తమది నీతిమంతమైన పాలన అంటూ ప్రధాని నరేంద్ర మోడి చెప్పుకునే గొప్పలను నిలువునా చీరేస్తూ బి.జె.పి ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. యు.పి.ఏ పాలనలో అవినీతి కుంభకోణాలు వెలుగు చూసేందుకు మూడు నాలుగు సంవత్సరాల సమయం తీసుకుంది. యు.పి.ఏ రికార్డును ఎన్.డి.ఏ-2 తిరగరాసింది. యు.పి.ఏ/కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని కుంభకోణాలే పెట్టుబడిగా అధికార లాభం సంపాదించిన ఎన్.డి.ఏ-2/బి.జె.పి సంవత్సరం తిరక్కుండానే తనకు, కాంగ్రెస్ కు ఎంతమాత్రం తేడా లేదని వేగంగా రుజువు చేసుకుంటోంది. కాంగ్రెస్ అవినీతిపై అలుపు లేకుండా ఛీత్కారాల వర్షం కురిపించే నరేంద్ర మోడి, వెంకయ్య నాయుడు తదితర హిందూత్వ నేతలు కాంగ్రెస్ అవినీతి రికార్డులను బద్దలు కొడుతున్న తమ ప్రతిభా సంపత్తులపై మాటలుడిగి విలేఖరులకు సైతం అందడం లేదు. సుష్మా స్వరాజ్-లలిత్ మోడిల అనైతిక, క్విడ్-ప్రొ-కొ (పాస్ పోర్ట్) కుంభకోణంపై నోరు మెదపని ప్రధాన మంత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత్ర వహించిన వ్యాపం కుంభకోణంపై మాట్లాడగలరా అన్నది అనుమానమే.
వ్యాపం అంటే!
వ్యాపం అంటే వ్యాపకమో వేపకాయో కాదు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. సంస్ధ పేరు హిందీలో ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్’. ఈ హిందీ పేరులోని పొడి అక్షరాలను ఆంగ్లంలో రాసుకుని వాటిని కలిపి చదువుతూ vyapam అని సంబోధిస్తున్నారు. ఆంగ్లంలో దీని పేరు: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు. పొడి అక్షరాల్లో చెప్పుకుంటే.. ఎం.పి.పి.ఇ.బి. ప్రి-ఇంజనీరింగ్, ప్రి-మెడికల్, ఎం.సి.ఏ మొదలైన కోర్సులతో పాటు ఉపాధ్యాయులు, పోలీసులు, ఫారెస్టు గార్డులు మొదలైన ఉద్యోగాల అభ్యర్ధులకు కూడా పరీక్షలు నిర్వహించడం ఈ సంస్ధ పని.
సంస్ధలోని ఉన్నతాధికారులు అనేక అవకతవకలకు పాల్పడుతూ పరీక్షలను, పరీక్ష పత్రాలతో పాటు అభ్యర్ధులను కూడా భారీ మొత్తంలో రిగ్గింగ్ చేస్తున్నట్లు 2013లో వెలుగులోకి వచ్చింది. అవకతవకలు అంటే సాధారణమైనవి కాదు. అసాధారణ అవకతవకలు! అసాధారణ అవకతవకలు కనుక లంచాలుగా ముట్టిన సొమ్ము కూడా ఆసాధారణ మొత్తంలోనే ఉన్నది. జులై 4 తేదీనాటి ది హిందు పత్రిక సంపాదకీయం ప్రకారం కుంభకోణంలో చేతులు మారిన మొత్తం రు. 2,000 కోట్లకు పై మాటే. దాదాపు 6 సంవత్సరాలుగా ఈ కుంభకోణం జరుగుతోందని నిజానికి అంతకంటే ఎక్కువ కాలం క్రితమే ఈ భారీ కుంభకోణానికి పునాదులు పడినట్లు కనిపిస్తోందని సదరు సంపాదకీయం విశ్లేషించడం బట్టి కుంభకోణం విస్తృతిని అర్ధం చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే కుంభకోణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కర్తవ్య బలగం (స్పెషల్ టాస్క్ ఫోర్స్ –ఎస్.టి.ఎఫ్) 2013 అక్టోబర్ లో దాఖలు చేసిన చార్జి షీటులో నిందితులు 3,292 రకాల నేరాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ చార్షి షీటులో భాగంగా 92,176 పత్రాలను ఎస్.టి.ఎఫ్ హై కోర్టుకు సమర్పించింది. ఎస్.టి.