతిలో భాగస్వామ్యం కావడం విచిత్రం ఏమీ అనిపించలేదు. ఎందుకంటే సాధారణంగా కుంభకోణమంటే ఉన్నతవర్గీయుల పాత్రే అధికంగా ఉంటుందని భావిస్తాం.కానీ,అవినీతిని అన్ని స్థాయిలలో పైనుండి వ్యవస్థీకృతం గావించినపుడు దానిలోకి సాధారణ ప్రజానీకానికి పాత్ర కల్పించకుండా ఉండదుకదా! ఈ లక్షణాలవలనే అవినీతిని కుంభకోణాలని ప్రజలు తేలికగా తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితిలో ఉన్నాము.

    వరుసగా మూడవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై కొనసాగుతున్న చౌహాన్,తాను నిజాయితీ పరుడనని బి.జె.పి లోని అగ్రనాయకత్వమ్నుండి సర్టిఫికేట్ అందుకోవడం ఎందుకంటే అదికేవలం మోదీకి పోటీగా నిలపడానికితప్ప మరొకటికాదు. ఈ కుంభకోణంలో దొంగకే తాళం అప్పగించితే ఆ దొంగను పట్టుకొనేదెవరు?

    రాజ్యం ఎన్ని వెర్రితలలు వేస్తుందో ప్రతిభింబించేందుకు ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ కనిపిస్తోంది. పౌరుల రక్షణకు ఉపక్రమించవలసిన ప్రభుత్వం(రాజ్యంలోని ఒకభాగం) అందుకు చార్జీలు ప్రత్యక్షంగా వసూలు చేయడాన్ని ఏమనాలి? ధనిక వర్గం వారు ప్రజలకుదూరంగా తమ రక్షణకు ప్రైవేట్ సైన్యాన్ని మోపుతున్నట్లు,సామన్య ప్రజానీకం కూడా అలానే మేపాలనుకోవడం ఏమిటి?విచిత్రం కాకపోతే.

    వీళ్ళు హిందుత్వనేతలు,ప్రతినిధులు ఏమిటి? వీళ్ళకా హక్కు ఎవరిచ్చారు? దేశంలో ఉన్న 70 కోట్లకుపైగా ఉన్న హిందువుల బాగోగులు వీళ్ళకు ఎప్పుడైనా పట్టిందా?వాళ్ళ సంక్షేమంకోసం ఏమిచేశారు? వీళ్ళు మతంపేరు చెప్పుకొంటున్న అతివాద గ్రూపులు.అంతేగానీ హిందుత్వ ప్రతినిధులు ఎప్పటికీ కారు.

  2. “తన ఫాసిస్టు స్వభావాన్ని హిందూత్వ శక్తులు ఇప్పటికే రుజువు చేసుకున్నాయి”
    ఎవరో తమ స్వలాభాలకోసం చేసే పనిని హిందూ మతానికి ఆపాదించడం ఎంత వరకు సబబు..

  3. నారాయణ గారు నేను హిందు మతాన్ని ఏమీ అనలేదు. హిందూత్వ, హిందూ మతం వేరు. మొదటిది రాజకీయాలు, అణచివేతకు సంబంధించినది. రెండోది ప్రజల నమ్మకం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s