ఎఫ్ ను నియమించి ఆమూలాగ్రం దర్యాప్తు చేయించింది తానే కనుక విచారణ క్రెడిట్ తనకే దక్కుతుందని కనుక కుంభకోణంలో తన పాత్ర లేదని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నమ్మబలుకుతున్నాడు. కానీ కుంభకోణాన్ని వెలికి తీయడంలో కీలకపాత్ర పోషించిన పలువురు కార్యకర్తలు, ప్రముఖులు మాత్రం ముఖ్యమంత్రితో విభేదిస్తున్నారు. అందుకు సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. కానీ అధికార బలం, అంగబలం అన్నీ జేబులో ఉంచుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ నేరం తనమీదికి రాకుండా అన్ని పావుల్ని వినియోగిస్తున్నాడని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
జైల్లో ఉన్న నిందితులు, జైలు బయట ఉన్న సాక్ష్యులు కూడా అనేకమంది అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోతుండగా, బతికి ఉన్నవారికి క్రమం తప్పకుండా బెదిరింపులు వస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 27 నుండి 35 మంది వరకు అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోయారు. అనధికారికంగా వారి సంఖ్య 50కి పైనే. బెదిరింపుల ఫలితంగా పోలీసు రక్షణ కోరుతున్న స్వచ్ఛంద కార్యకర్తలకు రక్షణ ఇచ్చినట్లే ఇచ్చి తొలగిస్తున్నారు. నెలవారీ రక్షణ ఖర్చులను బాధితులపైనే మోపుతూ రక్షణ లేకుండా చూస్తున్నారు. చివరికి హై కోర్టు తీర్పులు, రూలింగ్ లు కూడా అంతిమంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా వస్తుండడంతో స్వచ్ఛంద కార్యకర్తలు, విజిల్ బ్లోయర్లు (ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో భాగంగా ఉంటూ అక్రమాలను బైటికి చెప్పేవారు) భయాందోళనలతో గడుపుతున్నారు. తమకూ త్వరలోనే చావు ఖాయం అని బహిరంగంగానే చెబుతున్నారు.
కుంభకోణం ఎలా జరిగింది?
వ్యాపం సంస్ధ పైన అవకతవకల ఆరోపణలు ఇప్పటివి కాదు. 1995 ప్రాంతంలోనే ఆరోపణలు మొదలయ్యాయి. కానీ అప్పట్లో ఇంత భారీ మొత్తంలో అక్రమాలు చోటు చేసుకోలేదు. మొదట ఒకటీ, అరా జరగడం, అవి బైటపడకపోవడంతో అక్రమాల పరిమాణం కాస్త పెరిగింది. ఆరోపణలు వచ్చినా ప్రభుత్వాలు వాటిని తోసిపుచ్చాయి. అడపాదడపా ఎఫ్.ఐ.ఆర్ లు దాఖలు కావడం చివరికి నిర్దోషులుగా విడుదల కావడంతో రాకేటీర్లకు శక్తి వచ్చింది. ఎవరూ ఏమీ చేయలేరన్న నమ్మకం పెరిగింది. 2003 నుండి నడుస్తున్న బి.జె.పి సుదీర్ఘ పాలనలో వారి శక్తి పరిమితులు దాటిపోయింది. ఒక పద్ధతి ప్రకారం పెద్ద మొత్తంలో పరీక్షలను, పరీక్ష పత్రాలను రిగ్గింగ్ చేసే ఆర్గనైజ్డ్ వ్యవస్ధ నిర్మితం అయింది. ఈ వ్యవస్ధ ఛోటా మోటా బ్రోకర్లు మొదలుకొని, కోటీశ్వరులైన మధ్యవర్తుల మీదుగా అత్యున్నత రాజకీయ అధికారం నెరిపేవారి వరకూ విస్తరించింది. తగిన అర్హతలు లేకున్నా వివిధ కోర్సుల్లో సీట్లు కావాలనుకునే సంపన్న పరీక్షార్ధులు, పోటీ పరీక్షల్లో నెగ్గలేక అడ్డదారులు వెతికే ఉద్యోగార్ధులు, వారికి అందుబాటులో ఉండే చిన్నా, పెద్దా మధ్యవర్తులు, వ్యాపారులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కైన ఫలితమే వ్యాపం కుంభకోణం.
నిందితుల కంప్యూటర్ లలోని సమాచారాన్ని వెలికి తీసి విశ్లేషించడంలో సహకరించిన ఐ.టి. నిపుణుడు, ఆ తర్వాత విజిల్ బ్లోయర్ గా మారిన ప్రశాంత్ పాండే ప్రకారం కుంభకోణం ప్రధానంగా మూడు పద్ధతుల్లో జరిగింది.
ఒక పద్ధతి, పరీక్ష రాసేవారిని మార్చివెయ్యడం. ఈ పద్ధతిలో అడ్మిట్ కార్డులను ముఖ్య సాధనంగా వినియోగించారు. అక్రమంగా సీటు లేదా ఉద్యోగం సంపాదించాలనుకున్నవారు మామూలుగానే అందరితో పాటు దరఖాస్తు చేస్తారు. వారి ఫోటోలు అవీ దరఖాస్తులపై ఉంటాయి. అడ్మిట్ కార్డు పైన కూడా వారి ఫోటో ఉంటుంది. సరిగ్గా పరీక్ష జరగడానికి ముందు అడ్మిట్ కార్డులోని ఇతర సమాచారాన్ని అలాగే ఉంచి అభ్యర్ధి ఫోటో మార్చేవారు. అభ్యర్ధి ఫోటో స్ధానంలో తాము ముందే మాట్లాడుకుని ఉంచుకున్న తెలివైన అభ్యర్ధులు లేదా అప్పటికే ఆ సీటు లేదా ఉద్యోగం పొందినవారి ఫోటోని అతికిస్తారు. ఆ విధంగా అసలు అభ్యర్ధికి బదులు సమాధాన పత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగల వ్యక్తులు పరీక్ష రాసేస్తారు. పరీక్ష ముగిసిన అనంతరం అక్రమ రాతగాడి ఫోటోను తొలగించి మళ్ళీ అసలు అభ్యర్ధి ఫోటోని అతికించేవారు. ఈ తప్పుడు పనికి, తప్పుడు పనిని నివారించవలసిన బోర్డు ఉన్నతాధికారులే నిర్వహించారు. పరీక్ష రాసినందుకు తగిన మొత్తం రాసినవారికి ముడుతుంది. ఈ మొత్తం పరీక్షను బట్టి 50,000 నుండి 4 లక్షల వరకు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే అక్రమ అభ్యర్ధి ఇచ్చేది ఇంతే మొత్తం కాదు. అక్రమంగా సీటు లేదా ఉద్యోగం పొందినవారు రు. 10 లక్షల నుండి రు. 40 లక్షల వరకు మధ్యవర్తులకు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఆ మిగిలిన సొమ్ము మిగిలిన చీకటి రాజులు పంచుకుని తిన్నారు. అలా తిన్న మొత్తం 2,000 కోట్ల రూపాయలకు పైనే అని దర్యాప్తు సంస్ధలు నిగ్గు దేల్చాయి.
ఇంకో అక్రమ పద్ధతిని ఇంజన్-బోగీ పద్ధతి అనవచ్చు. అనగా తెలివైన అభ్యర్ధి, అక్రమంగా సీటు లేదా ఉద్యోగం పొందుతున్న అభ్యర్ధి ఇద్దరూ పరీక్ష రాయడం. రైలుని లాగే ఇంజన్ కి బోగీలు తగిలించినట్లుగా పరీక్షలను లాగే తెలివైన ఇంజన్ కి అర్హతలు లేని అభ్యర్ధిని బోగీగా తగిలించడం. ఇందులో కూడా బోర్డు ఉన్నతాధికారుల హస్తం కావాలి. ముందే మాట్లాడుకున్న ఇంజన్ అభ్యర్ధికి ముందూ వెనక గానీ పక్కన గానీ బోగీ అభ్యర్ధి వచ్చేలా ఏర్పాటు చేయబడుతుంది. ఆ తర్వాత పరీక్షలో కాపీ జరుగుతుంది. బోగీ అభ్యర్ధికి అంతా కనపడేలా ఇంజన్ అభ్యర్ధి తన సమాధాన పత్రాన్ని ఉంచుతూ పరీక్ష రాస్తాడు. ఇంజన్ తో పాటు బోగీ కూడా విజయవంతంగా పరీక్ష పూర్తి చేస్తుంది. కాపీ కొట్టడం కూడా చేతకాకపోతే లేదా ఇన్విజిలేటర్ కి దొరికే రిస్కు ఎందుకు అనుకుంటే వారికి కూడా సరికొత్త మార్గాన్ని అక్రమాల రాకెట్ సిద్ధం చేసింది. బోగీ అభ్యర్ధి ఏదో ఒకటి గెలికి సమాధాన పత్రం పూర్తి చేస్తాడు. పరీక్ష చివర్లో ఇంజన్ అభ్యర్ధి, బోగీ అభ్యర్ధి తమ సమాధాన పత్రాలను పరస్పరం మార్చుకుంటారు. ఈ పద్ధతిలో ఒకసారి పరీక్ష రాసి ఉత్తీర్ణులు అయినవారే మళ్ళీ మళ్ళీ పరీక్షలకు హాజరు కావడం దర్యాప్తు బృందం గమనించింది. ఉత్తర ప్రదేశ్, బీహార్ ల నుండి కూడా ఇంజన్ అభ్యర్ధులను తెచ్చి పరీక్ష రాయించిన చరిత్ర వ్యాపం కుంభకోణంలో జరిగింది. పైన చెప్పిన మొదటి పద్ధతిలోనూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అసలు అభ్యర్ధుల స్ధానంలో పరీక్షలు రాశారు.
మూడో పద్ధతి ఓ.ఎం.ఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) షీట్లు గల్లంతు చేయడం. (ఒక్కో సమాధానానికి చిన్న వృత్తాలను ఇచ్చి సరైన సమాధానం ఎదుటి వృత్తాన్ని పెన్సిల్ తో గీసి నింపే సమాధాన పత్రాలే ఓ.ఎం.ఆర్ షీట్లు. ప్రశ్నలన్నింటికి ఒకటి రెండు పేజీల్లో సమాధానం ఇవ్వగల సులువు వీటికి ఉంటుంది.) ఇప్పుడు చాలా ప్రవేశ పరీక్షలకు సమాధాన పత్రాలుగా ఓ.ఏం.ఆర్ షీట్లను ఇస్తున్నారు. ఒక ప్రశ్నకు నాలుగైదు సమాధానాలు ఇచ్చి ఏది కరెక్టో అడిగే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధాన పత్రాలుగా ఓ.ఎం.ఆర్ షీట్లు ఇవ్వడం వల్ల స్కానర్ల సాయంతో త్వరగా పరీక్ష ఫలితాలు ప్రకటించడం సాధ్యం అవుతుంది. ఈ పద్ధతిలో జరిగే అక్రమంలో అభ్యర్ధులు తమ సమాధాన పత్రాలలో ఏమీ నింపరు. ఖాళీ సమాధాన పత్రాన్ని ఇస్తారు. ఆ తర్వాత వారికి సీటు గానీ, ఉద్యోగం గానీ వచ్చే విధంగా మార్కులు ఇచ్చేట్లుగా ఏర్పాట్లు చేస్తారు. అక్రమంలో భాగం వహిస్తున్న అధికారి సమాచార చట్టం హక్కు కింద సదరు అభ్యర్ధి సమాధాన పత్రం చూపాలని కోరుతూ ఇతరుల పేరుతో పిటిషన్ దాఖలు చేస్తాడు. తద్వారా అభ్యర్ధి సమాధాన పత్రాన్ని చూసే అవకాశాన్ని తనకు తానే కల్పించుకుంటాడు. అలా సమాధాన పత్రాన్ని తీసుకున్నాక అతనికి ఇవ్వబడిన మార్కులకు అనుగుణంగా సమాధానాలను నింపుతాడు. ఆ తర్వాత ఎవరన్నా ఆ సమాధాన పత్రాన్ని తనిఖీ చేసినా జరిగింది ఏమిటో తెలియకుండా ఉంటుందని అక్రమార్కుల అంచనా.
ఈ అంశాలన్నీ ఎస్.టి.ఎఫ్ జరిపిన పరిమిత దర్యాప్తులో వెల్లడి అయినవే. బోర్డు అధికారులు, మధ్యవర్తులు, అక్రమ అభ్యర్ధులు తదితర నిందితులు కోర్టులోనూ, పోలీసుల వద్దా అంగీకరించినవే. (విజిల్ బ్లోయర్ ఆశిష్ చతుర్వేది ప్రకారం కుంభకోణంలో 5 శాతం భాగాన్ని మాత్రమే ఎస్.టి.ఎఫ్ వెల్లడి చేసింది.) వ్యాపం సంస్ధ స్వయంగా కోర్టులో అంగీకరించిన వివరాల ప్రకారం 1020 దరఖాస్తు పత్రాలు కనిపించకుండా పోయాయి. దరఖాస్తు పత్రాలని మాయం చేస్తే దరఖాస్తుకి, సమాధాన పత్రాలకి మధ్య తేడా తెలుసుకునే అవకాశం ఉండదు. ఈ దురాలోచనతో బోర్డు అధికారులే అక్రమ అభ్యర్ధుల పరీక్ష దరఖాస్తులను, ఉద్యోగ దరఖాస్తులను మాయం చేశారు. తాము నిర్వహించిన పరీక్షల్లో 346 మంది దొంగ అభ్యర్ధులు పాల్గొన్నట్లు తేలిందని వ్యాపం అధికారులు కోర్టులో అంగీకరించారు. బోర్డు అధికారులు, బడా మధ్యవర్తుల్లో ఒకరైన నితిన్ మహేంద్రలు వ్యాపంకి చెందిన కంప్యూటర్లలో భద్రపరిచిన రికార్డులను మాయం చేయడం వల్ల 1120 మంది సమాధాన పత్రాలు కనపడడం లేదని కూడా బోర్డు అంగీకరించింది.
బి.జె.పి ప్రభుత్వ క్రియారాహిత్యం
2007-08 లోనే మధ్య ప్రదేశ్ లోకల్ ఫండ్ ఆడిట్ సంస్ధ అనేకమంది అభ్యర్ధుల దరఖాస్తులు కనిపించని సంగతిని కనుగొంది. ఈ కారణం వల్ల పరీక్షల అడ్మిట్ కార్డులతో దరఖాస్తులను పోల్చుకునే అవకాశం లేకుండా పోయిందని ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. దానితో కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరుతూ డా. ఆనంద్ రాయ్ అనే స్వచ్చంద కార్యకర్త కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేశాడు. ఆ తర్వాతనే ముఖ్యమంత్రి ఒక కమిటీ నియమించి దర్యాప్తు చేయాలని పురమాయించాడు.
ఈ కమిటీ 2011 లో నివేదిక ఇస్తూ 114 మంది ఇతరుల చేత పరీక్ష రాయించడం ద్వారా ప్రీ-మెడికల్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయ్యారని, వారంతా సంపన్న కుటుంబాల వారేనని ధ్రువపరిచింది. పరీక్ష రాసినవారిలో కొందరు ఉత్తర ప్రదేశ్, బీహార్ ల నుండి వచ్చారని తెలిపింది. మెడికల్ కోర్సు పూర్తి చేసుకుని డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులు కూడా అసలు అభ్యర్ధుల స్ధానంలో పరీక్ష రాశారని బైటపెట్టింది. ఈ నేపధ్యంలో అక్రమంగా సీట్లు పొందినవారు అప్పటికే డాక్టర్ కోర్సు ముగించుకుని డాక్టర్ పట్టాతో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టి ఉండవచ్చని వారివల్ల ఏ ప్రమాదం జరగనుందో అన్న ఆందోళన వ్యక్తం చేసింది. కుంభకోణంలో ప్రభుత్వ అధికారులు భాగస్వామ్యం వహించారన్న అనుమానాన్ని గట్టిగా వెలిబుచ్చింది. ఇంత చెప్పినా చౌహాన్ ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపుచ్చింది తప్ప పూర్తి విచారణకు పూనుకోలేదు. 2011, 2012 సంవత్సరాల్లో కూడా వివిధ పరీక్షల్లో ముఖ్యంగా ప్రీ-మెడికల్ టెస్ట్ (పి.ఎం.టి) పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు అభ్యర్ధుల స్ధానంలో పరీక్షలు రాయడానికి వచ్చిన 4 గురు వ్యక్తులను ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు కూడా.
2013లో ఇండోర్ పోలీసులు ఇతరుల కోసం పరీక్షలు రాయడానికి వచ్చిన 20 మందిని నగరంలోని వివిధ హోటళ్ళ నుండి అరెస్టు చేయడంతో కుంభకోణం పరిమాణం ఏమిటో తెలిసి వచ్చిందని పత్రికలు రాస్తున్నాయి. ఈ 20 మందిని విచారణ చేసిన దరిమిలా జగదీష్ సాగర్ అనే రాకేటీర్ నేతృత్వంలోని అక్రమ రాకెట్ బయటపడిందని దానితోనే కుంభకోణం విస్తృతి వెలుగులోకి వచ్చిందని పత్రికలు చెబుతున్నాయి. అయితే ఇది అర్ధ సత్యం మాత్రమే. నిజానికి కుంభకోణం పరిమాణం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ద్వారానే తెలిసివచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ క్రియా రాహిత్యాన్ని, అవినీతిపట్ల ప్రదర్శిస్తున్న అలవిమాలిన సహనశీలతను కప్పిపుచ్చేందుకే ఇలా ‘2013 లోనే’ అంటూ ప్రచారం చేస్తున్నారు. తద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం యొక్క నేరపూరిత క్రియారాహిత్యం వైపు దృష్టి మరలకుండా ఉండేందుకు పత్రికలు సైతం కృషిచేస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.
ఇతర పరీక్షలు కూడా…
వ్యాపం కుంభకోణంలోని ప్రధాన పాత్రధారులు వ్యాపం నిర్వహించే దాదాపు ఏ పరీక్షను వదిలిపెట్టలేదు. ఈ సంగతిని అనేక పత్రికలు పూర్తిగా విస్మరించాయి. ఏవో కొన్ని పరీక్షలను ప్రస్తావించి సరిపెట్టి ఊరుకున్నాయి. ఉదాహరణకి ప్రీ-పి.జి పరీక్షలు, ఫుడ్ ఇనస్పెక్టర్ సెలక్షన్ టెస్ట్, మిల్క్ ఫెడరేషన్ టెస్ట్, సుబేదార్-సబ్ ఇనస్పెక్టర్-ప్లాటూన్ కమాండర్ సెలక్షన్ టెస్ట్… ఈ పరీక్షలను కూడా వ్యాపం రాకెటీర్లు రిగ్గింగ్ చేసినట్లు ఎస్.టి.ఎఫ్ దర్యాప్తులో వెల్లడి అయింది. ప్రీ-పి.జి పరీక్షల్లో ఎంచుకున్న అభ్యర్ధుల కోసం వ్యాపం పరీక్షల కంట్రోలర్, సిస్టమ్ ఎనలిస్టులు ఇద్దరూ సమాధానాలను ఫోటో కాపీలు తీసి పంచినట్లు వెల్లడి అయింది. ఈ పేరాలో ప్రస్తావించిన ఇతర పరీక్షల కోసం వ్యాపం అధికారులు ఏకంగా స్ట్రాంగ్ రూం ని తెరిచి అభ్యర్ధుల ఓ.ఎం.ఆర్ పత్రాలను తమకు అవసరమైన విధంగా మార్చివేశారు.
రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన 9 రకాల పరీక్షల ఫలితాలను తాము పరిశీలిస్తున్నామని 2014లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 9 నాటి వార్తల ప్రకారం జడ్జిలు, ఐ.ఏ.ఎస్ అధికారులు, మంత్రులు తదితర ఉన్నతాధికారుల పిల్లలు ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్లు కొనుగోలు చేసినట్లు విజిల్ బ్లోయర్లు వెల్లడి చేశారు. సంబంధిత పత్రాలను వారు తమకు అందజేశారని ఎన్.డి.టి.వి ప్రకటించింది. ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ, వేల పేజీల చార్జిషీట్లు దాఖలు అయినప్పటికీ ఆ స్ధాయిలో అరెస్టులు ఎందుకు జరగడం లేదని మధ్య ప్రదేశ్ హై కోర్టు ఎస్.టి.ఎఫ్ ను ప్రశ్నించవలసి వచ్చింది. హై కోర్టు ప్రశ్నలతో వందలమంది అభ్యర్ధులను అరెస్టు చేయడం మొదలయింది. కుంభకోణం సూత్రధారులు, లంచాల లబ్దిదారులు మాత్రం ఇప్పటికీ అధికారంలో కొనసాగుతూ ఎవరు అరెస్టు కావాలో, ఎవరు అరెస్టు కాకూడదో, ఎవరు ప్రమాదాల్లో చనిపోవాలో నిర్ణయిస్తున్నారు.
………………………ఇంకా ఉంది